పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : అజామిళోపాఖ్యానము

  •  
  •  
  •  

6-144-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పాతకుండ నగు నాకు నవ్విబుధోత్తమ దర్శనంబు పురాకృతంబగు మదీయ పుణ్య విశేషంబునం గాని పొంద శక్యంబు గాదు; తత్సందర్శనం బాత్మకు నతిసుప్రసన్నంబయి యొప్పె; నట్లు గాకుండెనేనిఁ గలుషవర్తనంబున వృషలీభర్తనై యుండి మృతిఁ బొందుచున్న నాదు జిహ్వకు శ్రీమన్నారాయణనామ గ్రహణంబు సంభవింప నేరదు; మఱియును.

టీకా:

పాతకుండను = పాతకములు యొనర్చువాడను; అగు = అయిన; నా = నా; కున్ = కు; ఆ = ఆ; విబుధ = దేవతా; ఉత్తమ = శ్రేష్ఠుల యొక్క; దర్శనంబు = దర్శనము; పురాకృతంబు = పూర్వజన్మములలో చేసినట్టివి; అగు = అయిన; మదీయ = నా యొక్క; పుణ్య = పుణ్యముల; విశేషంబునన్ = ప్రత్యేకతవలన; కాని = కాని; పొందన్ = పొందుటకు; శక్యంబు = సాధ్యము; కాదు = కాదు; తత్ = వారి; సందర్శనంబు = చక్కటి దర్శనము; ఆత్మ = మనసున; కున్ = కు; అతి = మిక్కిలి; ప్రసన్నంబు = ప్రసన్నతకలది; అయి = అయ్యి; ఒప్పెన్ = చక్కగానున్నది; అట్లు = ఆ విధముగ; కాకుండెనేని = కాకపోయినచో; కలుష = పాపపు; వర్తనంబున = ప్రవర్తనములతో; వృషలీ = స్వైరిణి యొక్క; భర్తను = మొగుడను; ఐ = అయ్యి; ఉండి = ఉండినను; మృతి = మరణము; పొందుచున్న = పొందుచున్నట్టి; నాదు = నా యొక్క; జిహ్వ = నాలుక; కున్ = కు; శ్రీమన్నారాయణ = శ్రీహరి; నామ = నామమును; గ్రహణంబు = స్వీకరించుట; సంభవింపన్ = కలుగుట; నేరదు = సాధ్యముగాదు; మఱియును = ఇంకను.

భావము:

పాపాత్ముడనైన నాకు ఆ దేవతా శ్రేష్ఠుల సందర్శనం పూర్వ జన్మలో చేసిన పుణ్యవిశేషం వల్లనే కాని లభించదు. వాళ్ళ దర్శనం నా ఆత్మకు ఎంతో ఆనందాన్ని చేకూర్చింది. అలా కాకుంటే పాపవర్తనంతో స్వైరిణికి భర్తనై మరణిస్తున్న సమయంలో నా నాలుకకు భగవంతుని నామాన్ని ఉచ్చరించే భాగ్యం ఎలా అబ్బుతుంది?