పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : సవితృవంశ ప్రవచనాది కథ

  •  
  •  
  •  

6-506-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"వినవయ్య! నరనాథ! విశదంబుగాఁ ద్వష్టృ-
వంశంబు చెప్పితి; వాని వెనుక
వితృండు పృశ్నియు సావిత్రి వ్యాహృతి-
ను భార్యలందు నింపారు వేడ్క
గ్ని హోత్రంబుల రయంగఁ బశుసోమ-
పంచయజ్ఞంబులఁ రఁగఁ గనియె;
గుఁడు సిద్ధిక యను భార్యకు మహిమాను-
వుల విభవులఁ దాఁ డసె మువురఁ;

6-506.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నయ నొకతెఁ గాంచెఁ దనంతరమున నా
రళనేత్ర సద్వ్రస్వధామ
పుణ్యశీల సుగుణ పూరిత చారిత్ర
ఖిలలోకపూజ్య యాశిషాఖ్య.
ద్వాదశాదిత్యులు.

టీకా:

వినవు = వినుము; అయ్య = తండ్రి; నరనాథ = రాజా పరీక్షిత్తు; విశదంబుగాన్ = వివరముగా; త్వష్టృ = త్వష్ట యొక్క {త్వష్ట - అదితి సంతానము పన్నెండుగురులో ఒకడు}; వంశంబున్ = వంశమును; చెప్పితి = చెప్పితిని; వాని = అతని; వెనుక = తరువాత; సవితృండు = సవితృడు {సవితృడు - అదితి సంతానము పన్నెండుగురులో ఒకడు}; పృశ్నియున్ = పృశ్ని; సావిత్రి = సావిత్రి; వ్యాహృతి = వ్యాహృతి; అను = అనెడి; భార్యలు = భార్యలు; అందున్ = అందు; ఇంపారు = చక్కటి; వేడ్కన్ = ఉత్సాహముతో; అగ్నిహోత్రంబులన్ = అగ్నిహోత్రములను; అరయంగన్ = చూడగా; పశు = పశుయజ్ఞము; సోమ = సోమయజ్ఞము; పంచయజ్ఞంబులన్ = పంచయజ్ఞములను; పరగన్ = ప్రసిద్ధముగా; కనియెన్ = పుట్టించెను; భగుడు = భగుడు {భగుడు - అదితి సంతానము పన్నెండుగురులో ఒకడు}; సిద్ధిక = సిద్ధిక; అను = అనెడి; భార్య = భార్య; కు = కు; మహిమా = మహిముడు; అనుభవుల = అనుభవుడు; విభవులన్ = విభవుడు; పడసె = పుట్టించెను; మువురన్ = ముగ్గురను (3); తనయన్ = పుత్రికను; ఒకతెన్ = ఒకామెను; కాంచెన్ = పుట్టించెను; తదనంతరంబునన్ = తరువాత; ఆ = ఆ;
తరళనేత్ర = స్త్రీ {తరళనేత్ర - తళుక్కుమనె డి నేత్రములు గలామె, స్త్రీ}; సత్ = మంచి; వ్రత = నిష్ఠ; స్వధామ = స్థిరత్వము; పుణ్య = పుణ్యవంతమైన; శీల = వర్తన గలామె; సుగుణ = సుగుణములు; పూరిత = నిండిన; చారిత్ర = నడవడిక గలామె; అఖిల = సర్వ; లోక = లోకములకు; పూజ్య = పూజ్యనీయురాలు; ఆశిష = ఆశిష యనెడి; ఆఖ్య = పేరు గలామె.

