పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-363-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు రుద్రగణంబులు, మరుద్గణంబులు, నాదిత్యగణంబులు, నశ్వినీదేవతలుఁ, బితృదేవతలు, విశ్వేదేవులు, వహ్ని, యమ, నైరృతి, వరుణ వాయు, కుబే, రేశా నాదులు, సిద్ధ, సాధ్య, కిన్నర, కింపురుష, గరుడ, గంధర్వ, ఖేచరప్రముఖంబు లగు నింద్ర సైన్యంబులతోడ నముచియు, శంబరుండును, ననుర్వుండును, ద్విమూర్ధండును, వృషభుండును, నంబరుండును, హయగ్రీవుండును, శంకుశిరుండును, విప్రచిత్తియు, నయోముఖుండును, బులోముండును, వృషపర్వుండును, హేతియుఁ, బ్రహేతియు, నుత్కటుండును, ధూమ్రకేశుండును, విరూపాక్షుండును, గపిలుండును, విభావసుండును, నిల్వలుండును, బల్వలుండును, దందశూకుండును, వృషధ్వజుండును, గాలనాభుండును, మహానాభుండును, భూతసంతాపనుండును, వృకుండును, సుమాలియు, మాలియు మున్నగు దైతేయ దానవ యక్ష రాక్షసాద్యసంఖ్యంబు లగు వృత్రాసురు బలంబు లంతం దలపడి, సమరంబు చేసి; రప్పుడు.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; రుద్రగణంబులు = రుద్రగణములు; మరుద్గణంబులు = మరుత్తులగణములు; ఆదిత్యగణంబులు = ఆదిత్యగణములు; అశ్వనీదేవతలు = అశ్వనీదేవతలు; పితృదేవతలు = పితృదేవతలు; విశ్వేదేవులు = విశ్వేదేవులు; వహ్ని = అగ్ని; యమ = యముడు; నైరృతి = నైరృతి; వరుణ = వరుణుడు; వాయు = వాయువు; కుబేర = కుబేరుడు; ఈశాన = ఈశానుడు; ఆదులు = మొదలగువారు; సిద్ధ = సిద్ధులు; సాధ్య = సాధ్యులు; కిన్నర = కిన్నరులు; కింపురుష = కింపురుషులు; గరుడ = గరుడులు; గంధర్వ = గంధర్వులు; ఖేచర = ఖేచరులు; ప్రముఖంబులగు = మొదలగు; ఇంద్ర = ఇంద్రుని; సైన్యంబు = సైన్యము; తోడన్ = తోటి; నముచియు = నముచి; శంబరుండును = శంబరుడు; అనుర్వుండును = అనుర్వుడు; ద్విమూర్థుండును = ద్విమూర్థుడు; వృషభుండును = వృషభుడు; అంబరుండును = అంబరుడు; హయగ్రీవుండును = హయగ్రీవుడు; శంకుశిరుండును = శంకుశిరుడు; విప్రచిత్తియున్ = విప్రచిత్తి; అయోముఖుండును = అయోముఖుడు; పులోముండును = పులోముడు; వృషపర్వుండును = వృషపర్వుడు; హేతియున్ = హేతి; ప్రహేతియును = ప్రహేతి; ఉత్కటుండును = ఉత్కటుడు; ధూమ్రకేశుండును = ధూమ్రకేశుడు; విరూపాక్షుండును = విరూపాక్షుడు; కపిలుండును = కపిలుడు; విభావసుండును = విభావసువు; ఇల్వలుండు = ఇల్వలుడు; బల్వలుండును = బల్వలుడు; దందశూకుండును = దందశూకుడు; వృషధ్వజుండును = వృషధ్వజుడు; కాలనాభుండును = కాలనాభుడు; మహానాభుండును = మహానాభుడు; భూతసంతాపనుండును = భూతసంతాపనుడు; వృకుండును = వృకుడు; సుమాలియున్ = సుమాలి; మాలియున్ = మాలి; మున్నగు = మొదలగు; దైతేయ = దైత్యులు; దానవ = దానవులు; యక్ష = యక్షులు; రాక్షస = రాక్షసులు; ఆది = మొదలగు; అసంఖ్యంబులు = సంఖ్యాతీతములు; అగు = అయిన; వృత్రాసురు = వృత్రాసురుని; బలంబులన్ = సైన్యములను; తలపడి = ఎదుర్కొని; సమరంబు = యుద్ధము; చేసిరి = చేసిరి; అప్పుడు = అప్పుడు.

భావము:

ఈ విధంగా రుద్రగణాలు, మరుద్గణాలు, ఆదిత్యగణాలు, అశ్వినీదేవతలు, పితృదేవతలు, విశ్వేదేవుళ్ళు, అగ్ని, యముడు, నైరృతి, వరుణుడు, వాయుదేవుడు, కుబేరుడు, ఈశానుడు, సిద్ధులు, సాధ్యులు, కిన్నరులు, కింపురుషులు, గరుడులు, గంధర్వులు, ఖేచరులు మొదలైన వారున్న ఇంద్రుని సైన్యంతో నముచి, శంబరుడు, అనర్వుడు, ద్విమూర్ధుడు, హేతి, ప్రహేతి, ఉత్కటుడు, ధూమ్రకేశుడు, విరూపాక్షుడు, కపిలుడు, విభావసుడు, ఇల్వలుడు, పల్వలుడు, దందశూకుడు, వృషధ్వజుడు, కాలనాభుడు, మహానాభుడు, భూతసంతాపనుడు, వృకుడు, సుమాలి, మాలి మొదలైన దైత్య దానవ యక్ష రాక్షసులు అసంఖ్యాకంగా ఉన్న వృత్రాసురుని సైన్యం కలియబడి సంగ్రామం చేశారు. అప్పుడు...