పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాదుడు స్తుతించుట

  •  
  •  
  •  

7-371-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని పరమేశ్వరుండు ప్రహ్లాదునియందుఁ గల సకామత్వంబుఁ దెలియుకొఱకు వంచించి యిట్టానతిచ్చిన; నతండు నిష్కాముండైన యేకాంతి గావునఁ గామంబు భక్తియోగంబునకు నంతరాయం బని తలంచి యిట్లనియె; "నుత్పత్తి మొదలు కామాద్యనుభవాసక్తి లేని నాకు వరంబు లిచ్చెదనని వంచింపనేల? సంసారబీజంబులును హృదయబంధకంబులు నయిన గామంబులకు వెఱచి ముముక్షుండనై సేమంబుకొఱకు నేమంబున నిన్నుం జేరితి; కామంబులును నింద్రియంబులును మనశ్శరీర ధైర్యంబులు మనీషా ప్రాణ ధర్మంబులును లజ్జాస్మరణలక్ష్మీసత్యతేజోవిశేషంబులును నశించు; లోకంబు లందు భృత్యు లర్థకాము లయి రాజుల సేవింతురు రాజులుం బ్రయోజనంబు లర్థించి భృత్యులకు నర్థంబు లొసంగుదు; రవ్విధంబు గాదు; నాకుం గామంబు లేదు; నీకుం బ్రయోజనంబు లే; దయినను దేవా! వరదుండ వయ్యెద వేనిఁ గామంబులు వృద్ధిఁబొందని వరంబుఁ గృపజేయుము; కామంబులు విడిచిన పురుషుండు నీతోడ సమాన విభవుం డగు నరసింహ! పరమాత్మ! పురుషోత్తమ!" యని ప్రణవ పూర్వకంబుగా నమస్కరించిన హరి యిట్లనియె.

టీకా:

