పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : పాతాళ లోకములు

  •  
  •  
  •  

5.2-121-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు వాసుకి ప్రముఖులైన శంఖ కుళిక మహాశంఖ శ్వేత ధనంజయ ధృతరాష్ట్ర శంఖచూడ కంబళాశ్వతర దేవదత్తాదు లయిన మహానాగంబు లైదు నేడు పది నూఱు వేయి శిరంబులు గలిగి ఫణామణికాంతులం జేసి పాతాళ తిమిరంబును బాపుచుందురు.

టీకా:

ఇట్లు = ఈ విధముగా; వాసుకి = వాసుకి; ప్రముఖులు = మొదలగు ముఖ్యులు; ఐన = అయిన; శంఖ = శంఖుడు; కుళిక = కుళికుడు; మహాశంఖ = మహాశంఖుడు; శ్వేత = శ్వేతుడు; ధనంజయ = ధనంజయుడు; ధృతరాష్ట్ర = ధృతరాష్ట్రుడు; శంఖచూడ = శంఖచూడుడు; కంబళ = కంబళుడు; అశ్వతర = అశ్వతరుడు; దేవదత్త = దేవదత్తుడు; ఆదులు = మొదలైనవారు; అయిన = ఐన; మహా = గొప్ప; నాగంబులున్ = నాగములు; ఐదు = అయిదు (5); ఏడు = ఏడు (7); పది = పది (10); నూఱు = వంద (100); వేయి = వెయ్యి (1,000); శిరంబులున్ = తలలు, పడగలు; కలిగి = కలిగి ఉండి; ఫణా = పడగ లందలి; మణి = మణుల; కాంతులన్ = వెలుగుల; చేసి = వలన; పాతాళ = పాతాళ మందలి; తిమిరంబున్ = చీకటిని; పాపుచుందురు = పోగొట్టుచుందురు;

భావము:

వాసుకి, శంఖుడు, కుళికుడు, మహాశంఖుడు, శ్వేతుడు, ధనంజయుడు, ధృతరాష్ట్రుడు, శంఖచూడుడు, కంబళుడు, అశ్వతరుడు, దేవదత్తుడు మొదలైనవారు పాతాళలోక వాసులైన మహానాగులు. వారిలో కొందరు ఐదు తలలవారు, కొందరు నూరు తలలవారు, వేయి తలలవారూ ఉన్నారు. వారి పడగల మీద మణులు మెరుస్తూ ఉంటాయి. ఆ మణుల కాంతులు పాతాళంలోని చీకట్లను పారద్రోలుతుంటాయి.