పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాదుడు స్తుతించుట

  •  
  •  
  •  

7-356-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దేవా! సకల యోను లందును సుఖవియోగ దుఃఖసంయోగ సంజనితంబైన శోకానలంబున దందహ్యమానుండనై దుఃఖనివారకంబు గాని దేహాద్యభిమానంబున మోహితుండనై పరిభ్రమించుచున్న యేను నాకుం బ్రియుండవు సఖుండవుఁ బరదేవతవు నైన నీవగు బ్రహ్మగీతంబు లయిన లీలావతార కథావిశేషంబులఁ బఠియించుచు రాగాదినిర్ముక్తుండనై దుఃఖపుంజంబులఁ దరియించి భవదీయ చరణకమల స్మరణ సేవానిపుణులైన భక్తులం జేరి యుండెద; బాలునిఁ దల్లిదండ్రులును, రోగిని వైద్యదత్తంబయిన యౌషధంబును, సముద్రంబున మునింగెడు వాని నావయును, దక్కొరులు రక్షింపనేరని తెఱంగున సంసారతాప సంతప్యమానుండై నీచేత నుపేక్షితుం డయిన వాని నుద్ధరింప నీవు దక్క నన్యుండు సమర్థుండు గాఁడు; జగంబుల నెవ్వం డేమి కృత్యంబు నెవ్వనిచేతం బ్రేరితుండై యే యింద్రియంబులం జేసి యేమిటి కొఱకు నెవ్వనికి సంబంధి యై యే స్థలంబున నే సమయంబునం దేమి రూపంబున నే గుణంబున నపరంబయిన జనకాది భావంబున నుత్పాదించి పరంబయిన బ్రహ్మాదిభావంబున రూపాంతరంబు నొందించు నట్టి వివిధప్రకారంబు లన్నియు నిత్యముక్తుండవు రక్షకుండవు నైన నీవ; నీ యంశంబైన పురుషునికి నీ యనుగ్రహంబునఁ గాలంబుచేతం బ్రేరితయై కర్మమయంబును బలయుతంబును బ్రధానలింగంబును నైన మనంబును నీ మాయ సృజియించు; నవిద్యార్పితవికారంబును వేదోక్తకర్మప్రధానంబును సంసారచక్రాత్మకంబైన యీ మనమున నిన్ను సేవింపక నియమించి తరియింప నొక్కరుండును సమర్థుండు లేడు; విజ్ఞాననిర్జిత బుద్ధిగుణుండవు; నీ వలన వశీకృత కార్యసాధన శక్తి యైన కాలంబు మాయతోడం గూడ షోడశవికారయుక్తం బయిన సంసారచక్రంబుఁ జేయుచుండు; సంసారదావదహన తంతప్యమానుండ నగు నన్ను రక్షింపుము.
^[షోడశ వికారములు]

టీకా:

దేవా = భగవంతుడా; సకల = అఖిలమైన; యోనులు = గర్భములు; అందును = లోను; సుఖ = సుఖము; వియోగంబును = తొలగుట; దుఃఖ = దుఃఖము; సంయోగ = కలుగుటలు; సంజనితంబు = పుట్టింపబడినది; ఐన = అయిన; శోక = దుఃఖము యనెడి; అనలంబునన్ = అగ్నిలో; దందహ్యమానుండను = మిక్కిలి కాల్చబడినవాడను; ఐ = అయ్యి; దుఃఖ = శోకమును; నివారకంబున్ = పోగొట్టునది; కాని = కాని; దేహ = దేహము; ఆది = మొదలగువానియందు; అభిమానంబునన్ = మమకారముచేత; మోహితుండను = మాయలోపడినవాడను; ఐ = అయ్యి; పరిభ్రమించుచున్న = తిరుగుతున్న; ఏను = నేను; నా = నా; కున్ = కు; ప్రియుండవు = ఇష్టుడవు; సఖుండవు = స్నేహితుడవు; పరదేవతవు = ఆరాధ్య దేవతవు; ఐన = అయిన; నీవి = నీవి; అగు = ఐన; బ్రహ్మ = బ్రహ్మచేత; గీతంబులు = కీర్తింపబడినవి; అయిన = ఐన; లీలా = విలాసములకైన; అవతార = అవతారముల యొక్క; కథా = గాథలు; విశేషంబులన్ = వృత్తాంతములను; పఠియించుచు = అధ్యయనము చేయుచు; రాగాది = రాగద్వేషాదులనుండి; నిర్ముక్తుండను = విడివడినవాడను; ఐ = అయ్యి; దుఃఖ = దుఃఖముల; పుంజములన్ = సమూహములను; తరియించి = దాటి; భవదీయ = నీ యొక్క; చరణ = పాదములు యనెడి; కమల = పద్మముల; స్మరణ = తలచుట; సేవా = కొలచుటలయందు; నిపుణులు = నేర్పరులు; ఐన = అయిన; భక్తులన్ = భక్తులను; చేరి = చేరి; ఉండెదన్ = ఉండెదను; బాలునిన్ = పిల్లలను; తల్లిదండ్రులును = తల్లిదండ్రులు; రోగిని = జబ్బుపడినవానిని; వైద్య = వైద్యునిచే; దత్తంబు = ఈయబడినది; అయిన = ఐన; ఔషధంబును = ఔషధము; సముద్రంబునన్ = సాగరమునందు; మునింగెడు = మునిగిపోతున్న; వానిన్ = వానిని; నావయును = పడవ; తక్క = తప్పించి; ఒరులు = ఇతరులు; రక్షింపన్ = కాపాడుటకు; నేరని = చాలని, సమర్థులుకాని; తెఱంగునన్ = విధముగ; సంసార = సంసారము యొక్క; తాప = తాపత్రయములచే, బాధలచే {తాపత్రయములు - 1ఆధ్యాత్మికము (తనవలన కలిగెడి బాధలు) 2ఆదిభౌతికములు (ఇతర భూతాదుల వలని బాధలు) 3ఆదిదైవికములు (దైవికములు ప్రకృతి వైపరీత్యాదుల వలని బాధలు)}; తప్యమానుండు = బాధింపబడినవాడు; ఐ = అయ్యి; నీ = నీ; చేతను = వలన; ఉపేక్షితుండు = అశ్రద్ధ చేయబడినవాడు; అయిన = ఐన; వానిన్ = వానిని; ఉద్ధరింపన్ = ఉద్ధరించుటకు; నీవు = నీవు; తక్క = తప్పించి; అన్యుండు = ఇతరుడు ఎవడును; సమర్థుండు = నేర్పుగలవాడు; కాడు = కాడు; జగంబులన్ = లోకములందు; ఎవ్వండు = ఎవడైనను; ఏమి = ఎట్టి; కృత్యంబు = కార్యము; ఎవ్వని = ఎవని; చేతన్ = చేత; ప్రేరితుండు = ప్రేరేపింపబడినవాడు; ఐ = అయ్య; ఏ = ఏ; ఇంద్రియంబులన్ = సామర్ధ్యముల; చేసి = వలన; ఏమిటి = ఎందు; కొఱకు = కు; ఎవ్వని = ఎవని; కిన్ = కి; సంబంధి = సంబంధముగలవాడు {నవవిధసంబంధములు - 1పితృపుత్ర సంబంధము 2రక్ష్యరక్షక సంబంధము 3శేషిశేష సంబంధము 4భర్తృభర్త సంబంధము 5జ్ఞాతృజ్ఞేయ సంబంధము 6స్వస్వామి సంబంధము 7శరీరిశరీర సంబంధము 8 ఆధారాధేయ సంబంధము 9భోక్తృభోగ్య సంబంధము}; ఐ = అయ్యి; ఏ = ఏ; స్థలంబునన్ = చోటునందు; ఏ = ఏ; సమయంబున్ = సమయము; అందున్ = లో; ఏమి = ఎట్టి; రూపంబునన్ = ఆకారముతో; ఏ = ఎట్టి; గుణంబునన్ = గుణములతో; అపరంబు = ఇహలోకపువి, శ్రేష్ఠముకానివి; అయిన = ఐన; జనక = తండ్రి; ఆది = మొదలగు; భావంబున్ = తలపులను; ఉత్పాదించి = కలిగించి; పరంబు = పరలోకపువి, శ్రేష్ఠమైనవి; బ్రహ్మ = పరబ్రహ్మతత్వము; ఆది = మొదలగు; భావంబునన్ = భావములగా; రూపాంతరంబున్ = రూపముమారుటను; ఒందించున్ = కలిగించు; అట్టి = అటువంటి; వివిధ = రకరకముల; ప్రకారంబులు = విధానములు; అన్నియున్ = సర్వమును; నిత్యముక్తుండవున్ = శాశ్వతమైనముక్తిగలవాడవు; రక్షకుండవున్ = కాపాడెడివాడవు; ఐన = అయిన; నీవ = నీవే; నీ = నీ యొక్క; అంశంబు = అంశ, భాగము; ఐన = అయిన; పురుషున్ = మానవుని; కిన్ = కి; నీ = నీ యొక్క; అనుగ్రహంబునన్ = దయవలన; కాలంబు = కాలము; చేతన్ = చేత; ప్రేరిత = ప్రేరేపింపబడినది; ఐ = అయ్యి; కర్మమయంబును = కర్మరూపము; బల = బలముతో; యుతంబునున్ = కూడినది; ప్రధాన = ప్రధానము యనెడి; లింగంబును = గురుతుకలది; ఐన = అయిన; మనంబును = మనసును; నీ = నీ యొక్క; మాయన్ = మాయ; సృజియించున్ = సృష్టించును; అవిద్యా = మాయచేత; అర్పిత = కల్పింబడిన; వికారంబును = వికారములుగలది {వికారములు - మార్పువలన కలుగునవి, ఇవి షోడశము (16) ఏకాదశేంద్రియములు మరియు పంచభూతములు}; వేద = వేదములందు; ఉక్త = చెప్పబడిన; కర్మ = కర్మలే; ప్రధానంబును = ముఖ్యముగాగలది; సంసార = సంసారము యనెడి; చక్ర = చక్రము; ఆత్మకంబు = రూపమైనది; ఐన = అగు; ఈ = ఈ; మనమును = మనసును; నిన్నున్ = నిన్ను; సేవింపక = కొలువకుండగ; నియమించి = కట్టడిచేసికొని; తరియింపన్ = తరించుటను; ఒక్కరుండును = ఒకడైనను; సమర్థుండు = నేర్చినవాడు; లేడు = లేడు; విజ్ఞాన = విశిష్ట జ్ఞానముచే; నిర్జిత = జయింపబడిన; బుద్ధిన్ = బుద్ధి; గుణుండవు = గుణములుగలవాడవు; నీ = నీ; వలనన్ = చేత; వశీకృత = స్వాధీనముచేసికొనబడిన; కార్య = కార్యములను, పనులను; సాధన = చక్కజేయ; శక్తి = సామర్థ్యము గలది; ఐన = అయిన; కాలంబున్ = కాలమును; మాయ = మాయ; తోడన్ = తోటి; కూడ = కలిపి; షోడశవికార = షోడశవికారములతో; యుక్తంబు = కూడినది; అయిన = ఐన; సంసార = పునర్జన్మల; చక్రంబున్ = పునరావృతమును; చేయుచుండున్ = కలిగించుచుండును; సంసార = సంసారము యనెడి; దావదహనన్ = కార్చిచ్చుచే; తంతప్యమానుండను = బాధింపబడుచున్నవాడను; అగు = అయిన; నన్నున్ = నన్ను; రక్షింపుము = కాపాడుము.

