పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : పాతాళ లోకములు

  •  
  •  
  •  

5.2-128-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు; నా శేషుని నెవ్వండేని నాకస్మికంబుగ నయినను నార్తుం డగుచు నయినను స్మరించినమాత్రన యఖిల పాపంబులం బాసి సకలశ్రేయస్సులం బొందు; నట్టి శేషునినే ముముక్షువు లాశ్రయించి ధ్యానం బొనర్చి భవబంధ నిర్ముక్తు లగుదు; రతని ఫణంబుల యందు భూగోళం బణుమాత్రం బగుచు నుండు; నతని మహామహిమలు గణుతింప సహస్రజిహ్వలు గల పురుషుండైన నోపం డని పలుకు చుందు; రా యనంతుండు పాతాళంబున నుండి సకల లోకహితార్థంబు భూమిని ధరియించు" నని లోకతిర్యఙ్మనుష్య గతులను లోకస్థితియును శుకయోగీంద్రుండు వినిపించి "యింక నేమి వినిపింతు నెఱింగింపు" మనినం బరీక్షిన్నరేంద్రుండు శుకయోగీంద్రున కిట్లనియె.

టీకా:

మఱియున్ = ఇంకనూ; ఆ = ఆ; శేషుని = ఆదిశేషుని; ఎవ్వండేనిన్ = ఎవరైనా సరే; ఆకస్మికంబుగన్ = ఏదో అప్పటికప్పుడు; అయినన్ = అయినా సరే; ఆర్తుండు = బాధలలో ఉన్నవాడు; అగుచున్ = అగుచు; అయినన్ = అయినా సరే; స్మరించిన = తలచిన; మాత్రన = మాత్రముననే; అఖిల = సర్వమైన; పాపంబులన్ = పాపములు; పాసి = దూరమై; సకల = అఖిలమైన; శ్రేయస్సులన్ = శుభములను; పొందున్ = పొందునో; అట్టి = అటువంటి; శేషుని = ఆదిశేషుని; ముముక్షువులు = మోక్షమును కాంక్షించువారు; ఆశ్రయించి = చేరి; ధ్యానంబున్ = ధ్యానము; ఒనర్చి = చేసి; భవబంధ = సంసార బంధనములనుండి; నిర్ముక్తులు = పూర్తిగా విముక్తులైన వారు; అగుదురు = అగుదురు; అతని = అతని యొక్క; ఫణంబులన్ = పడగల; అందున్ = పైన; భూగోళంబున్ = భూగోళము; అణు = అణువు; మాత్రంబున్ = అంతమాత్రము; అగుచున్ = అగుచు; ఉండును = ఉండును; అతని = అతని యొక్క; మహిమలు = మహత్వములు; గణుతింపన్ = గణించుటకు; సహస్ర = వేయి (1,000); జిహ్వలు = నాలుకలు; కల = కలిగిన; పురుషుండున్ = మానవుడైనను; ఓపండు = సమర్థుడు కాడు; అని = అని; పలుకుచుందురు = అనుచుందురు; ఆ = ఆ; అనంతుండు = ఆదిశేషుడు {అనంతుడు - (మహాప్రళయాంతమునను) అంతము లేని వాడు, శేషుడు}; పాతాళంబున = పాతాళలోకము నందు; ఉండి = ఉండి; సకల = సర్వమైన; లోక = జగత్తులకును; హిత = మేలు కలిగించుట; అర్థంబు = కోసము; భూమిని = భూగోళము; ధరియించును = శిరసున ధరించును; అని = అని; లోక = లోకములు; తిర్యక్ = చలనము కలవాని (జంతువుల); మనుష్య = మానవుల; గతులను = వర్తనలను; లోక = లోకముల; స్థితియును = స్థితి; శుక = శుకుడు అనెడి; యోగి = యోగులలో; ఇంద్రుడు = ఇంద్రునివంటివాడు; వినిపించి = చెప్పి; ఇంకన్ = ఇంకను; ఏమి = ఏమి; వినిపింతున్ = చెప్పమనెదవో; ఎఱిగింపుము = తెలుపుము; అనినన్ = అనగా; పరీక్షిత్ = పరీక్షిత్తు యనెడి; నరేంద్రుండు = రాజు; శుక = శుకుడు యనెడి; యోగి = యోగులలో; ఇంద్రుడు = ఇంద్రునివంటివాడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఆ ఆదిశేషుణ్ణి ఎవరైనా సరే అకస్మాత్తుగా తలచుకొన్నా, బాధలలో చిక్కుకొని మొరపెట్టినా వారి పాపాలను పోగొట్టి సకల శ్రేయస్సులను ప్రసాదిస్తాడు. అందువల్ల ముక్తిని కోరేవారు అనంతుని ఆశ్రయించి ధ్యానించి భవబంధాలకు దూరమవుతారు. అతని పడగల మీద భూగోళం అణుమాత్రంగా నిలిచి ఉంటుంది. ఆ అనంతుని మహిమలు లెక్కించడం వేయి నాలుకలున్న వానికి కూడా అలవిగాని పని. ఆ అనంతుడు పాతాళంలో నివసిస్తూ అన్ని లోకాలకు మేలు కోరేవాడై భూమిని ధరిస్తాడు” అంటూ లోకాల స్వరూపాలను, జంతువుల స్వభావాలను, మానవుల నైజాలను శుకమహర్షి పరీక్షిత్తుకు విశదంగా బోధించి “ఇంకా ఏమేమి వినదలచుకొన్నావో అడుగు” అని పలికాడు. అప్పుడు పరీక్షిన్మహారాజు శుకునితో ఈ విధంగా అన్నాడు.