పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : పూర్ణి

  •  
  •  
  •  

6-528-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రాజీవరాజపూజ్య
శ్రీజిత గోపీకటాక్ష సేవాంతర వి
భ్రాజితమూర్తి! మదోద్ధత
రాకులోత్సాద రామరాజాఖ్యనిధీ!

టీకా:

రాజీవ రాజ పూజ్య శ్రీజిత గోపీ కటాక్ష సేవాంతర విభ్రాజిత మూర్తి = నారాయణ {రాజీవరాజ పూజ్య శ్రీజిత గోపీ కటాక్ష సేవాంతర విభ్రాజిత మూర్తి - రాజీవ (తామరపూలలో) రాజ (శ్రేష్ఠమైనవానిచే) పూజ్య (అర్చిందగిన) శ్రీ (వైభవమును) జిత (నెగ్గెడి) గోపీ (గోపికల) కటాక్ష (కడగంటి చూపు లనెడి) సేవ (సేవించుట యందలి) అంతరము (గొప్పదనముచే) విభ్రాజిత (ప్రకాశించెడి) మూర్తి (స్వరూపమ), విష్ణువు} మదోద్ధత రాజ కులోత్సాద = నారాయణ {మదోద్ధత రాజ కులోత్సాద - మద (గర్వముతో) ఉద్దత (అతిశయించిన) రాజ (రాజుల) కుల (వంశములను) ఉత్సాద (పెల్లగించి వేయువాడ), విష్ణువు}; రామరాజాఖ్యనిధీ = నారాయణ {రామరాజాఖ్యనిధీ - రామరాజు (రామరాజు) ఆఖ్య (పేరును) నిధి (ఆశ్రితులకు నిధిగా ఇచ్చినవాడ), విష్ణువు}.

భావము:

శ్రేష్ఠమైన పద్మాల శోభ కల గోపికల కడగంటి సేవలతో ప్రకాశించే రూపం కలవాడా! మదోన్మత్తులైన రాజుల వంశాలను రూపుమాపినవాడా! రామనామాన్ని నిధిగా ఇచ్చినవాడా!

6-529-త.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మువిదారణ ముఖ్యకారణ! మూలతత్త్వవిచారణా!
దురితతారణ దుఃఖవారణ! దుర్మదాసురమారణా!
గిరివిహారణ! కీర్తిపూరణ! కీర్తనీయమహారణా!
ణిధారణ! ధర్మతారణ తాపసస్తుతిపారణా!

టీకా:

మురవిదారణ = నారాయణ {ముర విదారణుడు - ముర యనెడి అసురుని విదారణ (సంహరించిన వాడు), విష్ణువు}; ముఖ్యకారణ = నారాయణ {ముఖ్య కారణుడు - సమస్త విశ్వమునకు ప్రధానమైన కారణమైనవాడు, విష్ణువు}; మూల తత్త్వవిచారణా = నారాయణ {మూల తత్త్వవిచారణుడు - ఆదిమూల తత్త్వవిచారణకి స్వరూపమైనవాడు, విష్ణువు}; దురితతారణ = నారాయణ {దురిత తారణుడు - పాపములనుండి తరింపజేయువాడు, విష్ణువు}; దుఃఖవారణ = నారాయణ {దుఃఖ వారణుడు - దుఃఖములను నివారించెడివాడు, విష్ణువు}; దుర్మ దాసుర మారణా = నారాయణ {దుర్మ దాసుర మారణుడు - దుర్మద (అదికమైన గర్వముగల) అసురులను మారణ (సంహరించెడివాడు), విష్ణువు}; గిరివిహారణ = నారాయణ {గిరి విహారణుడు - గిరి (పర్వతమును) విహారణుడు (ఎత్తి రక్షించినవాడు), కృష్ణుడు}; కీర్తి పూరణ = నారాయణ {కీర్తి పూరణుడు - తన కీర్తిచే విశ్వమంతను పూరణుడు (నింపినవాడు), విష్ణువు}; కీర్తనీయ మహా రణా = నారాయణ {కీర్తనీయ మహా రణుడు - కీర్తనీయ (ప్రశంసనీయమైన) మహా (గొప్ప) రణుడు (యుద్ధము చేయువాడు), విష్ణువు}; ధరణి ధారణ = నారాయణ {ధరణి ధారణుడు - ధరణిన్ (భూమిని) ధారణుడు (ధరించినవాడు), విష్ణువు}; ధర్మతారణ = నారాయణ {ధర్మతారణుడు - ధర్మమును తారణుడు (కాపాడెడివాడు), విష్ణువు}; తాపస స్తుతి పారణా = నారాయణ {తాపస స్తుతి పారణుడు - తాపసుల యొక్క స్తుతులకు పారణుడు (పాత్రమైనవాడు), విష్ణువు}.

