పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-326-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు భయార్తులై యమర్త్యవ్రాతంబు చనిచని ముందట నభంగ భంగ రంగ దుత్తుంగ డిండీర మండల సముద్దండాడంబర విడంబిత నారాయణ నిరంతర కీర్తిలతా కుసుమగుచ్ఛ స్వచ్ఛంబును, అనవరత గోవింద చరణారవింద సేవా సమాకుల కలకలఫలిత మహాపుణ్య ఫలాయమాన సముద్దీపితావర్తవర్తిత దక్షిణావర్త రుచిర శంఖమండల మండితంబును, నతినిష్ఠుర కఠిన పాఠీన పృథురోమ రాజిసంకుల తిమి తిమింగిల కర్కట కమఠ కచ్ఛప మకర నక్ర వక్రగ్రహ గ్రహణ ఘుమఘుమారావ దారుణగమన విషమిత విషమ తరంగఘట్టన ఘట్టిత సముద్ధూత శీకర నికర నీరంధ్ర తారకిత తారాపథంబును, మహోచ్ఛ్రయ శిలోచ్చయ శిఖరాగ్ర ప్రవహిత దుగ్ధనిర్ఝర సమ్మార్జిత పురాణపురుష విశుద్ధ శుద్ధాంత విహరణధురీణ నవవసుధాధౌత ధావళ్య ధగద్ధగాయమాన రమ్య హర్మ్య నిర్మాణ కర్మంబును, నతి పవిత్రగుణ విచిత్ర నిజకళత్ర ప్రేమానంద సందర్శిత ముకుంద పరిస్రవదంతరంగ కరుణారస పరిమిళిత భావబంధుర విద్రుమ వల్లీమతల్లి కాంకుర శోభితంబును, ప్రసిద్ధ సిద్ధరసాంబువాహ సంగమ సముత్థిత గంభీర ఘోష పరిదూషిత సకల రోదోంతరాళంబును, సముద్రమేఖలాఖిల ప్రదేశ విలసిత నవీన దుకూలాయమానంబును, హరిహర ప్రముఖ దేవతానిచయ పరిలబ్ధామృత మహైశ్వర్య దానధౌరేయ మహానిధానంబును, వైకుంఠపుర పౌరవర కామ్యఫలఫలిత మందార పారిజాత సంతాన కల్పవృక్ష హరిచందన ఘన వనానుకూలంబు నునై యొప్పుచుఁ గుబేరు భాండాగారంబును బోలెఁ బద్మ, మహా పద్మ, శంఖ, మకర, కచ్చప, ముకుంద, కుంద, నీల, వర సమగ్రంబై, విష్ణు కరకమలంబునుం బోలె సుదర్శనావర్త ప్రగల్భంబై, కైలాస మహీధరంబునుం బోలె, నమృతకళాస్థాన శేఖరపదార్పణంబై, యింద్ర వైభవంబునుం బోలెఁ గల్పవృక్ష, కామధేను, చింతామణి జనితంబై, సుగ్రీవసైన్యంబునుం బోలె నపరిమిత నిబిడ హరిసంచారంబై, నారా యణోదరంబునుం బోలె నఖిల భువన భారభరణ సమర్థంబై, శంకరు జటాజూటంబును బోలె గంగాతరంగిణీ సమాశ్రయం బై, బ్రహ్మలోకంబునుం బోలె బరమహంసకుల సేవ్యంబై, పాతాళ లోకంబునుం బోలె ననంత భోగి భోగయోగ్యంబై, నందనవనంబునుం బోలె నైరావత మాధవీ రంభాది సంజననకారణంబై, సౌదామినీ నికరంబునుం బోలె నభ్రంకషంబై, విష్ణునామకీర్తనంబునుం బోలె నిర్మలస్వభావంబై, క్రతు శతగతుండునుం బోలె హరిపదభాజనంబై యొప్పుచున్న దుగ్థవారాశి డాసి, శ్వేతద్వీపంబున వసియించి, యందు సకల దిక్పాలకాది దేవతలు దేవదేవు నాశ్రయించి యిట్లని స్తుతియించి; రంత.