పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : హంసగుహ్య స్తవరాజము

  •  
  •  
  •  

6-217-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు; ననేకవిధ నామ రూప నిరూప్యంబగు మనంబునకు దృష్టస్మృతుల నాశంబువలనఁ గలిగెడు నుపరామం బగు సమాధి యందుఁ గేవల జ్ఞానస్వరూపంబునఁ దోచు నిర్మల ప్రతీతిస్థానంబైన హంసస్వరూపికి నమస్కరింతు; దారువందు నతి గూఢంబైన వీతిహోత్రుని బుద్ధిచేతం బ్రకాశంబు నొందించు భంగి, బుద్ధిమంతులు హృదంతరంబున సన్నివేశుం డయిన పరమపురుషుని నాత్మశక్తిత్రయంబులచేతం దేజరిల్లఁ జేయుదు; రట్టి దేవుండు, సకల మాయావిచ్ఛేదకం బయిన నిర్వాణ సుఖానుభవంబునం గూడి యుచ్ఛరింపం గొలఁదిగాని శక్తిగల విశ్వరూపుండు నాకుం బ్రసన్నుండగుంగాక; వాగ్భుద్ధీంద్రియ మానసంబులచేతం జెప్పను, నిట్టి దని నిరూపింపను, నలవిగాక యెవ్వని గుణరూపంబులు వర్తించు, నెవ్వండు నిర్గుణుండు, సర్వంబు నెవ్వనివలన నుత్పన్నంబగు, నెవ్వనివలన స్థితిం బొందు, నెవ్వని వలన లయంబగు, నట్టి పరాపరంబులకుం బరమంబై, యనన్యంబై, ప్రాక్ప్రసిద్ధంబై, సర్వవ్యాపకంబై, యదియ బ్రహ్మంబై, యాదికారణంబై యున్న తత్త్వంబు నాశ్రయింతు; నెవ్వని ప్రభావంబు మాటలాడెడు వారలకు, వాదంబు చేయువారలకు వివాద సంవాదస్థలంబు లగుచు నప్పటప్పటికి మోహంబు నొందించుచుండు, నట్టి యనంతగుణంబులు గల మహాత్మునకుం బ్రణామంబు చేయు; దస్థి నాస్థి యను వస్తుద్వయ నిష్ఠలం గలిగి, యొక్కటన యుండి విరుద్ధ ధర్మంబులుగఁ గనంబడు నుపాసనా శాస్త్ర సాంఖ్యశాస్త్రంబులకు సమంబై, వీక్షింపఁదగిన పరమంబు నాకు ననుకూలంబగు గాక, యెవ్వఁడు జగదనుగ్రహంబుకొఱకు జన్మ కర్మంబులచేత నామరూపంబు లెఱుంగంబడ కుండియు, నామరూపంబులు గలిగి తేజరిల్లు, నట్టి యనంతుడయిన భగవంతుండు ప్రసన్నుండగుం గాక; యెవ్వండు జనులకుఁ బురాకృత జ్ఞాన పదంబుల చేత నంతర్గతుండై, మేదినిం గలుగు గంధాది గుణంబుల నాశ్రయించిన వాయువు భంగి మెలంగుచుండు నా పరమేశ్వరుండు మదీయ మనోరథంబు సఫలంబు జేయు గాక"యనుచు భక్తి పరవశుండయి యుక్తి విశేషంబున స్తుతియించుచున్న దక్షునికి భక్తవత్సలుం డైన శ్రీవత్సలాంఛనుండు ప్రాదుర్భావంబు నొందె; నప్పుడు.

