పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-370-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు ప్రళయసంరంభ విజృంభిత సముత్తుంగ రంగత్తరంగిత భైరవారావ నిష్ఠ్యూత నిష్ఠుర మహార్ణవంబునుం బోలె యుగాంత సంక్రాంత ఝంఝాపవన పరికంపిత దీర్ఘ నిర్ఘాత నిబిడ నిష్ఠుర నీరదంబులుం బోలె, నుభయ సైన్యంబులు గలసి సంకుల సమరంబు సలుపు సమయంబున, యుగాంత కృతాంత సకలప్రాణి సంహార కారణలీలయుం బోలెఁ, బదాతిరాతి మావంత రథిక మహారథిక వీరు లొండురులు చండగతిం గాండంబులు పఱపుచు, గదలం జదుపుచుఁ, గత్తులఁ గత్తళంబులఁ జినుఁగం బొడుచుచు, నడిదంబుల నఱకుచుఁ, గుంతలంబులం గ్రుచ్చుచు, గుఠారంబుల వ్రచ్చుచు, ముసలంబుల మోఁదుచు, ముద్గరంబులం బాఁదుచుఁ, జక్రంబులం ద్రుంచుచు, సబళంబుల నొంచుచు, చురియల మెఱుముచు, శూలంబులఁ దుఱుముచు, వాజుల కుఱికియు, వాలంబుల నఱికియుఁ, దొడలు తుండించియుఁ, దొండంబులు ఖండించియు, మెడ లెడయించియు, మెదళ్ళు గెడయించియు, నములు ద్రుంచియు, నాసికలు ద్రెంచియుఁ, బదంబుల విఱిచియుఁ, బార్శంబులం జఱచియు, గజంబులఁ బఱపియు, గాత్రంబుల మఱపియుఁ, గుంభంబులఁ బగిలించియుఁ, గొమ్ములఁ బెకలించియు, హస్తంబులఁ దుండించియు, నంగంబులఁ జించియు, రథంబుల చలియించియు, రథికుల బొలియించియు, సారథుల జంపియు, సైంధవంబులఁ దంపియు, శిరంబు నొగిలించియు, సీసకంబు లగిలించియు, ఛత్రంబుల నుఱుమాడియుఁ, జామరంబులం దునుమాడియు, సైన్యంబులఁ జిదిపియు, సాహసుల మెదిపియు, నడుములు ద్రుంచియు, మఱియును బరస్పర గుణవిచ్ఛేదనంబున, నన్యోన్య కోదండ ఖండన పటుత్వంబు నుభయ సైంధవ ధ్వజ సారథి రథిక రథ వికలనంబును, నొండొరుల పాద జాను జంఘా హస్త మస్తక నిర్దళనంబును, రక్త మాంస మేదః పంకసంకలిత సమరాంగణంబునునై యతి ఘోర భంగిం బెనంగి; రప్పుడు.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; ప్రళయ = ప్రళయకాలపు; సంరంభ = ఆటోపముతో; విజృంభిత = విజృంభిస్తున్న; సముత్తుంగ = ఉవ్వెత్తు; తరంగ = అలలచే; తరంగిత = అల్లకల్లోలపు; భైరవ = భయంకరమైన; ఆరావ = శబ్దములు; నిష్ఠ్యూత = వెలువడుతున్నట్టి; నిష్ఠుర = భీకరమైన; మహార్ణవంబునున్ = సముద్రమును; పోలెన్ = వలె; యుగ = యుగము; అంత = అంత్యకాలమున; సంక్రాంత = సంక్రమణపు, సంధ్యాకాల; ఝంఝాపవన = ఝంమ్మని అతి వేగముగా వీచెడి; పవన = గాలులచే; పరికంపిత = చలించిపోవు; దీర్ఘ = పెద్ద పెద్ద; నిర్ఘాత = పిడుగులచే; నిబిడ = దట్టమైన; నిష్ఠుర = కఠినమైన; నీరదంబులున్ = మేఘములను; పోలెనున్ = వలె; ఉభయ = రెండు ప్రక్కల; సైన్యంబులున్ = సైన్యములును; కలసి = కలిసి; సంకుల = దొమ్మి; సమరంబు = యుద్ధము; సలుపు = చేసెడి; సమయంబున = సమయములో; యుగాంత = యగము లంతం బగునప్పటి; కృతాంత = యముని {కృతాంతుడు – అంతము చేసెడివాడు, యముడు}; సకల = సమస్తమైన; ప్రాణి = ప్రాణుల; సంహార = సంహరించుట; కారణ = కోసమైన; లీలయున్ = కార్యముల; పోలెన్ = వలె; పదాతి = కాల్బలము; రాతి = గుఱ్ఱపురౌతులు; మావంత = ఏనుగు మావటీలు; రథిక = రథులు {రథి - రథముపైనుండి యుద్ధముజేయు వాడు}; మహారథిక = మహారథులు {మహారథి - రథముపైనుండి పదకొండువేలమందితో యుద్ధము జేయగలవాడు}; వీరులు = వీరులు; ఒండొరులన్ = ఒకరి నొకరు; చండ = భయంకరముగా; కాండంబులు = బాణములు; పఱపుచు = వేయుచు; గదలన్ = గదలతో; చదుపుచున్ = నలగగొట్టుతు; కత్తులన్ = కత్తులతో; కత్తళంబులన్ = కవచములను; చినుగన్ = చిరిగిపోవునట్లు; పొడుచుచున్ = పొడుచుచు; అడిదంబులన్ = ఖడ్గములతో; నఱకుచున్ = నరకుచు; కుంతలంబులన్ = ఈటెలతో; గ్రుచ్చుచు = పొడుచుచు; కుఠారంబులన్ = గొడ్డళ్ళతో; వ్రచ్చుచున్ = బద్దలుకొట్టుచు; ముసలంబులన్ = రోకళ్ళతో; మోదుచున్ = మొత్తుచు; ముద్గరంబులన్ = గుదియలతో, సమ్మెటలతో; బాదుచున్ = బాదుచు; చక్రంబులన్ = చక్రములతో; త్రుంచుచున్ = తుంచివేయుచు; సబళంబులన్ = వెడల్పైన ఈటెలతో, సబడి ఆయుధము; ఒంచుచున్ = వంచుచు; చురియలన్ = సురకత్తులతో; మెఱముచు = పొడిచి తిప్పుచు; శూలంబులన్ = శూలములతో; తుఱుముచున్ = తురుముచు; వాజుల్ = గుఱ్ఱముల; కున్ = కు; ఉఱికియున్ = ఉరుకుచు; వాలంబులన్ = కత్తులతో; నఱకియున్ = నరకుచు; తొడలున్ = తొడలను; తుండించియున్ = ఖండించి; తొండంబులున్ = తొండములను; ఖండించియున్ = ఖండించి; మెడలున్ = కంఠములను; ఎడయించియిన్ = విరిచేసి; మెదళ్ళు = మెదళ్ళను; గెడయించియున్ = కెలికుచు; నడుములున్ = నడుములను; త్రుంచియున్ = విరగొట్టి; నాసికలు = ముక్కులను; త్రెంచియున్ = కోసి; పదంబులన్ = కాళ్ళను; విఱిచియున్ = విరిచేసి; పార్శంబులన్ = పక్కలను; చఱచియున్ = చరచి; గజంబులన్ = ఏనుగులను; పఱపియున్ = పారదోలి; గాత్రంబులన్ = ఏనుగు కాలి ముందరి పిక్కలను; మఱపియున్ = మడిచేసి, మాటుపరచి; కుంభంబులన్ = ఏనుగు కుంభస్థలములను; పగిలించియున్ = పగులగొట్టి; కొమ్ములన్ = ఏనుగు దంతములను; పెకలించియున్ = పీకివేసి; హస్తంబులన్ = తొండములను; తుండించియున్ = తునకలుచేసి; అంగంబులన్ = అవయవములను; చించియున్ = చించివేసి; రథంబులన్ = రథములను; చలియించియున్ = కుదిపేసి; రథికులన్ = రథములోని వీరులను; పొలియించియున్ = చంపి; సారథులన్ = రథముల నడపెడివారిని; చంపియున్ = చంపి; సైంధవంబులన్ = గుఱ్ఱములను; చంపియున్ = చంపి; శిరంబున్ = తలలు; ఒగిలించియు = పగులగొట్టి; సీసకంబులున్ = కిరీటములను; అగిలించియున్ = ఊడగొట్టి; ఛత్రంబులన్ = గొడుగులను; ఉఱుమాడియున్ = విరగొట్టి; చామరంబులన్ = చామరములను; తునుమాడియున్ = ముక్కలుచేసి; సైన్యంబులున్ = సైనికుల సమూహములను; చిదిపియున్ = చిదిమేసి; సాహసులన్ = వీరులను; మెదపియున్ = చంపి; నడుములున్ = నడుములను; త్రుంచియున్ = విరిచేసి; మఱియున్ = ఇంకను; పరస్పర = ఒకరి కొకరి; గుణ = విల్లుతాడు, అల్లెతాడు; విచ్ఛేదనంబునన్ = తెంపుటలు; అన్యోన్య = ఒకరి దొకరి; కోదండ = విల్లులను; ఖండన = విరగొట్టెడి; పటుత్వంబునున్ = గట్టిదనములు; ఉభయ = రెండు; సైంధవ = గుఱ్ఱములను; ధ్వజ = జండాకొయ్యలను; సారథి = రథసారథులను; రథిక = రథులను; రథ = రథములను; వికలనంబునున్ = వికలనముచేయుట; ఒండొరులన్ = ఒకరి నొకరు; పాద = కాళ్ళు; జాను = మోకాళ్ళు; జంఘ = పిక్కలు; హస్త = చేతులు; మస్తక = తలలు; నిర్దళనంబునున్ = తెగొట్టుట; రక్త = రక్తము; మాంస = మాంసపు ముద్దల; మేదస్ = మెదళ్ళ ముద్దల; పంక = బురదలతో; సంకలిత = కూడిన; సమరాంగణంబును = యుద్ధభూమి; ఐ = అయ్యి; అతి = మిక్కిలి; ఘోర = ఘోరమైన; భంగిన్ = విధముగ; పెనగిరి = దొమ్మి యుద్ధము చేసిరి; అప్పుడు = అప్పుడు.

