పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : హంసగుహ్య స్తవరాజము

  •  
  •  
  •  

6-243-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు శబళాశ్వులు ప్రజాసర్గంబు కొఱకుఁ దండ్రి పంపునం దపంబు జేయువారై యే తీర్థంబు తీర్థరాజం బై సకలతీర్థఫలంబు నాలోకన మాత్రంబున ననుగ్రహించుచు సకలపాపంబుల నిగ్రహించు, నే తీర్థ ప్రభావంబున నగ్రజన్ములు ఫలసిద్ధిం బొందుదు, రట్టి నారాయణసర స్సను పుణ్యతీర్థంబునకుం జని, త దుపస్పర్శమాత్రంబున నిర్ధూత మలాశయులై.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; శబళాశ్వులు = శబళాశ్వులు; ప్రజాసర్గంబు = జనులను పుట్టించుట; కొఱకు = కోసము; తండ్రి = తండ్రి; పంపున = నియమించిన ప్రకారము; తపంబు = తపస్సు; చేయువారు = చేసెడివారు; ఐ = అయ్యి; ఏ = ఏ; తీర్థంబు = పుణ్యతీర్థము; తీర్థరాజంబు = తీర్థములలో శ్రేష్ఠమైనది; ఐ = అయ్యి; సకల = సర్వ; తీర్థ = తీర్థముల; ఫలంబున్ = ఫలితములను; ఆలోకన = దర్శన; మాత్రంబునన్ = మాత్రముచేత; అనుగ్రహించుచు = ప్రసాదిస్తూ; సకల = సర్వ; పాపంబులన్ = పాపములను; నిగ్రహించున్ = నాశనము చేయును; ఏ = ఏ; తీర్థ = తీర్థము యొక్క; ప్రభావంబునన్ = ప్రభావమువలన; అగ్రజన్ములు = శ్రేష్ఠమైన జన్మము గలవారు, అన్నలు; ఫల = ఫలితముల; సిద్ధిన్ = సిద్దించుటను; పొందుదురు = పొందుదురు; అట్టి = అటువంటి; నారాయణసరస్సు = నారాయణసరస్సు; అను = అనెడి; పుణ్యతీర్థంబున్ = పుణ్యతీర్థమున; కున్ = కు; చని = వెళ్ళి; తత్ = దానిని; ఉపస్పర్శ = తాకిన; మాత్రంబునన్ = మాత్రముచేత; నిర్ధూత = పోగొట్టబడిన; మలాశయులు = దోషములు గలవారు; ఐ = అయ్యి.

భావము:

ఆ శబలాశ్వులు తండ్రి ఆజ్ఞానుసారం ప్రజాసృష్టి కొరకు తపస్సు చేయాలనే కోరికతో తీర్థాలలో ఉత్తమమైన నారాయణ తీర్థాన్ని చేరుకున్నారు. ఆ పుణ్యతీర్థం దర్శనమాత్రం చేతనే సమస్త పుణ్యతీర్థాలలో స్నానం చేసిన ఫలాన్ని అనుగ్రహిస్తుంది. సకల పాపాలను హరిస్తుంది. అటువంటి తీర్థరాజాన్ని స్పర్శించి తమ దోషాలను పోగొట్టుకొని పవిత్రులైనారు.