పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-343-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నమస్తే భగవన్నారాయణ! వాసుదేవ! యాదిపురుష! మహానుభావ! పరమమంగళ! పరమకళ్యాణ! దేవ! పరమకారుణికు లయిన పరమహంస లగు పరివ్రాజకులచేత నాచరితంబు లగు పరమసమాధి భేదంబులఁ బరిస్ఫుటం బయిన పరమహంస ధర్మంబుచేత నుద్ఘాటితం బగు తమః కవాటద్వారంబున రసావృతంబయిన యాత్మలోకంబున నుపలబ్ధమాత్రుండవై, నిజ సుఖానుభవుండ వై యున్న నీ వాత్మ సమవేతంబు లై యపేక్షింపఁ బడని శరీరంబులకు నుత్పత్తి స్థితి లయ కారణుండ వై యుండుదువు; గుణసర్గ భావితుండవై యపరిమిత గుణగణంబులుగల నీవు, దేవదత్తుని మాడ్కిఁ బారతంత్ర్యంబున నబ్బిన కుశల ఫలంబుల ననుభవించి చింతింతువు; షడ్గుణైశ్వర్యసంపన్నుండవైన నీ వాత్మారాముండ వయి యుండుదువు; గుణసర్గ భావితుండవయి యపరిమిత గుణగణంబు లర్వాచీన వితర్క విచార ప్రమాణభావంబులగు తర్కశాస్త్రంబులఁ గర్కశంబు లయిన ప్రజ్ఞలు గలిగి, దురవగ్రహవాదు లయిన విద్వాంసుల వివాదానుసరణంబుల యందు నుపరతంబులగు నస్తినాస్తీత్యాది వాక్యంబుల సమస్త మాయామయుండ వై నిజ మాయచేతఁ గానంబడక యుక్తిగోచరుండవై, సమస్త విషమ రూపంబులఁ బ్రవర్తింతువు; దేవా! రజ్జువు నందు సర్పభ్రాంతి గలుగునట్లు ద్రవ్యాంతరంబులచేత బ్రహ్మం బయిన నీ యందుఁ బ్రపంచ భ్రాంతి గలుగుచుండు సర్వేశ్వరా! సర్వజగత్కారణరూపం బైన నీవు సర్వభూత ప్రత్యగాత్మ వగుటంజేసి సర్వగుణాభావభాసోపలక్షితుడవై కానంబడుదువు, లోకేశ్వరా! భవన్మహిమ మహామృతసముద్ర విప్రుట్సకృత్పాన మాత్రంబున సంతుష్టచిత్తులై, నిరంతర సుఖంబున విస్పారిత దృష్ట శ్రుత విషయ సుఖ లేశాభాసులైన పరమభాగవతులు భవచ్చరణకమల సేవాధర్మంబు విడువరు; త్రిభువనాత్మభవ! త్రివిక్రమ! త్రినయన! త్రిలోక మనోహరానుభావ! భవదీయ వైభవ విభూతి భేదంబు లైన దనుజాదులకు ననుపమక్రమ సమయం బెఱింగి, నిజమాయాబలంబున సుర నర మృగ జలచరాది రూపంబులు ధరియించి, తదీయావతారంబుల ననురూపంబైన విధంబున శిక్షింతువు; భక్తవత్సలా! భవన్ముఖ కమల నిర్గత మధుర వచనామృత కళావిశేషంబుల, నిజ దాసులమైన మా హృదయతాపం బడంగింపుము; జగదుత్పత్తి స్థితి లయకారణ ప్రధాన దివ్య మాయా వినోదవర్తివై సర్వజీవనికాయంబులకు బాహ్యభ్యంతరంబుల యందు బ్రహ్మ ప్రత్యగాత్మ స్వరూప ప్రధానరూపంబుల దేశకాల దేహావస్థాన విశేషంబులఁ, దదుపాదాను భవంబులు గలిగి, సర్వప్రత్యయసాక్షివై, సాక్షాత్పరబ్రహ్మస్వరూపుండవై యుండెడి నీకు నేమని విన్నవించువారము? జగదాశ్రయంబై, వివిధ వృజిన సంసార పరిశ్రమోపశమనం బైన భవదీయ దివ్యచరణ శతపలాశచ్ఛాయ నాశ్రయించెద;" మని పెక్కువిధంబుల వినుతించి యిట్లనిరి.

