పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : పాతాళ లోకములు

  •  
  •  
  •  

5.2-119-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియును గుహక తక్షక కాళియ సుషేణాది ప్రధాను లయిన వార లతుల శరీరంబులు గలిగి యాదిపురుషుని వాహనం బైన పతగరాజ భయంబున ననవరతంబు నుద్వేజితు లగుచు స్వకళత్రా పత్య సుహృద్భాంధవ సమేతు లయి యుండుదు; రా క్రింద రసాతలంబున దైత్యులు దానవులు నగు నివాతకవచ కాలకేయు లను హిరణ్యపుర నివాసులగు దేవతాశత్రువులు మహా సాహసులును దేజోధికులును నగుచు సకల లోకాధీశ్వరుండైన శ్రీహరితేజంబునం బ్రతిహతులై వల్మీకంబు నందు నడంగి యున్న సర్పంబుల చందంబున నింద్రదూత యగు సరమచేఁ జెప్పబడెడు మంత్రాత్మక వాక్యంబులకు భయంబు నొందు చుండుదురు.

టీకా:

మఱియునున్ = ఇంకను; కుహక = కుహకుడు; తక్షక = తక్షకుడు; కాళియ = కాళియుడు; సుషేణ = సుషేణుడు; ఆది = మొదలగు; ప్రధానులు = ముఖ్యులు; అయిన = అయినట్టి; వారలు = వారు; అతుల = సాటిలేని; శరీరంబులున్ = దేహములు; కలిగి = కలిగి ఉండి; ఆదిపురుషుని = నారాయణుని; వాహనంబున్ = వాహనము; ఐన = అయినట్టి; పతగరాజ = గరుత్మంతుని {పతగరాజు - పతంగ (పక్షుల)కు రాజు, గరుత్మంతుడు}; భయంబునన్ = భయమువలన; అనవరతంబు = ఎడతెగక; ఉద్వేజితులు = భయపడుతున్నవారు; అగుచున్ = అగుచు; స్వ = తమ; కళత్రా = భార్యలు; అపత్య = సంతానము; సుహృత్ = స్నేహితులు; బాంధవ = బంధువుల; సమేతులు = కూడినవారు; అయి = అయ్యి; ఉండుదురు = ఉండెదరు; ఆ = దానికి; క్రిందన్ = క్రిందను; రసాతలంబునన్ = రసాతలమున; దైత్యులున్ = దైత్యులు {దైత్యులు - దితి యొక్క సంతానము, రాక్షసులు}; దానవులున్ = దానవులు; అగు = అయినట్టి; నివాత = నివాతులు; కవచ = కవచులు; కాలకేయులు = కాలకేయులు; అను = అనెడి; హిరణ్యపుర = హిరణ్యపురము నందు; నివాసులు = నివసించెడివారు; అగున్ = అయిన; దేవతా = దేవతలకు; శత్రువులు = శత్రువులు; మహా = గొప్ప; సాహసులును = సాహసము కలవారును; తేజస్ = తేజస్సు; అధికులునున్ = అధికముగా కలవారు; అగుచున్ = అగుచు; సకల = సర్వమైన; లోక = జగత్తులకు; అధీశ్వరుండున్ = ప్రభువు; ఐన = అయిన; శ్రీహరి = నారాయణుని; తేజంబునన్ = తేజస్సు యందు; ప్రతిహతులున్ = ఓడింపబడువారును; ఐ = అయ్యి; వల్మీకంబునన్ = పుట్ట; అందున్ = లో; అడంగి = అణగి; ఉన్న = ఉన్నట్టి; సర్పంబులన్ = పాముల; చందంబునన్ = వలె; ఇంద్ర = ఇంద్రుని యొక్క; దూత = దూత; అగు = అయిన; సరమ = సరమ; చేన్ = చేత; చెప్పబడెడు = ఉచ్చరింపబడెడు; మంత్రాత్మక = మంత్రపూర్వకములగు; వాక్యంబుల్ = వాక్యముల; కున్ = కు; భయంబున్ = భయమును; ఒందుచుండుదురు = పొందుతుందురు;

భావము:

ఇంకా ఆ మహాతలంలో కుహకుడు, తక్షకుడు, కాళియుడు, సుషేణుడు మొదలైన సర్ప ముఖ్యు లున్నారు. వారు సాటిలేని మేటిరూపం కలవారు. ఆదిపురుషుడైన నారాయణుని వాహనమైన గరుత్మంతుని భయంవల్ల కలవరపడుతూ ఎల్లప్పుడూ భార్యలతో, బిడ్డలతో, మిత్రులతో, బంధువులతో కలిసి ఉంటారు. మహాతలం క్రింద రసాతలం ఉంది. ఆ రసాతలంలో దైత్యులు, దానవులు అయిన హిరణ్యపురవాసులు, నివాతకవచులు, కాలకేయులు అనేవారు నివాసం చేస్తుంటారు. వారు దేవతల పట్ల శత్రుత్వం వహించి ఉంటారు. వారు మహా సాహసవంతులు, తేజోవంతులు. అయినా అన్ని లోకాలకు ప్రభువైన శ్రీహరి తేజస్సుకు లొంగినవారై పుట్టలలో దాగిన సర్పాల మాదిరిగా భయంతో బ్రతుకుతుంటారు. ఇంద్రుని దూతి అయిన సరమ ఉచ్చరించే మంత్రాలకు భయపడుతూ ఉంటారు.