పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : దేవాసుర యుద్ధము

  •  
  •  
  •  

6-282-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బ్రహ్మిష్ఠుం డైన బ్రాహ్మణు నాచార్యుం గైకొనక గురుద్రోహంబు చేసితిరి; తద్దోషం బిపుడు మీఁకుఁ జేసేఁత శత్రుకృతం బై యనుభవింపం జేసె; నతి బలవంతులయిన మిమ్ము నతి క్షీణులైన యారాక్షసులు జయించుట దమ యాచార్యుండైన శుక్రు నారాధించి తన్మంత్ర ప్రభావంబునఁ బునర్లబ్ధ వీర్యు లగుటచేతనే; ఇప్పుడు మదీయంబైన నిలయంబు నాక్రమింపం గలవారై మదోద్రేకంబున నెదురు లేక వర్తిల్లుచున్న రక్షోనాయకులకుం ద్రిదివంబు గొనుట తృణప్రాయంబు; అభేద్య మంత్ర బలంబుగల భార్గవునకు వారు శిష్యులగుటంజేసి విప్ర గోవింద గవేశ్వరానుగ్రహంబు గలవారలకుఁ దక్కం దక్కిన రాజుల కరిష్టంబగుం; గావున మీ రిప్పుడు త్వష్ట యను మను పుత్రుండగు విశ్వరూపుం డను ముని నిశ్చల తపో మహత్త్వ సత్త్వ స్వభావుం డతని నారాధించిన, మీకు నభీష్టార్థంబుల నతండు సంఘటిల్లఁ జేయు; నిట్టి దుర్దశల నతం డడంచు" నని చెప్పిన దిక్పాలకాదులు డెందంబులు డిందుపడి కమలగర్భుని వీడ్కొని విశ్వరూపు కడకుం జని యిట్లనిరి.

టీకా:

బ్రహ్మిష్ఠుండు = బహ్మజ్ఞాన స్వరూపుడు; ఐన = అయిన; బ్రాహ్మణున్ = బ్రాహ్మణుని; ఆచార్యున్ = గురువు; కైకొనక = చేపట్టక; గురుద్రోహంబు = గురువు యెడల చేసిన ద్రోహము; చేసితిరి = చేసిరి; తత్ = ఆ యొక్క; దోషంబు = దోషము; ఇపుడు = ఇప్పుడు; మీరు = మీరు; కున్ = కు; చేసేత = చేజేతుల చేసినది; శత్రు = శత్రువులచే; కృతంబు = చేయబడినది; ఐ = అయ్యి; అనుభవింపన్ = అనుభవించునట్లు; చేసెన్ = చేసెను; అతి = మిక్కిలి; బలవంతులు = శక్తి సామర్థ్యములు గలవారు; అయిన = ఐన; మిమ్మున్ = మిమ్ములను; అతి = మిక్కిలి; క్షీణులు = దుర్బలులు; ఐన = అయిన; ఆ = ఆ; రాక్షసులు = రాక్షసులు; జయించుట = జయించుట; తమ = తమ యొక్క; ఆచార్యుండు = గురువు, పురోహితుడు; ఐన = అయిన; శుక్రున్ = శుక్రుని; ఆరాధించి = సేవించి; తత్ = అతని; మంత్ర = మంత్రాంగపు; ప్రభావంబునన్ = ప్రభావము వలన; పునర్ = మరల; లబ్ధ = లభించిన; వీర్యులు = పరాక్రమము గలవారు; అగుటన్ = అగుట; చేతనే = వలన; ఇప్పుడు = ఇప్పుడు; మదీయంబు = నాది; ఐన = అయినట్టి; నిలయంబున్ = నివాసమును; ఆక్రమింపగలవారు = ఆక్రమించ గలవారు; ఐ = అయ్యి; మద = మదమువలని; ఉద్రేకంబునన్ = ఉద్రేకముతో; ఎదురు = తిరుగు; లేక = లేకుండగ; వర్తిల్లుచున్ = తిరుగుచున్న; రక్షస = రాక్షసుల యొక్క; నాయకుల్ = నాయకుల; కున్ = కు; త్రిదివంబు = స్వర్గమును; కొనుట = తీసుకొనుట; తృణప్రాయంబు = అతి తేలిక {తృణప్రాయము - తృణము (గడ్డిపరక)తో ప్రాయము (సమానము), అతితేలికైన పని}; అభేద్య = జయింపరాని; మంత్ర = మంత్రాంగపు; బలంబు = సామర్థ్యము; కల = కలిగినట్టి; భార్గవున్ = శుక్రుని; కు = కి; వారు = వారు; శిష్యులు = శిష్యులు; అగుటన్ = అగుట; చేసి = వలన; విప్ర = బ్రాహ్మణుని; గోవింద = నారాయణుని; గవ = గోవుని; ఈశ్వర = ఈశ్వరుని; కల = అనుగ్రహం కలిగినట్టి; వారల్ = వారల; కున్ = కు; తక్క = తప్పించి; తక్కిన = ఇతరమైన; రాజుల్ = రాజుల; కున్ = కు; అరిష్టంబు = నష్టదాయక మగునది; అగున్ = అగును; కావున = కనుక; మీరు = మీరు; ఇప్పుడు = ఇప్పుడు; త్వష్ట = త్వష్ట; అను = అనెడి; మను = మనువు యొక్క; పుత్రుండు = కుమారుడు; అగు = అయిన; విశ్వరూపుండు = విశ్వరూపుడు; అను = అనెడి; ముని = ముని; నిశ్చల = చలించని; తపస్ = తపస్సు; మహత్త్వ = మహత్యము; సత్త్వ = సత్త్వగణములు గల; స్వభావుండు = స్వభావము గలవాడు; అతనిన్ = అతనిని; ఆరాధించిన = సేవించిన; మీ = మీ; కున్ = కు; అభీష్టార్థంబులు = వలసిన వాంఛితములను; అతండు = అతడు; సంఘటిల్లన్ = తీరునట్లు; చేయున్ = చేయును; ఇట్టి = ఇటువంటి; దుర్దశలన్ = దురదృష్టములను; అతండు = అతడు; అడంచున్ = అణచివేయును; అని = అని; చెప్పిన = చెప్పగా; దిక్పాలక = దిక్పాలకులు {అష్టదిక్పాలకులు - 1 ఇంద్రుడు - తూర్పు దిక్కునకు 2 అగ్ని - ఆగ్నేయ మూలకు 3 యముడు - దక్షిణ దిక్కునకు 4 నిరృతి - నైఋతి మూలకు 5 వరుణుడు - పడమటి దిక్కునకు 6 వాయువు - వాయవ్య మూలకు 7 కుబేరుడు - ఉత్తర దిక్కునకు 8 ఈశానుడు - ఈశాన్య మూలకు పరిపాలకులు}; ఆదులు = మొదలగువారు; డెందంబులు = మనసులు; డిందుపడి = కుదుటపడి; కమలగర్భుని = బ్రహ్మదేవుని {కమల గర్భుడు - కమలమున గర్భుడు (పుట్టినవాడు), బ్రహ్మ}; వీడ్కొని = సెలవు తీసుకొని; విశ్వరూపు = విశ్వరూపుని; కడ = వద్ద; కున్ = కు; చని = వెళ్ళి; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.

