పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-433-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు లోకభీకరుండై వృత్రాసురుండు గూలిన, నఖిల లోకంబులు బరితాపంబు లుడిగి సుస్థితిం బొందె; దేవర్షి పితృగణంబులు దానవుల తోడంగూడి, యింద్రునకు జెప్పక తమతమ స్థానంబులకుం జని;" రనిన విని, పరీక్షిన్నరేంద్రుండు శుకయోగీంద్రున కిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; లోక = లోకములకు; భీకరుండు = భయంకరుడు; ఐన్ = అయిన; వృత్రాసురుండు = వృత్రాసురుడు; కూలినన్ = చనిపోగా; అఖిల = సమస్తమైన; లోకంబులున్ = లోకములు; పరితాపంబులు = బాధలు; ఉడిగి = తగ్గి; సుస్థితిన్ = మంచిదశను; పొందె = పొందెను; దేవర్షి = దేవఋషులు; పితృగణంబులు = పితృదేవతలు; దానవుల = రాక్షసుల; తోడన్ = తోటి; కూడి = కలిసి; ఇంద్రున్ = ఇంద్రున; కున్ = కు; చెప్పక = చెప్పకుండగ; తమతమస్థానంబులకున్ = ఎవరి స్థానమునకు వారు; చనిరి = వెళ్ళిరి; అనినన్ = అని చెప్పగా; విని = విని; పరీక్షిత్ = పరీక్షిత్తు యనెడి; నరేంద్రుండు = రాజు; శుక = శుకుడు యనెడి; యోగి = యోగులలో; ఇంద్రున్ = శ్రేష్ఠున; కున్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఈ విధంగా లోకభయంకరుడైన వృత్రుడు మరణించడంతో సమస్త లోకాలు సంతాపాన్ని వీడి సంతోషించాయి. దేవతలు, ఋషులు, పితృదేవతలు, దానవులు అందరు ఇంద్రునితో చెప్పకుండానే తమ తమ ప్రదేశాలకు వెళ్ళిపోయారు” అని చెప్పగా విని పరీక్షిత్తు శుకమహర్షితో ఇలా అన్నాడు.