పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : చిత్రకేతోపాఖ్యానము

  •  
  •  
  •  

6-461-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన నంగిరసుం డిట్లనియె "నేను బుత్రకాంక్షివైన నీకుఁ బుత్రుం బ్రసాదించిన యంగిరసుండ; నితండు బ్రహ్మపుత్రుం డైన నారదభగవంతుండు; దుస్తరంబైన పుత్రశోకంబున మగ్నుండ వైన నిను ననుగ్రహించి, పరమజ్ఞానం బుపదేశింప వచ్చితిమి; నీ దుఃఖం బెఱింగి, పుత్రు నిచ్చితిమేనిఁ బుత్రవంతులైన వారి తాపంబు నీ చేత ననుభవింపం బడు; నీ ప్రకారంబున లోకంబున సతులును, గృహంబులును, సంపదలును, శబ్దాదులైన విషయంబులును, రాజ్యవైభవంబును జంచలంబులు; మఱియు రాజ్యంబును, భూమియును, బలంబును ధనంబును, భృత్యామాత్య సుహృజ్జనంబులును మొదలైనవి శోక మోహ భయ పీడలం జేయుచుండుఁ; గాని సుఖంబుల నీ నేరవు గంధర్వ నగరంబునుం బోలె స్వప్నలబ్ధ మనోరథంబునుం బోని యర్థంబుఁ బాసి కానంబడుచు, మనోభవంబులయిన యర్థంబులం గూడి, స్వార్థంబులై కానంబడ నేరవు; కర్మంబులచేత ధ్యానంబులు చేయుచుండు మనంబులు నానాకర్మంబు లగుచు నుండు నీ దేహి దేహంబు ద్రవ్యజ్ఞానక్రియాత్మకంబై దేహికి వివిధ క్లేశసంతాపంబులం జేయుచుండు; గావున నీవు నిర్మలంబైన మనంబు చేత నాత్మగతి వెదకి ధ్రువం బయిన పదవి నొందు" మనియె; అప్పుడు నారదుం డిట్లనియె "ఉపనిషద్గోప్యంబగు నే నిచ్చుమంత్రం బెవ్వడేని సప్తరాత్రంబులు పఠియించు, నతండు సంకర్షణుండైన భగవంతునిం జూచును; ఎవ్వని పాదమూలంబు సర్వాశ్రయంబై యుండు నట్టి శ్రీమన్నారాయణుని పాదంబులు సేవించి, యీ మోహంబు వదలి యతి శ్రీఘ్రంబున నుత్తమ పదంబు నొందు; మిప్పు డిక్కుమారునకు నీకును బ్రయోజనంబు గలదేనిం జూడు" మని నారదుండు మృతబాలకుని కళేబరంబుఁ జూచి "యో జీవుండ! నీకు శుభం బయ్యెడు; నిందుఁ బ్రవేశించి మీ తల్లిదండ్రుల బంధుజనులం జూచి వీరల దుఃఖంబు లార్చి యీ కళేబరంబునందుఁ బ్రవేశించి యాయుశ్శేషంబు ననుభవించి పిత్రధీనం బైన రాజ్యాసనంబునఁ గూర్చుండు" మనిన నబ్బాలుం డిట్లనియె.