భావము:

మురాసురుని సంహరించినవాడా! సమస్త విశ్వానికి కారణమైనవాడా! ఆదిమూలమైన తత్త్వస్వరూపుడా! పాపాలనుండి తరింపజేసేవాడా! దుఃఖాలను దూరం చేసేవాడా! గర్వాంధులైన రాక్షసులను సంహరించేవాడా! గోవర్ధన పర్వతాన్ని పైకెత్తినవాడా! స్వకీర్తితో జగత్తునంతా నింపినవాడా! గొప్ప యుద్ధాలలో కొనియాడదగిన వీరుడవైనవాడా! భూభారాన్ని వహించేవాడా! ధర్మాన్ని రక్షించేవాడా! తాపసుల స్తోత్రాలకు అర్హుడవైనవాడా!

6-530-తో.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రుణాకర! శ్రీకర! కంబుకరా!
ణాగతసంగతజాడ్యహరా!
రిరక్షితశిక్షితక్తమురా!
రిరాజశుభప్రద! కాంతిధరా!

టీకా:

కరుణాకర = నారాయణ {కరుణాకరుడు - దయామయుడు, విష్ణువు}; శ్రీకర = నారాయణ {శ్రీ కరుడు -శుభములను కలిగించెడివాడు, విష్ణువు}; కంబుకరా = నారాయణ {కంబు కరుడు - కంబు (పాంచజన్యము యనెడి శంఖమును) కరుడు (చేత ధరించెడివాడు), విష్ణువు}; శరణాగత సంగత జాడ్యహరా = నారాయణ {శరణాగత సంగత జాడ్యహరుడు - శరణ (శరణని) ఆగత (వచ్చినవారికి) సంగత (కలిగిన) జాడ్య (కష్టములను) హరుడు (నశింపజేసెడివాడు), విష్ణువు}; పరిరక్షిత శిక్షిత భక్త మురా = నారాయణ {పరిరక్షిత శిక్షిత భక్త మురా - పరిరక్షిత(చక్కగా కాపాడ బడెడి) శిక్షిత (శిక్షింప బడిన) భక్త (భక్తులు) ముర (మురాసుర ఆదులు) గల వాడు,, విష్ణువు}; కరిరాజ శుభ ప్రద = నారాయణ {కరిరాజ శుభ ప్రదుడు - కరిరాజు (గజేంద్రుని)కి శుభ (శుభములు) ప్రదుడు (ఇచ్చెడివాడు), విష్ణువు}; కాంతిధరా = నారాయణ {కాంతిధరుడు - కాంతి (ప్రకాశమును) ధరుడు (ధరించువాడు), విష్ణువు}.

భావము:

కరుణకు ఆలవాలమైనవాడా! సంపదలను సమకూర్చేవాడా! పాంచజన్య శంఖాన్ని చేతిలో ధరించినవాడా! శరణు జొచ్చిన భక్తుల కష్టాలను కడతేర్చేవాడా! భక్తులను రక్షించి ముర అనే రాక్షసుని శిక్షించినవాడా! గజరాజుకు మేలు చేకూర్చినవాడా! కాంతిమయమైన రూపాన్ని ధరించినవాడా!