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; భయ = భయముచే; ఆర్తులు = బాధపడువారు; ఐ = అయ్యి; అమర్త్య = దేవతా {అమర్త్యులు - మరణములేనివారు, దేవతలు}; వ్రాతంబు = సమూహము; చనిచని = వెళ్లి; ముందటన్ = ఎదురుగ; అభంగ = భంగపాటునొందని; భంగ = అలలతో; రంగత్ = ఒప్పుతున్న; ఉత్తుంగ = ఎత్తైన; డిండీర = నురగల; మండల = ముద్దలతో; సమ = మిక్కిలి; ఉద్దండ = అధికమైన; ఆడంబర = ఆడంబరముతో; విడంబిత = కలగలసిన; నారాయణ = విష్ణుమూర్తి యొక్క; నిరంతర = ఎడతెగని; కీర్తి = యశస్సు యనెడి; లతా = లతల యొక్క; కుసుమ = పూల; గుచ్ఛ = గుత్తుల; స్వచ్ఛంబును = స్వచ్ఛతయును; అనవరత = ఎల్లప్పుడు; గోవింద = విష్ణుమూర్తి యొక్క; చరణ = పాదము లనెడి; అరవింద = పద్మములను; సేవా = సేవించుటల; సమాకుల = చక్కగా కలిగిన; కలకల = కలకలములచే; ఫలిత = ఫలించినట్టి; మహా = గొప్ప; పుణ్య = పుణ్యము; ఫలాయమాన = పరిపక్వతగల; సమ = మిక్కిలి; ఉద్దీపిత = ప్రకాశించుతున్న; ఆవర్త = సుడులు తిరుగుతూ; వర్తిత = ప్రవర్తిల్లుతున్న; దక్షిణావర్త = కుడివైపునకు సుడి తిరిగి; రుచిర = వెలుగొందుతున్న; శంఖ = శంఖముల; మండల = మండలములచే; మండితంబునున్ = ప్రకాశించుతున్నదియు; అతి = మిక్కిలి; నిష్ఠుర = పరుషమైన; కఠిన = గట్టి; పాఠీన = వేయి కోరల చేపల; పృథు = బిరుసైన; రోమ = రోమముల; రాజి = సమూహముతో; సంకుల = వ్యాపించిన; తిమి = పెద్దచేప {తిమి - నూరు యోజనముల పొడవుగల చేప, పెద్దచేప}; తిమింగల = తిమింగలము {తిమింగలము - తిమిని మింగెడు చేప}; కర్కట =పీత, ఎండ్రకాయ; కమఠ = తాబేలు; కచ్ఛప = మెట్టతాబేలు; మకర = మొసలి; నక్ర = పెద్ద మొసలి; వక్రగ్రహ = సెలయేటి మొసళ్ళు; గ్రహణ = పట్టుటలతో; ఘుమఘుమ = ఘుమఘుమ యనెడి; ఆరావ = శబ్దములతో; దారుణ = భయంకరమైన; గమన = గమనములతో; విషమిత = మిక్కిలి చలిస్తున్న; విషమ = ఎత్తైన; తరంగ = అలల; ఘట్టన = తాకిడులచే; ఘట్టిత = కొట్టబడిన; సమ = మిక్కిలి; ఉద్ధూత = చిందుతున్న; శీకర = తుంపరల; నికర = గుంపులచే; నీరంధ్ర = దట్టమైన; తారకిత = తారకలదిగ జేయబడి నట్టి; తారాపథంబును = తారాపథమును; మహా = గొప్ప; ఉచ్ఛ్రయ = ఉన్నతమైన; శిలోచ్చయ = బండరాళ్లమయమైన; శిఖర = కొండశిఖరముల; అగ్ర = పైన; ప్రవహిత = ప్రవహించెడి; దుగ్ధ = పాల; నిర్ఝర = సెలయేర్లచే; సమ = చక్కగా; ఆర్జిత = సేవింపబడుతున్న; పురాణపురుష = నారాయణుని; విశుద్ధ = పరిశుద్ధమైన; శుద్ధాంత = అంతఃపుర; విహరణ = విహరించుటలో; ధురీణ = నేర్పరి; నవ = కొత్తగా; వసుధాధౌత = సున్నము కొట్టబడిన; ధావళ్య = తెల్లదనముతో; ధగధగాయమాన = తళతళలాడి పోతున్న; రమ్య = మనోహరమైన; హర్మ్య = భవనముల; నిర్మాణకర్మంబున = నిర్మించుటవలన; అతి = మిక్కిలి; పవిత్ర = పావన; గుణ = గుణములతో; విచిత్ర = విశిష్టముగ చిత్రింపబడినది; నిజ = తన; కళత్ర = భార్య; ప్రేమానంద = ప్రేమ ఆనందములను; సందర్శిత = చూసిన; ముకుంద = నారాయణుని; పరిస్రవత్ = కరగుతున్న; అంతరంగ = మనసు నందలి; కరుణా = దయా; రస = రసముచే; పరిమళిత = పరిమళిస్తున్న; భావబంధుర = భావములతో నిండిన; విద్రుమ = పగడాల; వల్లీమతల్లిక = లతల యొక్క; అంకుర = మొలకలచే; శోభితంబును = శోభించుతున్నది; ప్రసిద్ధ = ప్రసిద్ధమైన; సిద్దరస = మంచినీటి; అంబువాహ = నదుల; సంగమ = సముద్రసంగమముచే; సమ = ఎక్కువగా; ఉత్థిత = పుట్టిన; గంభీర = గంభీరమైన; ఘోష = సముద్రపు ఘోషచే; పరిదూషిత = తిరస్కరింపబడిన; సకల = సమస్తమైన; రోదస్ = అంతరిక్షము; అంతరాళంబును = లోపలంతయు గలది; సముద్ర = సముద్రము యనెడి; మేఖల = మొలనూలుగాగల; అఖిల = సమస్తమైన; ప్రదేశ = భూప్రదేశముతో; విలసిత = సుందరమైన; నవీన = కొత్త; దుకూలాయమానంబును = పట్టుబట్టల వంటిది; హరి = విష్ణుమూర్తి; హర = పరమశివుడు; ప్రముఖ = మొదలగు; దేవతా = దేవతల; నిచయ = సమూహమునకు; పరిలబ్ధ = చక్కగా లభించిన; అమృత = అమృతము యనెడి; మహా = గొప్ప; ఐశ్వర్య = ఐశ్వర్యమును; దాన = దక్కునట్లు చేసిన; ధౌరేయ = సామర్థ్యము యొక్క; మహా = గొప్ప; నిధానంబును = నిధియును; వైకుంఠపుర = వైకుంఠములో నుండెడి; పౌర = జనుల; వర = ఉత్తముల; కామ్య = కోరిన కోరికలు; ఫల = తీర్చెడి; ఫలిత = ఫలవంతమైన; మందార = మందారము; పారిజాత = పారిజాతము; సంతాన = సంతానము; కల్పవృక్ష = కల్పవృక్షము {కల్పవృక్షములలో రకములు - 1మందారము 2పారిజాతము 3సంతానము 4కల్పవృక్షము 5హరిచందనము}; హరిచందన = మంచి గంధముల; ఘన = గొప్ప; వన = తోటలతో; అనుకూలంబును = అనుకూలముగా నున్నది; ఐ = అయ్యి; ఒప్పుచున్ = ఒప్పుతూ; కుబేరు = కుబేరుని; భాండాగారంబును = ధనాగారము; పోలె = వలె; పద్మ = పద్మము {నవనిధులు - 1పద్మము 2మహాపద్మము 3శంఖము 4మకరము 5కచ్చపము 6ముకుందము 7కుందము 8నీలము 9వరము}; పద్మ = పద్మరాగరత్నములు; మహాపద్మ = మహాపద్మము; మహాపద్మ = పెద్దపద్మ రాగ రత్నములు; శంఖ = శంఖము; శంఖ = శంఖములు; మకర = మకరము; మకర = మొసళ్ళు; కచ్ఛప = కచ్ఛపము; కచ్చప = తాబేళ్ళు; ముకుంద = ముకుందము; ముకుంద = ముకుందరత్నము; కుంద = కుందము; కుంద = కుందరత్నము; నీల = నీలము; నీల = నీలమణులతో; వర = వరములతో; వర = శ్రేష్ఠమై; సమగ్రంబు = సంపూర్ణమైనది; ఐ = అయ్యి; విష్ణు = నారాయణుని; కర = చేతులు యనెడి; కమలంబునున్ = పద్మములను; పోలెన్ = వలె; సుదర్శనా = సుదర్శనచక్రము యొక్క; సుదర్శనా = చక్కగా కనబడెడి; ఆవర్త = సుడి గలిగి వర్తించెడి; ఆవర్త = సుడిగుండములు కలిగి ఉండెడి; ప్రగల్భంబు = ప్రతిభగలది; ఐ = అయ్యి; కైలాస = కైలాసము యనెడి; మహీధరంబునున్ = పర్వతము {మహీధరము - మహి (భూమి)ని ధరము (ధరించెడిది), పర్వతము}; పోలెన్ = వలె; అమృతకళాస్థానశేఖర = పరమశివుని {అమృత కళాస్థాన శేఖరుడు - అమృత (అందమైన) కళా (కళలకు) ఆస్థాన (నివాసమైన చంద్రుని) శేఖరుడు (శిఖ యందు ధరించినవాడు), పరమశివుడు}; పద = పాదములకు; అర్పణంబు = అర్పింపబడినది; ఐ = అయ్యి; ఇంద్ర = ఇంద్రుని; వైభవంబు = వైభవము; పోలెన్ = వలె; కల్పవృక్ష = కల్పవృక్షము {కల్పవృక్షము - కల్ప (భావించిన వానిని యిచ్చెడి) వృక్షము (చెట్టు)}; కామధేను = కామధేనువు {కామధేనువు - కామ (కోరినవి యిచ్చెడి) ధేనువు (ఆవు)}; చింతామణి = చింతామణి {చింతామణి - చింత (చింతించినవానిని యిచ్చెడి) మణి (రత్నము)}; జనితంబు = కలిగినది; ఐ = అయ్యి; సుగ్రీవ = సుగ్రీవుని; సైన్యంబును = సైన్యము; పోలెన్ = వలె; అపరిమిత = లెక్కలేనన్ని; నిబిడ = దట్టమైన; హరి = కోతుల, నారాయణుని; సంచారంబు = సంచరించుటలు గలది; ఐ = అయ్యి; నారాయణ = విష్ణుమూర్తి యొక్క; ఉదరంబునున్ = కడుపును; పోలెన్ = వలె; అఖిల = సమస్తమైన; భువన = లోకములను; భువన = భూమి యొక్క; భార = బరువును; భరణ = భరించగల; సమర్థంబు = ప్రతిభ గలది; ఐ = అయ్యి; శంకరు = పరమశివుని; జటా = జటల; జూటంబునున్ = చుట్టలను; పోలెన్ = వలె; గంగా = గంగానది యొక్క; గంగా = నీటి; తరంగణీ = అలలతో; సమాశ్రయంబు = మిక్కిలి చేరినది; ఐ = అయ్యి; బ్రహ్మ = బ్రహ్మదేవుని; లోకంబునున్ = లోకమును; పోలెన్ = వలె; పరమహంస = పరమహంసల; పరమహంస = శ్రేష్ఠమైన హంసల; కుల = సమూహములచే; కుల = గుంపులచే; సేవ్యంబు = కొలువబడునది; సేవ్యంబు = తాగబడుతున్నది; ఐ = అయ్యి; పాతాళ = పాతాళము యనెడి; లోకంబునున్ = లోకమును; పోలెన్ = వలె; అనంత = ఆదిశేషుడు యనెడి; అనంత = అంతులేని; భోగి = సర్పము యొక్క; భోగి = భోగములను; భోగ = పడగలచే; భోగ = అనుభవించుటకు; యోగ్యంబు = యోగ్యత గలది; యోగ్యంబు = అనుకూలమైనది; ఐ = అయ్యి; నందన = నందనము యనెడి; వనంబునున్ = వనము; పోలెన్ = వలె; ఐరావత = నిమ్మచెట్లు; ఐరావత = ఇంద్రుని ఐరావతము; మాధవీ = మాధవీలతలు; మాధవీ = లక్ష్మీదేవి; రంభ = అరటిచెట్లు; రంభ = అప్సరస రంభ; ఆది = మొదలగువాని; ఆది = మొదలైనవారి; సంజనన = పుట్టుటకు; కారణంబు = కారణము; ఐ = అయ్యి; సౌదామినీ = మెరుపుతీగల; నికరంబు = సమూహముల; పోలెన్ = వలె; అభ్రంకషము = ఆకాశమును అంటునది; అభ్రంకషము = ఆకాశమునంటెడి అలలుగలది; ఐ = అయ్యి; విష్ణు = నారాయణుని; నామ = నామములను; కీర్తనంబునున్ = స్తుతించుటను; పోలెన్ = వలె; నిర్మల = స్వచ్ఛమైన; స్వభావంబున్ = లక్షణము గలది; ఐ = అయ్యి; క్రతు = యజ్ఞములు; శత = నూరింటిని; గతుండునున్ = చేసినవాని; పోలెన్ = వలె; హరి = ఇంద్రుని; హరి = నారాయణుని; పద = పదవికి; పద = పాదములను; భాజనంబు = యోగ్యత గలవాడు; భాజనంబు = నివాసమైనది; ఐ = అయ్యి; ఒప్పుచున్న = చక్కనైన; దుగ్ధవారాశిన్ = పాలసముద్రమును; డాసి = చేరి; శ్వేతద్వీపంబునన్ = శ్వేతద్వీపము నందు; వసియించి = చేరి; అందు = దానిలో; సకల = సమస్తమైన; దిక్పాలక = దిక్పాలకులు; ఆది = మొదలగు; దేవతలు = దేవతలు; దేవదేవున్ = విష్ణుమూర్తిని; ఆశ్రయించి = శరణుకోరి; ఇట్లు = ఈ విధముగ; అని = అని; స్తుతియించిరి = కీర్తించిరి; అంత = అంతట.

భావము:

ఈ విధంగా భయకంపితులైన దేవతలు పోయి పోయి పాలసముద్రం చేరుకున్నారు. ఆ సముద్రమంతటా శ్రీమన్నారాయణుని కీర్తి లతలకు పూచిన తెల్లని పూల గుత్తుల వలె ప్రకాశిస్తున్న నురుగు ముద్దలు, ఎత్తుగా ఎగిరి పడుతున్న తరంగాలపై అంతటా కనిపిస్తున్నవి. నిరంతరం గోవిందుని పాదపద్మాల సేవలో అనురక్తులైన భక్తుల పుణ్యఫలాల వలె సుడులతో తిరుగుతున్న దక్షిణావర్త శంఖాలు విరాజిల్లుతున్నాయి. మిక్కిలి కఠినంగా ఉన్న వేయి కోరలు, పృథురోమాలు కలిగిన తిమి తిమింగిలాలు మొదలైన మహా మత్స్యాలు, పీతలు, తాబేళ్ళు, మొసళ్ళు మొదలైన జలచరాలు గిరిగిరా గుండ్రంగా తిరుగుతున్నాయి. వాటి వక్రగమనం ఏర్పడే సముద్ర తరంగాల పై ఎగిరిపడే పాల తుంపురులు ఆకాశం నిండా నక్షత్రాల వలె మెరుస్తున్నాయి. ఆ సముద్రంలో పెద్ద పెద్ద పర్వతాలున్నాయి. ఆ పర్వత శిఖరాలపై