టీకా:

అనినన్ = అనగా; అంగిరసుండు = అంగిరసుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; నేను = నేను; పుత్ర = కొడుకులు; కాంక్షివి = కావలెనని కోరినవాడవు; ఐన = అయిన; నీ = నీ; కున్ = కు; పుత్రున్ = కొడుకును; ప్రసాదించిన = దయచేసిన; అంగిరసుండన్ = అంగిరసుడను; ఇతండు = ఇతడు; బ్రహ్మ = బ్రహ్మదేవుని; పుత్రుండు = కుమారుడు; ఐన = అయిన; వారద = నారదుడు యనెడి; భగవంతుండు = మహిమాన్వితుడు; దుస్తరంబు = దాటరానిది; ఐన = అయిన; పుత్రశోకంబునన్ = పుత్రశోకమునందు; మగ్నుండవు = ములిగినవాడవు; ఐన = అయిన; నినున్ = నిన్ను; అనుగ్రహించి = అనుగ్రహించి; పరమ = అతిపవిత్రమైన; జ్ఞానంబున్ = జ్ఞానమును; ఉపదేశింపన్ = ఉపదేశించుటకై; వచ్చితిమి = వచ్చితిమి; నీ = నీ యొక్క; దుఃఖంబున్ = దుఃఖమును; ఎఱింగి = తెలిసికొని; పుత్రున్ = కుమారుని; ఇచ్చితిమేని = ఇచ్చినచో; పుత్రవంతులు = పుత్రులుగలవారు; ఐన = అయిన; వారి = వారి యొక్క; తాపంబున్ = బాధలను; నీ = నీ; చేతన్ = వలన; అనుభవింపంబడున్ = అనుభవింపవలసి యుండును; ఈ = ఈ; ప్రకారంబునన్ = విధముగ; లోకంబునన్ = లోకములో; సతులును = భార్యలు; గృహంబులునున్ = ఇళ్ళు వాకిళ్లు; సంపదలును = సంపదలు; శబ్దాదులు = శబ్దాదులు {శబ్దాదులు - పంచతన్మాత్రలు, 1శబ్దము 2స్పర్శ 3రూప 4రుచి 5వాసనలు}; ఐన = అయినట్టి; విషయంబులును = ఇంద్రియార్థములును; రాజ్య = రాజ్యమువలని; వైభవంబును = వైభవములును; చంచలంబులు = అశాశ్వతములు; మఱియున్ = ఇంకను; రాజ్యంబును = రాజ్యము; భూమియును = పొలములు; బలంబును = సైన్యములు; ధనంబును = ధనము; భృత్య = సేవకులు; అమాత్య = పురోహితాదులు; సుహృత్ = స్నేహితులు; జనంబులును = ప్రజలు; మొదలైనవి = మొదలైనవి; శోక = దుఃఖము; మోహ = మోహము; భయ = భయము; పీడలన్ = పీడలను; చేయుచుండున్ = కలిగించుచుండును; కాని = అంతేకాని; సుఖంబులన్ = సుఖములను; ఈనేరవు = ఇవ్వలేవు; గంధర్వనగరంబునున్ = ఆకాశములోని మేడలు (మేఘములు); పోలెన్ = వలె; స్వప్న = కలలో; లబ్ధ = ఈడేరిన; మనోరథంబునున్ = కోరికలను; పోని = పోలిన; అర్థంబున్ = ప్రయోజనములను; పాసి = విడిచిపెట్టి; కానంబడుచు = కనపడుతూ; మనః = మనసున; భవంబులు = పుట్టినవి; అయిన = ఐనట్టి; అర్థంబులన్ = ప్రయోజనములతో; కూడి = కలిసి; స్వార్థంబులు = తనకు మేలుచేసెడివి; ఐ = అయ్యి; కానంబడనేరవు = కనబడలేవు; కర్మంబుల్ = వేదకర్మములచేత; ధ్యానంబులు = ధ్యానములు; చేయుచుండు = చేసెడి; మనంబులు = మనసులు; నానా = వివిధములైన; కర్మంబుల్ = కర్మలు; కర్మంబులన్ = కర్మలలోను; అగుచుండున్ = కలుగుచుండును; ఈ = ఇట్టి; దేహి = జీవుని; దేహంబు = శరీరము; ద్రవ్య = వస్తువులు; జ్ఞాన = జ్ఞానము; క్రియ = క్రియలుతో; ఆత్మకంబు = కూడినది; ఐ = అయ్యి; దేహి = జీవుని; కిన్ = కి; వివిధ = అనేక రకములైన; క్లేశ = చిక్కులు, సంతాపములు; సంతాపంబులన్ = మనస్తాపములను; చేయుచుండున్ = కలిగించును; కావునన్ = అందుచేత; నీవు = నీవు; నిర్మలంబు = స్వచ్ఛము; ఐన = అయిన; మనంబు = మనసు; చేతన్ = తోటి; ఆత్మగతిన్ = ఆత్మ జ్ఞాన మార్గమును; వెదికి = సోధించి; ధ్రువంబు = స్థిరమైనది; అయిన = ఐనట్టి; పదవిన్ = స్థితిని; ఒందుము = పొందుము; అనియె = అనెను; అప్పుడు = అప్పుడు; నారదుండు = నారదుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; ఉపనిషత్ = ఉపనిషత్తులందు; గోప్యంబున్ = దాచబడినది; అగు = అయిన; నేను = నేను; ఇచ్చు = ఇచ్చెడి; మంత్రంబున్ = మంత్రమును; ఎవ్వడేని = ఎవడు అయినను; సప్త = ఏడు (7); రాత్రంబులున్ = రాత్రులు, దినములు; పఠియించున్ = చదువునో; అతండు = అతడు; సంకర్షణుండు = సంకర్షణుడు; ఐన = అయిన; భగవంతునిన్ = భగవంతుని; చూచును = దర్శించును; ఎవ్వని = ఎవని యొక్క; పాదమూలంబు = పాదములు; సర్వ = సర్వ విధముల; ఆశ్రయంబున్ = ఆశ్రయింపదగినవి; ఐ = అయ్యి; ఉండున్ = ఉండునో; అట్టి = అటువంటి; శ్రీమన్నారాయణుని = విష్ణుమూర్తి యొక్క; పాదంబులున్ = పాదములను; సేవించి = కొలిచి; ఈ = ఈ; మోహంబున్ = మోహమును; వదలి = విడిచిపెట్టి; అతి = మిక్కిలి; శ్రీఘ్రంబునన్ = వేగముగా; ఉత్తమ = ఉత్తమమైన; పదంబున్ = స్థితిని; ఒందుము = పొందుము; ఇప్పుడు = ఇప్పుడు; ఈ = ఈ; కుమారున్ = బాలుని; కున్ = కి; నీ = నీ; కునున్ = కు; కలదేని = ఉన్నదేమో; చూడుము = పరిశీలింపుము; అని = అని; నారదుండు = నారదుడు; మృత = మరణించిన; బాలకుని = పిల్లవాని; కళేబరంబున్ = కళేబరమును; చూచి = చూసి; ఓ = ఓ; జీవుండ = జీవుడా; నీ = నీ; కున్ = కు; శుభంబున్ = శుభములు; అయ్యెడున్ = అగును; ఇందున్ = దీనిలో; ప్రవేశించి = చేరి; మీ = మీ యొక్క; తల్లిదండ్రులన్ = తల్లిదండ్రులను; బంధు = బంధువులైన; జనులన్ = వారిని; చూచి = చూసి; వీరల = వీరి యొక్క; దుఃఖంబున్ = శోకమును; ఆర్చి = తీర్చి; ఈ = ఈ యొక్క; కళేబరంబున్ = కళేబరము; అందున్ = లో; ప్రవేశించి = చేరి; అయుస్ = జీవితకాలములో; శేషంబునున్ = మిగిలినదానిని; అనుభవించి = అనుభవించి; పితృ = తండ్రి యొక్క; అధీనంబు = ఆధీనములో యున్నది; ఐన = అయిన; రాజ్యాసనంబునన్ = రాజ్యాధికారమున; కూర్చుండుము = వసింపుము; అనినన్ = అనగా; ఆ = ఆ; బాలుండున్ = పిల్లవాడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అని అడిగిన చిత్రకేతుతో అంగిరసుడు ఇలా అన్నాడు. “నీవు పుత్రసంతానం కావాలని కోరినపుడు నీకు పుత్రుణ్ణి ప్రసాదించిన అంగిరసుణ్ణి నేను. ఈయన బ్రహ్మ మానస పుత్రుడైన నారద మహర్షి. తరింప శక్యం కాని పుత్రశోకంలో మునిగి ఉన్న నిన్ను అనుగ్రహించి నీకు పరమ జ్ఞానాన్ని ఉపదేశించడానికి వచ్చాము. నీ దుఃఖాన్ని తెలుసుకొని ఇప్పుడు మళ్ళీ నీకు కుమారుణ్ణి ప్రసాదించినా బిడ్డలు గలవారికి కలిగే దుఃఖం నీకు మళ్ళీ కలుగుతుంది. ఈ లోకంలో భార్యలు, గృహాలు, సంపదలు, శబ్ద స్పర్శ రూపాలైన విషయ సుఖాలు, రాజ్య వైభవాలు అన్నీ అశాశ్వతాలు. చివరకు దుఃఖాన్నే కలిగిస్తాయి. ఇంతేకాదు, భోగ భాగ్యాలు, పొలం, బలం, ధనం, సేవకులు, మంత్రులు, మిత్రులు మొదలైన సంబంధాలన్నీ శోకాన్నీ మోహాన్నీ భయాన్నీ బాధనూ కలిగిస్తాయే కాని సుఖాన్ని చేకూర్చలేవు. ఆకాశంలో కనిపించే గంధర్వ నగరం వలె, కలలో కనిపించే వస్తువుల వలె ఈ సంబంధాలన్నీ మాయమౌతూ మళ్ళీ కనిపిస్తూ ఉంటాయి. మన మనస్సులలో ధ్యానించే భావాలే మనకు స్వప్నంలో కనిపించి మాయమౌతూ ఉంటాయి. జీవి యొక్క దేహం ద్రవ్యం, జ్ఞానం, క్రియ అనే మూడు విధాలైన సంబంధాలతో కూడి ఉంటుంది. అటువంటి దేహం దేహధారి అయినవానికి నానావిధాలైన క్లేశాలను కలిస్తుంది. ఎన్నెన్నో చిక్కులను తెచ్చి పెడుతుంది. అందువల్ల రాజా! నీవు నీ మనస్సును ఈ బంధాలలో చిక్కుకోకుండా నిశ్చలం చేసుకో. అటువంటి నిర్మలమైన మనస్సుతో ఆత్మజ్ఞానాన్ని అలవరుచుకో. శాశ్వతమైన పదవిని అందుకో” అని అంగిరసుడు పలికిన తరువాత నారదుడు చిత్రుకేతుతో ఇలా అన్నాడు. “రాజా! ఉపనిషత్తులలో రహస్యంగా నిక్షిప్తమై ఉన్న ఒక మంత్రాన్ని నేను నీకు ఉపదేశిస్తాను. ఈ మంత్రాన్ని ఏడు రాత్రులు జపించిన వానికి భగవంతుడైన సంకర్షణుని దర్శనం లభిస్తుంది. సమస్త విశ్వానికి ఆశ్రయమైన శ్రీమన్నారాయణుని పాదాలను సేవించి అతడు మోహబంధాలను ఛేదించి అతి శీఘ్రంగా ఉత్తమ గతిని పొందుతాడు. ఈ కుమారునికి, నీకు ఎటువంటి సంబంధమూ లేదు. ఒకవేళ ఏదైనా ప్రయోజనం ఉన్నదనుకుంటావేమో? అయితే ఇప్పుడే పరీక్షించుకో” అని నారదుడు చనిపోయిన బాలుని కళేబరం వైపు చూచి “ఓ జీవుడా! నీకు శుభం కలుగుగాక! నీవు మళ్ళీ ఈ దేహంలో ప్రవేశించు. మీ తల్లిదండ్రులను, బంధు మిత్రులను ఒక్కసారి చూడు. వాళ్ళ దుఃఖాన్ని పోగొట్టు. మిగిలిన ఆయుర్దాయమంతా ఈ శరీరంలోనే ఉండి నీ తండ్రి సింహాసనాన్ని అధిష్ఠించు” అన్నాడు. అప్పుడా బాలుడు ఇలా అన్నాడు.