పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : అజామిళోపాఖ్యానము

  •  
  •  
  •  

6-81-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇ ట్లఖిల లోకానందకర కమ్రాకారులు, నఖిల విభ్రాజమాన తేజో దుర్నిరీక్ష్యమాణులును, నిఖిలధర్మపాలురును నగు మీరు ధర్మ పరిపాలుర మమ్ము నడ్డపెట్టం గతం బేమి?" యనిన మందస్మిత కందళిత ముఖారవిందులయి గోవిందుని కందువ మందిరంబు కావలివారలు వారివాహ గంభీర నిర్ఘోష పరిపోషణంబు లైన విశేషభాషణంబుల ని ట్లనిరి.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; అఖిల = సమస్తమైన; లోక = లోకములకు; ఆనంద = సంతోషమును; కర = కలిగించెడి; కమ్ర = చక్కటి; ఆకారులు = స్వరూపములు గలవారు; అఖిల = సమస్తమును; విభ్రాజమాన = విశేషముగ ప్రకాశిస్తున్న; తేజస్ = తేజస్సుతో; దుర్నిరీక్ష్యమాణులును = తేరిపార చూడరానివారు; నిఖిల = సమస్తమైన; ధర్మ = ధర్మమును; పాలురున్ = నడిపించువారు; అగు = అయిన; మీరు = మీరు; ధర్మ = ధర్మమును; పరిపాలురన్ = పరిపాలించెడి వారము; మమ్మున్ = మమ్మలును; అడ్డపెట్టన్ = అడ్డుకొనుటకు; గతంబు = కారణము; ఏమి = ఏమిటి; అనినన్ = అనగా; మందస్మిత = చిరునవ్వుతో; కందళిత = బాగుగా వికసించిన; ముఖ = మోము అనెడి; అరవిందలు = పద్మములు గలవారు; అయి = అయ్యి; గోవిందుని = విష్ణుమూర్తి యొక్క; కందువ = అంతఃపుర, నివాస; మందిరంబు = మందిరమున; కావలి = కాపాలా కాసెడి; వారలు = వారు; వారివహ = మేఘ; గంభీర = గంభీరమైన; నిర్ఘోష = గర్జనలకు; పరిపోషణంబులు = చక్కగా పాలించ గలిగెడివి; ఐన = అయిన; విశేష = విశేషమైన; భాషణంబులన్ = మాటలతో; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.

భావము:

ఈ విధంగా లోకాలన్నింటికి ఆనందాన్ని కలిగించే సుందర విగ్రహాలు కలవారు, చూడడానికి సాధ్యం కాని తేజస్సుతో విరాజిల్లుతున్నవారు, సర్వధర్మాలను పాలించేవారు అయిన మీరు మమ్మల్ని అడ్డగించడానికి కారణమేమిటి?” అని యమదూతలు పలుకగా చిరునవ్వులతో వికసించిన ముఖపద్మాలు కలిగిన ఆ విష్ణుదేవుని మందిర ద్వారపాలకులు గంభీరమైన మేఘ గర్జనలతో సమానమైన మాటలతో ఇలా అన్నారు.