టీకా:

మఱియున్ = ఇంకను; అనేక = అనేక; విధ = రకముల; నామ = నామములు; రూప = రూపములను; నిరూప్యంబు = నిరూపించెడిది; అగు = అయిన; మనంబున్ = మనసున; కు = కు; దృష్ట = చూసినది; స్మృతుల = స్మరించునది; నాశంబు = నాశన మగుట; వలన = వలన; కలిగెడు = కలుగు; ఉపరామంబు = విరామము; అగు = అయిన; సమాధి = సమాధి; అందున్ = లోను; కేవల = కేవలము; జ్ఞాన = జ్ఞానము యొక్క; రూపంబునన్ = రూపములో; తోచు = గోచరించెడి; నిర్మల = స్వచ్ఛమైన; ప్రతీత = తత్త్వము వెలువడు; స్థానంబు = స్థానము; ఐన = అయినట్టి; హంస = హంస; స్వరూపి = స్వరూపము గలవాని; కి = కి; నమస్కరింతు = నమస్కరించెదను; దారువు = కఱ్ఱ; అందు = లో; అతి = మిక్కిలి; గూఢంబు = రహస్యముగ నుండు నది; ఐన = అయిన; వీతిహోత్రుని = అగ్నిహోత్రుని; బుద్ధి = జ్ఞానము; చేతన్ = వలన; ప్రకాశంబున్ = కనబడునట్లు; ఒందించు = చేసెడి; భంగిన్ = విధముగ; బుద్ధిమంతులు = జ్ఞానులు; హృదంతరంబునన్ = హృదయము లోపల; సన్నివేశుండు = కూడి యుండెడివాడు; అయిన = అయినట్టి; పరమపురుషుని = సర్వోత్తమమైన పురుషుని; ఆత్మశక్తిత్రయంబు = ఆత్మ యొక్క మూడు శక్తులు {ఆత్మ శక్తి త్రయంబు - ఆత్మయొక్క మూడుశక్తులు 1ఆజ్ఞాశక్తి 2 సంకల్పశక్తి 3మంత్రశక్తి}; చేతన్ = చేతను; తేజరిల్లన్ = ప్రకాశముగ; చేసెదరో = చేస్తారో; అట్టి = అటువంటి; దేవుండు = దేవుడు; సకల = సమస్తమైన; మాయా = మాయలను; విచ్ఛదకంబు = తెగనరికి వేయు నది; అయిన = అయినట్టి; నిర్వాణ = మోక్షపద; సుఖ = సుఖము యొక్క; అనుభవంబునన్ = అనుభవముతో; కూడి = కలసి; ఉచ్చరింపన్ = చెప్పుటకు; కొలదికాని = శక్యముకాని; శక్తి = శక్తి; కల = కలిగిన; విశ్వరూపుండు = విశ్వమే తన రూపమైన వాడు; నాకున్ = నాకు; ప్రసన్నుండు = ప్రసన్నమైన వాడు; అగుంగాక = అగుగాక; వాక్ = మాటలు; బుద్ధి = జ్ఞానము; ఇంద్రియ = ఇంద్రియములు; మానసంబు = మనసు; చేతన్ = చేతను; చెప్పను = చెప్పుటకు; ఇట్టిది = ఇటువంటిది; అని = అని; నిరూపింపను = నిరూపించుటకు; అలవిగాక = శక్యము గాకుండగ; ఎవ్వని = ఎవని; గుణ = గుణములు; రూపంబులు = స్వరూపములు; వర్తించున్ = నడుస్తుండునో; ఎవ్వండు = ఎవడైతే; నిర్గుణుండు = త్రిగుణరహితుడో; సర్వంబు = సమస్తము; ఎవ్వని = ఎవని; వలనన్ = వలన; ఉత్పన్నంబు = సృష్టింపబడుట; అగున్ = జరుగునో; ఎవ్వని = ఎవని; వలన = వలనైతే; స్థితిన్ = స్థితిని; పొందున్ = పొందునో; ఎవ్వని = ఎవని; వలన = వలనైతే; లయంబు = లయమగుట; అగున్ = అగునో; అట్టి = అటువంటి; పర = ఇతరమైనది; అపరంబులు = అనితరమైనవాని (రెంటి); కున్ = కి; పరమంబు = అతీతమైనది; ఐ = అయ్యి; అనన్యంబు = అద్వితీయము; ఐ = అయ్యి; ప్రాక్ = మొదటినుండి; ప్రసిద్ధంబు = మిక్కిలి సిద్ధించి యుండునది; ఐ = అయ్యి; సర్వవ్యాపకంబు = సమస్తము నందు వ్యాపించి యుండునది; ఐ = అయ్యి; అదియ = అదే; బ్రహ్మంబు = పరబ్రహ్మము; ఐ = అయ్యి; ఆదికారణంబు = మూలకారణము; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; తత్త్వంబున్ = తత్త్వమును; ఆశ్రయింతు = ఆశ్రయించెదను; ఎవ్వని = ఎవని; ప్రభావంబు = ప్రభావము; మాటలాడెడు = మాట్లాడే; వారల = వారల; కున్ = కు; వాదంబు = వాదనలు; చేయు = చేసెడి; వారల = వారల; కున్ = కు; వివాద = తగవు; సంవాద = తర్క; స్థలంబులు = స్థానములు; అగుచున్ = అగుచు; అప్పటప్పటికి = ఎప్పటి కప్పుడే; మోహంబు = మోహము; ఒందించున్ = పొందించు; అట్టి = అటువంటి; అనంత = అంతులేని; గుణంబులు = లక్షణములు; కల = కలిగిన; మహాత్మున్ = గొప్పవాని; కున్ = కి; ప్రణామంబు = నమస్కారములు; చేయుదు = చేయుదును; అస్థి = ఉన్నది; నాస్థి = లేనిది; అను = అనెడి; వస్తు = పదార్థముల; ద్వయ = రెంటి; నిష్ఠలన్ = ఉనికి; కలిగి = ఉండి; ఒక్కటన = ఏకమై; ఉండి = ఉండి; విరుద్ధ = విరుద్ధమైన; ధర్మంబులుగన్ = లక్షణములువలె; కనంబడు = కనబడెడు; ఉపాసనాశాస్త్ర = ఉపాసించెడి శాస్త్రము; సాంఖ్యశాస్త్రంబుల = సాంఖ్యా శాస్త్రముల; కున్ = కు; సమంబు = సమానమైనది; ఐ = అయ్యి; వీక్షింపదగిన = దర్శించదగిన; పరమంబు = పరమాత్మ; నా = నా; కున్ = కు; అనుకూలంబు = ప్రసన్నము; అగుగాక = అగుగాక; ఎవ్వడు = ఎవడైతే; జగత్ = భువనమును; అనుగ్రహంబు = అనుగ్రహించుట; కొఱకు = కోసము; జన్మ = పుట్టుక; కర్మంబుల = కర్మల; చేతన్ = వలన; నామ = నామములు; రూపంబులు = స్వరూపములు; ఎఱుంగంబడక = తెలియకుండగ; ఉండియు = ఉండియు; నామ = నామములు; రూపంబులు = రూపములు; కలిగి = కలిగి; తేజరిల్లున్ = విరాజిల్లును; అట్టి = అటువంటి; అనంతుడు = అంతము లేనివాడు; అయిన = అయినట్టి; భగవంతుండు = భగవంతుడు; ప్రసన్నుండు = అనుకూలుడు; అగుంగాక = అగుగాక; ఎవ్వండు = ఎవడైతే; జనులు = మానవులు; కున్ = కు; పురాకృత = పూర్వము చేసిన సుకృతముల; జ్ఞాన = కలిగిన జ్ఞాన; పదంబుల = స్థితి; చే = వలన; తను = తను; అంతర్గంతుండు = లోన వ్యాపించి యుండువాడు; ఐ = అయ్యి; మేదినిన్ = భూమిపైన; కలుగు = ఉండెడి; గంధ = వాసన; ఆది = మొదలైన; గుణంబులన్ = గుణములను; ఆశ్రయించిన = ఆశ్రయించినట్టి; వాయువు = వాయువు; భంగిన్ = వలె; మెలంగుచుండున్ = తిరుగుచుండు; ఆ = ఆ; పరమేశ్వరుండు = నారాయణుడు {పరమేశ్వరుడు - పరమ (అందరికంటె పై నుండెడి) ఈశ్వరుడు, విష్ణువు}; మదీయ = నా యొక్క; మనోరథంబు = కోరికను; సఫలంబు = తీరునట్లు; చేయుగాక = చేయుగాక; అనుచున్ = అనుచూ; భక్తి = భక్తితో; పరవశుండు = పరవశము పొందిన వాడు; అయి = అయ్యి; యుక్తివిశేషంబునన్ = యోగవిద్యారహస్యముతో; స్తుతియించుచున్న = స్తోత్రము చేయుచున్న; దక్షున్ = దక్షుని; కి = కి; భక్త = భక్తుల యెడ; వత్సలుండు = వాత్సల్యము గలవాడు; ఐన = అయిన; శ్రీవత్సలాంఛనుండు = నారాయణుడు {శ్రీవత్స లాంఛనుడు - శ్రీవత్సము అనెడి పుట్టుమచ్చ గలవాడు, విష్ణువు}; ప్రాదుర్భవంబున్ = ప్రత్యక్ష మగుటను; ఒందె = పొందెను; అప్పుడు = అప్పుడు.

భావము:

నానావిధాలైన నామ రూపాలను నిరూపించే మనస్సుచేత గమనింపబడినవి, స్మరింపబడినవి అయిన విషయాలు తొలగినప్పుడు కలిగే సమాధి స్థితిలో కేవలం జ్ఞానస్వరూపంగా గోచరించి, అటువంటి సమాధి స్థితికి ఆశ్రయభూతుడైన హంసస్వరూపునకు నమస్కరిస్తాను. ఎండుకట్టెలో దాగి ఉన్న అగ్నిని తమ బుద్ధితో ప్రకాశింపజేసినట్లు బుద్ధిమంతులు తమ హృదయాంతరాలలో ఉన్న పరమపురుషుని తమలోని శక్తిత్రయం చేత ప్రకాశింపజేస్తారు. అటువంటి భగవంతుడు సమస్త విధాలైన మాయలకు అతీతమైన మోక్షసంబంధమైన ఆనందానుభూతితో విలసిల్లుతుంటాడు. మాటలకు అందని మహత్తర శక్తితో కూడి ఉన్న ఆ విశ్వరూపుడు నాకు ప్రసన్నుడు అగును గాక! వాక్కు, బుద్ధి, ఇంద్రియాలు, మనస్సు మొదలైనవి ఆ పరమాత్ముని స్వరూపాన్ని వెల్లడించలేవు. అది ఇటువంటిదని నిరూపింపలేవు. ఇంద్రియాలకు అతీతాలైన గుణరూపాలతో వర్తిస్తూ ఉన్న ఆ నిర్గుణ స్వరూపానికి నమస్కరిస్తున్నాను. ఈ సమస్త విశ్వం ఏ మహాశక్తి వలన సృష్టింప బడుతున్నదో, ఏ మహాశక్తి వలన రక్షింపబడుతున్నదో, ఏ మహాశక్తి వలన లయం పొందుతున్నదో అటువంటి పరమాత్మ స్వరూపం పరాపరాల కంటే ఉత్తమమైనది. అనన్యమైనది, అనాది కాలం నుండి ప్రసిద్ధమైనది, అంతటా వ్యాపించి ఉన్నది, పరబ్రహ్మస్వరూప మైనది, అన్నిటికీ మూలమైనది అయిన ఆ పరతత్వమును ఆశ్రయిస్తున్నాను. ఆ పరమాత్మ ప్రభావం వల్లనే ప్రాణులు మాట్లాడుతున్నారు. వాదోపవాదాలు చేస్తున్నారు. వివాదాలు పెడుతున్నారు. అన్నింటికీ కారణం ఆ పరమాత్మ అనంత గుణాలే. జీవులను ఎప్పటి కప్పుడు మోహంలో ముంచి తేల్చే ఆ భగవంతునికి ప్రణామం చేస్తున్నాను. ఉన్నది, లేదు అనే వస్తు ద్వయానికి ఆలవాలాలై పైకి విరుద్ధ ధర్మాలుగా కనబడుతున్న యోగసాంఖ్య దర్శనాలను రెంటికీ సమత్వం సమకూర్చే పరమాత్మ నన్ను అనుగ్రహించు గాక! స్వతస్సిద్ధంగా నామరూపాలు లేనివాడైననూ. జగాలను అనుగ్రహించుట కొఱకు అవతరిస్తూ వివిధ నామరూపాలు స్వీకరించి ప్రకాశిస్తుండే ఆ భగవంతుడు, అనంతుడు నాకు ప్రసన్నుడగు గాక! ఏ దేవుడు మానవుల పురాకృత పుణ్య విశేషాల చేత సుగంధాన్ని ఆశ్రయించిన వాయువు వలె అంతర్యామియై ఈ భూమిమీద ఉద్భవిస్తుంటాడో ఆ పరమేశ్వరుడు నా మనోరథాన్ని సఫలం చేయు గాక!” అంటూ భక్తిపరవశుడై తన భక్తి విశేషాలతో స్తుతిస్తున్న దక్షునికి భక్తవత్సలుడైన శ్రీహరి సాక్షాత్కరించాడు. అప్పుడు....