షష్ఠ స్కంధము : చిత్రకేతోపాఖ్యానము
- ఉపకరణాలు:
ఆతనికింబ్రియుఁ డప్రియుఁ
డే తెఱఁగున లేడు నిఖిల మెల్లను దానై
భూతముల కాత్మ యగుటయు
భూతప్రియుఁ డొక్కఁ డాదిపురుషుఁడు తన్వీ!
టీకా:
అతని = అతని; కిన్ = కి; ప్రియుండు = ఇష్టుడు; అప్రియుడు = అయిష్టుడు; ఏ = ఏ; తెఱగునన్ = విధముగను; లేడు = లేడు; నిఖిలము = సమస్తమైనది; ఎల్లను = అంతయు; తాను = తానే; ఐ = అయ్యి; భూతముల్ = జీవుల; కున్ = కు; ఆత్మ = ఆత్మ; అగుటయున్ = అగుటవలన; భూత = జీవులకు; ప్రియుడు = కోరదగినవాడు; ఒక్కడు = ఒకడే; ఆదిపురుషుడు = మూలపురుషుడు, విష్ణువు; తన్వీ = పార్వతీదేవీ, స్త్రీ {తన్వి - మంచి తనువు గలామె, స్త్రీ, (తన్వి - తనివి, తృప్తి)}.
భావము:
పార్వతీ! ఆ నారాయణునకు ఇష్టమైనవాడు, ఇష్టం కానివాడు అంటూ ఎవడూ ఉండడు. ఆయన సర్వాంతర్యామి. సమస్తమూ తానే అయినవాడు. సర్వజీవులకు ఆత్మ అయినవాడు. సకల జీవులకు ప్రియమైన ఆదిపురుషుడు ఆయన ఒక్కడే.