పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-337-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చిక్కిరి దేవతావరులు చిందఱ వందఱలైరి ఖేచరుల్;
స్రుక్కిరి సాధ్యసంఘములు; సోలిరి పన్నగు లాజి భూమిలో;
మ్రక్కిరి దివ్యకోటి; గడు మ్రగ్గిరి యక్షులు వృత్రుచేత నీ
చిక్కినవారి నైన దయచేయుము నొవ్వకయండ నో! హరీ!

టీకా:

చిక్కిరి = తగ్గిపోయినారు; దేవతా = దేవతలు యనెడి; వరులు = ఉత్తములు; చిందఱవందఱలు = చెల్లాచెదురులు; ఐరి = అయినారు; ఖేచరుల్ = ఆకాశ విహారులు; స్రుక్కిరి = కుంగిపోయినారు; సాధ్య = సాధ్యుల; సంఘములు = సమూహములు; సోలిరి = మూర్చిల్లినారు; పన్నగులు = సర్పములు; ఆజి = యుద్ధ; భూమి = భూమి; లోన్ = అందు; మ్రక్కిరి = అవిసిపోయిరి; దివ్య = దేవతల; కోటి = పెద్దసమూహము; కడు = మిక్కిలి; మ్రగ్గిరి = విహ్వలులైనారు; యక్షులు = యక్షులు; వృత్రు = వృత్రుని; చేతన్ = చేతిలో; ఈ = ఈ; చిక్కిన = మిగిలిన; వారిన్ = వారిని; ఐనన్ = అయినా; దయచేయుము = కృపచూడుము; నొవ్వక = బాధలు పొందక; ఉండన్ = ఉండునట్లు; ఓ = ఓ; హరీ = విష్ణుమూర్తి.

భావము:

శ్రీహరీ! ఆ వృత్రాసురుని వలన దేవతలు కృశించారు. కిన్నరులు చిందర వందర అయ్యారు. సాధ్యులు అలసిపోయారు. యుద్ధభూమిలో నాగులు సొమ్మసిల్లారు. సిద్ధులు వెలవెల బోయారు. యక్షులు విహ్వలులైనారు. ప్రాణాలతో బయట పడిన మమ్ములనైనా వాని బాధనుండి దయతో కాపాడు.