అని = అని; పరమేశ్వరుండు = నరసింహుడు {పరమేశ్వరుడు - పరమ (సర్వాతీతమైన) ఈశ్వరుడు, విష్ణువు}; ప్రహ్లాదునిన్ = ప్రహ్లాదుని; అందు = ఎడల; కల = ఉన్నట్టి; సకామత్వంబున్ = కోరికలి గలిగి యుండుట; తెలియు = తెలుసుకొనుట; కొఱకు = కోసము; వంచించి = వక్రీకరించి, డొంకతిరుగుడుగా; ఇట్లు = ఈ విధముగ; ఆనతిచ్చినన్ = చెప్పగా; అతండు = అతడు; నిష్కాముండు = కోరికలులేనివాడు; ఐన = అయినట్టి; ఏకాంతి = ఆత్మనిష్ఠాపరుడు {ఏకాంతి - ఏక (ఒకే) అంతి (అంత్య ఫలము, ముక్తి) మాత్రము కోరెడివాడు, ఆత్మనిష్ఠాపరుడు}; కావునన్ = కనుక; కామంబు = కోరికలు; భక్తి = భక్తియందు; యోగంబున్ = కూడియుండుట; కున్ = కి; అంతరాయంబు = విఘ్నములు; అని = అని; తలచి = భావించి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; ఉత్పత్తి = పుట్టినది; మొదలు = మొదలుపెట్టి; కామ = కోరికలు {కామాది - అరిషడ్వర్గములు, 1కామము 2క్రోధము 3లోభము 4మోహము 5మదము 6మాత్సర్యము}; ఆది = మొదలైనవాని; అనుభవ = అనుభవించుట యందు; ఆసక్తి = ఆసక్తి; లేని = లేనట్టి; నా = నా; కున్ = కు; వరంబుల్ = వరములను; ఇచ్చెదన్ = ఇచ్చెదను; అని = అని; వంచింపన్ = మోసపుచ్చుట; ఏల = ఎందులకు; సంసార = సంసారమునకు; బీజములునున్ = కారణములైనవి; హృదయబంధకంబులు = తగులములు {హృదయబంధకములు - హదయమును జ్ఞానము వంక పోనీయక కట్టివేసెడివి, తగులములు}; అయిన = ఐన; కామంబుల్ = కోరికల; కున్ = కు; వెఱచి = బెదరి; ముముక్షుండను = ముక్తిబొందకోరువాడను; ఐ = అయ్యి; సేమంబు = క్షేమము; కొఱకు = కోసము; నేన్ = నేను; నేమంబునన్ = నియమములతో; నిన్నున్ = నిన్ను; చేరితిన్ = ఆశ్రయించితిని; కామంబులును = కోరికలు; ఇంద్రియములు = ఇంద్రియములు; మనస్ = మనస్సు; శరీర = దేహము; ధైర్యంబులున్ = బలములు; మనీషా = ప్రజ్ఞలు, బుద్ధి; ప్రాణ = ప్రాణము; ధర్మంబులును = న్యాయములు; లజ్జ = సిగ్గు; స్మరణ = జ్ఞప్తి; లక్ష్మీ = సంపదలు; సత్య = సత్యము; తేజస్ = వర్చస్సు; విశేషంబులు = అతిశయములు; నశించు = క్షయమగు; లోకంబులు = లోకముల; అందున్ = లో; భృత్యులు = సేవకులు; అర్థ = ధనము; కాములు = కోరువారు; ఐ = అయ్యి; రాజులన్ = ప్రభువులను; సేవింతురు = కొలచెదరు; రాజులున్ = ప్రభువులును; ప్రయోజనంబులు = కావలసిన కార్యములు; అర్థించి = కోరి; భృత్యుల్ = సేవకుల; కున్ = కు; అర్థంబులు = ధనము,ప్రయోజనములను; ఒసంగుదురు = ఇచ్ఛెదరు; అవ్విధంబు = అలా; కాదు = కాదు; నా = నా; కున్ = కు; కామంబు = కోరదగినది; లేదు = లేదు; నీ = నీ; కున్ = కు; ప్రయోజనంబు = కావలసిన కార్యము; లేదు = లేదు; అయినను = ఐనను; దేవా = భగవంతుడ; వరదుండవు = వరములనిచ్చువాడవు; అయ్యెదవేనిని = అగుదునన్నచో; కామంబులు = కోరికలు; వృద్ధి = పెరగుట; పొందని = పొందని; వరంబున్ = వరములను; కృపజేయుము = దయతోనిమ్ము; కామంబులు = కోరికలు; విడిచిన = వదలివేసినచో; పురుషుండు = మానవుడు; నీ = నీ; తోడన్ = తోటి; సమాన = సమానమైన; విభవుండు = వైభవముగలవాడు; అగున్ = అగును; నరసింహ = నరసింహ {నరసింహుడు - నరుడు సింహము రూపములుకూడియున్నవాడు, విష్ణువు}; పరమాత్మ = నరసింహ {పరమాత్మ - పర (సర్వాతీతమైన) ఆత్మ, విష్ణువు}; పురుషోత్తమ = నరసింహ {పురుషోత్తముడు - పురుషులలో (కారణభూతులలో) ఉత్తముడు, విష్ణువు}; అని = అని; ప్రణవ = ఓంకారము; పూర్వకంబు = ముందుండునది; కాన్ = అగునట్లు; నమస్కరించినన్ = నమస్కరించగా; హరి = నరసింహుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అలా పరమేశ్వరుడు నరకేసరి, ప్రహ్లాదుడు కోరికలను జయించాడా లేదా అన్నది తెలియటం కోసం కపటంగా “వరాలు కోరుకో ఇస్తాను” అని అన్నాడు. ప్రహ్లాదుడు జితేంద్రియులలో అగ్రగణ్యుడు, ఏకాంత భక్తుడు కాబట్టి, భక్తియోగానికి కోరికలు ఆటంకం అని నిశ్చయించుకుని స్వామితో ఇలా పలికాడు “ఓ దేవదేవా! పుట్టుక నుండీ కామాది అనుభవాలలో ఆసక్తి లేని నాకు వరాలు ఇస్తానని పరీక్షిస్తున్నావా? సంసార బీజములైన కామములు హృదయగ్రంథులు. అటువంటి కామములకు భయపడి నేను మోక్షార్థినై, క్షేమాన్ని కోరుతున్నవాడనై, నియమ వంతుడనై నీ సన్నిధికి వచ్చాను. కోరికలూ, ఇంద్రియాలూ, మనస్సు, శరీరం, ధైర్యం, బుద్ధి, ప్రాణం, ధర్మం, లజ్జ, స్మరణం, సిరిసంపదలు, తేజో విశేషాలూ సమస్తం నశించేవే. ఇది సత్యం. లోకంలో సేవకులు ధనంకోసం రాజులను ఆశ్రయిస్తారు. రాజులు తమ ప్రయోజనాల కోసం సేవకులకు ధనం ఇచ్చి పోషిస్తారు. తండ్రీ! నరసింహా! పరమాత్మా! పరమపురుషా! నా సేవను ఆ విధంగా భావించకు. నాకా ఏ కోరికలు లేవు, నీకా నా వల్ల ప్రయోజనమూ లేదు. అయినా నాకు వరప్రదానం చేస్తానంటే, కామములు వృద్ధిపొందని వరం దయతో అనుగ్రహించు. కామములు విడిచినవాడు, నీతో సమానమైన వైభవం పొందుతాడు” అని భక్తితో ప్రణవ పూర్వకంగా నమస్కారం చేసాడు ప్రహ్లాదుడు. అంతట భగవంతుడైన నరసింహస్వామి ప్రహ్లాదుడితో ఇలా అన్నాడు.