టీకా:

నమస్తే = నమస్కారము; భగవన్నారాయణ = హరి {భగవన్నారాయణుడు - భగవంతుడు అయిన నారాయణుడు, భగవాన్ వ్యు. భగము, అనగా సంపూర్ణమైన 1 ఐశ్వర్యము 2 ధర్మము 3 యశస్సు 4 లక్ష్మి 5 జ్ఞానము 6 వైరాగ్యములు ఆరు, రూపమగు వాడు కనుక భగవాన్ / భగవంతుడు అని విష్ణుసహస్రనామ శ్రీశంకర భాష్యం నిర్వచనం, విష్ణువు}; వాసుదేవ = హరి {వాసుదేవుడు - సర్వాత్మ లందు వసించెడి దేవుడు, విష్ణువు}; ఆదిపురుష = హరి {ఆది పురుషుడు - సృష్టి ఆది (మూలము) యైన పురుషుడు}; మహానుభావ = హరి {మహానుభావుడు - గొప్పవాడు, విష్ణువు}; పరమమంగళ = హరి {పరమ మంగళుడు - పరమ (అత్యుత్తమమైన) మంగళుడు (శుభకరుడు), విష్ణువు}; పరమకళ్యాణ = హరి {పరమ కళ్యాణుడు - పరమ (అత్యున్నతమైన) కళ్యాణుడు (శ్రేయస్సు కలిగించువాడు), విష్ణువు}; దేవ = హరి; పరమ = అత్యధికమైన; కారుణికులు = కరుణ గలవారు; అయిన = అయిన; పరమహంసలు = పరమోత్తమ సాధులు; అగు = అయిన; పరివ్రాజకుల్ = సన్యాసులు; చేతన్ = చేత; ఆచరితంబులు = చేయబడినవి; అగు = అయిన; పరమ = అత్యుత్కృష్టమైన; సమాధి = సమాధుల యందలి; భేదంబులన్ = రకములను; పరిస్ఫుటంబు = మిక్కిలి ప్రసిద్ధమైనది; అయిన = అయిన; పరమహంస = పరమహంసల యొక్క; ధర్మంబు = ధర్మముల; చేతను = వలను; ఉద్ఘాటితంబు = గట్టిగా చెప్పబడెడిది; అగు = అయిన; తమస్ = తమోరూపమైన; కవాట = గుమ్మము; ద్వారంబునన్ = వలన; అపావృతంబు = ముసుగు తొలగింపబడినది; అయిన = ఐన; ఆత్మ = తన; లోకంబునన్ = సంపూర్ణ రూపమును; ఉపలబ్ధమాత్రుండవు = పొందినవాడవు; ఐ = అయ్యి; నిజ = సత్యమైన; సుఖ = సుఖము; అనుభవుండవు = అనుభవము పొందిన వాడవు; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; నీవు = నీవు; ఆత్మ = ఆత్మతో; సమవేతంబులు = కూడి యున్నవి; ఐ = అయ్యి; అపేక్షింపబడని = కోరకపోయినను; శరీరంబుల్ = దేహధారుల; కున్ = కు; ఉత్పత్తి = సృష్టి; స్థితి = స్థితి; లయ = లయములకు; కారణుండవు = కారణమైన వాడవు; ఐ = అయ్యి; ఉండుదువు = ఉండెదవు; గుణ = గుణముల; సర్గ = జననముతో; భావితుండవు = భావింపబడెడి వాడవు; ఐ = అయ్యి; అపరిమిత = అంతులేని; గుణ = గుణముల; గణంబులు = సమూహములు; కల = కలిగిన; నీవు = నీవు; దేవదత్తుని = దేవతలకు దత్తమైనవాని; మాడ్కి = వలె; పారతంత్ర్యంబునన్ = ఇతరులపై ఆధారపడుట వలన; అబ్బిన = కలిగిన; కుశల = శ్రేయో; ఫలంబులన్ = ప్రయోజనములను; అనుభవించి = అనుభవించి; చింతింతువు = బాధపడెదవు; షడ్గుణ = ఆరుగుణములు {షడ్గుణములు - 1ఐశ్వర్యము 2వీర్యము 3యశము 4శ్రీ 5జ్ఞానము 6వైరాగ్యము}; ఐశ్వర్య = అష్ఠైశ్వర్యముల {అష్టైశ్వర్యములు - 1అణిమ 2మహిమ 3గరిమ 4లఘిమ 5ప్రాప్తి 6ప్రాకామ్యము 7ఈశత్వము 8వశత్వము}; సంపన్నుండవు = సమృద్ధిగా గలవాడవు; ఐన = అయిన; నీవు = నీవు; ఆత్మా = ఆత్మ యందు; ఆరాముండవు = ఆనందించెడివావు; అయి = అయ్యి; ఉండుదువు = ఉండెదవు; గుణ = గుణముల; సర్గ = స్వభావములచే; భావితుండవు = భావింపబడెడివాడవు; అయి = అయ్యి; అపరిమిత = అంతులేని; గుణ = గుణముల; గణంబులన్ = సమూహములచే; ఆర్వాచీన = తరువాత పుట్టిన వైన; వితర్క = విపరీతమైన తర్కముతో; విచార = చర్చించెడి; ప్రమాణ = ప్రమాణములచే; అభావంబులు = సరికాని ఆలోచనలు; అగు = అయిన; తర్కశాస్త్రంబులన్ = తర్కశాస్త్ర నియమములచే; కర్కశంబులు = కరుకైనవి; అయిన = అయినట్టి; ప్రజ్ఞలు = సామర్థ్యములు; కలిగి = కలిగి; దురవగ్రహవాదులు = తప్పుడు అవగాహనతో వాదించువారు; అయిన = అయిన; విద్వాంసులు = పండితులు; వివాద = సందగ్ధతలు; అనుసరణంబుల = అనుసరించు వాని; అందు = అందు; ఉపరతంబులు = ఉడిగినవి; అగు = అయిన; అస్తి = ఉన్నది; నాస్తి = లేనిది; ఇత్యాది = మొదలగు; వాక్యంబులన్ = వాదనలతో; సమస్త = అఖిలమైన; మాయా = మాయతో; మయుండవు = కూడినవాడవు; ఐ = అయ్యి; నిజ = తన; మాయ = మాయ; చేతన్ = వలన; కానంబడక = కనిపించకుండగ; యుక్తి = యోగ ప్రయుక్తము నందలి నేర్పునకు; గోచరుండవు = తెలియబడువాడవు; ఐ = అయ్యి; సమస్త = సమ; విషమ = విషమ; రూపంబులన్ = రూపములలో; ప్రవర్తింతువు = వర్తిల్లుచుందువు; దేవా = భగవంతుడా; రజ్జువు = తాడు; అందు = అందు; సర్ప = పాము యనెడి; భ్రాంతి = భ్రాంతి; కలుగున్ = కలిగెడి; అట్లు = విధముగ; ద్రవ్యాంతరంబుల = ఇతరవస్తువుల; చేత = వలన; బ్రహ్మంబు = పరబ్రహ్మము; అయిన = అయినట్టి; నీ = నీ; అందు = అందు; ప్రపంచ = ప్రపంచము యనెడి; భ్రాంతి = భ్రాంతి; కలుగుచుండు = కలుగుతుండును; సర్వేశ్వరా = హరి; సర్వ = అఖిల; జగత్ = లోకములకు; కారణరూపంబు = కారణభూతుడవు; ఐన = అయిన; నీవు = నీవు; సర్వ = సమస్తమైన; భూత = ప్రాణులకు; ప్రత్యగాత్మవు = ప్రత్యగాత్మవు {ప్రత్యగాత్మ - ప్రత్యక్ (ప్రత్యక్షముగ) ఆత్మవు (ఆత్మ)}; అగుటన్ = అగుట; చేసి = వలన; సర్వ = సమస్తమైన; గుణ = గుణముల; అభావ = లేకపోవుట; అభాస = లేనిది ఉన్నట్లు కనబడుట; ఉపలక్షితుడవు = ఆరోపింపబడినవాడవు; ఐ = అయ్యి; కానంబడుదువు = తెలియబడెదవు; లోకేశ్వరా = హరి; భవత్ = నీ యొక్క; మహిమ = మహత్మ్యము యనెడి; మహా = గొప్ప; అమృత = అమృతపు; సముద్ర = సముద్రము యొక్క; విప్రుట్ = తుంపరలను; సకృత్ = ఏదో నొకమారు; పాన = తాగిన; మాత్రంబునన్ = మాత్రముచేతనే; సంతుష్ట = సంతృప్తిచెందిన; చిత్తులు = మనసులు గలవారు; ఐ = అయ్యి; నిరంతర = ఎడతెగని; సుఖంబునన్ = సుఖముతో; విస్మారిత = మరచిన; దృష్ట = చూసినవి; శ్రుత = విన్నవి; విషయ = ఇంద్రియార్థముల వలని; సుఖ = సౌఖ్యపు; లేశ = పిసర్లు; అభాసులు = అభాసములు గలవారు; ఐన = అయిన; పరమ = అత్యుత్తమ; భాగవతులు = భగవద్భక్తులు; భవత్ = నీ యొక్క; చరణ = పాదములు యనెడి; కమల = పద్మములను; సేవా = పూజించెడి; ధర్మంబున్ = విధానమును; విడువరు = వదలరు; త్రిభువనాత్మభవ = హరి {త్రిభువనాత్మభవుడు - త్రిభువన (ముల్లోకములును) ఆత్మన్ (తానే అయ్యి) భవ (దివ్యమైనవాడు), విష్ణువు}; త్రివిక్రమ = హరి {త్రివిక్రముడు - త్రివిక్రమ రూపము దరించిన వామనావతారుడు, విష్ణువు}; త్రినయన = హరి {త్రినయనుడు - శివస్వరూపుడు, విష్ణువు}; త్రిలోకమనోహరానుభావ = హరి {త్రిలోక మనోహరానుభావుడు - తిలోక (ముల్లోకములకు) మనోహరమైన అనుభవముల యిచ్చువాడు, విష్ణువు}; భవదీయ = నీ యొక్క; వైభవ = వైభవముల; విభూతి = ఐశ్వర్యముల; భేదంబులు = రూపములు; ఐన = అయిన; దనుజ = రాక్షసులు; ఆదుల్ = మొదలగువారి; కున్ = కి; అనుపమక్రమ = విరామము చెందెడి; సమయంబు = కాలమును; ఎఱింగి = తెలిసి; నిజ = తన; మాయా = మాయ యొక్క; బలంబునన్ = సామర్థ్యముతో; సుర = దేవతలు; నర = మానవులు; మృగ = జంతువులు; జలచర = జలచరములు; ఆది = మొదలైన; రూపంబులున్ = స్వరూపములను; ధరియించి = ధరించి; తదీయ = అతని యొక్క; అవతారంబులన్ = అవతారములలో; అనురూపంబు = అనుకూలము; ఐన = అయిన; విధంబునన్ = విధముగ; శిక్షింతువు = శిక్షించెదవు; భక్తవత్సలా = హరి {భక్త వత్సలుడు - భక్తుల యెడ వాత్సల్యముగలవాడు, విష్ణువు}; భవత్ = నీ యొక్క; ముఖ = ముఖము యనెడి; కమల = పద్మములనుండి; నిర్గత = వెలువడు; మధుర = తీయని; వచన = మాటలు యనెడి; అమృత = అమృతము యొక్క; కళా = కళల; విశేషంబులన్ = విశిష్ఠతలచే; నిజ = సత్యమైన; దాసులము = భక్తులము; ఐన = అయిన; మా = మా యొక్క; హృదయ = హదయములలోని; తాపంబున్ = తాపములను; అడంగింపుము = అణచివేయుము; జగత్ = జగత్తునకు; ఉత్పత్తి = సృష్టి; స్థితి = స్థితి; లయ = లయములకు; కారణ = కారణమును; ప్రధాన = ప్రధానము యనెడి; దివ్య = దివ్యమైన; మాయా = మాయ లందు; వినోదవర్తి = క్రీడించెడివాడవు; ఐ = అయ్యి; సర్వ = అఖిలమైన; జీవ = ప్రాణుల; నికాయంబుల్ = సమూహముల; కున్ = కు; బాహ్య = వెలుపలను; అభ్యంతరంబుల = లోపలలను; అందున్ = అందును; బ్రహ్మ = పరబ్రహ్మము; ప్రత్యగాత్మ = ప్రత్యగాత్మ; స్వరూప = స్వరూపముల; ప్రధాన = ముఖ్య; రూపంబులన్ = రూపములలో; దేశ = ప్రదేశము; కాల = కాలము; దేహ = శరీరము; అవస్థాన = అవస్థల; విశేషంబులన్ = విశిష్ఠతలచే; తత్ = వానికి; ఉపాదాన = కారణభూతములు; అనుభవంబులు = అనుభవములు; కలిగి = కలిగినట్టి; సర్వ = సమస్తమైన; ప్రత్యయ = ప్రత్యయములకు {ప్రత్యయములు - అనుభవమునకు వచ్చునవి}; సాక్షివి = సాక్షీభూతుడవు; ఐ = అయ్యి; సాక్షాత్ = స్వయముగ; పరబ్రహ్మ = పరబ్రహ్మము యొక్క; స్వరూపుండవు = తన యొక్క రూపముగా గలవాడవు; ఐ = అయ్యి; ఉండెడి = ఉండునట్టి; నీ = నీ; కున్ = కు; ఏమి = ఏమి; అని = అని; విన్నవించువారము = మనవిచేసుకొనగల వారము; జగత్ = జగత్తునకు; ఆశ్రయంబున్ = ఆశ్రయము యిచ్చునది; ఐ = అయ్యి; వివిధ = అనేక రకముల; వృజిన = క్లేశములుగల; సంసార = సంసారము యనెడి; పరిశ్రమ = బాధలనుండి; ఉపశమనంబున్ = శాంతి కలిగించెడిది; ఐన = అయిన; భవదీయ = నీ యొక్క; దివ్య = దివ్యమైన; చరణ = పాదములు యనెడి; శతపలాశ = కమలముల; ఛాయన్ = నీడను; ఆశ్రయించెదము = అండ చేకొనెదము; అని = అని; పెక్కు = అనేక; విధంబులన్ = రకములుగా; వినుతించి = స్తుతించి; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.

భావము:

భగవంతుడవైనా నారాయణా! వాసుదేవా! ఆదిపురుషా! మహానుభావా! సర్వ మంగళ స్వరూపా! కళ్యాణ మూర్తీ! దేవా! నీకు నమస్కారం. దయా పరిపూర్ణులు, పరమహంసలు అయిన పరివ్రాజకులు సమాధి యోగాన్ని అనుష్ఠించినవారై చిత్తైకాగ్రతను సాధిస్తారు. అప్పుడు పరిశుద్ధమైన అంతఃకరణంలో పారమహంస్య ధర్మం ఆవిర్భవిస్తుంది. మనస్సులోని తమోరూపమైన తలుపు తెరుచుకుంటుంది. ఆత్మలోకం ప్రకాశితమౌతుంది. ఆ సమయంలో కలిగే ఆత్మసుఖ స్వరూపమైన ఆనందానుభూతి ఏదైతే ఉన్నదో అదే నీవు. నిర్గుణుడవు, బ్రహ్మస్వరూపుడవు అయినప్పటికీ నీవు అనంతమైన గుణగణాలతో కూడి దేవదత్తుని వలె కాలకర్మాదులకు అధీనుడవై స్వయంకృతాలైన శుభాశుభాలను అనుభవిస్తావు. షడ్గుణైశ్వర్య సంపన్నుడవైన నీవు ఆత్మారాముడవై కూడా అపరిమిత గుణగణాలకు ఆశ్రయమై ఉన్నావు. ఈశ్వరుడవైన నీ మాహాత్మ్యం ఇతరులకు