భావము:

“పరీక్షిన్నరేంద్రా! విను. నీకు త్వష్ట ప్రజాపతి వంశాన్ని వివరించాను. ఇక సవిత్రుని వంశాన్ని వినిపిస్తాను. అదితికి జన్మించిన పన్నెండుమంది ఆదిత్యులలో అయిదవవాడైన సవితృడు పృశ్ని, సావిత్రి, వ్యాహృతి అనే భార్యలందు అగ్నిహోత్రాలను, పశుయాగము, సోమయజ్ఞము పంచమహాయజ్ఞము అనే కుమారులను కన్నాడు. అదితి కుమారులలో ఆరవవాడైన భగుడు సిద్ధిక అనే భార్య వల్ల మహిముడు, అనుభవుడు, విభవుడు అనే ముగ్గురు కుమారులను, ఆశిష అనే కుమార్తెను కన్నాడు. ఆ కుమార్తె తళతళ మెరిసే కన్నులు కలది, సువ్రత, పుణ్యశీలి, సుగుణవతి, సుచరిత్ర, అఖిల లోకాలకు ఆరాధ్యురాలు.

6-507-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు, ధాతకుఁ గల కుహూ సినీవాలీ రాకానుమతు లనియెడు నలువురు భార్యలలోఁ గుహూదేవి సాయమను సుతునిం గాంచె; సినీవాలి దర్శాఖ్యునిం బడసె; రాక ప్రాతరాఖ్యునిఁ గాంచె; ననుమతి పూర్ణిమాఖ్యునిఁ బడసె; విధాత క్రియ యను భార్యయందు నగ్నిపురీష్యాదులం గనియె; వరుణునకుఁ జర్షిణి యను భార్యయందుఁ బూర్వకాలంబున బ్రహ్మపుత్రుం డయిన భృగువును వల్మీకంబునం జనియించిన వాల్మీకియు నుదయించిరి; మిత్రావరుణులకు నూర్వశి యందు రేతోద్గమంబైన, దానిఁ గుంభంబునం బ్రవేశింప జేయ నందు నగస్త్యుండును, వసిష్ఠుండును జనియించిరి; ప్రత్యేకంబ మిత్రునకు రేవతియందు నుత్సర్గ సంభవులైన యరిష్టయుఁ, బిప్పలుండును నను వారలు జనియించిరి; శక్రునకుఁ బౌలోమి యందు జయంత ఋషభ విదుషులన ముగ్గురు పుట్టిరి; వామనుం డయిన యురుక్రమ దేవునకుఁ గీర్తి యను భార్యయందు బృహశ్లోకుండు పుట్టె; నా బృహశ్లోకునకు సౌభగాదులు పుట్టిరి; మఱియు, మహానుభావుం డయిన కశ్యపప్రజాపతికి నదితి యందు శ్రీమన్నారాయణుం డవతరించిన ప్రకారంబు వెనుక వివరించెద; దితిసుతులైన దైతేయుల వంశంబు చెప్పెదను; ఏ దైతేయ వంశంబు నందు బ్రహ్లాద బలులు పరమ భాగవతులై దైత్యదానవవందితులై వెలసిరి; దితి కొడుకులు హిరణ్యకశిపు హిరణ్యాక్షులనఁ బ్రసిద్ధి నొంది; రందు హిరణ్యకశిపునకుఁ జంభాసుర తనయ యైన దత్తకుఁ బ్రహ్లాదానుహ్లాద సంహ్లాద హ్లాదులను నలుగురు గొడుకులును సింహిక యను కన్యకయు జన్మించి; రా సింహికకు రాహువు జనియించె; నా రాహువు శిరం బమృతపానంబు చేయ, హరి దన చక్రంబునం ద్రుంచె; సంహ్లాదునకు గతి యను భార్య యందుఁ బంచజనుండు పుట్టె; హ్లాదునకు దమని యను భార్య యందు వాతాపీల్వలులు పుట్టిరి; వారల నగస్త్యుండు భక్షించె; ననుహ్లాదునకు సూర్మి యను భార్యయందు బాష్కల మహిషులు గలిగిరి; ప్రహ్లాదునకు దేవి యను భార్యయందు విరోచనుండు పుట్టె; నతనికి బలి జన్మించె; నా బలికి నశన యను భార్య యందు బాణుండు జ్యేష్ఠుండుగా నూర్వురు గొడుకులు పుట్టి; రా బలి ప్రభావంబు వెనుక వివరించెద; బాణాసురుండు పరమేశ్వరు నారాధించి ప్రమథగణంబులకు ముఖ్యుం డయ్యెను; మఱియు, నా దితి సంతానంబులగు మరుత్తు లేకోనపంచదశకంబులు గలవార లందఱు ననపత్యులై యింద్రుతోఁ గూడి దేవత్వంబు నొంది" రనిన విని పరీక్షిన్నరేంద్రుండు శుకయోగీంద్రున కిట్లనియె.

