పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : ఉపోద్ఘాతము

  •  
  •  
  •  

6-2-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిండుమతిం దలంతుఁ గమనీయ భుజంగమరాజమండలీ
మంనుఁ జంద్రఖండ పరిమండితమస్తకుఁ దారమల్లికా
పాండురవర్ణుఁ జండతరభండను హేమగిరీంద్రచారు కో
దండు మహేశు గంధగజదానవభంజను భక్తరంజనున్.

టీకా:

నిండుమతిన్ = సంపూర్ణమైన మనస్సుతో; తలంతు = సంస్మరించెదను; కమనీయ భుజంగమరాజ మండలీ మండనున్ = పరమశివుని {కమనీయ భుజంగమ రాజ మండలీ మండనుడు - కమనీయ (మనోహరమైన) భుజంగమ (సర్ప) రాజ (రాజుల) మండలీ (సమూహములచే) మండనుడు (అలంకరింపబడినాడు), శివుడు}; చంద్రఖండపరిమండితమస్తకున్ = పరమశివుని {చంద్రఖండ పరిమండిత మస్తకుడు - చంద్రఖండ (చంద్రకళచే) పరిమండిత (చక్కగా అలంకరింపబడిన) మస్తకుడు (శిరస్సు గలవాడు), శివుడు}; తారమల్లికాపాండురవర్ణున్ = పరమశివుని {తార మల్లికా పాండుర వర్ణుడు - తార (తారక లేదా వెండి) వంటి మల్లికా (మల్లెపూల) వంటి పాండుర (తెల్లని) వర్ణుడు (రంగు దేహము గలవాడు), శివుడు}; చండతరభండనున్ = పరమశివుని {చండతర భండనుడు - చండతర (మిక్కిలి భయంకరముగ) భండనుడు (యుద్ధము చేయువాడు), శివుడు}; హేమగిరీంద్రచారుకోదండున్ = పరమశివుని {హేమగిరీంద్ర చారు కోదండు - హేమగిరీంద్ర (మేరుపర్వతోత్తమును) చారు (అందమైన) కోదండు (విల్లుగా గలవాడు), శివుడు}; మహేశున్ = పరమశివుని {మహేశుడు - మహ (గొప్ప) ఈశుడు, శివుడు}; గంధగజదానవభంజనున్ = పరమశివుని {గంధ గజదానవ భంజనుడు - గంధ (మదించిన) గజదానవ (గజాసురుని) భంజనుడు (సంహరించినవాడు), శివుడు}; భక్తరంజనున్ = పరమశివుని {భక్త రంజనుడు - భక్తులను రంజనుడు (రంజింపజేయువాడు), శివుడు}.

భావము:

అందమైన నాగరాజులను భూషణాలుగా ధరించినవాడు, తలపై నెలవంకను అలంకరించుకొన్నవాడు, నక్షత్రం వలె మల్లెపువ్వు వలె తెల్లని మేనిఛాయ కలవాడు, భయంకరంగా యుద్ధం చేసేవాడు, మేరుపర్వతాన్ని విల్లుగా ధరించినవాడు, గర్వించిన గజాసురుణ్ణి సంహరించినవాడు, భక్తులను రంజింపజేసేవాడు అయిన మహేశ్వరుణ్ణి నిండు మనస్సుతో స్మరిస్తాను.