పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : వర్ణాశ్రమ ధర్మంబులు

  •  
  •  
  •  

7-423-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వినుము; స్వరూపసాక్షాత్కారంబున దేహి బహిరింద్రియాదికం బయిన యింతయు నాభాసమాత్రంబుగా నిశ్చయించి యెందాఁక జీవుండు స్వతంత్రుఁ డయిన యీశ్వరుండు గాకుండు నంతదడవు నంగన యిది పురుషుండ నే ననియెడి భేదబుద్ధి మానుట కర్తవ్యంబు గాదు; బ్రహ్మచారి యతి గృహస్థులం దెవ్వఁ డైనఁ జిత్తంబు పరిపక్వంబు గాక యద్వైతానుసంధానంబుజేసిన మూఢుండగుంగావున రహస్యంబునఁ బుత్రిక నైనం డాయకుండవలయు.

టీకా:

వినుము = వినుము; స్వరూప = ఆత్మ; సాక్షాత్కారంబునన్ = ఎరుకవలన; దేహి = జీవుడు; బహిరింద్రియ = బాహ్యేంద్రియములు; ఆదికంబు = మున్నగునవి; అయిన = ఐన; ఇంతయున్ = ఇదంతా; ఆభాస = భ్రాంతి; మాత్రంబు = మాత్రమే; కాన్ = అయినట్లు; నిశ్చయించి = నిశ్చయముగాతెలిసికొని; ఎందాక = ఎంతవరకు; జీవుండు = జీవుడు; స్వతంత్రుడు = దేనికిలొంగనివాడు; అయిన = ఐన; ఈశ్వరుండు = ఈశ్వరుడు; కాకుండున్ = కాడో; అంతతడవు = అందాక; అంగన = స్త్రీ; ఇది = ఈమె; పురుషుండన్ = పురుషుడను; నేన్ = నేను; అనియెడి = అనెడి; భేదబుద్ధి = భేదముచూసెడిబుద్ధి; మానుట = వీడుట; కర్తవ్యంబు = చేయదగినది; కాదు = కాదు; బ్రహ్మచారి = బ్రహ్మచార్యాశ్రమస్థుడు; యతి = సన్యాసాశ్రమస్థుడు; గృహస్థుల = గృహస్థాశ్రమస్థుల; అందున్ = లో; ఎవ్వండైనన్ = ఏవరైనాసరే; చిత్తంబు = మనసు; పరిపక్వంబు = పరిణతచెందినది; కాక = కాకుండగ; అద్వైత = స్త్రీపురుషాది యభేదమును; అనుసంధానంబు = భావనము; చేసినన్ = చేసినచో; మూఢుండు = మందబుద్ధిగలవాడు; అగున్ = అగును; కావునన్ = కనుక; రహస్యంబునన్ = ఒంటరిగా; పుత్రికన్ = కూతురుని; ఐనన్ = అయినను; డాయక = సమీపించక; ఉండవలయు = ఉండవలెను.

భావము:

ధర్మరాజా! ఆలకించు! ఆత్మసాక్షాత్కారం పొంది, ఇంద్రియాలకు కనిపించే బాహ్య ప్రపంచం అంతా స్వప్నమాత్రమే నని ఎరిగి, తనకూ పరబ్రహ్మకూ భేదం లేదని ఎప్పటివరకూ గ్రహించడో, అప్పటివరకూ స్త్రీ, పురుష భేదభావం వదలుట భావ్యం కాదు. కాబట్టి, బ్రహ్మచారి, యతి, గృహస్థుడు ఎవరైనా సరే మనస్సు పరిపక్వం చెందకుండా అద్వైతాను సంధానం చేసుకోవటం మూర్ఖత్వం అవుతుంది. కనుక, కన్న కుమార్తెతో కూడా రహస్యంగా ఏకాంతంగా మెలగరాదు.