టీకా:

మఱియున్ = ఇంకను; ధాత = ధాత {ధాత - అదితి సంతానము పన్నెండుగురులో ఒకడు}; కున్ = కు; కల = కలిగిన; కుహూ = కుహూ {కుహూ - చంద్రకళ కానరాని అమావాస్య}; సినీవాలీ = సినీవాలి {సినివాలి - చంద్రకళ కాన వచ్చెడి అమావాస్య}; రాక = రాక {రాక - నిండుపున్నమి నాటి పౌర్ణమి}; అనుమతులు = అనుమతులు {అనుమతి - ఒక కళ తక్కువైన చంద్రుడుగల పౌర్ణమి}; అనియెడు = అనెడి; నలువురు = నలుగురు; భార్యల = భార్యల; లోన్ = అందలి; కుహూదేవి = కుహూదేవి; సాయము = సాయము {సాయము - సాయంకాలము}; అను = అనెడి; సుతునిన్ = పుత్రుని; కాంచెన్ = పుట్టించెను; సినీవాలి = సినీవాలి; దర్శ = దర్శ {దర్శము - అమావాస్య}; ఆఖ్యునిన్ = పేరు గలవానిని; పడసెన్ = పొందెను; రాక = రాక; ప్రాతః = ప్రాతః {ప్రాతః - ఉదయము}; ఆఖ్యునిన్ = పేరు గలవానిని; కాంచెన్ = పుట్టించెను; అనుమతి = అనుమతి; పూర్ణిమ = పూర్ణిమ {పూర్ణిమ - పున్నమి}; ఆఖ్యునిన్ = పేరు గలవానిని; పడసెన్ = పొందెను; విధాత = విధాత {విధాత - అదితి సంతానము పన్నెండుగురులో ఒకడు}; క్రియ = క్రియ; అను = అనెడి; భార్య = భార్య; అందున్ = అందు; అగ్ని = అగ్ని; పురీష్ = పురీష; ఆదులన్ = మొదలగువానిని; కనియె = పుట్టించెను; వరుణున్ = వరుణుడు {వరుణుడు - అదితి సంతానము పన్నెండుగురులో ఒకడు}; కున్ = కు; చర్షిణి = చర్షిణి; అను = అనెడి; భార్య = భార్య; అందున్ = అందు; పూర్వకాలంబునన్ = పూర్వకాలము నందు; బ్రహ్మ = బ్రహ్మదేవుని; పుత్రుండు = కుమారుడు; అయిన = ఐన; భృగువును = భృగువు; వల్మీకంబునన్ = పుట్ట యందు; జనియించిన = పుట్టినట్టి; వాల్మీకియున్ = వాల్మీకి; ఉదయించిరి = పుట్టిరి; మిత్ర = మిత్రుడు {మిత్రుడు - అదితి సంతానము పన్నెండుగురులో ఒకడు}; వరణుల్ = వరుణుల {వరుణుడు - అదితి సంతానము పన్నెండుగురులో ఒకడు}; కున్ = కు; ఊర్వశి = ఊర్వశి; అందున్ = అందు; రేతస్ = రేతస్సు; ఉద్గమంబున్ = వెలువడినది; ఐన = అయిన; దానిన్ = దానిని; కుంభంబునన్ = కుండలో; ప్రవేశింపజేయన్ = చేరునట్లుచేయగా; అందున్ = దానిలో; అగస్త్యుండును = అగస్త్యుడు; వసిష్ఠుండును = వసిష్ఠుడును; జనియించిరి = పుట్టిరి; ప్రత్యేకంబ = విడిగా; మిత్రున్ = మిత్రున; కున్ = కు; రేవతి = రేవతి; అందున్ = అందు; ఉత్సర్గ = శుక్రస్ఖలనము వలన; సంభవులు = పుట్టినవారు; ఐన = అయిన; అరిష్టయున్ = అరిష్ట; పిప్పలుండును = పిప్పలుడు; అను = అనెడి; వారలు = వారు; జనియించిరి = పుట్టిరి; శక్రున్ = ఇంద్రుని {ఇంద్రుడు - అదితి సంతానము పన్నెండుగురులో ఒకడు}; కున్ = కి; పౌలోమి = శచీదేవి {పౌలోమి - పులోముని పుత్రిక, శచీదేవి}; అందున్ = అందు; జయంత = జయంతుడు; ఋషభ = ఋషభుడు; విదుషుల్ = విదుషులు; అను = అనెడి; ముగ్గురు = ముగ్గురు (3); పుట్టిరి = పుట్టిరి; వామనుండు = వామనావతారుండు; అయిన = అయిన; ఉరుక్రమదేవున్ = ఉరుక్రమదేవుని {ఉరుక్రముడు - అదితి సంతానము పన్నెండుగురులో ఒకడు}; కున్ = కి; కీర్తి = కీర్తి; అను = అనెడి; భార్య = భార్య; అందున్ = అందు; బృహశ్లోకుండు = బృహశ్లోకుడు; పుట్టెన్ = పుట్టెను; ఆ = ఆ; బృహశ్లోకున్ = బృహశ్లోకుని; కున్ = కి; సౌభగ = సౌభగ; ఆదులు = మొదలగువారు; పుట్టిరి = పుట్టిరి; మఱియున్ = ఇంకను; మహానుభావుండు = గొప్పవాడు; అయిన = అయిన; కశ్యప = కశ్యపుడు యనెడి; ప్రజాపతి = ప్రజాపతి; కిన్ = కి; అదితి = అదితి; అందున్ = అందు; శ్రీమన్నారాయణుండు = విష్ణుమూర్తి {శ్రీమన్నారాయణుడు - శ్రీమత్ (శుభవంతము అయిన) నారాయణుడు, విష్ణుమూర్తి}; అవతరించిన = పుట్టిన; ప్రకారంబున్ = విధానము; వెనుక = తరువాత; వివరించెదన్ = వివరముగా చెప్పెదను; దితి = దితి యొక్క; సుతులు = పుత్రులు; ఐన = అయిన; దైతేయుల = దైత్యుల; వంశంబున్ = వంశమును; చెప్పెదను = చెప్పెదను; ఏ = ఏ; దైతేయ = దైత్య; వంశంబునన్ = వంశములో; అందున్ = అందు; ప్రహ్లాద = ప్రహ్లాదుడు; బలులు = బలియును; పరమ = అత్యుత్తమ; భాగవతులు = భాగవతులు; ఐ = అయ్యి; దైత్య = దైత్యుల; దానవ = దానవులచేతను; వందితులు = కీర్తింపబడువారు; ఐ = అయ్యి; వెలసిరి = పుట్టిరి; దితి = దితి యొక్క; కొడుకులు = పుత్రులు; హిరణ్యకశిపు = హిరణ్యకశిపుడు; హిరణ్యాక్షులు = హిరణ్యాక్షులు; అనన్ = అనగా; ప్రసిద్ధిన్ = ప్రసిద్ధిని; ఒందిరి = పొందిరి; అందున్ = వారిలో; హిరణ్యకశిపున్ = హిరణ్యకశిపుని; కున్ = కు; జంభాసుర = జంభాసురుని; తనయ = పుత్రిక; ఐన = అయిన; దత్త = దత్త; కున్ = కు; ప్రహ్లాద = ప్రహ్లాదుడు; అనుహ్లాద = అనుహ్లాదుడు; సంహ్లాద = సంహ్లాదుడు; హ్లాదులు = హ్లాదులు; అను = అనెడి; నలుగురు = నలుగురు (4); కొడుకులును = కుమారులు; సింహిక = సింహిక; అను = అనెడి; కన్యకయున్ = కుమార్తె; జన్మించిరి = పుట్టిరి; ఆ = ఆ; సింహిక = సింహిక; కున్ = కు; రాహువు = రాహువు; జనియించెన్ = పుట్టెను; ఆ = ఆ; రాహువు = రాహువు; శిరంబు = తల; అమృత = అమృతమును; పానంబున్ = తాగుట; చేయన్ = చేయగా; హరి = నారాయణుడు; తన = తన యొక్క; చక్రంబునన్ = చక్రముతో; త్రుంచెన్ = తెంచివేసెను; సంహ్లాదున్ = సంహ్లాదున; కున్ = కు; గతి = గతి; అను = అనెడి; భార్య = భార్య; అందున్ = అందు; పంచజనుండు = పంచజనుడు; పుట్టెన్ = పుట్టెను; హ్లాదున్ = హ్లాదుని; కున్ = కి; దమని = దమని; అను = అనెడి; భార్య = భార్య; అందున్ = అందు; వాతాపి = వాతాపి; ఇల్వలులు = ఇల్వలుడు; పుట్టిరి = పుట్టిరి; వారలన్ = వారిని; అగస్త్యుండు = అగస్త్యుడు; భక్షించెన్ = తినివేసెను; అనుహ్లాదున్ = అనుహ్లాదుని; కున్ = కి; సూర్మి = సూర్మి; అను = అనెడి; భార్య = భార్య; అందున్ = అందు; బాష్కల = బాష్కలుడు; మహిషులు = మహిషులు; కలిగిరి = పుట్టిరి; ప్రహ్లాదున్ = ప్రహ్లాదుని; కున్ = కి; దేవి = దేవి; అను = అనెడి; భార్య = భార్య; అందున్ = అందు; విరోచనుండు = విరోచనుడు; పుట్టెన్ = పట్టెను; అతని = అతని; కిన్ = కి; బలి = బలి; జన్మించెన్ = పుట్టెను; ఆ = ఆ; బలి = బలి; కిన్ = కి; అశన = అశన; అను = అనెడి; భార్య = భార్య; అందున్ = అందు; బాణుండు = బాణుడు; జ్యేష్ఠుండుగా = పెద్దవాడుగా; నూర్వురు = వందమంది (100); కొడుకులు = పుత్రులు; పుట్టిరి = పుట్టిరి; ఆ = ఆ; బలి = బలి; ప్రభావంబున్ = ప్రభావమును; వెనుక = తరువాత; వివరించెదన్ = వివరముగా చెప్పెదను; బాణాసురుండు = బాణాసురుడు; పరమేశ్వరున్ = పరమశివుని; ఆరాధించి = కొలిచి; ప్రమథగణంబుల్ = ప్రమథగణముల; కున్ = కు; ముఖ్యుండు = నాయకుడు; అయ్యెను = అయ్యెను; మఱియున్ = ఇంకను; ఆ = ఆ; దితి = దితి యొక్క; సంతానంబులు = సంతానములు; అగు = అయిన; మరుత్తులు = మరుత్తులు; ఏకోనపంచదశకంబులు = నలభైతొమ్మిది మంది; కల = ఉన్న; వారలు = వారు; అందఱున్ = అందరు; అనపత్యులు = సంతతి లేనివారు; ఐ = అయ్యి; ఇంద్రు = ఇంద్రుని; తోన్ = తోటి; కూడి = కలిసి; దేవత్వంబున్ = దేవతలుగా నుండుటను; ఒందిరి = పొందిరి; అనినన్ = అనగా; విని = విని; పరీక్షిత్ = పరీక్షిత్తు అనెడి; నరేంద్రుండు = రాజు; శుక = శుకుడు అనెడి; యోగి = యోగులలో; ఇంద్రున్ = శ్రేష్ఠున; కు = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అదితి సంతానమైన పన్నెండుగురిలో ఏడవవాడైన ధాతకు కుహువు (చంద్రకళ కనిపించని అమావాస్య), సినీవాలి (చంద్రకళ కనిపించే అమావాస్య), రాక (పౌర్ణమి), అనుమతి (ఒక కళ తక్కువైన చంద్రుడున్న పౌర్ణమి) అని నలుగురు భార్యలు. వారిలో కుహూదేవికి సాయం(కాలం), సినీవాలికి దర్శ (అమావాస్య), రాకకు ప్రాతఃకాలం, అనుమతికి పూర్ణిమ అనే కుమారులు