పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : పాతాళ లోకములు

  •  
  •  
  •  

5.2-107-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు మానసేంద్రియంబుల కానందకరంబులైన నానావిధ జలవిహంగమ మిథునంబులు గలిగి నిర్మలజలపూరితంబులై మత్స్యకుల సంచార క్షుభితంబులైన కుముద కువలయ కహ్లార లోహిత శతపత్రాదికంబులఁ దేజరిల్లెడు సరోవరంబులుగల యుద్యానవనంబుల యందుఁ గృతనికేతనులై స్వర్గభూముల నతిశయించిన వివిధ విహారంబులు గలిగి యహోరాత్రాది కాలవిభాగ భయంబులు లేక మహాహిప్రవరుండయిన శేషుని శిరోమణి దీధితులచే నంధకారోపద్రవంబు లేక యెల్లప్పుడు దివసాయమానంబుగా నుండు; నా లోకంబు నందు నఖిల జనులు దివ్యౌషధి రస రసాయనంబుల ననవరతంబు నన్నపానంబులుగా సేవించుటం జేసి యచ్చటివారలకు నాధివ్యాధులును, వలితపలితంబులును, జరారోగంబులును, శరీరవైవర్ణ్యంబులును, స్వేదదౌర్గంధ్యంబులును, గలుగక పరమకల్యాణమూర్తు లగుచు హరిచక్రభయంబు దక్క నన్యంబగు మృత్యుభయంబు నొందక యుందు; రదియునుం గాక.

టీకా:

మఱియున్ = ఇంకను; మానస = మనసులకు; ఇంద్రియంబుల్ = ఇంద్రియముల; కున్ = కు; ఆనంద = ఆనందమును; కరంబులు = కలిగించునవి; ఐన = అయినట్టి; నానవిధ = అనేక రకములైన; జలవిహంగమ = నీటిపక్షుల; మిథునంబులు = జంటలు; కలిగి = కలిగుండి; నిర్మల = స్వచ్ఛమైన; జల = నీటితో; పూరితంబులు = నిండినవి; ఐన = అయినట్టి; మత్స్య = చేపల; కుల = సమూహముల; సంచార = తిరుగుటలచే; క్షుభితంబులు = కదలుచున్నట్టివి; ఐన = అయినట్టి; కుముద = తెల్లకలువలు; కువలయ = కలువలు; కహ్లార = ఎఱ్ఱకలువలు; లోహిత = ఎఱ్ఱని; శతపత్ర = తామరపూలు; ఆదికంబులన్ = మొదలగువానిచే; తేజరిల్లెడు = విరాజిల్లుతున్న; సరోవరంబులు = సరస్సులు; కల = కలిగిన; ఉద్యానవనంబులన్ = తోటలు; అందున్ = లో; కృత = క్రీడా; నికేతనులు = గృహములు కలవారు; ఐ = అయ్యి; స్వర్గ = స్వర్గము నందలి; భూములన్ = ప్రదేశములను; అతిశయించిన = మించిన; వివిధ = అనేక రకములైన; విహారంబులు = విహరింపదగినవి; కలిగి = కలిగి ఉండి; అహోరాత్ర = రాత్రంబగళ్ళు; ఆది = మొదలగు; కాల = సమయ; విభాగ = విభాగ భేదముల; భయంబులు = భయములు; లేక = లేకుండగ; మహా = గొప్ప; అహి = సర్పములలో; ప్రవరుండు = శ్రేష్ఠుడు; అయిన = ఐనట్టి; శేషుని = ఆశేషుడి యొక్క {శేషుడు - మహాప్రళయమున సర్వంసహా లయమైన తరువాత శేషముగా మిగిలి విష్ణుని సేవయందుండు వాడు}; శిరోమణి = శిరసు నందు అలంకరించిన మణి యొక్క; దీధితుల = కాంతుల; చేన్ = వలన; అంధకర = చీకటు లనెడి; ఉపద్రవంబులు = ప్రమాదములు; లేక = లేకుండగ; ఎల్లప్పుడు = ఎల్లప్పుడును; దివస = పగలుగా; ఆయమానంబుగాన్ = చేయబడినదై; ఉండున్ = ఉండును; ఆ = ఆ; లోకంబున్ = లోకము; అందున్ = లో; అఖిల = సమస్తమైన; జనులు = ప్రజలు; దివ్య = దివ్యమైన; ఔషధి = మూలికల; రస = రసములు; రసాయనంబులు = ఔషధముల, మందుల; అనవరతంబు = ఎడతెగకుండగ; అన్న = ఆపారము; పానంబులుగా = పానీయములుగా; సేవించుటన్ = తీసుకొనుట; చేసి = వలన; అచ్చటి = అక్కడి; వారల్ = వారల; కున్ = కి; ఆధి = మనోవ్యధలు; వ్యాధులును = శారీరక రుగ్మతలు; వలిత = చర్మము ముడుతలు పడుట; పలితంబులును = శిరోజములు నెరయుట; జరా = ముసలితనములు; రోగంబులు = అనారోగ్యములు; శరీర = దేహము; వైవర్ణ్యంబులును = పాలిపోవుటలు; స్వేదదౌర్గంధ్యంబులును = చెమట వాసనలును; కలుగక = కలగక; పరమ = అత్యుత్తమ; కల్యాణ = శుభకర; మూర్తులు = స్వరూపులు; అగుచున్ = అగుచు; హరిచక్ర = విష్ణుచక్రమువలని; భయంబున్ = భయము; తక్క = తప్పించి; అన్యంబు = ