పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-422-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లోములెల్ల నిండి తన లోనుగ సర్వముఁజేసి ప్రాణులన్
దీకులఁ బెట్టి యెల్లడలఁ దీప్తులు చూపెడి విష్ణుమాయ నేఁ
డేమతిన్ దలంచి తిది యేల? మహాసురురూపు మాని సు
శ్లోకుఁ బురాణపూరుషుని శోభనమూర్తి ధరింపు మింపునన్.

టీకా:

లోకముల్ = భువనములు; ఎల్లన్ = సమస్తమును; నిండి = నిండి; తన = తన; లోనుగన్ = లోబడియే, లోపలనే; సర్వమున్ = సమస్తమును; చేసి = సృష్టించి; ప్రాణులన్ = జీవులను; తీకులన్ = తీపులను, బంధనములలో; పెట్టి = బంధించి; ఎల్లన్ = అన్ని; ఎడలన్ = సమయ సందర్భములలోను; దీప్తులు = ప్రకాశములు; చూపెడి = ప్రదర్శించెడి; విష్ణు = విష్ణుమూర్తి యొక్క; మాయన్ = మాయను; నేడు = ఈనాడు; ఏక = ఏకాగ్ర; మతిన్ = బుద్ధితో; తలంచితి = స్మరించితివి; ఇది = ఇది; ఏల = ఎందులకు; మహా = పెద్ద; అసుర = రాక్షసుల; రూపు = స్వరూపము; మాని = వదలివేసి; సుశ్లోకున్ = నారాయణుని {సుశ్లోకుడు - సు (మంచివారిచే) శ్లోకుడు (కీర్తింపబడువాడు), విష్ణువు}; పురాణపూరుషుని = నారాయణుని {పురాణపూరుషుడు - పుర్వకాలము నుండి ఉన్న పూరుషుడు (కారణభూతుడు), విష్ణువు}; శోభన = శుభకరమైన; మూర్తిన్ = స్వరూపమును; ధరింపుము = స్వీకరింపుము; ఇంపునన్ = చక్కగా.

భావము:

సమస్త లోకాలలో నిండి, సకల భువనాలను తనలో ఇముడ్చుకొని, ప్రాణులను చిక్కులు పెట్టి, అంతటా వింతలు చూపించే విష్ణుమాయను నీవు ఏకాగ్రబుద్ధితో తెలుసుకోగలిగావు. ఇంకా ఈ భీకరమైన రాక్షసాకారం నీకెందుకు? దీనిని పరిత్యజించి పరమ పవిత్రమైన పురాణ పురుషుని స్వరూపాన్ని స్వీకరించు.