పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : వర్ణాశ్రమ ధర్మంబులు

  •  
  •  
  •  

7-419-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు సంకరజాతు లయిన రజక చర్మకారక నట బురడ కైవర్తక మ్లేచ్ఛ భిల్లు లను నంత్యజాతు లేడ్వురకును జండాల పుల్కస మాతంగ జాతులకును నాయా కులాగతంబు లైన వృత్తులఁ జౌర్యహింసాదులు వర్జించి సంచరింపవలయు; మానవులకుఁ బ్రతియుగంబున నైసర్గికంబులైన ధర్మంబులు రెండు లోకంబు లందును సుఖకరంబు లని వేదవిదులైన పెద్దలు చెప్పుదురు; కారుకారున దున్నెడు క్షేత్రంబు లావు చెడు; నందు జల్లిన బీజంబులు నిస్తేజంబు లై యుండి లెస్సగ నంకురింపవు; నిరంతర ఘృతధారావర్షంబున దహనునకు దాహకత్వంబు లేక శాంతిం జెందు; నందు వేల్చిన హవ్యంబులు ఫలింపవు; తద్విధంబున ననవరత కామానుసంధానంబునఁ గామోన్ముఖంబైన చిత్తంబు కామంబులం దనిసి నిష్కా మంబై విరక్తి నొందుం; గావున సత్త్వస్వభావంబుతోడ నెప్పుడుఁ దప్పక నిజవంశానుగత విహితధర్మంబున వర్తించు నరుండు మెల్లన స్వాభావిక కర్మపరత్వంబు విడిచి ముక్తి నొందు; జాతి మాత్రంబునఁ బురుషునికి వర్ణంబు నిర్దేశింపం బనిలేదు; శమదమాది వర్ణలక్షణ వ్యవహారంబులఁ గనవలయు" నని మఱియు నారదుం డిట్లనియె.

టీకా:

మఱియున్ = ఇంకను; సంకరజాతులు = సంకరజాతులు {సంకరజాతులు - అసమాన స్త్రీపురుషలవలన కలిగిన జాతులు}; అయిన = ఐన; రజక = చాకలి, బట్టలుతుకువారు; చర్మకారక = మాదిగ,చెప్పులుకుట్టువారు; నట = నట్టువ, వేశ్యలకాటనేర్పు వారు; బురడ = మేదర, బుట్టలల్లువారు; కైవర్తక = చేపలుపట్టువారు, జాలరి; మ్లేచ్ఛ = యవన; భిల్లులు = కొండజాతివారు; అను = అనెడి; అంత్యజాతులు = నీచజాతులు; ఏడ్వుర = ఏడుగుర; కునున్ = కు; చండాల = మాల; పుల్కస = బోయలలోనొకతెగ; మాతంగ = మాలలోనొకతెగ; జాతుల్ = జాతుల; కునున్ = కు; ఆయా = వారివారి; కుల = కులములకు; ఆగతంబులు = వంశానుగతముగవచ్ఛినవి; ఐన = అయిన; వృత్తులన్ = జీవికలను; చౌర్య = దొంగతనము; హింస = చంపుట; ఆదులు = మున్నగునవి; వర్జించి = వదలివేసి; సంచరింపవలయున్ = వర్తింపవలెను; మానవుల్ = నరుల; కున్ = కు; ప్రతి = ప్రతియొక్క; యుగంబునన్ = యుగమునందు; నైసర్గికంబులు = స్వభావమునగలిగెడివి; ఐన = అయిన; ధర్మంబులు = ధర్మములు; రెండు = పర అపర రెండు; లోకంబుల్ = లోకముల; అందును = లోను; సుఖ = మేలు; కరంబులు = చేకూర్చునవి; అని = అని; వేదవిదులు = వేదములనెరిగినవారు; పెద్ధలు = జ్ఞానులు; చెప్పుదురు = చెప్పుతుంటారు; కారుకారునన్ = ప్రతివర్షాకాలమునందు; దున్నెడు = దున్నుచున్న; క్షేత్రంబు = పొలము; లావు = బలము; చెడున్ = చెడిపోవును; అందున్ = దానిలో; చల్లిన = చల్లినట్టి; బీజంబులు = విత్తనములు; నిస్తేజంబులు = తేజస్సులేనివి; ఐ = అయ్యి; ఉండి = ఉండిపోయి; లెస్సగన్ = సరిగా; అంకురింపవు = మొలవవు; నిరంతర = ఎడతెగని; ఘృత = నేతి; ధారా = ధారల; వర్షంబునన్ = కుమ్మరించుటవలన; దహనున్ = అగ్ని; కున్ = కి; దాహకత్వంబు = కాల్చెడిశక్తి; లేక = ఉండక; శాంతిన్ = చల్లారిపోవుట; చెందున్ = పొందును; అందు = దానిలో; వ్రేల్చిన = హోమముచేసిన; హవ్యంబులున్ = వస్తువులు; ఫలింపవు = ఫలించవు; తత్ = ఆ; విధంబునన్ = లాగుననే; అనవరత = నిరంతర; కామ = కామములను, ఇచ్ఛలను; అనుసంధానంబునన్ = అనుభవించుటవలన; కామ = కామములందు; ఉన్ముఖంబు = కోరునది; ఐన = అయిన; చిత్తంబు = మనసు; కామంబులన్ = కామములయెడ; తనిసి = తృప్తిచెంది; నిష్కామంబు = కోరికలేనిది; ఐ = అయ్యి; విరక్తిన్ = రాగములేకపోవుటను; ఒందున్ = పొందును; కావునన్ = కనుక; సత్త్వ = సాత్విక; స్వభావంబు = లక్షణముల; తోడన్ = తోటి; ఎప్పుడున్ = ఎల్లప్పుడు; తప్పక = తొలగక; నిజ = తన; వంశ = కులమునకు; అనుగత = అనుక్రమముగా; విహిత = విధింపబడిన; ధర్మంబున = ధర్మములందు; వర్తించు = నడచెడి; నరుండు = మానవుడు; మెల్లన = నెమ్మదిగా; స్వాభావిక = పుట్టుకతోవచ్చిన; కర్మ = కర్మలందు; పరత్వంబు = లగ్నమగుట; విడిచి = వదలివేసి; ముక్తిన్ = మోక్షమును {ముక్తి -సంసారబంధములనుండివిడుదల}; ఒందున్ = పొందును; జాతి = పుట్టుక; మాత్రంబునన్ = చేతనే; పురుషుని = మానవున; కిన్ = కు; వర్ణంబు = చాతుర్వర్ణములలోనిది {చాతుర్వర్ణములు - 1బ్రాహ్మణ 2క్షత్రియ 3వైశ్య 4శూద్రవర్ణములు నాలుగు}; నిర్దేశింపన్ = నిర్ణయించవలసిన; పని = అవుసరము; లేదు = లేదు; శమ = అంతరింద్రియనిగ్రహము; దమ = బహిరింద్రియనిగ్రహము; ఆది = మొదలగు; వర్ణ = వర్ణముల; లక్షణ = లక్షణములను; వ్యవహారంబులన్ = నడవడికలను; కనవలయును = చూడవలెను; అని = అని; మఱియున్ = ఇంకను; నారదుండు = నారదుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

