పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : శ్రీమన్నారాయణ కవచము

  •  
  •  
  •  

6-311-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కావున నీ పుణ్యశల్యంబులు భక్తియుక్తుండ వై కొనిపోయి ప్రాఙ్ముఖంబునఁ బ్రవహించెడు సరస్వతీ జలంబుల నిక్షేపణంబు జేసి కృతస్నానుండవై యాచమనంబు చేసిన, నీ సర్వాంగబంధనంబు లుడుగు" ననిన నతం డట్ల చేసి, తన విమానం బెక్కి నిజస్థానంబున కరిగెఁ; గావున.

టీకా:

కావునన్ = అందుచేత; ఈ = ఈ; పుణ్య = పుణ్యవంతమైన; శల్యంబులు = ఎముకలు; భక్తి = భక్తితో; యుక్తుండవు = కూడినవాడవు; ఐ = అయ్యి; కొనిపోయి = తీసుకు వెళ్ళి; ప్రాక్ = తూర్పు; ముఖంబున్ = వైపునకు; ప్రవహించెడు = ప్రవహించే టటువంటి; సరస్వతి = సరస్వతినది యొక్క; జలంబులన్ = నీటిలో; నిక్షేపణంబు = నిమజ్జనము; చేసి = చేసి; కృత = చేసిన; స్నానుండవు = స్నానము చేసిన వాడవు; ఐ = అయ్యి; ఆచమనంబు = ఆచమనము {ఆచమనము - మంత్రపూర్వకముగ అరచేత జలము తీసుకొనెడి వైదిక ధర్మము}; చేసిన = చేసినచో; నీ = నీ యొక్క; సర్వ = అఖిలమైన; అంగ = అవయవముల; బంధనంబులు = బంధములు; ఉడుగును = విడుచును; అనినన్ = అనగా; అతండు = అతడు; అట్ల = ఆ విధముగ; చేసి = చేసి; తన = తన యొక్క; విమానంబు = విమానమును; ఎక్కి = అధిరోహించి; నిజ = తన; స్థానంబున్ = నివాస స్థానమున; కు = కు; అరిగెన్ = వెళ్ళెను; కావున = అందుచేత.

భావము:

కావున ఈ పవిత్రమైన అస్థికలను భక్తితో తీసికొని పోయి తూర్పుదిక్కుగా ప్రవహిస్తున్న సరస్వతీ నదిలో నిమజ్జనం చెయ్యి. ఆ నదీజలాలలో స్నానం చేసి ఆచమనం చెయ్యి. అప్పుడు నీ సర్వాంగ బంధాలు విడిపోతాయి” అని వాలఖిల్యుడు చెప్పగా విని ఆ చిత్రరథుడు ఆ విధంగానే ఆచరించి బంధవిముక్తుడై విమానమెక్కి తన లోకానికి వెళ్ళిపోయాడు.