పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : మరుద్గణంబుల జన్మంబు

  •  
  •  
  •  

6-514-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు నిజసతిచేత నుపలాలితుండై కశ్యపప్రజాపతి యా సతికిం బరమప్రీతుం డై యిట్లనియె "నో తన్వీ! నీకుఁ బ్రసన్నుండ నైతి; వరంబు గోరు మిచ్చెద; నాథుండు ప్రసన్నుండైన స్త్రీలకుం గోరిక సంభవించుట కేమి గొఱంత? సతికిం బతియె దైవంబు సర్వభూతంబుల మానసంబులకు వాసుదేవుండె భర్త; నామరూప కల్పితులైన సకల దేవతామూర్తులచేతను ఋషులచేతను భర్తృరూపధరుం డయిన భగవంతుండు సేవింపబడుచుండు; స్త్రీలచేతఁ బతిరూపంబున భజియింపంబడుఁ; గావునం బతివ్రత లైన సుందరులు శ్రేయస్కామలై యేక చిత్తంబున నాత్మేశ్వరుం డయిన యప్పరమేశ్వరుని భర్తృభావంబున సేవించుచుండుదురు; నేనును నీదు భావంబున వరదుండ నైతి; దుశ్శీల లయిన వనితలకుం బొందరాని వరంబు నీ కిచ్చెద; వేఁడు" మనిన నా కశ్యపునకు దితి యిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; నిజ = తన; సతి = భార్య; చేతన్ = వలన; ఉపలాలితుండు = బుజ్జగింపబడినవాడు; ఐ = అయ్యి; కశ్యప = కశ్యపుడు యనెడి; ప్రజాపతి = ప్రజాపతి; ఆ = ఆ; సతి = భార్య; కిన్ = కి; పరమ = అత్యధికముగ; ప్రీతుండు = సంతోషము చెందినవాడు; ఐ = అయి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; ఓ = ఓ; తన్వీ = అందమైన దేహము గలదానా; నీ = నీ; కున్ = కు; ప్రసన్నుడను = ప్రసన్నమైన వాడను; ఐతి = అయితిని; వరంబున్ = వరమును; కోరుము = కోరుకొనుము; ఇచ్చెద = ఇచ్చెదను; నాథుండు = భర్త; ప్రసన్నుండు = ప్రసన్నమైన వాడు; ఐన = అయిన; స్త్రీల్ = స్త్రీల; కున్ = కు; కోరిక = కోరికలు; సంభవించుట = కలుగుట; కున్ = కు; ఏమి = ఏమి; కొఱంత = కొరత లుండును; సతి = భార్య; కిన్ = కి; పతియె = భర్తే; దైవంబు = దైవము; సర్వ = అఖిలమైన; భూతంబులన్ = జీవుల; మానసంబుల్ = మనసుల; కున్ = కు; వాసుదేవుండె = శ్రీకృష్ణుడే {వాసుదేవుడు - వసుదేవుని కుమారుడు, కృష్ణుడు}; భర్తన్ = భర్త; నామ = పేర్లు; రూప = స్వరూపములచేత; కల్పితంబులు = ఏర్పడెడివి; ఐన = అయిన; సకల = సమస్తమైన; దేవతా = దేవతల; మూర్తుల = స్వరూపముల; చేతను = చేతను; ఋషుల = ఋషుల; చేతను = చేతను; భర్తృ = భర్త యొక్క; రూప = రూపము; ధరుండు = ధరించినవాడు; అయిన = ఐన; భగవంతుండు = భగవంతుడు; సేవింపబడుచుండున్ = కొలువబడుచుండును; స్త్రీల్ = స్త్రీల; చేతన్ = చేత; పతి = భర్త; రూపంబునన్ = స్వరూపముతో; భజియింపబడున్ = పూజింపబడును; కావునన్ = అందుచేత; పతివ్రతలు = పతివ్రతలు; ఐన = అయిన; సుందరులు = అందగత్తెలు; శ్రేయస్ = శ్రేయస్సును; కామలు = కోరెడివారు; ఐ = అయ్యి; ఏక = ఏకాగ్రమైన; చిత్తంబునన్ = మనసుతో; ఆత్మ = తమ; ఈశ్వరుండు = భర్త; అయిన = ఐన; ఆ = ఆ; పరమేశ్వరుని = భగవంతుని; భర్తృ = భర్త యనెడి; భావంబునన్ = భావముతో; సేవించుచుండుదురు = కొలిచెదరు; నేనునున్ = నేనుకూడ; నీదు = నీ యొక్క; భావంబునన్ = ఎడల; వరదుండన్ = వరముల నిచ్చెడి వాడను, హరిని; ఐతి = అయితిని; దుశ్శీలలు = చెడు వర్తన గలవారు; అయిన = ఐన; వనితలు = స్త్రీల; కున్ = కి; పొందరాని = పొందటకు శక్యము గాని; వరంబున్ = వరములు; నీ = నీ; కున్ = కు; ఇచ్చెదన్ = ఇచ్చెదను; వేడుము = కోరుకొనుము; అనిన = అనగా; ఆ = ఆ; కశ్యపున్ = కశ్యపుని; కున్ = కి; దితి = దితి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

ఈ విధంగా తన భార్య చేస్తున్న సేవలకు కశ్యప ప్రజాపతి ఎంతో సంతోషించి ఆమెతో ఇలా అన్నాడు “దేవీ! నేను నీ ప్రవర్తనతో తృప్తి పడ్డాను. నీకు కావలసిన వరం కోరుకో. భర్త సంతోషిస్తే భార్యలకు కొరత ఏముంటుంది? సతులకు భర్తయే దైవం. సమస్త జీవరాసులకు వాసుదేవుడే పతి. నామ రూపాలు కల్పించబడ్డ ఇతర దేవతామూర్తులు, పురుషులు భర్త రూపంలో ఉన్న భగవంతునే ఆరాధిస్తూ ఉంటారు. అందువల్ల పతివ్రతలైన సతీమణులు శ్రేయస్సును కోరుకున్నవారై ఏకాగ్రభావంతో పతిదేవుని సేవిస్తుంటారు. అటువంటి భావం నీలో కలిగినందుకు నేను నీకు వరమిస్తున్నాను. చెడు నడత గల స్త్రీలకు దుర్లభమైన వరాన్ని నేను నీకు అనుగ్రహిస్తాను. కోరుకో” అని చెప్పగా ఆ కశ్యపునితో దితి ఇలా అన్నాది.