భావము:

బ్రహ్మనిష్ఠుడు, బ్రాహ్మణుడు అయిన ఆచార్యుని గౌరవించకుండా గురుద్రోహం చేశారు. చేతులారా చేసిన ఆ దోషమే ఇప్పుడు మీకు శత్రురూపంలో అనుభవానికి వచ్చింది. మిక్కిలి బలవంతులైన మిమ్ములను బలహీనులైన రాక్షసులు జయించడం వారు తమ గురువైన శుక్రాచార్యుని పూజించి, అతని మంత్రమహిమ వల్ల తిరిగి గొప్ప పరాక్రమవంతులు కావడం వల్లనే సాధ్యమయింది. ఇప్పుడు వారు నా బ్రహ్మపదాన్నైనా అక్రమించ గలవారై గర్వంతో ఎదురులేకుండా ఉన్నారు. అటువంటి వారికి స్వర్గాన్ని ఆక్రమించడం తృణప్రాయమైన పని. భేదింపరాని మంత్రబలం కలిగిన శుక్రాచార్యుని శిష్యులు కనుక బ్రాహ్మణల, గోవుల, నారాయణుల అనుగ్రహం పొందిన వారికి తప్ప మిగిలిన రాజులకు కీడు చేస్తారు. కావున మీరిప్పుడు త్వష్ట అనే మనువు కొడుకు, మహాతపస్వి, సత్త్వగుణ సంపన్నుడు అయిన విశ్వరూపుడు అనే మునిని ఆశ్రయించండి. మీ కోరికలను అతడు తీరుస్తాడు. ఇటువంటి కష్టాలను తొలగింప జేస్తాడు” అని బ్రహ్మ చెప్పగా దిక్పాలకులు మొదలైన దేవతలు బ్రహ్మ వద్ద సెలవు తీసుకొని విశ్వరూపుని దగ్గరకు వెళ్ళి ఇలా అన్నారు.