పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : అజామిళోపాఖ్యానము

  •  
  •  
  •  

6-155-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్లజామిళుండు యోగమార్గంబున దేహంబు విడిచి పుణ్య శరీరుండై యగ్రభాగంబునం బ్రాగుపలబ్ధులైన మహాపురుష కింకరులం గాంచి, సమంచిత రోమాంచిత చలచ్ఛటాపింజరిత స్వేదబిందుసందోహ మిష నిష్యంద మహానందవల్లీకామతల్లికాంకుర సంకుల పరిశోభిత తనుండును, హర్ష నికర్షమాణ మానసోద్యోగ యోగప్రభావోత్సాహ విస్మయ మందస్మిత కందళిత ముఖారవిందుండును, నిఖిల జగజ్జేగీయమానాఖండ శుభప్రద శుభాకార సందర్శన సమాసాదిత కుతూహల మానసుండును నై, ప్రణామంబు లాచరించుచు భాగీరథీ తీరంబునఁ గళేబరంబు విడిచి, తత్క్షణంబ హరిపార్శ్వవర్తు లైన దాసవరుల స్వరూపంబుఁ దాల్చి, యా విష్ణుసేవకులతోడం గూడి దివ్య మణిగణఖచితంబై సువర్ణమయంబైన యసమాన విమానం బెక్కి, నిఖిలానంద భోగభాగ్యానుభ వాకుంఠితం బైన వైకుంఠనగరంబునకు శ్రీమన్నారాయణ పదారవింద సేవాచరణ పరిమాణ స్థితికిం జనియెను; నిట్లు విప్లావిత సర్వధర్ముండైన దాసీపతి, గర్హిత కర్మంబులచేతఁ బతితుండును, హతవ్రతుండును నై నరకంబునం గూలుచుండి భగవన్నామ గ్రహణంబున సద్యోముక్తుం డయ్యెఁ; గావున.

టీకా:

అట్లు = ఆ విధముగ; యోగమార్గంబునన్ = యోగమార్గములో; దేహంబు = శరీరమును; విడిచి = వదలి; పుణ్యశరీరుండు = పుణ్యవంతమైన దేహము గలవాడు; ఐ = అయ్యి; అగ్ర = ముందు; భాగంబునన్ = భాగములో; ప్రాక్ = ఇంతకు ముందు; లబ్ధులు = దర్శనమిచ్చిన వారు; ఐన = అయిన; మహాపురుష = నారాయణుని; కింకరులన్ = సేవకులను; కాంచి = చూసి; సమంచిత = చక్కగా నొప్పుచున్న; రోమాంచిత = గగుర్పాటు వలన; చలత్ = చలిస్తున్న; చటాపింజరిత = చివళ్ల యందు రంగులు గలిగిన; స్వేదబిందు = చెమటబిందువుల; సందోహ = సమూహము; మిష = అనుపేర; నిష్యంద = కారుతున్న; మహా = గొప్ప; ఆనంద = సంతోష మనెడి; వల్లికామతల్లికా = తీగ యొక్క; అంకుర = చివుళ్ళ; సంకుల = సమూహముచేత; పరిశోభిత = మిక్కిలి శోభ గలిగిన; తనుండును = శరీరము గలవాడును; హర్ష = ఆనందము; నికర్షమాణ = పొంగిపొర్లుతున్న; మానస = మానసిక; ఉద్యోగ = ప్రయత్నపు; యోగ = యోగపు; ప్రభావ = ప్రభావము యొక్క; ఉత్సహ = ఉత్సాహము; విస్మయ = ఆశ్చర్యకరమైన; మందస్మిత = చిరునవ్వుతో; కందళిత = తడసిన; ముఖ = ముఖ మనెడి; అరవిందుండును = పద్మము గలవాడును; నిఖిల = సమస్త; జగత్ = లోకము లందు; జేగీయమాన = కీర్తింపబడుతున్న; అఖండ = అఖండమైన; శుభప్రద = శుభప్రదమైన; శుభాకార = శుభాకారులను; సందర్శన = దర్శించుటవలన; సమాసాదిత = పొందినట్టి; కుతూహల = కుతూహలము గల; మానసుండును = మనసు గలవాడు; ఐ = అయ్యి; ప్రణామంబులు = నమస్కారములు; ఆచరించుచు = చేయుచు; భాగీరథి = గంగానది యొక్క; తీరంబునన్ = తీరములో; కళేబరంబున్ = దేహమును; విడిచి = వదలి; తత్క్షణంబ = ఆ క్షణములోనే; హరి = నారాయణుని; పార్శవర్తులు = అనుచరులు; ఐన = అయిన; దాస = సేవకులలో; వరుల = ఉత్తముల; స్వరూపంబున్ = స్వరూపమును; తాల్చి = ధరించి; ఆ = ఆ; విష్ణు = నారాయణుని; సేవకుల = దాసుల; తోడన్ = తోటి; కూడి = కలిసి; దివ్య = దివ్యమైన; మణి = మణులు; ఖచితంబు = పొదిగినట్టిది; ఐ = అయ్యి; సువర్ణ = బంగారముతో; మయంబున్ = చేయబడినది; ఐన = అయిన; అసమాన = సాటిలేని; విమానంబున్ = విమానమును; ఎక్కి = అధిరోహించి; నిఖిల = సర్వమైన; ఆనంద = సంతోషములు; భోగ = భోగములు; భాగ్య = భాగ్యముల; అనుభవ = అనుభవముల; అకుఠింతంబు = కుంటుపడనిది; ఐన = అయిన; వైకుంఠనగరంబున్ = వైకుంఠపురమున; కున్ = కు; శ్రీమన్నారాయణ = విష్ణుమూర్తి యొక్క; పద = పాదము లనెడి; అరవింద = పద్మములను; సేవా = కొలుచుట వలని; పరిమాణ = అనుభవపు; స్థితి = స్థితి; కిన్ = కి; చనియెన్ = వెళ్ళెను; ఇట్లు = ఈ విధముగ; విప్లావిత = చక్కగా వికసించిన; సర్వ = అఖిల; ధర్ముండు = ధర్మములు గలవాడు; ఐన = అయిన; దాసీపతి = శూద్రస్త్రీ యొక్క భర్త; గర్హిత = నిందార్హమైన; కర్మంబుల = పనులు; చేతన్ = వలన; పతితుండును = పతనమైన వాడును; హత = నష్టమైన; వ్రతుండు = నియమములు గలవాడును; ఐ = అయ్యి; నరకంబునన్ = నరకములో; కూలుచుండి = కూలిపోవుతూ; భగవత్ = భగవంతుని; నామ = నామమును; గ్రహణంబునన్ = గ్రహించుటచేత; సద్యోముక్తుండు = వెంటనే మోక్షము పొందినవాడు; అయ్యె = అయ్యెను; కావున = అందుచేత.

