పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : త్రిపురాసుర సంహారము

  •  
  •  
  •  

7-405-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు హరుండు దురవగాహంబు లైన త్రిపురంబుల నభిజిన్ముహూర్తంబున భస్మంబు చేసి కూల్చిన, నమర గరుడ గంధర్వ సాధ్య యక్ష వల్లభులు వీక్షించి జయజయశబ్దంబులు జేయుచుఁ గుసుమ వర్షంబులు వర్షించిరి; ప్రజలు హర్షించిరి; బ్రహ్మాదులు గీర్తించి; రప్సరసలు నర్తించిరి; దివ్య కాహళ దుందుభి రవంబులును మునిజనోత్సవంబులును బ్రచురంబు లయ్యె; నిట్లు విశ్వజనీనం బగు త్రిపురాసురసంహారంబున నఖిలలోకులును సంతసిల్లి యుండ; నయ్యవసరంబున.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; హరుండు = పరమ శివుడు; దురవగాహంబులు = చొరశక్యముగానివి; ఐన = అయిన; త్రి = మూడు; పురంబులన్ = పురములను; అభిజిన్ముహూర్తంబునన్ = మిట్టమధ్యాహ్నము {అభిజిన్ముహూర్తము - పగలు (సూర్యోదయమునుండి) పద్నాలుగు గడియల (సుమారు 14x30ని. అనగా ఒంటిగంట) సమయము, మిట్టమధ్యాహ్నము}; భస్మము = బూడిద; చేసి = చేసి; కూల్చినన్ = నాశనముచేయగా; అమర = దేవతల; గరుడ = గరుడుల; గంధర్వ = గంధర్వుల; సాధ్య = సాధ్యుల; యక్ష = యక్షుల; వల్లభులు = ప్రభువులు; వీక్షించి = చూసి; జయజయ = జయజయ యనెడి; శబ్దంబులు = ధ్వానంబులు; చేయుచున్ = చేయుచు; కుసుమ = పూల; వర్షంబులు = వానలు; వర్షించిరి = కురిసిరి; ప్రజలు = లోకులు; హర్షించిరి = సంతోషించిరి; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆదులు = మొదలగువారు; కీర్తించిరి = నుతించిరి; అప్సరసలు = అప్సరసలు; నర్తించిరి = నాట్యములుచేసిరి; దివ్య = దివ్యమైన; కాహళ = కాహళుల; దుందుభి = దుందుభుల; రవంబులును = శబ్దములు; మునిజనుల = మునులయొక్క; ఉత్సవంబులునున్ = వేడుకలు; ప్రచురంబులు = వెల్లడి; అయ్యెన్ = అయ్యెను; ఇట్లు = ఈ విధముగ; విశ్వజనీనంబు = ఎల్లజనులకు మేలుకొరకైనది; అగు = అయిన; త్రిపుర = త్రిపురములందలి; అసుర = రాక్షసులను; సంహారంబునన్ = నాశనమువలన; అఖిల = సమస్తమైన; లోకులును = ప్రజలు; సంతసిల్లి = సంతోషించి; ఉండన్ = ఉండగా; ఆ = ఆ; అవసరంబునన్ = సమయములో.

భావము:

అలా మహాదేవుడు దుర్భేధ్యాలయిన త్రిపురాలను మిట్టమధ్యాహ్న సమయంలో భస్మం చేసి కూల్చివేశాడు; ఇది చూసి దేవతలూ, గరుడులూ, గంధర్వులూ, సిద్ధులూ, సాధ్యులూ, యక్ష నాయకులు జయజయ నినాదాలు చేశారు; పూలవానలు కురిపించారు; బ్రహ్మదేవుడు మున్నగు వారంతా హరుని హర్షంతో ప్రస్తుతించారు; అప్సరసలు ఆనందంతో ఆడారు; మునిజనులు ఉత్సవం జరుపుకున్నారు; దివ్య కాహళుల, దుందుభుల శబ్దాలు మిన్నుముట్టాయి; ఇలా పరమేశ్వరుడు విశ్వకల్యాణకర మగునట్లు త్రిపురాసుర సంహారం చేయటంతో సకల లోకాల లోని ప్రజలూ సంతసించారు