6-531-గ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇది సకల సుకవి జనమిత్ర శ్రీవత్సగోత్ర పవిత్ర కసువయామాత్య పుత్ర బుధజనప్రసంగానుషంగ సింగయ నామధేయ ప్రణీతంబైన శ్రీ మహాభాగవత పురాణంబునందు నజామిళోపాఖ్యానంబును, బ్రచేతసులఁ జంద్రు డామంత్రణంబు చేయుటయు, దక్షోత్పత్తియు, ప్రజాసర్గంబును, దక్షుండు శ్రీహరింగూర్చి తపంబు చేయుటయు, నతనికి నప్పరమేశ్వరుండు ప్రత్యక్షం బగుటయు, హర్యశ్వ శబళాశ్వుల జన్మంబును, వారలకు నారదుండు బోధించుటయు, నారదు వచన ప్రకారంబునవారు మోక్షంబు నొందుటయుఁ, దద్వృత్తాంతంబు నారదు వలన విని దక్షుండు దుఃఖాక్రాంతుం డగుటయుఁ, దదనంతరంబ బ్రహ్మవరంబున దక్షుండు శబళాశ్వసంజ్ఞల సహస్ర సంఖ్యాకు లగు పుత్రులం గాంచుటయును, సృష్టినిర్మాణేచ్ఛా నిమిత్తంబున దక్షు పంపున వార లగ్రజన్ములు సిద్ధింబొందిన తీర్థరాజంబైన నారాయణ సరస్సునకుం జనుటయు, వారికి నారదభగవంతుండు బ్రహ్మజ్ఞానంబు నుపదేశించుటయు, వారు పూర్వజు లేగిన ప్రకారంబున మోక్షంబు నొందుటయుఁ, దద్వృత్తాంతంబును దక్షుండు దివ్యజ్ఞానంబున నెఱింగి నారదోపదిష్టం బని తెలిసి నారదుని శపించుటయు, నారదుండు దక్షుశాపంబు ప్రతిగ్రహించుటయు, దక్షునకు బ్రహ్మవరంబున సృష్టివిస్తారంబు కొఱకుఁ గూతులఱువదండ్రు జనియించుటయు, నందు గశ్యపునకు నిచ్చిన పదమువ్వురు వలన సకల లోకంబులు నిండుటయు, దేవాసుర నర తిర్యఙ్మృగ ఖగాదుల జన్మంబులును, దేవేంద్ర తిరస్కారంబున బృహస్పతి యధ్యాత్మమాయచేతం గాన రాకుండుటయుఁ, దద్వృత్తాంతంబు రాక్షసులు విని శుక్రోపదిష్టులై దేవతలపై నెత్తివచ్చుటయు, దేవాసుర యుద్ధంబును, నాచార్యతిరస్కారంబున దివిజరాజపలాయనంబును, బలాయమానులైన దేవతలు బ్రహ్మసన్నిధికిం జనుటయును, బ్రహ్మవాక్యంబునఁ ద్వష్ట కుమారుండయిన విశ్వరూపు నాచార్యునింగా దేవతలు వరించుటయును, విశ్వరూపు ప్రసాదంబున నింద్రుండు నారాయణ వర్మం బను మంత్రకవచంబు ధరియించి రాక్షసుల జయించుటయుఁ, బరోక్షంబున రాక్షసులకు ననుకూలుం డయిన విశ్వరూపు నింద్రుండు వధియించుటయు, విశ్వరూపు వధానంతరంబున నింద్రునకు బ్రహ్మ హత్య సంప్రాప్తం బయిన నింద్రుండు స్త్రీ భూ జల ద్రుమంబుల యందుఁ బంచిపెట్టుటయు, విశ్వరూపుండు హతుండగుటకుఁ ద్వష్ట గోపించి యింద్రవదార్థంబు మారణహోమంబు చేయ వృత్రాసురుండు జనించుటయు, వృత్రాసుర యుద్ధంబునఁ బరాజితులై యింద్ర సహితు లయిన దేవతలు శ్వేతద్వీపంబునకుం జనుటయు, నందు శ్రీహరి ప్రసన్నుండయి దధీచి వలన భిదురంబు గైకొన; నుపదేశించుటయు, నింద్రుండు వజ్రాయుధంబున వృత్రుని సంహరించుటయు, నింద్రుండు బ్రహ్మహత్యా పీడితుండయి మానససరస్సు ప్రవేశించుటయును, నహుషుండు శతాశ్వమేధంబులం జేసి యింద్రాధిపత్యంబు బడయుటయు, నహుషుండు డగస్త్యశాపంబున సురరాజ్యచ్యుతుండై యజగర యోనిం బుట్టుటయు, యింద్రాగమనంబును, యశ్వమేధంబును, యింద్రుండు మరలఁ ద్రిలోకాధిపత్యంబు బడయుటయును, జిత్రకేతూపాఖ్యానంబును, మరుద్గణంబుల జన్మప్రకారంబును నను కథలు గల షష్ఠస్కంధము సమాప్తము.

