పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : శబళాశ్వులకు బోధించుట

  •  
  •  
  •  

6-254-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వార లెవ్వ రనిన భానువు, లంబయుఁ, గకుప్పు, జామియు, విశ్వయు, సాధ్యయు, మరుత్వతియు, వసువు, ముహూర్తయు, సంకల్పయు, ననం బదుగురు ధర్మునకుఁ బత్నులై కొడుకులం బడసిరి; వార లెవ్వ రంటేని భానువునకు వేదఋషభుండు పుట్టె; నతనికి నింద్ర సేనుం డుదయించె; లంబకు విద్యోతుండు గలిగె; నతనికి స్తనయిత్నువు లనువారు పుట్టిరి; కకుబ్దేవికి సంకుటుండు పుట్టె; సంకుటునకుం గీటకుండు పుట్టె; కీటకునకు దుర్గాభిమానిను లయిన దేవతలు జన్మించిరి; జామిదేవికి దుర్గ భూముల కధిష్ఠాన దేవతలు జనియించిరి; వారికి స్వర్గుండును, నందియు జన్మించిరి; విశ్వ యను దానికి విశ్వేదేవగణంబు జనియించె; వార లపుత్రుకులనం బరఁగిరి; సాధ్య యనుదానికి సాధ్యగణంబులు పుట్టె; వానికి నర్థసిద్ధి యను వాఁడు పుట్టె; మరుత్వతి యనుదానికి మరుత్వంతుఁడు, జయంతుం డను వార లుదయించి; రందు జయంతుండు వాసుదేవాంశజుం డైన యుపేంద్రుం డనంబడి వినుతి నొందె; ముహూర్త యనుదానికి సకల భూతంబులకు నాయాకాలంబులం గలిగెడు నాయా ఫలాఫలంబుల నిచ్చు మౌహర్తికు లనియెడు దేవగణంబులు పుట్టిరి; సంకల్ప యనుదానికి సంకల్పుం డుదయించె; నా సంకల్పునకుఁ గాముండు జనియించె; వసు వనుదానికి ద్రోణుండును, బ్రాణుండును, ధ్రువుండును, నర్కుండును, నగ్నియు, దోషుండును, వస్తువును, విభావసువును నన నెనమండ్రు వసువు లుదయంబు నొంది; రందు ద్రోణునకు నభిమతి యను భార్య యందు హర్ష శోక భయాదులు పుట్టిరి; ప్రాణునకు భార్య యైన యూర్జస్వతి యందు సహుఁడును, నాయువును, బురోజవుండును ననువారలు గలిగిరి; ధ్రువునకు భార్య యగు ధరణి యందు వివిధంబులగు పురంబులు పుట్టె; నర్కునకు భార్య యగు వాసన యందుఁ దర్షాదు లుదయించి; రగ్నికి భార్యయైన వసోర్ధార యందు ద్రవిణకాదులు పుట్టిరి; మఱియుఁ గృత్తికలకు స్కందుండు గలిగె; నా స్కందునకు విశాఖాదు లుదయించిరి; దోషునకు శర్వరి యను భార్య యందు హరికళ యగు శింశుమారుం డుదయించె వస్తువునకు నాంగిరస యందు విశ్వకర్మ యను శిల్పాచార్యుం డుదయంబందె; నా విశ్వకర్మకు నాకృతి యను సతియందుఁ జాక్షుషుం డను మనువు జనియించె; నా మనువు వలన విశ్వులు సాధ్యు లనువారలు పుట్టిరి; విభావసునకు నుష యను భార్య యందు వ్యుష్టియు, రోచియు, నాతపుండును జనించి; రందు