పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : హంసగుహ్య స్తవరాజము

  •  
  •  
  •  

6-244-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బ్రహ్మేంద్రాదులు నందనేరని పరబ్రహ్మంబుఁ జింతించుచున్
బ్రహ్మానందముఁ బొంది జిహ్వికలపై బ్రహ్మణ్యమంత్రంబులన్
బ్రహ్మాలోకనవాంఛతో నిలుపుచున్ బ్రహ్మం బితండంచు మున్
బ్రహ్మజ్ఞాన గురున్ హరిం దపమునం బాటించి రబ్బాలకుల్.

టీకా:

బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఇంద్ర = ఇంద్రుడు; ఆదులు = మొదలగువారు; అందనేరని = అందుకొనలేని; పరబ్రహ్మంబున్ = పరబ్రహ్మమును; చింతించుచున్ = ధ్యానించుతూ; బ్రహ్మానందమున్ = బ్రహ్మానందమును; పొంది = పొంది; జిహ్వికల = నాలుకల; పై = మీద; బ్రహ్మణ్య = పరమాత్మకు చెందిన; మంత్రంబులన్ = మంత్రములను; బ్రహ్మ = పరబ్రహ్మమును, పరమాత్మను; ఆలోకన = దర్శించెడి; వాంఛ = కోరిక; తో = తోటి; నిలుపుచున్ = ధారణచేయుచు; బ్రహ్మంబు = పరమాత్మ; ఇతడు = ఇతడు; అంచున్ = అని; మున్ = ముందుగా; బ్రహ్మజ్ఞాన = బ్రహ్మజ్ఞానమునకు; గురున్ = తండ్రిని; హరిన్ = నారాయణుని; తపమునన్ = తపస్సు నందు; పాటించిరి = ధ్యానించిరి; ఆ = ఆ; బాలకుల్ = చిన్నవారు.

భావము:

శబలాశ్వులు బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలు కూడా అందుకోలేని పరబ్రహ్మాన్ని బ్రహ్మానందంతో ధ్యానం చేశారు. ఆ బాలకులు తమ నాలుకలతో పరమాత్మకు సంబంధించిన మంత్రాలను ఉచ్చరిస్తూ భగవంతుణ్ణి దర్శించాలనే కుతూహలంతో సమస్తమూ ఆ పరబ్రహ్మ స్వరూపంగా భావించి ఆనందమయుడైన ఆ దేవదేవుని గురించి తపస్సు చేశారు.