రజకులు నటకులు, కిరాతులు, మేదరులు. జాలరులు, చర్మకారులు, కుమ్మరులు అనే ఈ ఏడుజాతులవారూ; చండాల, పులస్క, మాతంగ, జాతులవారూ; వారి వారి కులాచారా వృత్తులను ఆచరిస్తూ జీవించాలి. అయితే చౌర్య, హింసాదులను మాత్రం ఎవరికీ తగవు. మానవులకు ప్రతియుగములోనూ సహజమైన యుగధర్మాలు ఇహలోక పరలోక సుఖాలను కలిగిస్తాయి. అని వైదిక ఋషులు చెప్పారు.
తడవ తడవకూ దున్నుతుంటే, పొలం సారం కోల్పోతుంది. అందులో చల్లిన విత్తనాలు మొలచి ఏపుగా పెరగవు. హోమకుండంలో ఎడతెగకుండా నెయ్యి పోస్తుంటే, అగ్నికి దాహకత్వం తగ్గిపోతుంది. అందులో వేసిన హోమ ద్రవ్యాలు నిరుపయోగం అవుతాయి. అలాగే నిరంతర కామకలాపాలతో మన్నథ మగ్నమైన చిత్తం తరువాత నిష్కామమై క్రమంగా విరక్తి పొందుతుంది.
కాబట్టి, మానవుడు సాత్త్విక భావంతో నియమానుసారంగా, నిజ వంశాచారాలను నిర్వర్తిస్తూ ఉండాలి. అటువంటి పురుషుడు క్రమంగా సహజంగానే కర్మబంధాలనుండి విముక్తుడు అవుతాడు. జాతి మాత్రం వలన పురుషునికి వర్ణం నిర్ణయం చేయరాదు. శమ దమాది ధర్మాలు పాటించటం ద్వారా వాని జాతి నిర్ణయించాలి” అని నారదుడు ధర్మరాజుతో చెప్పి, ఇంకా ఇలా అన్నాడు.