నాతపునికిఁ బంచయాముం డను దివసాభిమాన దేవత జనియించె; శంకరాంశజుం డయిన భూతునకు సురూప యను భార్య యందుఁ గోట్ల సంఖ్యలైన రుద్రగణంబు లుదయించిరి; మఱియు రైవతుండు, నజుండు, భవుండు, భీముండు, వాముండు, నుగ్రుండు, వృషాకపియు నజైకపాత్తు, నహిర్బుధ్న్యుండు, బహురూపుండు, మహాంతుండు ననువారలును, రుద్రపారిషదులును నతిభయంకరు లయిన ప్రేతులును వినాయకులును బుట్టి; రంగిరసుం డను ప్రజాపతికి స్వధ యను భార్యయందుఁ బిత్రుగణంబులు పుట్టిరి; సతి యను భార్యకు నధ్వర వేదాభిమాన దేవతలు పుట్టరి; కృశాశ్వునకు నర్చి యను భార్యయందు ధూమ్రకేశుం డను పుత్రుం డుదయించె; వేదశిరునకు ధిషణ యను భార్య యందు దేవలుఁడును, వయనుండును, మనువునుం బుట్టిరి; తార్క్షునకు వినత కద్రువ పతంగి యామిని యన నలువురు భార్య లందుఁ బతంగికిఁ బక్షులు పుట్టె; యామినికి శలభంబులు పుట్టె; వినతకు సాక్షాత్కరించిన యజ్ఞాధిపతికి వాహనం బయిన గరుడుండును, సూర్యునకు సారధి యైన యనూరుండును జనియించిరి; కద్రువకుఁ బెక్కు తెఱంగు లగు భుజంగమంబులు పుట్టె; చంద్రునకుఁ గృత్తికాది నక్షత్రంబులు భార్యలయినను వారల యందుఁ జంద్రుండు రోహిణి యందు మాత్రము మోహితుం డగుటంజేసి దక్షశాపంబున క్షయరోగగ్రస్తుండై సంతానంబు పడయనేరఁ డయ్యె; నంత దక్ష ప్రసాదంబున క్షయపీడితంబు లగు షోడశకళల మరలం బొందె; మఱియును.
అసక్ని దక్షుడు దంపతుల వంశవృక్షం

టీకా:

వారలు = వారు; ఎవ్వరు = ఎవరు; అనిన = అనగా; భానువు = భానువు; లంబయు = లంబ; కకుప్పు = కకుప్పు; జామియు = జామి; విశ్వయు = విశ్వ; సాధ్యయు = సాధ్య; మరుత్వతియు = మరుత్వతి; వసువు = వసువు; ముహూర్తయు = ముహూర్త; సంకల్పయున్ = సంకల్ప; అనన్ = అనెడి; పదుగురు = పదిమంది; గురు = గొప్పవాడైన; ధర్మున్ = ధర్ముని; కున్ = కి; పత్నులు = భార్యలు; ఐ = అయ్యి; కొడుకులన్ = పుత్రులను; పడసిరి = పొందిరి; వారలు = వారు; ఎవ్వరంటేని = ఎవరంటే; భానువున్ = భానువు; కు = కు; వేదఋషభుండు = వేదఋషభుడు; పుట్టెన్ = జనించెను; అతని = అతని; కి = కి; ఇంద్రసేనుండు = ఇంద్రసేనుడు; ఉదయించె = పుట్టెను; లంబ = లంబ; కు = కు; విద్యోతుండు = విద్యోతుడు; కలిగె = జనించెను; అతని = అతని; కి = కి; స్తన = స్తనుడు; ఇత్నువులు = ఇత్నువు; అను = అనెడి; వారు = వారు; పుట్టిరి = కలిగిరి; కకుబ్దేవి = కకుప్ దేవి; కి = కి; సంకుటుండు = సంకుటుడు; పుట్టె = పుట్టెను; సంకుటున్ = సంకుటుని; కున్ = కి; కీటకుండు = కీటకుడు; పుట్టె = పుట్టెను; కీటకున్ = కీటకుని; కు = కి; దుర్గ = దుర్గము లందు; అభిమానులు = ఆపేక్ష కలిగినవారు; అయిన = ఐన; దేవతలు = దేవతలు; జన్మించిరి = పుట్టిరి; జామిదేవి = జామిదేవి; కి = కి; దుర్గ = ప్రవేశింప శక్యము కాని; భూములు = ప్రదేశములు; కు = కు; అధిష్ఠాన = అధికారము గల; దేవతలు = దేవతలు; జనియించిరి = పుట్టిరి; వారి = వారి; కి = కి; స్వర్గుండును = స్వర్గుడు; నందియు = నంది; జన్మించిరి = పుట్టిరి; విశ్వ = విశ్వ; అను = అనెడి; దాని = ఆమె; కి = కు; విశ్వేదేవ = విశ్వేదేవ; గణంబు = సమూహములు; జనించె = పుట్టెను; వారలు = వారు; అపుత్రకులు = పుత్రులు లేనివారు; అనన్ = అని; పరిగిరి = ప్రసిద్ధులైరి; సాధ్య = సాధ్య; అను = అనెడి; దాని = ఆమె; కి = కు; సాధ్య = సాధ్యుల; గణంబులు = సమూహములు; పుట్టె = పుట్టెను; వాని = వాని; కిన్ = కి; అర్థసిద్ధి = అర్థసిద్ధి; అను = అనెడి; వాడు = వాడు; పుట్టె = పుట్టెను; మరుత్వతి = మరుత్వతి; అను = అనెడి; దాని = ఆమె; కి = కు; మరుత్వంతుడు = మరుత్వంతుడు; జయంతుండు = జయంతుడు; అను = అనెడి; వారలు = వారు; ఉదయించిరి = పుట్టిరి; జయంతుండు = జయంతుడు; వాసుదేవ = నారాయణుని; అంశజుండు = అంశతో పుట్టినవాడు; ఐన = అయిన; ఉపేంద్రుండు = ఉపేంద్రుడు; అనంబడి = అని తెలియబడి; వినుతి = ప్రసిద్ధి; ఒందె = పొందెను; ముహూర్త = ముహూర్త; అను = అనెడి; దాని = ఆమె; కి = కు; సకల = సర్వ; భూతముల = జీవుల; కున్ = కు; ఆయా = ఆయా; కాలంబులన్ = కాలానుసరమై; కలిగెడున్ = కలిగెడి; ఆయా = ఆయా; ఫలాఫలములను = మంచి చెడు ఫలితములను; ఇచ్చు = ఇచ్చెడి; మౌహర్తికులు = మౌహర్తికులు; అనియెడు = అనెడు; దేవ = దేవతల; గణంబులు = సమూహములు; పుట్టిరి = పుట్టిరి; సంకల్ప = సంకల్ప; అను = అనెడి; దాని = ఆమె; కి = కు; సంకల్పుండు = సంకల్పుడు; ఉదయించెన్ = పుట్టెను; ఆ = ఆ; సంకల్పున్ = సంకల్పుని; కున్ = కి; కాముండు = కాముడు; జనియించె = పుట్టెను; వసువు = వసువు; అను = అనెడి; దాని = ఆమె; కి = కు; ద్రోణుండును = ద్రోణుడు; ప్రాణుండును = ప్రాణుడు; ధ్రువుండును = ధ్రువుండు; అర్కుండును = అర్కుండు; అగ్నియు = అగ్ని; దోషుండును = దోషుండు; వస్తువును = వస్తువు; విభావసువును = విభావసువు; అనన్ = అనగా; ఎనమండ్రు = ఎనిమిదిమంది; వసువులు = వసువులు {అష్టవసువులు - 1ద్రోణుడు 2ప్రాణుడు 3ధ్రువుండు 4అర్కుండు 5అగ్ని 6దోషుండు 7వస్తువు 8విభావసువు (ఇంకొక క్రమముకూడ కలదు)}; ఉదయంబునొందిరి = పుట్టిరి; అందు = వారిలో; ద్రోణున్ = ద్రోణుని; కున్ = కి; అభిమతి = అభిమతి; అను = అనెడి; భార్య = భార్య; అందు = అందు; హర్ష = హర్షుడు; శోక = శోకుడు; భయ = భయుడు; ఆదులు = మొదలగువారు; పుట్టిరి = పుట్టిరి; ప్రాణున్ = ప్రాణుని; కున్ = కి; భార్య = భార్య; ఐన = అయిన; ఊర్జస్వతి = ఊర్జస్వతి; అందు = అందు; సహుడును = సహుడు; ఆయువును = ఆయువు; పురోజవుండునున్ = పురోజవుడు; అను = అనెడి; వారలు = వారు; కలిగిరి = పుట్టిరి; ధ్రువున్ = ధ్రువుని; కున్ = కి; భార్య = భార్య; అగు = అయిన; ధరణి = ధరణి; అందు = అందు; వివిధంబులు = అనేక రకములు; అగు = అయిన; పురంబులు = పురములు; పుట్టెన్ = పుట్టెను; అర్కున్ = అర్కుని; కు = కి; భార్య = భార్య; అగు = అయిన; వాసన = వాసన; అందు = అందు; తర్ష = తర్షుడు; ఆదులు = మొదలగువారు; ఉదయించిరి = పుట్టిరి; అగ్ని = అగ్ని; కి = కి; భార్య = భార్య; ఐన = అయిన; వసోర్ధార = వసోర్ధార; అందు = అందు; ద్రవిణక = ద్రవిణకుడు; ఆదులు = మొదలగువారు; పుట్టిరి = పుట్టిరి; మఱియున్ = ఇంకను; కృత్తికల = కృత్తికల; కు = కు; స్కందుండు = స్కందుడు; కలిగెన్ = పుట్టెను; ఆ = ఆ; స్కందున్ = స్కందున; కు = కు; విశాఖ = విశాఖుడు; ఆదులు = మొదలగువారు; ఉదయించిరి = పుట్టిరి; దోషున్ = దోషుని; కు = కి; శర్వరి = శర్వరి; అను = అనెడి; భార్య = భార్య; అందు = అందు; హరి = నారాయణుని; కళ = అంశ; అగు = అయిన; శింశుమారుండు = శింశుమారుడు; ఉదయించె = పుట్టెను; వస్తువున్ = వస్తువు; కున్ = కు; ఆంగిరస = ఆంగిరస; అందు = అందు; విశ్వకర్మ = విశ్వకర్మ; అను = అనెడి; శిల్పాచార్యుండు = శిల్పాచార్యుడు; ఉదయంబందెన్ = పుట్టెను; ఆ = ఆ; విశ్వకర్మ = విశ్వకర్మ; కున్ = కు; ఆకృతి = ఆకృతి; అను = అనెడి; సతి = భార్య; అందున్ = అందు; చాక్షుషుండు = చాక్షుషుడు; అను = అనెడి; మనువు = మనువు; జనియించెన్ = పుట్టెను; ఆ = ఆ; మనువు = మనువు; వలన = వలన; విశ్వులు = విశ్వులు; సాధ్యులు = సాధ్యులు; అను = అనెడి; వారు = వారు; పుట్టిరి = పుట్టిరి; విభావసున్ = విభావసువున; కున్ = కు; ఉష = ఉష; అను = అనెడి; భార్య = భార్య; అందు = అందు; వ్యుష్టియు = వ్యుష్టి; రోచియున్ = రోచి; ఆతపుండును = ఆతపుడు; జనించిరి = పుట్టిరి; అందున్ = అందు; ఆతపుని = నాతపుని; కి = కి; పంచయాముండు = పంచయాముడు; అను = అనెడి; దివస = పగలుని; అభిమాన = అభిమానించెడి; దేవత = దేవత; జనియించె = పుట్టెను; శంకర = ఆదిశంకరుని; అంశజుండు = అంశతో పుట్టిన వాడు; అయిన = అయిన; భూతున్ = భూతుని; కు = కి; సురూప = సురూప; అను = అనెడి; భార్య = భార్య; అందు = అందు; కోట్ల = కోట్లకొద్దీ; సంఖ్యలు = సంఖ్యలలో నుండు వారు; ఐన = అయిన; రుద్రగణంబులు = రుద్రగణములు; ఉదయించిరి = పుట్టిరి; మఱియు = ఇంకను; రైవతుండు = రైవతుడు; అజుండు = అజుడు; భవుండు = భవుడు; భీముండు = భీముడు; వాముండు = వాముడు; ఉగ్రుండు = ఉగ్రుడు; వృషాకపియున్ = వృషాకపి; అజైకపాత్తున్ = అజైకపాత్తు; అహిర్భుధ్న్యుండు = అహిర్భుధ్న్యుండు; బహురూపుండు = బహురూపుడు; మహాంతుండున్ = మహాంతుడు; అను = అనెడి; వారలు = వారు; రుద్రపారిషదులును = రుద్రునికి అనుచరులు, ప్రమథగమములు; అతి = మిక్కిలి; భయంకరులు = భీకరులు; అయిన = అయిన; ప్రేతులను = ప్రేతములు; వినాయకులును = వినాయకులు; పుట్టిరి = పుట్టిరి; అంగిరసుండు = అంగిరసుడు; అను = అనెడి; ప్రజాపతి = ప్రజాపతి; కి = కి; స్వధ = స్వధ; అను = అనెడి; భార్య = భార్య; అందున్ = అందు; పితృగణంబులు = పితృగణములు; పుట్టిరి = పుట్టిరి; సతి = సతి; అను = అనెడి; భార్య = భార్య; కు = కు; అద్వర = అధర్వణ; వేద = వేదము నందు; అభిమాన = ఆపేక్ష కలిగిన; దేవతలు = దేవతలు; పుట్టిరి = పుట్టిరి; కృశాశ్వున్ = కృశాశ్వున; కున్ = కి; అర్చి = అర్చి; అను = అనెడి; భార్య = భార్య; అందు = అందు; ధూమ్రకేశుండు = ధూమ్రకేశుడు; అను = అనెడి; పుత్రుండు = కుమారుడు; ఉదయించె = పుట్టెను; వేదశిరున్ = వేదశిరున; కు = కి; ధిషణ = ధిషణ; అను = అనెడి; భార్య = భార్య; అందు = అందు; దేవలుడును = దేవలుడు; వయనుండును = వయనుడు; మనువునున్ = మనువు; పుట్టిరి = పుట్టిరి; తార్క్షున్ = తార్క్షుని, (కశ్యపుని నామాంతరం తార్క్షుడు); కు = కి; వినత = వినత; కద్రువ = కద్రువ; పతంగి = పతంగి; యామిని = యామిని; అన = అని; నలువురు = నలుగురు; భార్యలు = భార్యలు; అందు = వారిలో; పతంగి = పతంగి; కిన్ = కి; పక్షులు = పక్షులు; పుట్టె = పుట్టెను; యామిని = యామిని; కి = కి; శలభంబులు = శలభములు; పుట్టె = పుట్టెను; వినత = వినత; కు = కు; సాక్షాత్కరించిన = ప్రత్యక్ష; యజ్ఞాధిపతి = నారాయణుని {యజ్ఞాధిపతి - యజ్ఞములకు అధిపతి, విష్ణువు}; కి = కి; వాహనంబు = వాహనము; అయిన = అయినట్టి; గరుడుండును = గరుడుడు; సూర్యున్ = సూర్యుని; కు = కి; సారథి = సారథి; ఐన = అయినట్టి; అనూరుండును = అనూరుడు; జనియించిరి = పుట్టిరి; కద్రువ = కద్రువ; కున్ = కు; పెక్కు = అనేకమైన; తెఱగులు = విధములైనవి; అగు = అయినట్టి; భుజంగమంబులు = పాములు; పుట్టె = పుట్టెను; చంద్రున్ = చంద్రున; కున్ = కు; కృత్తిక = కృత్తిక; ఆది = మొదలైన; నక్షత్రంబులు = నక్షత్రములు; భార్యలు = భార్యలు; అయినను = అయినప్పటికిని; వారల = వారి; అందు = లో; చంద్రుండు = చంద్రుడు; రోహిణి = రోహిణి; అందు = ఎడల; మాత్రము = మాత్రము; మోహితుండు = ప్రేమగలవాడు; అగుటన్ = అగుట; చేసి = వలన; దక్ష = దక్షుని; శాపంబునన్ = శాపమువలన; క్షయరోగ = క్షయరోగమున; గ్రస్తుడు = లోనైనవాడు; ఐ = అయ్యి; సంతానంబు = సంతానమును; పడయనేరడు = పొందలేని వాడు; అయ్యెన్ = అయ్యెను; అంత = అంతట; దక్ష = దక్షుని; ప్రసాదంబున = అనుగ్రహమున; క్షయపీడితంబులు = క్షయచే బాధింపబడునవి; అగు = అయిన; షోడశ = పదహారు; కళలన్ = కళలను; మరలన్ = మళ్ళీ; పొందె = పొందెను; మఱియును = ఇంకను.

భావము:

వారెవరంటే భానువు, లంబ, కకుప్పు, జామి, విశ్వ, సాధ్య, మరుత్వతి, వసువు, ముహూర్త, సంకల్ప అనే పదిమంది దక్షుని కుమార్తెలు ధర్మునకు భార్యలై కొడుకులను కన్నారు. వారెవరంటే భానువుకు వేదఋషభుడు పుట్టాడు. అతనికి ఇంద్రసేనుడు జన్మించాడు. అంబకు విద్యోతుడు పుట్టాడు. అతనికి స్తనుడు, ఇత్నువు అనే కుమారులు కలిగారు. కకుబ్దేవికి సంకుటుడు పుట్టాడు. అతనికి కీకటుడు జన్మించాడు. కీకటునకు దుర్గాభిమానులైన దేవతలు జన్మించారు. జామిదేవికి దుర్గభూములకు అధిష్ఠాన దేవతలు జన్మించారు. వారికి స్వర్గుడు, నంది పుట్టారు. విశ్వకు విశ్వేదేవతలు జన్మించారు. వారు సంతానం లేనివారయ్యారు. సాధ్యకు సాధ్యగణాలు పుట్టారు. వానికి అర్థసిద్ధి అనేవాడు జన్మించాడు. మరుత్వతికి మరుత్వతుడు, జయంతుడు అనేవారు కలిగారు. వారిలో జయంతుడు శ్రీమన్నారాయణుని అంశతో పుట్టి ఉపేంద్రుడు అనే పేరుతో ప్రసిద్ధిని పొందాడు. ముహూర్తకు సకల ప్రాణులకు ఆయా కాలాలలో కలిగే ఆయా ఫలితాలాను ఇచ్చే మౌహూర్తికులు అనే దేవసమూహం పుట్టింది. సంకల్పకు సంకల్పుడు జన్మించాడు. ఆ సంకల్పునకు కాముడు పుట్టాడు. వసువుకు ద్రోణుడు, ప్రాణుడు, ధ్రువుడు, అర్కుడు, అగ్ని, దోషుడు, వస్తువు, విభావసువు