భావము:

భగవంతుడా! జన్మజన్మలలోనూ సుఖానికి వియోగం, దుఃఖానికి సంయోగం కలుగుతూనే ఉంది. దానితో నా కెప్పుడూ శోకమే ప్రాప్తిస్తూ ఉంది. ఈ శోకాగ్ని నన్నెప్పుడూ నిలువునా కాల్చివేస్తూ ఉంది. సుఖం ఇవ్వదని తెలిసినా, ఈ దేహం మీద అభిమానం వదలటంలేదు. అలా ఆ మోహంతో తిరుగుతున్నాను. అటువంటి నాకు ప్రియుడవు, సఖుడవు, పరదేవతవు సర్వం నీవే. నీ లీలావతారాలే బ్రహ్మగీతాలు. వాటినే నిత్యం పఠిస్తూ కోరికలనుండి విముక్తి పొంది, దుఃఖాలను అధిగమించి నీ పాదపద్మాలను సేవించే భక్తులతో కలిసి ఉంటాను.
చంటిపిల్లాడిని తల్లిదండ్రులూ, రోగిని వైద్యుడు ఇచ్చే ఔషధమూ, సముద్రంలో మునిగిపోతున్న వాడిని నావ ఎలాగైతే రక్షిస్తారో, అలాగే ఈ సంసార తాపత్రయాలతో తప్తులైన వారిని నీవే తప్ప మరెవరు రక్షించలేరు. నీచేత ఉపేక్షింపడినవానిని, నువ్వు తప్ప మరెవ్వరూ ఉద్ధరించలేరు. లోకంలో ఎవడు, ఏ కార్యం, ఎవరి ప్రేరణతో, ఏ ఇంద్రియాల వలన, దేని కోసం, ఎవరికి సంబంధించి, ఏ స్థలంలో, ఏ సమయంలో, ఏ రూపంలో, ఏ గుణం వలన నెరవేరుస్తాడో; ఇహలోకంలో జనకభావానికీ, పరలోకంలో బ్రహ్మభావానికీ రూపాంతరం పొందించే ఆ వివిధ ప్రకారాలూ నీవే. సమస్తమూ నీవే, నీవు నిత్యముక్తుడవు. సత్యరక్షకుడవు.
నీ అంశయైన పురుషునిలో నీ అనుగ్రహం వలననే కాలప్రేరితమూ, కర్మమయమూ, బలయుతమూ, ప్రధానలింగమూ అయిన మనస్సును, నీ మాయ సృష్టిస్తుంది. ఈ మనస్సు అవిద్యాజనకమైన వికారమూ, వేదోక్తకర్మ ప్రధానమూ, సంసారచక్రాత్మకమూ అయినది. ఇలాంటి మనస్సుతో నిన్ను సేవించకుండా తరించగల సమర్ధుడు ఎవడూ లేడు. నువ్వు విజ్ఞానం చేత బుద్ధిగుణమును జయించిన వాడవు. కార్యకారణ శక్తినీ కాలం నీ వలననే వశం చేసుకుంటుంది, ఈ కాలం మాయతో కూడి పదహారు విధాలైన వికారాలతో కూడిన సంసార చక్రమును నిర్మించి, త్రిప్పుతూ ఉంటుంది, నేను ఈ సంసార దావానలంలో పడిమాడిపోతున్నాను లోకరక్షామణీ! రక్షించు!