టీకా:

ఇది = ఇది; శ్రీ = శుభకరమైన; సకల = సర్వ; సుకవిజన = మంచికవుల; మిత్ర = స్నేహితుడైన; శ్రీవత్స = శ్రీవత్స; గోత్ర = గోత్రమువాడు; పవిత్ర = పావనమైన; కసువయామాత్య = కసువయ అమాత్యుని; పుత్ర = కుమారుడు; బుధజన = పండితులతో; ప్రసంగ = సంభాషించుట యందు; అనుషంగ = ఆసక్తిగల; సింగయ = సింగయ యనెడి; నామధేయ = పేరుగలవానిచే; ప్రణీతంబు = సంస్కరింపబడినది; ఐన = అయిన; శ్రీ = శుభకరమైన; మహాభాగవత = మహాభాగవతము యనెడి; పురాణంబున్ = పురాణము; అందున్ = అందలి; అజామిళోపాఖ్యానంబున్ = అజామిళోపాఖ్యానము; ప్రచేతసులన్ = ప్రచేతసులను; చంద్రుడు = చంద్రుడు; ఆమంత్రణంబు = సంభాషించుట; చేయుటయున్ = చేయుట; దక్ష = దక్షుని; ఉత్పత్తియున్ = సృష్టి; ప్రజా = సంతానము; సర్గంబును = పుట్టించుట; దక్షుండు = దక్షుడు; శ్రీహరిన్ = నారాయణుని; గూర్చి = గురించి; తపంబున్ = తపస్సును; చేయుటయున్ = చేయుట; అతని = అతని; కిన్ = కి; ఆ = ఆ; పరమేశ్వరుండు = భగవంతుడు; ప్రత్యక్షంబగుటయున్ = సాక్షాత్కరించుట; హర్యశ్వశబళాశ్వుల = హర్యశ్వశబళాశ్వుల; జన్మంబును = పుట్టుక; వారల = వారి; కున్ = కి; నారదుండు = నారదుడు; బోధించుటయున్ = ఉపదేశించుట; నారదు = నారదుని; వచన = ఉపదేశించిన; ప్రకారంబునన్ = విధముగ; మోక్షంబున్ = ముక్తిని; ఒందుటయున్ = పొందుట; తత్ = అతని; వృత్తాంతంబున్ = వృత్తాంతమును; నారదు = నారదుని; వలన = ద్వారా; విని = విని; దక్షుండు = దక్షుడు; దుఃఖ = దుఃఖముచే; ఆక్రాంతుండు = ఆక్రమింపబడినవాడు; అగుటయున్ = అగుట; తదనంతరంబ = తరువాత; బ్రహ్మ = బ్రహ్మదేవుని; వరంబునన్ = వరమువలన; దక్షుండు = దక్షుడు; శబళాశ్వ = శబళాశ్వులను; సంజ్ఞలన్ = పేర; సహస్ర సంఖ్యాకులగు = వేయమందిని; పుత్రులన్ = కుమారులను; కాంచుటయున్ = పుట్టించుట; సృష్టి = సృష్టి; నిర్మాణ = చేయవలె ననెడి; ఇచ్చన్ = కోరిక; నిమిత్తంబున = కొరకు; దక్షు = దక్షుని; పంపునన్ = ఆజ్ఞమేరకు; వారలు = వారు; అగ్రజన్ములు = అన్నలు; సిద్ధిన్ = సిద్ధిని; పొందిన = పొందినట్టి; తీర్థ = తీర్థములలో; రాజంబు = శ్రేష్ఠమైనది; ఐన = అయిన; నారాయణ = నారాయణ యనెడి; సరస్సున్ = సరస్సున; కున్ = కు; చనుటయున్ = వెళ్లుట; వారి = వారి; కిన్ = కి; నారద = నారదుడు యనెడి; భగవంతుండు = భగవంతుడు; బ్రహ్మజ్ఞానంబున్ = బ్రహ్మజ్ఞానమును; ఉపదేశించుటయున్ = ఉపదేశించుట; వారు = వారు; పూర్వజులు = అగ్రజులు; ఏగిన = నడచి; ప్రకారంబునన్ = విధముగ; మోక్షంబున్ = ముక్తిని; ఒందుటయున్ = పొందుట; తత్ = ఆ; వృత్తాంతంబును = వృత్తాంతమును; దక్షుండు = దక్షుడు; దివ్యజ్ఞానంబునన్ = దివ్యదృష్టిచేత; ఎఱింగి = తెలిసికొని; నారద = నారదునిచే; ఉపదిష్టంబు = ఉపదేశింపబడినది; అని = అని; తెలిసి = తెలిసికొని; నారదుని = నారదుని; శపించుటయున్ = శపించుట; నారదుండు = నారదుడు; దక్షు = దక్షుని; శాపంబున్ = శాపమును; ప్రతిగ్రహించుటయున్ = స్వీకరించుట; దక్షున్ = దక్షుని; కున్ = కి; బ్రహ్మ = బ్రహ్మదేవుని; వరంబునన్ = వరమువలన; సృష్టి = సృష్టిని; విస్తారంబున్ = విస్తరింపజేయుటకు; కూతులు = పుత్రికలు; అఱువండ్రు = అరవైమంది; జనియించుటయున్ = పుట్టుట; అందున్ = వారిలో; కశ్యపున్ = కశ్యపుని; కున్ = కి; ఇచ్చిన = ఇచ్చినట్టి; పదమువ్వురు = పదముగ్గురు; వలన = వలన; సకల = సమస్తమైన; లోకంబులు = లోకములు; నిండుటయున్ = నిండిపోవుట; దేవ = దేవతలు; అసుర = రాక్షసులు; నర = మానవులు; తిర్యక్ = చరించగలవి; మృగ = జంతువులు; ఖగ = పక్షులు; ఆదులన్ = మొదలగువాని; జన్మంబులును = పుట్టుకలు; దేవేంద్ర = దేవేంద్రుని; తిరస్కారంబునన్ = తిరస్కారమువలన; బృహస్పతి = బృహస్పతి; అధ్యాత్మ = యోగ; మాయ = మాయ; చేతన్ = వలన; కానరాకుండుటయున్ = అదృశ్యు డగుట; తత్ = ఆ; వృత్తాంతంబున్ = వృత్తాంతమును; రాక్షసులు = రాక్షసులు; విని = విని; శుక్ర = శుక్రునిచే; ఉపదిష్టులు = ఉపేశింపబడినవారు; ఐ = అయ్యి; దేవతల్ = దేవతల; పైన్ = పైకి; ఎత్తివచ్చుట = దండెత్తివచ్చుట; దేవ = దేవతల; అసుర = రాక్షసుల; యుద్ధంబును = యుద్ధము; ఆచార్య = గురువు యొక్క; తిరస్కారంబునన్ = తిరస్కారమువలన; దివిజరాజ = ఇంద్రుని {దివిజరాజు - దివిజుల (దేవతల) రాజు, ఇంద్రుడు}; పలాయనంబును = పారిపోవుట; పలాయమానులు = పారిపోవువారు; ఐన = అయిన; దేవతలు = దేవతలు; బ్రహ్మ = బ్రహ్మదేవుని; సన్నిధికిన్ = వద్దకు; చనుటయున్ = వెళ్ళుట; బ్రహ్మ = బ్రహ్మదేవుని; వాక్యంబున్ = మాట ప్రకారము; త్వష్ట = త్వష్టుని; కుమారుండు = పుత్రుడు; అయిన = అయినట్టి; విశ్వరూపున్ = విశ్వరూపుని; ఆచార్యునిన్ = గురువు; కాన్ = అగునట్లు; దేవతలు = దేవతలు; వరించుటయును = వరించుట; విశ్వరూపు = విశ్వరూపునిచే; ప్రసాదంబునన్ = ప్రసాదించబడుటవలన; ఇంద్రుండు = ఇంద్రుడు; నారాయణవర్మంబు = నారాయణ కవచము; అను = అనెడి; మంత్ర = మంత్రరూపక; కవచంబున్ = కవచమును; ధరియించి = ధరించి; రాక్షసులన్ = రాక్షసులను; జయించుటయున్ = జయించుట; పరోక్షంబునన్ = పరోక్షముగా; రాక్షసుల్ = రాక్షసుల; కున్ = కు; అనుకూలుండు = అనుకూలముగా వర్తించెడివాడు; అయిన = అయిన; విశ్వరూపున్ = విశ్వరూపుని; ఇంద్రుండు = ఇంద్రుడు; వధియించుటయున్ = సంహరించుట; విశ్వరూపు = విశ్వరూపుని; వధ = సంహారము; అనంతరంబునన్ = తరువాత; ఇంద్రుని = ఇంద్రుని; కున్ = కి; బ్రహ్మహత్య = బ్రహ్మహత్యాపాపము; సంప్రాప్తంబు = కలుగట; అయిన = సంభవించిన; ఇంద్రుండు = ఇంద్రుడు; స్త్రీ = స్త్రీ; భూ = భూమి; జల = నీరు; ద్రుమంబుల = చెట్లు; అందున్ = అందు; పంచిపెట్టుటయున్ = పంచిపెట్టుట; విశ్వరూపుండు = విశ్వరూపుడు; హతుండు = చంపబడినవాడు; అగుట = అగుట; కు = కు; త్వష్ట = త్వష్ట; కోపించి = కోపించి; ఇంద్ర = ఇంద్రుని; వధ = సంహరించుట; అర్థంబున్ = కోసము; మారణహోమంబున్ = మారణహోమమును; చేయన్ = చేయగా; వృత్రాసురుండు = వృత్రాసురుడు; జనియించుటయున్ = పుట్టుట; వృత్రాసుర = వృత్రాసురుని; యుద్ధబును = యుద్ధములో; పరాజితులు = ఓడిపోయినవారు; ఐ = అయ్యి; ఇంద్ర = ఇంద్రునితో; సహితులు = కూడినవారు; అయిన = ఐన; దేవతలు = దేవతలు; శ్వేతద్వీపంబున్ = శ్వేతద్వీపమున; కున్ = కు; చనుటయున్ = వెళ్ళుట; అందున్ = అక్కడ; శ్రీహరిన్ = విష్ణుమూర్తి; ప్రసన్నుండు = ప్రసన్నమైనవాడు; అయి = అయ్యి; దధీచి = దధీచి; వలన = వలన; భిదురంబున్ = వజ్రాయుధమును; కైకొనన్ = తీసుకొనమని; ఉపదేశించుటయున్ = ఉపదేశించుట; ఇంద్రుండు = ఇంద్రుడు; వజ్రాయుధమున = వజ్రాయుధముతో; వృత్రునిన్ = వృత్రుని; సంహరించుటయున్ = సంహరించుట; ఇంద్రుండు = ఇంద్రుడు; బ్రహ్మహత్యా = బ్రహ్మహత్యాపాతకముచే; పీడితుండు = పీడింపబడినవాడు; అయి = అయ్యి; మానససరస్సు = మానససరోవరము నందు; ప్రవేశించుటయును = ప్రవేశించుట; నహుషుండు = నహుషుడు; శత = నూరు; అశ్వమేధంబులన్ = అశ్వమేధయాగములను; చేసి = చేసి; ఇంద్రాధిపత్యంబున్ = ఇంద్రపదవిని; పడయుటయును = పొందుట; నహుషుండు = నహుషుడు; అగస్త్య = అగస్త్యుని; శాపంబునన్ = శాపమువలన; సురరాజ్య = స్వర్గ రాజ్యాధికారము నుండి; చ్యుతుండు = పతనము యైనవాడు; ఐ = అయ్యి; అజగర = కొండచిలువ; యోనిన్ = గర్భమున; పుట్టుటయున్ = పుట్టుట; ఇంద్ర = ఇంద్రుని; ఆగమనంబును = వచ్చుట; అశ్వమేధంబునున్ = అశ్వమేధయాగము వలన; ఇంద్రుండు = ఇంద్రుడు; మరల = మరల; త్రిలోక = ముల్లోకముల; అధిపత్యంబున్ = అధికారమును; పడయుటయును = పొందుట; చిత్రకేతోపాఖ్యానంబును = చిత్రకేతోపాఖ్యానము; మరుద్గణంబుల = మరుద్గణముల; జన్మ = పుట్టుక; ప్రకారంబునన్ = విధము; అను = అనెడి; కథలు = కథలు; కల = కలిగిన; షష్ఠ = ఆరవ (6); స్కంధము = స్కంధము; సమాప్తము = సమాప్తము.

