పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాదుడు స్తుతించుట

  •  
  •  
  •  

7-373-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు నటమీఁదటఁ గాలవేగంబునం గళేబరంబు విడిచి త్రైలోక్యవిరాజ మానంబును దివిజరాజజేగీయమానంబును బరిపూరిత దశదిశంబును నయిన యశంబుతోడ ముక్తబంధుండవై నన్ను డగ్గఱియెదవు; వినుము.

టీకా:

మఱియున్ = ఇంకను; అటమీదటన్ = ఆ పైన; కాల = కాలము యొక్క; వేగంబునన్ = గతిచే; కళేబరంబున్ = ప్రాణముమినహాదేహము; విడిచి = వదలివేసి; త్రైలోక్య = ముల్లోకములందును; విరాజమానంబును = మిక్కిలి ప్రకాశించునది; దివిజరాజ = దేవేంద్రునిచే {దివిజరాజు - దివిజుల (దేవతల)కు రాజు, దేవేంద్రుడు}; జేగీయమానంబునున్ = పొగడబడునది; పరిపూరిత = పూర్తిగానిండిన; దశదిశంబునున్ = పదిదిక్కులుగలది {దశదిశలు - అష్టదిక్కులు (8) మరియు కింద పైన}; అయిన = అయిన; యశంబు = కీర్తి; తోడన్ = తోటి; ముక్త = వీడిన; బంధుండవు = బంధనములుగలవాడవు; ఐ = అయ్యి; నన్నున్ = నన్ను; డగ్గఱియెదవు = చేరెదవు; వినుము = వినుము.

భావము:

అటు పిమ్మట, కాలప్రవాహానికి లోబడి, కళేబరం వదలిపెట్టి, ముల్లోకాల లోనూ ప్రకాశించేదీ, దేవేంద్రుని చేత పొగడబడేదీ, దశదిక్కులందు పరిపూర్ణంగా నిండి ఉండేదీ అయిన గొప్ప కీర్తితో నా సాన్నిధ్యం పొందుతావు.