భావము:

ఈ విధంగా అజామిళుడు యోగమార్గం ద్వారా తన శరీరాన్ని విడిచి దివ్యమైన పుణ్యశరీరం ధరించినవాడై తన ఎదుట పూర్వం తనను రక్షించిన విష్ణుకింకరులను చూశాడు. అతని దేహం ఆనందంతో పులకించింది. పారవశ్యంతో ఒడలంతా చెమర్చింది. ఆనందవల్లి చిగుర్చింది. హృదయం హర్షంతో నిండింది. యోగప్రభావం ప్రకాశించింది. విస్మయంతో ఉత్సాహంతో కూడిన మందహాసం అతని ముఖారవిందం మీద చిందులు త్రొక్కింది. సమస్త లోకాలను ప్రకాశింప జేసేదీ, మంగళ ప్రదమైనదీ అయిన భగవంతుని శుభాకారాన్ని సందర్శించాలనే కుతూహలం మనస్సులో కలిగింది. అజామిళుడు విష్ణుదూతలకు చేతులు మోడ్చుతూ గంగాతీరంలో శరీరం విడిచాడు. వెనువెంటనే అతనికి నారాయణ పార్శ్వచరులైన మహాభక్తుల స్వరూపం ప్రాప్తించింది. అనంతరం అతడు విష్ణుదూతలతో కలిసి వైకుంఠ నగరంలో ప్రవేశించి శ్రీమన్నారాయణుని పాదపద్మాలను సేవించే పరిణత దశకు చేరుకున్నాడు. ఈ విధంగా సర్వ ధర్మాలను ఉల్లంఘించినవాడు, దాసీపుత్రిని పెండ్లాడినవాడు, దుష్కర్మల చేత భ్రష్టుడైనవాడు అయిన అజామిళుడు నరకంలో పడబోతూ నారాయణ నామ స్మరణం వల్ల క్షణమాత్రలో మోక్షాన్ని అందుకున్నాడు.