పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : పాతాళ లోకములు

  •  
  •  
  •  

5.2-113-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నరేంద్రా! సకలభూతాంతర్యామియు దీర్థభూతుండును నయిన వాసుదేవుని యందుఁ జిత్తంబు గలిగి యిచ్ఛిన భూదానంబునకు సాక్షాత్కరించిన మోక్షంబు ఫలం బగుం; గాని పాతాళస్వర్గ రాజ్యంబులు ఫలంబులు గానేర; వయిన నెవ్వరికిని మోక్షంబు సాక్షాత్కృతంబు గాకుండుటంజేసి లోకప్రదర్శనార్థంబు పాతాళ స్వర్గరాజ్యంబుల నిచ్చె; క్షుత పతన ప్రస్ఖలనాదు లందును వివశుండైన యెడల నామస్మరణంబు చేయు పురుషుండు గర్మబంధంబువలన విముక్తుం డగుచు సుజ్ఞానంబునం బొందు; నట్టి వాసుదేవుం డాత్మజ్ఞాన ప్రపోషణంబు జేయు మాయామయంబు లైన భోగైశ్వర్యంబుల నెల్ల నెట్లొసంగు ననవలదు; భగవంతుండు యాచనజేసి సకల సంపదలఁ జేకొని శరీరమాత్రావశిష్టునిం జేసి వారుణ పాశంబులం గట్టి విడిచినప్పుడు బలీంద్రు డిట్లనియె.

టీకా:

నరేంద్రా = రాజా; సకల = అఖిలమైన; భూత = జీవుల; అంతర్యమియున్ = అంతరాత్మగా ఉండువాడు; తీర్థభూతుండును = పుణ్యతీర్థ స్వరూప మైనవాడును; అయిన = అయినట్టి; వాసుదేవుని = విష్ణుమూర్తిని; అందున్ = ఎడల; చిత్తంబున్ = మనసు; కలిగి = కలిగి; ఇచ్చిన = దాన మిచ్చినట్టి; భూదానంబున్ = భూదానమున; కున్ = కు; సాక్షాత్కరించిన = ప్రత్యక్షముగా లభించిన; మోక్షంబు = మోక్షమే; ఫలంబున్ = ఫలితము; అగున్ = అగునే; కాని = కాని; పాతాళ = పాతాళ మందలి; స్వర్గ = స్వర్గమునకు; రాజ్యంబులు = రాజ్యాధికారములు; ఫలంబులున్ = ఫలితములు; కానేరవు = కాలేవు; అయినన్ = అయిప్పటికిని; ఎవ్వరి = ఎవ్వరి; కినిన్ = కి కూడ; మోక్షంబున్ = మోక్షము; సాక్షాత్కృతంబు = ఎదురుగ కనబడునది; కాకుండుటన్ = కాకపోవుట; చేసి = వలన; లోక = లోకములకు; ప్రదర్శన = చక్కగా చూపుట; అర్థము = కోసము; పాతాళ = పాతాళ మందలి; స్వర్గ = స్వర్గమునకు; రాజ్యంబులు = రాజ్యాధికారములు; ఇచ్చెన్ = ఇచ్చెను; క్షుత = తుమ్ముట; పతన = పడుట; ప్రస్ఖలన = తొట్రుపాటు; ఆదులు = మొదలగువాని; అందున్ = అందు; వివశుండు = వశము తప్పినవాడు; ఐన = అయిన; ఎడల = సమయములలో; నామ = భగవంతుని నామమును; స్మరణంబు = స్మరించుట; చేయు = చేసెడి; పురుషుండు = మానవుడు; కర్మబంధంబున్ = కర్మబంధముల; వలనన్ = నుండి; విముక్తుండు = ముక్తిపొందినవాడు; అగుచున్ = అగుచు; సుజ్ఞానంబునన్ = మంచి జ్ఞానమును; పొందును = పొందును; అట్టి = అటువంటి; వాసుదేవుండు = నారాయణుడు; ఆత్మజ్ఞాన = తత్త్వజ్ఞానమును; ప్రపోషణంబున్ = చక్కగా పోషింపబడినదిగా; చేయున్ = చేయును; మాయా = మాయతో; మయంబులు = నిండినవి; ఐన = అయిన; భోగ = భోగములు; ఐశ్వర్యంబులన్ = సంపదలు; ఎల్లన్ = సర్వమును; ఎట్లు = ఏ విధము; ఒసంగున్ = ప్రసాదించును; అనవలదు = అనవద్దు; భగవంతుడు = విష్ణుమూర్తి; యాచన = యాచించుట; చేసి = చేసి; సకల = సర్వ; సంపదలన్ = సంపదలను; చేకొని = స్వీకరించి; శరీర = దేహము; మాత్ర = మాత్రమే; అవశిష్టునిన్ = మిగిలినవానిగా; చేసి = చేసి; వారుణ = వరుణ; పాశంబులన్ = తాళ్ళతో; కట్టి = కట్టివేసి; విడిచిన = వదలిన; బలి = బలి అనెడి; ఇంద్రుడు = ఇంద్రుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను;

భావము:

రాజా! వాసుదేవుడు అన్ని ప్రాణులలోను అంతర్యామిగా ఉండేవాడు. పైగా పుణ్యతీర్థం లాగా పవిత్రుడు. అటువంటి వాసుదేవుని మనసులో నిలుపుకొని బలిచక్రవర్తి భూదానం చేసాడు. ఇటువంటి భూదానానికి శ్రీమన్నారాయణుడు మెచ్చుకొని సాక్షాత్కరించాడు. ఆ సాక్షాత్కారానికి మోక్షమే ఫలం. అంతేకాని స్వర్గరాజ్యం కాని, పాతాళరాజ్యం కాని ఫలాలు కావు. అయితే ముక్తి అన్నది ఎవరికీ కనిపించేది కాదు. అందువల్ల శ్రీహరి బలిచక్రవర్తికి లోక ప్రదర్శనార్థం పాతాళ స్వర్గరాజ్యాలు ఇచ్చాడు. తుమ్మినప్పుడు, పడినప్పుడు, కాలు జారినప్పుడు, తెలివి తప్పినప్పుడు శ్రీమన్నారాయణుని నామస్మరణం చేసే పురుషునికి కర్మబంధాలు ఉండవు. ఆ బంధాల నుండి విముక్తి పొంది సుజ్ఞానవంతు డౌతాడు. ఆత్మజ్ఞానం అనుగ్రహించే వాసుదేవుడు మాయామయమైన ఇహలోక భోగాలను, అశాశ్వతమైన ఐశ్వర్యాలను ఏ విధంగా ప్రసాదిస్తాడనే సందేహం వద్దు. శ్రీహరి యాచన నెపంతో బలిచక్రవర్తి సర్వ సంపదలను హరించాడు. బలిని కేవలం శరీరమాత్ర అవశిష్టుణ్ణి చేసాడు. వారుణ పాశాలతో బంధించి చివరకు వదలిపెట్టినప్పుడు బలి ఈ విధంగా అన్నాడు.