అనే ఎనిమిదిమంది వసువులు పుట్టారు. వారిలో ద్రోణునకు అభిమతి అనే భార్య వల్ల హర్షుడు, శోకుడు, భయుడు మొదలైనవారు పుట్టారు. ప్రాణునకు ఊర్జస్వతి అనే భార్య వల్ల సహుడు, ఆయువు, పురోజవుడు అనే కుమారులు కలిగారు. ధ్రువునకు ధరణి అనే భార్య వల్ల వివిధ పురాలు కలిగాయి. అర్కునికి వాసన అనే భార్య వలన తర్షుడు మొదలైనవారు జన్మించారు. అగ్నికి వసోర్ధార అనే భార్యవల్ల ద్రవిణకుడు మొదలైనవారు పుట్టారు. కృత్తికలకు స్కందుడు జన్మించాడు. ఆ స్కందునకు విశాఖుడు మొదలైనవారు పుట్టారు. దోషునకు శర్వరి అనే భార్య వల్ల విష్ణువు యొక్క అంశ అయిన శింశుమారుడు పుట్టాడు. వస్తువుకు ఆంగిరస అనే భార్య వల్ల విశ్వకర్మ అనే శిల్పాచార్యుడు పుట్టాడు. ఆ విశ్వకర్మకు ఆకృతి అనే భార్య వల్ల చాక్షుషుడు అనే మనువు జన్మించాడు. ఆ మనువు వల్ల విశ్వుడు, సాధ్యులు అనేవాళ్ళు పుట్టారు. విభావసునకు ఉష అనే భార్య వల్ల వ్యుష్టి, రోచిస్సు, ఆతపుడు జన్మించారు. వారిలో ఆతపునికి పంచయాముడు అనే దినాధిదేవత పుట్టాడు. శంకరుని అంశతో పుట్టిన భూతునకు సురూప అనే భార్య వల్ల కోట్లకొలది రుద్రగణాలు పుట్టారు. అంతేకాక రైవతుడు, అజుడు, భవుడు, భీముడు, వాముడు, అగ్రుడు, వృషాకపి, అజైకపాత్తు, అహిర్బుధ్న్యుడు, బహురూపుడు, మహాంతుడు అనేవాళ్ళు, రుద్రపారిషదులు, మిక్కిలి భయంకరాకారులైన ప్రేతలు, వినాయకులు జన్మించారు. అంగిరసుడు అనే ప్రజాపతికి స్వధ అనే భార్య వల్ల పితృగణాలు పుట్టారు. సతి అనే భార్యకు అధర్వవేదాన్ని అభిమానించే దేవతలు పుట్టారు. కృతాశ్వునకు అర్చిస్సు అనే భార్య వల్ల ధూమ్రకేశుడు అనే కుమారుడు కలిగాడు. వేదశిరస్సుకు ధిషణ అనే భార్య వల్ల దేవలుడు, వయునుడు, మనువు జన్మించారు. కశ్యపునితి తార్క్షుడు అను నామాంతరం కలదు. అతనికి వినత, కద్రువ, పతంగి, యామిని అని నలుగురు భార్యలు. అందులో పతంగికి పక్షులు పుట్టాయి. యామినికి శలభాలు పుట్టాయి. వినత తనకు సాక్షాత్కరించిన యజ్ఞాధిపతికి వాహనమైన గరుత్మంతుని, సూర్యునికి సారథి అయిన అనూరుని కన్నది. కద్రువకు రకరకాల పాములు జన్మించాయి. చంద్రునికి కృత్తిక మొదలైన నక్షత్రాలు భార్యలు. చంద్రుడు తన భార్యలలో రోహిణిని అధిక మోహంతో చూచి మిగిలిన భార్యలను నిర్లక్ష్యం చేసి దక్షుని శాపం వల్ల క్షయరోగాన్ని పొంది సంతానం లేనివాడైనాడు. తరువాత దక్షుని దయవల్ల క్షయవల్ల తొలగిన కళలను తిరిగి పొందాడు. ఇంకా...