పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-373-లగ్రా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మొత్తముగఁ బాఱు పెనునెత్తురు మహానదులఁ;
త్తరముతో నుఱికి కుత్తుకలు మోవం
జిత్తముల నుబ్బి వెస నెత్తుకొను భూతముల;
త్తుకొని శాకినులు జొత్తిలుచు మాంసం
బుత్తలముతో మెసఁగి నృత్తములు జేయు మద;
త్తఘన ఢాకినులు వృత్తగతిఁ బ్రేవుల్
బిత్తరములం దిగిచి మెత్తమెదడుల్ మొనసి;
గుత్తగొనుచుండ భయవృత్తిఁ గల నొప్పెన్.

టీకా:

మొత్తముగన్ = అధికముగ; పాఱు = పారెడి; పెను = పెద్ద; నెత్తురు = రక్తపు; మహా = గొప్ప; నదులన్ = నదులందు; తత్తరము = సంభ్రమము; తోన్ = తో; ఉఱికి = దూకి; కుత్తుకలుమోవన్ = పీకలదాకా; చిత్తములన్ = మనసులలో; ఉబ్బి = సంతోషించి; వెసనెత్తుకొను = వేగిరించెడి; భూతములన్ = భూతములను; అత్తుకొని = అంటుకొని; శాకినులున్ = ఒకరకము భూతములు; జొత్తిలుచున్ = రంజిల్లుతూ; మాంసంబున్ = మాంసమును; ఉత్తలము = ఆత్రము; తోన్ = తో; మెసగి = మెక్కి; నృత్తములు = నృత్యములు; చేయు = చేసెడి; మద = మదించిన; మత్త = మత్తెక్కిన; ఢాకినులున్ = ఒకరకపు భూతములు; వృత్తగతిన్ = గుండ్రముగ తిరుగుటలు; ప్రేవుల్ = పేగులను; బిత్తరములన్ = తొట్రుపాటులతో; తిగిచి = లాగుతూ; మెత్త = మెత్తటి; మెదడుల్ = మెదళ్ళను; మొనసి = పూని; గుత్తన్ = మొత్తముగ; కొనుచుండన్ = తినుచుండగ; భయవృత్తన్ = భీకరముగ; కలను = యుద్ధము; ఒప్పెన్ = ఒప్పియుండెను.

భావము:

రణరంగమంతా రక్తపుటేరులు ప్రవహించాయి. పెనుభూతాలు కుత్తుకలోతు నెత్తురు ప్రవాహాలలో దుమికి విచ్చలవిడిగా విహరింపసాగాయి. శాకినులు మాంసపు కండలను కడుపునిండా భుజిస్తూ నృత్యం చేశాయి. మదంతో మైమరచిన డాకినులు ప్రేవుల దండలను మెడలనిండా ధరించి మెత్తని మెదళ్ళను తింటూ మిక్కిలి భయంకరంగా గంతులు వేశాయి.