సముద్ర తరంగాలు ఎగిరిపడి క్రిందికి ప్రవహిస్తున్నాయి. అవి మిక్కిలి పరిశుద్ధమైన అంతఃపురాలలో విహారాలలో క్రొత్తగా సున్నం కొట్టబడిన తెల్లని కాంతులతో ధగధగలాడే అందమైన మేడల వలె, మందిరాల వలె ప్రకాశిస్తున్నాయి. ఆ క్షీరసాగరంలో పగడాల తీగలున్నాయి. అవి తన రమణీమణులతో క్రీడించే గోవిందుని ఆనందాన్ని ప్రదర్శిస్తూ కరిగిపోయిన ఆయన అంతరంగం నుండి కరుణారసంతో కూడిన అనురాగ తరంగాల వలె అలరారుతున్నాయి. సిద్ధరసాలైన మేఘాలు ఆ సముద్రంలో నుండి నీరు నింపుకొంటున్నాయి. ఆ మేఘాలు పరస్పరం ఒరుసుకోవటం వల్ల సంభవించిన గంభీరమైన ఉరుములతో భూమ్యాకాశాలు దద్దరిల్లుతున్నాయి. భూమికి మేఖల అయిన ఈ సముద్ర జలాలు క్రొంగ్రొత్త పట్టుచీర వలె ఒప్పుతున్నాయి. విష్ణువు, శివుడు మొదలైన దేవతలకు అమృతాన్ని అందించే మహైశ్వర్యంతో కూడిన ఔదార్యసంపదకు ఆ పాలసముద్రం నిధానంగా ఉన్నది. వైకుంఠనగర వాసుల కోరికలు తీర్చే మందారం, పారిజాతం, సంతానం, కల్పవృక్షం, హరిచందనం వంటి దేవతా వృక్షాలు ఆ సముద్రం ఒడ్డున కనువిందు చేస్తున్నాయి. ఆ సముద్రం పద్మం, మహాపద్మం, శంఖం, మకరం, కచ్ఛపం మొదలైన వాటితో కూడి నవనిధులతో కూడిన కుబేరుని ధనాగారం వలె ఉన్నది. మంచి దర్శనాన్ని ఇస్తూ శోభించే ఆ సముద్ఱ్ఱం సుదర్శన చక్రంతో కూడిన విష్ణుదేవుని కరకమలం వలె ఉన్నది. అమృత కిరణుడైన చంద్రుని కళలకు ఆస్థానమైన ఆ సముద్రం చంద్రకళాశేఖరుని కైలాసం వలె ఉన్నది. కల్పవృక్షం, కామధేనువు, చింతామణి మొదలైన వానికి జన్మస్థానమైన ఆ సముద్రం దేవేంద్ర వైభవాన్ని పుణికి పుచ్చుకున్నట్లున్నది. అపరిమితమైన హరి సంచారంతో కూడిన ఆ సముద్రం అపరిమిత హరి (కోతుల) సంచారం కలిగిన సుగ్రీవుని సైన్యం వలె ఉన్నది. సమస్త లోకాల భారాన్ని భరించటానికి సమర్థమైన ఆ సముద్రం విష్ణుదేవుని ఉదరం వలె ఉన్నది. పరమహంస సమూహాలకు సేవింపదగిన ఆ సముద్రం బ్రహ్మలోకం వలె ఉన్నది. అనంత భోగ భాగ్యాలకు యోగ్యమైన ఆ సముద్రం పాతాళలోకం వలె ఉన్నది. ఐరావతం, లక్ష్మీదేవి, రంభ మొదలైనవారి పుట్టుకకు కారణమైన ఆ సముద్రం మెరుపుతీగల సమూహం వలె మేఘాలను తాకుతున్నది. హరినామ సంకీర్తనం వలె నిర్మల భావం కలిగి ఉన్నది. నూరు యజ్ఞాలు చేసినవాని వలె దేవేంద్రపదవికి తగి ఉన్నది. అటువంటి పాల సముద్రాన్ని సమీపించి, శ్వేతద్వీపాన్ని చేరిన దిక్పాలకులు మొదలైన దేవతలు దేవదేవుడైన విష్ణువును ఆశ్రయించి ఈ విధంగా స్తుతించారు.