జన్మించారు. అదితి కుమారులలో ఎనిమిదవవాడైన విధాత క్రియ అనే భార్య వల్ల అగ్ని, పురీషాదులను కన్నాడు. తొమ్మిదవ ఆదిత్యుడైన వరుణుడు చర్షిణి అనే భార్య వల్ల పూర్వం బ్రహ్మ కుమారుడైన భృగువును, వల్మీకం నుండి పుట్టిన వాల్మీకిని కన్నాడు. అదితి కుమారులలో పదవవాడు మిత్రుడు. మిత్రుని, వరుణిని కలిపి మిత్రావరుణు లంటారు. ఈ మిత్రావరుణులకు ఊర్వశి వల్ల రేతస్సు స్ఖలనం కాగా దానిని ఒక కుండలో ఉంచగా అందులోనుండి అగస్త్యుడు, వసిష్ఠుడు జన్మించారు. ప్రత్యేకంగా మిత్రునకు రేవతి అనే భార్య వల్ల శుక్రస్ఖలనం జరిగి అరిష్ట, పిప్పలుడు అనేవారు జన్మించారు. ఆదిత్యులలో పదకొండవవాడైన ఇంద్రునికి శచీదేవి వల్ల జయంతుడు, ఋషభుడు, విదుషుడు అనే కుమారులు కలిగారు. పన్నెండవవాడైన వామనావతారుడైన త్రివిక్రమునికి కీర్తి అనే భార్యవల్ల బృహశ్లోకుడు పుట్టాడు. ఆ బృహశ్లోకునికి సౌభగుడు మొదలైనవారు జన్మించారు. మహానుభావుడైన కశ్యప ప్రజాపతికి అదితి వల్ల శ్రీమన్నారాయణుడు వామనుడై అవతరించిన వృత్తాంతాన్ని తరువాత వివరిస్తాను. ఇప్పుడు దితి కుమారులైన దైతేయుల వంశాన్ని చెప్తాను. ఆ దైత్యవంశంలో ప్రహ్లాదుడు, బలి చక్రవర్తి పరమ భాగవతులై దేవ దానవులకు వందనీయులైనారు. దితికి హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అనే ఇద్దరు కుమారులు కలిగి ప్రసిద్ధులయ్యారు. వారిలో హిరణ్యకశిపునకు జంభాసురుని కుమార్తె అయిన దత్తకు ప్రహ్లాదుడు, అనుహ్లాదుడు, సంహ్లాదుడు, హ్లాదుడు అనే నలుగురు కుమారులు, సింహిక అనే కుమార్తె జనించారు. ఆ సింహికకు రాహువు పుట్టాడు. ఆ రాహువు శిరం అమృతాన్ని పానం చేయడంతో శ్రీహరి తన చక్రంతో దానిని ఖండించాడు. సంహ్లాదునకు గతి అనే భార్య యందు పంచజనుడు పుట్టాడు. హ్లాదునికి దమని అనే భార్యయందు వాతాపి, ఇల్వలుడు జన్మించారు. వారిద్దరినీ అగస్త్యుడు భక్షించాడు. అనుహ్లాదునికి సూర్మి అనే అనే భార్య యందు బాష్కలుడు, మహిషుడు పుట్టారు. ప్రహ్లాదునికి దేవి అనే భార్య వల్ల విరోచనుడు కలిగాడు. విరోచనునికి బలి జన్మించాడు. ఆ బలికి అశన అనే భార్య యందు బాణుడు పెద్దవాడుగా వందమంది కుమారులు పుట్టారు. బలి చక్రవర్తి గొప్పతనాన్ని తరువాత వివరిస్తాను. బాణాసురుడు శివుణ్ణి ఆరాధించి ప్రమథ గణాలకు నాయకుడయ్యాడు. ఇంకా దితి సంతానమైన నలభైతొమ్మిదిమంది మరుత్తులు ఉన్నారు. వారు సంతానం లేనివారై ఇంద్రునితో ఉంటూ దేవత్వాన్ని పొందారు” అని చెప్పగా విని పరీక్షిత్తు శుకమహర్షితో ఇలా అన్నాడు.