పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : పాతాళ లోకములు

  •  
  •  
  •  

5.2-125-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు; నా సంకర్షణమూర్తిం జేరి నాగకన్యకలు కోరికలు గల వార లగుచు నొప్పెడి శరీర విలాసంబులం జేసి యగరు చందన కుంకుమ పంకంబు లనులేపనంబులు చేయుచు సంకర్షణమూర్తి దర్శన స్పర్శనాదులను నుద్బోధిత మకరధ్వజావేశిత చిత్తంబుల గలిగి చిఱునవ్వు లొలయ నధికాభిలాషం జేసి స్మితావలోకనంబుల సవ్రీడితలై యవలోకించుచుండ ననంత గుణంబులు గల యనంతదేవుం డుపసంహరింపం బడిన క్రోధంబు గలిగి లోకంబులకు క్షేమంబు గోరుచు సురాసుర సిద్ధ గంధర్వ విద్యాధర ముని గణంబులనవరతంబు ధ్యానంబు జేయ సంతత సంతోషాతిశయంబున మ్రాఁగన్నుబెట్టుచు, సలలిత గీతావాద్యంబుల నానందంబు నొందుచుఁ దన పరిజనంబుల నతిస్నేహంబున నవలోకించుచు నవతులసీగంధ పుష్పరసామోదిత మధుకరవ్రాత మధుర గీతంబులు గల వైజయంతీవనమాలికల ధరియించుచు నీలాంబర ధరుండును హలధరుండును నగుచు నితండు మహేంద్రుండో? హరుండో? యనుచు జనంబులు పలుకుచుండఁ గాంచనాంబర ధరుం డై ముముక్షువులు ధ్యానంబులు చేయ నధ్యాత్మ విద్యా యుక్తం బయిన యానంద హృదయ గ్రంథిని భేదించు నట్టి శేషుని స్వాయంభువుండగు నారదుండు తుంబురు ప్రభ్రుతు లగు ఋషిశ్రేష్ఠులతోఁ జేరుకొని కమలాసనుని సభాస్థానము నందు నిట్లు స్తుతియించుచుండు.

టీకా:

మఱియున్ = ఇంకను; ఆ = ఆ; సంకర్షణమూర్తిన్ = సంకర్షుణుని; చేరి = దగ్గరకు వచ్చి; నాగకన్యలు = నాగస్త్రీలు; కోరికలున్ = కోరికలు; కలవారలు = కలిగినవారు; అగుచున్ = అగుచు; ఒప్పెడి = చక్కటి; శరీర = దేహము యొక్క; విలాసంబులన్ = విలాసముల; చేసి = వలన; అగరు = అగరు; చందన = చందనము; కుంకుమ = కుంకుమపువ్వుల; పంకంబుల్ = పైపూతు; అను = అనెడి; లేపనంబులు = లేపనములు; చేయుచు = రాయుచు; సంకర్షణమూర్తిన్ = సంకర్షణుని; దర్శన = దర్శించుకొనుట; స్పర్శన = స్పర్శించుట; ఆదులనున్ = మొదలగువానిచే; ఉద్భోధిత = రగల్చబడిన; మకరధ్వజ = మన్మథుని {మకరద్వజుడు - మకరము (మొసలి) ధ్వజము (జండా) పైగలవాడు, మన్మథుడు}; ఆవేశిత = ఆవేశము పొందిన; చిత్తంబుల్ = మనసులు; కలిగి = కలిగి ఉండి; చిఱునవ్వులున్ = చిరునవ్వులను; ఒలయన్ = ఒలికించుతుండగా; అధిక = మిక్కిలి; అభిలాషన్ = కాంక్షలు; చేసి = వలన; స్మిత = చిరునవ్వులుతో కూడిన; అవలోకనంబులన్ = చూపులతో; సవ్రీడితలు = సిగ్గులు కలవారు; ఐ = అయ్యి; అవలోకించుచుండన్ = చూస్తుండగా; అనంత = అనంతమైన; గుణంబులు = గుణములు; కల = కలిగిన; అనంత = అనంతుడు అనెడు; దేవుండు = దేవుడు; ఉపసంహరింపబడిన్ = తగ్గించుకొన్న; క్రోధంబున్ = క్రోధమును; కలిగి = కలిగి ఉండి; లోకంబుల్ = జగత్తుల; కున్ = కు; క్షేమంబున్ = మేలును; కోరుచున్ = కోరుతూ; సుర = దేవతలు; అసుర = రాక్షసులు; సిద్ధ = సిద్ధులు; గంధర్వ = గంధర్వులు; విద్యాధర = విద్యాధరులు; ముని = మునుల; గణంబులన్ = సమూహములను; అనవరతంబున్ = ఎల్లప్పుడును; ధ్యానంబున్ = ధ్యానము; చేయన్ = చేయుచుండగ; సంతత = నిత్యము; సంతోష = సంతోషము యొక్క; అతిశయనంబునన్ = అతిశయముచేత; మ్రాగన్నున్ = అరమోడ్పు కన్నులను; పెట్టుచున్ = పెడుతూ; సలలితగీత = లలితగీతములతో కూడిన; వాద్యంబులన్ = వాయిద్యములను; ఆనందంబున్ = సంతోషమును; ఒందుచున్ = పొందుతూ; తన = తన యొక్క; పరిజనంబులన్ = పరివారములను; అతి = మిక్కిలి; స్నేహంబునన్ = చనువుగా; అవలోకించుచున్ = చూచుచు; నవ = సరికొత్త; తులసీ = తులసి; గంధ = సువాసనలు కల; పుష్ప = పూల; రస = మకరందమును; ఆమోదిత = అంగీకరించిన; మధుకర = తుమ్మెదల; వ్రాత = సమూహముల యొక్క; మధుర = తీయని; గీతంబులున్ = పాటలు; కల = కలిగిన; వైజయంతీ = వైజయంతీ; వనమాలికలన్ = మాలలను; ధరియించుచు = ధరించుతూ; నీల = నల్లని; అంబర = వస్త్రములను; ధరుండును = ధరించినవాడును; హల = హలాయుధమును; ధరుండును = ధరించినవాడును; అగుచున్ = అగుచు; ఇతండు = ఇతడు; మహేంద్రుడో = విష్ణువేమో; హరుండో = శివుడేమో; అనుచున్ = అనుచు; జనంబులు = ప్రజలు; పలుకుచుండగాన్ = అనుచుండగా; కాంచన = బంగారపు, హాటక; అంబర = వస్త్రములను; ధరుండును = ధరించినవాడును; ఐ = అయ్యి; ముముక్షువులు = మోక్షమును వాంఛించెడివారు; ధ్యానంబులున్ = ధ్యానములను; చేయన్ = చేయగా; అధ్యాత్మ = ఆధ్యాత్మిక; విద్యా = విద్యతో; యుక్తంబున్ = కూడినది; అయిన = అయిన; ఆనంద = ఆనందకరమైన; హృదయ = హృదయ మందలి; గ్రంథినిన్ = గ్రంథిని, ముడిని; భేదించున్ = విడగొట్టును; అట్టి = అటువంటి; శేషుని = ఆదిశేషుని; స్వాయంభువుండు = తనకుతానె జనించినవాడు; అగు = అయిన; నారదుండు = నారదుడు; తుంబురు = తుంబురుడు; ప్రభృతులగు = మొదలగు; ఋషి = ఋషులలో; శ్రేష్ఠుల్ = ఉత్తముల; తోన్ = తోటి; చేరుకొని = కూడుకొని; కమలాసనుని = బ్రహ్మదేవుని {కమలాసనుడు - కమలము ఆసనముగా కలవాడు, బ్రహ్మ}; సభా = సభతీరిన; స్థానమున్ = ప్రదేశము; అందున్ = లో; ఇట్లు = ఈ విధముగా; స్తుతియించుచుండు = స్తోత్రము చేయుచుండును;