భావము:

ఈ విధంగా రణరంగమంతా పొంగి పొరలే ఉత్తుంగ తరంగాల భీషణ ఘోషలతో భయంకరమైన ప్రళయకాల మహాసముద్రం లాగా హోరెత్తుతున్నది. కల్పాంతకాలంలో విజృంభించి వీస్తున్న పెనుగాడ్పులకు కంపించి పోతూ పిడుగులు వర్షించే కారు మేఘాల వలె ఉభయ సైన్యాలు సంకుల సమరం సాగిస్తున్న ఆ దృశ్యం యుగాంత సమయంలో సమస్త ప్రాణులను సంహరించే యమధర్మరాజు క్రీడా విహారం లాగా ఉన్నది. ఆ యుద్ధభూమిలో కాలిబంట్లు, గుఱ్ఱపు రౌతులు, గజారోహకులు, రథికులు, మహారథికులు ఒకరిపై ఒకరు భయంకరంగా బాణాలను ప్రయోగిస్తూ, గదలతో కొట్టుకొంటూ, కత్తులతో కవచాలు చీలిపోయే విధంగా పొడుచుకొంటూ, ఖడ్గాలతో ఒకరినొకరు అణచివేస్తూ, ఈటెలను గ్రుచ్చుతూ, గొడ్డళ్ళతో నరుకుకుంటూ, రోకళ్ళతో బాదుతూ, ఇనుప గుదియలతో మోదుకుంటూ, చక్రాలను విరిచివేస్తూ, కుంతాలతో బాధిస్తూ, చురకత్తులతో నొప్పిస్తూ, శూలాలతో పొడుస్తూ, గుఱ్ఱాలపైకి ఉరికి తోకలు ఖండిస్తూ, ఏనుగుల మీదికి దూకి తొండాలను నరుకుతూ, మెడలు నరికి, మెదళ్ళు నేల రాల్చి, నడుములు విరుగగొట్టి, ముక్కులు కోసి, కాళ్ళు విరుగగొట్టి, ప్రక్కలు చీల్చి, ఏనుగులను పారద్రోలి, వాటి శరీరాలను చీల్చి, కుంభస్థలాలను పగులగొట్టి, దంతాలను పెకలించి, తొండాలను ముక్కలు చేసి, అవయవాలను చించివేసి, రథాలను కుదిపేసి, రథాలమీది వీరులను సారథులను చంపి, గుఱ్ఱాలను చంపి, తలలు పగులగొట్టి, కిరీటాలను ఎగురగొట్టి, గొడుగులను విరగ్గొట్టి, చామరాలను ముక్కలు చేసి, సైన్యాలను చిదిమివేసి, వీరులను చంపి, నడుములు విరుగగొట్టి, ఒకరి అల్లెత్రాడులను ఒకరు త్రెంచివేసి, ధనుస్సులను విరగ్గొట్టి, ఎదుటి పక్షంవారి గుఱ్ఱాలను, జెండాకొయ్యలను, సారథులను, రథులను, రథాలను ఛిన్నాభిన్నం చేసి, పరస్పరం కాళ్ళు, మోకాళ్ళు, పిక్కలు, చేతులు, తలలు తెగగొడుతూ, రక్తమాంసాల మెదళ్ళ బురదతో కూడిన యుద్ధభూమిలో భయంకరమైన యుద్ధాన్ని చేశారు. అప్పుడు...