పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : దేవాసుర యుద్ధము

  •  
  •  
  •  

6-287-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇప్పుడు బ్రహ్మనిష్ఠుండ వైన నిన్నాచార్యునింగా వరియించి, భవదీయ తేజోవిశేషంబు చేత వైరివీరులం బరిమార్చెద; మాత్మీయార్థం బైన యవిష్ణ పాదాభివందనంబు నిందితంబు గాదని వేదవాక్యంబు గలదు; గావున నీకు నమస్కరించుచున్న దేవతలం గైకొని పౌరోహిత్యంబు జేయు" మనినఁ బ్రహసితవదనుండై యమ్మునీశ్వరుం డిట్లనియె.

టీకా:

ఇప్పుడు = ఇప్పుడు; బ్రహ్మ = బ్రహ్మవిద్య యందు; నిష్ఠుండు = నిష్ఠ గలవాడవు; ఐన = అయిన; నిన్ను = నిన్ను; ఆచార్యునిన్ = గురువు, పురోహితుడు; కాన్ = అగునట్లు; వరియించి = కోరి; భవదీయ = నీ యొక్క; తేజస్ = తేజస్సు యొక్క; విశేషంబు = విశిష్టత; చేత = వలన; వైరి = శత్రు; వీరులన్ = వీరులను; పరిమార్చెదము = సంహరించెదము; ఆత్మీయ = మా యొక్క; అర్థంబు = ప్రయోజనార్థము; ఐన = అయిన; యవిష్ణ = చిన్నవారి; పాద = పాదములకు చేయు; అభివందనంబు = నమస్కారము; నిందితంబు = నిందింపదగినది; కాదు = కాదు; అని = అని; వేద = వేదము లందలి; వాక్యంబు = సూక్తి; కలదు = ఉన్నది; కావున = కనుక; నీ = నీ; కు = కు; నమస్కరించుచున్న = నమస్కారము చేయుచున్న; దేవతలన్ = దేవతలను; కైకొని = స్వీకరించి; పౌరోహిత్యంబు = గురువుగా నుండుట; చేయుము = చేయుము; అనినన్ = అనగా; ప్రహసిత = చక్కగా నవ్వుతున్న వాడు; ఐ = అయ్యి; ఆ = ఆ; ముని = మునులలో; ఈశ్వరుండు = భగవంతుని వంటి వాడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఇప్పుడు బ్రహ్మనిష్ఠుడవైన నిన్ను మా గురువుగా స్వీకరించి, నీ తేజో విశేషంతో శత్రువీరులను సంహరిస్తాము. ఆత్మరక్షణ కోసం చిన్నవాని పాదాలకు వందనం చేయటం దోషం కాదని వేదాలు తెలుపుతున్నవి. కావున నీకు నమస్కరిస్తున్న దేవతలమైన మమ్మల్ని స్వీకరించి మాకు పౌరోహిత్యం చెయ్యవలసింది” అని దేవతలు చెప్పగా ఆ మునీశ్వరుడు నవ్వుతూ ఇలా అన్నాడు.