పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-324-లగ్రా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"వీఁడు కడు దుర్దముఁడు వాఁడి మన కైదువులు;
పోఁడి చెడఁగా మెసఁగి యీడు గనకున్నాఁ;
డే బ్రతుకింకఁ? బెనుకీడు పొడమెన్ మనకుఁ;
దోడుపడ నొక్కరుఁడు లేఁడు హరి దక్కన్;
వేఁడుదము శ్రీధరునిఁ; గూడుదము సద్భటులఁ;
బాడుదము గీతముల; జాడఁపడు నంతన్
వీఁడు చెడు త్రోవ దయతో నెఱిగించు ఘనుఁ;
డోక సురాలయము పాడుపడ దింకన్. "

టీకా:

వీడు = ఇతడు; కడు = మిక్కిలి; దుర్దముడు = ఓడింపరానివాడు; వాడి = పదునైన; మన = మన యొక్క; కైదువులు = ఆయుధముల; పోడి = గొప్పదనము; చెడగ = పాడైపోవునట్లు; మెసఁగి = తినేసి; ఈడు = సరిసాటివారు; కనక = కనబడక; ఉన్నాడు = ఉన్నాడు; ఏడ = ఎక్కడ; బ్రతుకు = బతుకుటకు గలదు; ఇంక = ఇంక; పెను = పెద్ద; కీడు = ఆపద; పొడమెన్ = కలిగెను; మన = మన; కున్ = కు; తోడుపడ = సహాయము చేయ; ఒక్కరుడున్ = ఇంకెవ్వరును; లేడు = లేరు; హరి = నారాయణుడు; తక్కన్ = తప్పించి; వేడుదము = వేడుకొనెదము; శ్రీధరునిన్ = విష్ణుమూర్తిని {శ్రీ ధరుడు - శ్రీ (లక్మీదేవిని) (వక్షమున) ధరుడు (ధరించినవాడు), విష్ణువు}; కూడుదము = కలసెదము; సద్భటులన్ = సుసేవకులను, మంచి విష్ణుభక్తులను; పాడుదము = ఆలపించెదము; గీతములన్ = కీర్తనలను; జాడపడునంతన్ = కనబడువరకు; వీడు = ఇతడు; చెడు = నాశనమగు; త్రోవ = దారి; దయ = కృప; తోడన్ = తోటి; ఎఱిగించు = తెలుపును; ఘనుడు = గొప్పవాడు (నారాయణుడు); ఓడక = అవశ్యము; సురాలయము = స్వర్గము {సురాలయము - సురల (దేవతల) ఆలయము (నివాసము), స్వర్గము}; పాడుపడదు = పాడైపోదు; ఇంకన్ = ఇక.

భావము:

“ఈ వృత్రాసురుడు మనకు అజేయుడు. మన పదునైన ఆయుధాలన్నీ మ్రింగివేశాడు. వీనికి సాటి అయిన మేటి ఎక్కడా లేడు. ఇక మన బ్రతుకులు పాడైపోయాయి. మనకు కీడు మూడింది. ఇప్పుడు శ్రీహరి తప్ప మనకు తోడుపడేవాడు ఎవ్వడూ లేడు. అందువల్ల ఆ శ్రీమన్నారాయణుని రక్షింపమని వేడుకుందాము. ఆయన భక్తులతో చెలిమి చేద్దాము. ఆయనకు జాలి కలిగేటట్లు సంకీర్తనలు చేద్దాము. మనం అలా చేస్తే ఆ స్వామి కరుణించి వీడు నాశనమయ్యే విధానం మనకు దయతో వెల్లడిస్తాడు. అప్పుడు మన స్వర్గం పాడుపడకుండా ఉంటుంది”.