అనూహ్యం, అనవగాహ్యం. ఆధునికాలైన వికల్పం, వితర్కం, విచారం మొదలైన ప్రమాణాభాసాలతో కూడి జటిలమైన కుతర్కాలలో పడి కర్కశబుద్ధులైన విద్వాంసులు వ్యర్థమైన శాస్త్రవాదాలలో క్రిందు మీదు లౌతుంటారు. దేవుడున్నాడు, లేడు అనే తెలిసి తెలియని వాదోపవాదాలతో కీచులాడుకుంటారు. మాయామయుడవైన నీవు నిజమాయా ప్రభావం వల్ల వారికి కనిపించవు. అంతర్యామివైన నీవు సమ విషమ రూపాలతో ప్రవర్తిస్తూ యుక్తిమాత్ర గోచరుడవు అవుతున్నావు. దేవా! త్రాడును చూచి పామను భ్రాంతి కలిగినట్లు అంతర్యామివైన నీయందు అన్యవస్తు భ్రాంతి కలుగుతున్నది. సర్వేశ్వరా! సమస్త విశ్వానికి కారణమైన నీవు సర్వభూతాలలో అంతర్యామిగా ఉన్నందువల్ల సకల గుణగణాలతో ప్రకాశిస్తున్నట్లు కనిపిస్తావు. జగదీశ్వరా! నీ మహిమ అపారమైన అమృత సముద్రం వంటిది. ఆ అమృతసాగరంలోని ఒక చిన్న బిందువును రుచి చూచిన భాగవతోత్తములు సంతుష్టాంతరంగులై అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తారు. ఆ పరమ భాగవతులు ఆ ఆనందంతో పరవశించి చూచినవాటి వల్ల విన్నవాటి వల్ల కలిగే సుఖలేశాన్ని విస్మరిస్తారు. వారు నీ చరణ కమల సేవా వ్రతాన్ని వదలిపెట్టరు. నీవు ముల్లోకాలలో నిండి ఉన్నావు. ముల్లోకాలను ఆక్రమించిన త్రివిక్రముడవు. ముల్లోకాలను దర్శించే త్రిలోచనుడవు. ముల్లోకాల ఆత్మలను ఆకర్షించే మహా మహిమాన్వితుడవు. నీ విభూతి భేదాలైన దానవులు మొదలైన వారికి అంత్యకాలం ఆసన్నం అయిందని తెలుసుకొని నీ మాయా ప్రభావం వల్ల వామనాది దేవతా రూపాలను, రామకృష్ణాది మానవ రూపాలను, వరాహాది మృగరూపాలను, మత్స్యకూర్మాది జలచర రూపాలను ధరించి తగిన విధంగా శిక్షిస్తూ ఉంటావు. భక్తవత్సలా! నీ ముఖ కమలం నుండి వెలువడిన వాక్కులనే అమృతతరంగాలతో మా అంతరంగాల్లోని సంతాపాన్ని చల్లార్చు. ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలకు కారణభూతమైన మూలప్రకృతి మాయ నీకు వశవర్తిని అయి ఉంటుంది. ఈ సృష్టిలోని సమస్త ప్రాణికోటికి లోపల బయట ప్రత్యగాత్మగా, పరమాత్మగా నీవు వర్తిస్తూ ఉంటావు. దేశం కాలం దేహం మొదలైన వాని స్థితిగతులకు, అనుభవాలకు, సర్వవిషయాలకు సాక్షివై సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడవైన నీకు మా గోడు ఏమని విన్నవించుకోగలం? సమస్త విశ్వానికి ఆశ్రయమై, నానావిధ పాపాలను, సంసార తాపాలను ఉపశమింప జేసే నీ పవిత్ర పాదపద్మాల నీడను ఆశ్రయిస్తున్నాము” అని ఎన్నో విధాలుగా వినుతించి ఇలా అన్నారు.