భావము:

ఇంకా సంకర్షణమూర్తి అయిన ఆ ఆదిశేషుని దగ్గరికి తమ కోరికలు తీర్చుకోడానికి నాగకన్యలు వస్తుంటారు. ఆయన సమక్షంలో తమ శరీర విలాసాలు ప్రదర్శిస్తూ ఉంటారు. అగరు, చందనం, కుంకుమపువ్వు కలిపిన సుగంధ లేపనాలతో ఆయనను అర్చిస్తారు. ఆ తరువాత ఆ అనంతుని అపురూపమైన రూపాన్ని తనివితీరా చూడడం వల్లను, ఆ మూర్తిని తాకడం వల్లను కామోద్రేకం కలిగినవారవుతారు. ఆ కారణంగా చిరునవ్వును చిందిస్తూ, సిగ్గు లొలకబోస్తూ, క్రీగంటి చూపులు ప్రసరింపజేస్తూ ఆయన వంక చూస్తూ ఉంటారు. అప్పుడు అనంత గుణ సంపన్నుడైన అనంతుడు తన సహజ కోపాన్ని వదలిపెట్టి శాంతుడౌతాడు. లోకాలన్నింటికి క్షేమాన్ని కాంక్షిస్తాడు. దేవతలు, అసురులు, సిద్ధులు, గంధర్వులు, విద్యాధరులు, మునులు అనంతుని సదా ధ్యానం చేస్తుంటారు. అపుడు అనంతుడు సంతోషంతో అరగన్నుమోడ్పులతో లలిత గీతాలతో కూడిన మనోహరమైన వాద్య ధ్వనులకు ఆనందిస్తుంటాడు. తన పరిజనాన్ని ప్రీతితో కటాక్షిస్తుంటాడు. వైజయంతీ వనమాలికలను ధరిస్తుంటాడు. ఆ మాలికలు అప్పుడే కూర్చిన తులసీ మంజరులతో కూడినవై ఉంటాయి. ఆ మంజరుల మకరంద సుగంధాలకు క్రమ్ముకొన్న తుమ్మెదలు జుంజుమ్మని పాటలు పాడుతుంటాయి. అతడెప్పుడూ నల్లని వస్త్రాలు ధరించి నాగలిని ఆయుధంగా పట్టుకొని ఉంటాడు. అతణ్ణి మహేంద్రుడో, శివుడో అని జనులు భావిస్తుంటారు. ఆ శేషుడు మోక్షార్థులై తనను ధ్యానించే వారి హృదయ గ్రంధిని తొలగించి ఆధ్యాత్మవిద్యతో కూడిన ఆనందాన్ని కలిగిస్తాడు. అందువల్లనే ముక్తిని కోరేవారు ఆనంతుని భక్తితో ఆరాధిస్తుంటారు. ఇన్ని మహిమలు కలిగినవాడు కనుక బ్రహ్మమానసపుత్రుడైన నారదుడు తుంబురుడు మొదలైన ఋషి పుంగవులతో కూడి బ్రహ్మదేవుని పేరోలగంలో అనంతుణ్ణి ఈ విధంగా స్తుతిస్తుంటాడు.