భావము:

ఇది సకల సుకవి జనులకు మిత్రుడు, పవిత్రమైన శ్రీవత్స గోత్రం కలవాడు, కసువయామాత్యుని పుత్రుడు, పండితుల ప్రసంగాలతో సంబంధం కలవాడు అయిన సింగయ అనే పేరు కలవానిచే రచింపబడిన శ్రీ మహాభాగవతం అనే పురాణంలో అజామిళోపాఖ్యానం, ప్రచేతసులను చంద్రుడు శాంతింపజేయడం, దక్ష ప్రజాపతి జననం, ప్రజాసృష్టి, దక్షుడు శ్రీహరిని గురించి తప్పస్సు చేయడం, అతనికి ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షం కావటం, హర్యశ్వ శబళాశుల పుట్టుక, వారికి నారదుడు బోధించడం, నారదుని మాటల ప్రకారం వారు మోక్షాన్ని పొందడం, ఆ వృత్తాంతాన్ని నారదుని వలన విని దక్షుడు దుఃఖించడం, తరువాత బ్రహ్మ వరం వల్ల దక్షుడు శబళాశ్వులనే పేరు గల వేయిమంది కొడుకులను కనడం, సృష్టి చేయాలనే కోరికతో దక్షుని ఆజ్ఞ మేరకు వారు తమ అన్నలు సిద్ధి పొందిన తీర్థశ్రేష్ఠమైన నారాయణ సరస్సుకు పోవడం, వారికి నారదుడు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించడం, వారు తమ అన్నల అడుగుజాడలలో నడచి మోక్షాన్ని పొందడం, ఆ వృత్తాంతాన్ని దక్షుడు దివ్యజ్ఞానంతో తెలిసికొని నారదుని శపించడం, నారద మహర్షి దక్షుని శాపాన్ని స్వీకరించడం, బ్రహ్మ వరం చేత సృష్టిని విస్తరింప జేయడానికి దక్షునకు అరవై మంది కుమార్తెలు పుట్టడం, అందులో కశ్యప ప్రజాపతికి ఇచ్చిన పదముగ్గురు కుమార్తెల సంతానం వల్ల సకల లోకాలు నిండడం, దేవ రాక్షస మానవ మృగ పక్ష్యాదుల జననం, దేవేంద్రుని తిరస్కారాన్ని సహింపలేక బృహస్పతి అదృశ్యం కావడం, ఆ వృత్తాంతాన్ని రాక్షసులు విని