పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : శ్రీమన్నారాయణ కవచము

  •  
  •  
  •  

6-303-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వుల సంకటస్థలుల నాజిముఖంబుల నగ్ని కీలలం
దెరుల నెల్ల నాకు నుతి కెక్కఁగ దిక్కగుఁగాక శ్రీనృసిం
హుఁడు సురశత్రుయూధప వధోగ్రుడు విస్ఫురి తాట్టహాస వ
క్త్రుఁడు ఘన దంష్ట్ర పావక విధూత దిగంతరుఁ డప్రమేయుఁడై.

టీకా:

అడవుల = అడవు లందు; సంకట = ఆపదలు కలిగెడి; స్థలులన్ = స్థలము లందు; ఆజి = యుద్ధపు; ముఖంబునన్ = ఎదురుగ; అగ్నికీలలన్ = నిప్పు మంటలలో; ఎడరులన్ = ఎడారు లందు; ఎల్లన్ = అన్నిచోట్లను; నా = నా; కు = కు; నుతికి = ప్రసిద్ధము; ఎక్కగన్ = అగునట్లు; దిక్కు = రక్షగ; అగుగాక = ఉండుగాక; శ్రీనృసింహుఁడు = నరసింహస్వామి; సురశత్రు = రాక్షసులనెడి {సురశత్రులు - సురల(దేవతల)కు శత్రులు, రాక్షసులు}; యూధప = ఏనుగులను; వధ = సంహరించెడి; ఉగ్రుడు = కోపము గలవాడు; విస్ఫురిత = వెలిగ్రక్కుచున్న; అట్టహాస = వికృతహాసము గల; వక్త్రుడు = నోరు గలవాడు; ఘన = పెద్ద; దంష్ట్ర = దంతముల నుండి జనించిన; పావక = అగ్నిహోత్రునిచే; విధూత = ఎగురకొట్టబడిన; దిగంతరుండు = దిగంతములు గలవాడు; అప్రమేయుండు = ఏ ప్రమాణముల చేతను తెలుసుకొనుటకు శక్యము కాని వాడు, యదార్థ స్వరూప మెరుగ రానివాడు {అప్రమేయః - శ్రీశ్రీ శంకరాచార్యుల వారి విష్ణుసహస్రనామ భాష్యం 46 వ నామం, షట్ప్రమాణ పరమ దూరుడు కనుక అప్రమేయుడు; 1 ప్రత్యక్ష, 2. అనుమాన, 3. ఉపమాన, 4. అర్థాపత్తి, 5 అభావ, 6. శాస్త్రరూప ప్రమాణములు షట్ప్రమాణములు అనబడును}; ఐ = అయ్యి.

భావము:

దేవతల శత్రువులైన రాక్షసులను సంహరించడంలో ఉగ్రత్వం చూపేవాడు, అత్యంత భయంకరమైన అట్టహాసంతో కూడిన ముఖం కలవాడు, తన కోరల నుండి బయల్వెడలిన అగ్ని జ్వాలలచేత దిగంతాలను చెదరగొట్టినవాడు, ఊహించడానికి శక్యం కాని మహిమ కలవాడు అయిన నృసింహదేవుడు అడవులలోను, ప్రమాద స్థలాలలోను, యుద్ధభూమిలోను, నిప్పుల మంటలలోను, అన్ని ప్రమాదాలలోను నాకు దిక్కగును గాక!