పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : పాతాళ లోకములు

  •  
  •  
  •  

5.2-132-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నరేంద్రా! ప్రతిషిద్ధలక్షణంబగు నధర్మం బాచరించు నరుని శ్రద్ధ విపరీతంబుగాఁ బ్రవర్తిల్లు నట్టివానికిఁ గలిగెడి కర్మఫలంబును విపరీతంబుగనే యుండుం గావున ననాద్యవిద్యాకామప్రవర్తనల వలనఁ బెక్కు తెఱంగులఁ గలిగెడి కర్మగతుల సంగ్రహంబుగ నెఱింగించెద" ననిన శుకునితోఁ బరీక్షిన్నరేంద్రుం డిట్లనియె.

టీకా:

నరేంద్ర = రాజా; ప్రతిషిద్ధ = నిషిద్ధమైనట్టి {ప్రతిషిద్ధము - అదికూడదు అని చెప్పెడిది, నిషిద్ధము}; లక్షణంబు = స్వభావముకలది; అగు = అయిన; అధర్మంబున్ = అధర్మమును; ఆచరించు = అనుసరించెడి; నరుని = మానవుని; శ్రద్ధ = శ్రద్ధ; విపరీతముగాన్ = భిన్నముగా; ప్రవర్తిల్లున్ = కలుగుతుండును; అట్టి = అటువంటి; వాని = వారి; కిన్ = కి; కలిగెడి = లభించెడి; కర్మ = కర్మముల; ఫలంబును = ఫలితములు కూడ; విపరీతంబుగనే = భిన్నముగనే; ఉండున్ = ఉండును; కావునన్ = అందుచేత; అనాద్య = అనాదినుండి ఉన్నవి; అవిద్యా = అజ్ఞానము వలన కలిగెడివి; కామప్రవర్తనల = ఇష్టానుసార ప్రవర్తనలు కలిగెడి; వలన = వలన; పెక్కు = అనేక; తెఱంగులన్ = విధముల; కలిగెడి = కలిగెడి; కర్మ = కర్మముల; గతులన్ = పర్యవసానములను; సంగ్రహంబుగా = చక్కగా గ్రహింపగలుగునట్లుగా, సంక్షిప్తముగా; ఎఱింగించెదన్ = తెలిపెదను; అనినన్ = అనగా; శుకుని = శుకుడు తో; పరీక్షిత్ = పరీక్షత్తు యనెడి; నరేంద్రుడు = రాజు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను;

భావము:

రాజా! ఇది తగదని చెప్పడం ప్రతిషిద్ధం. తగదని చెప్పిన పనులను చేయడం అధర్మం. అటువంటి ప్రతిషిద్ధ లక్షణమైన అధర్మాన్ని ఆచరించే మానవుని శ్రద్ధ విపరీతంగా ఉంటుంది. శ్రద్ధయే భిన్నంగా ఉండడం వల్ల కర్మఫలాలు కూడా భిన్నంగానే ఉంటాయి. అందువల్ల అనాదికాలం నుంచి ఉన్నవీ, అజ్ఞానంవల్ల ఏర్పడేవీ, స్వేచ్ఛా ప్రవర్తన వల్ల కలిగేవీ అయిన నానావిధ కర్మగతులను సంగ్రహంగా చెబుతాను విను” అనగానే పరీక్షిత్తు శుకునితో ఇలా అన్నాడు.