శుక్రుని చేత ప్రేరేపింపబడి దేవతలపై యుద్ధానికి రావడం, దేవ రాక్షస యుద్ధం, గురు తిరస్కార ఫలంగా ఇంద్రుడు ఓడి పారిపోవడం, దేవతలు బ్రహ్మ దగ్గరకు వెళ్ళడం, బ్రహ్మ మాట ప్రకారం త్వష్ట కుమారుడైన విశ్వరూపుని గురువుగా దేవతలు స్వీకరించడం, విశ్వరూపుని దయ వల్ల ఇంద్రుడు నారాయణ కవచం అనే మంత్ర కవచాన్ని ధరించి రాక్షసులను ఓడించడం, పరోక్షంగా రాక్షసులకు అనుకూలుడైన విశ్వరూపుణ్ణి ఇంద్రుడు సంహరించడం, విశ్వరూపుణ్ణి చంపడం వల్ల ఇంద్రునకు బ్రహ్మహత్య పాతకం సంప్రాప్తించడం, ఆ పాపాన్ని ఇంద్రుడు భూ, జల, వనిత, వృక్షాలకు పంచి పెట్టడం, విశ్వరూపుణ్ణి చంపినందుకు త్వష్ట కోపించి ఇంద్రుణ్ణి వధించే నిమిత్తం మారణహోమం చేయడం, వృత్రాసురుని జననం, వృత్రాసురుని చేత ఓడింపబడిన దేవతలు ఇంద్రునితో కూడి శ్వేతద్వీపానికి పోవడం, శ్రీహరి దయ గలవాడై దధీచి మహర్షిని ప్రార్థించి ఆయన వల్ల వజ్రాయుధాన్ని తీసుకోమని చెప్పడం, ఇంద్రుడు వజ్రాయుధాన్ని సంపాదించి వృత్రుణ్ణి సహరించడం, ఇంద్రుడు బ్రహ్మహత్యచే పీడింపబడి మానస సరస్సులో ప్రవేశించడం, నహుషుడు నూరు అశ్వమేధ యజ్ఞాలు చేసి ఇంద్ర పదవిని పొందడం, నహుషుడు అగస్త్యుని శాపంతో సురరాజ్య భ్రష్టుడై కొండచిలువగా మారిపోవడం, ఇంద్రుడు స్వర్గంలో ప్రవేశించి అశ్వమేధ యాగం చేసి మళ్ళీ త్రిలోకాధిపత్యాన్ని అందుకొనడం, చికేతోపాఖ్యానం, మరుద్గణాల జన్మక్రమం అనే కథలతో కూడిన షష్ఠస్కంధం సంపూర్ణం.


ఓం నమో భగవతే వాసుదేవాయ!!
ఓం! ఓం! ఓం!
ఓం! శాంతిః! శాంతిః! శాంతిః!
సర్వే జనా స్సుఖినో భవతు!!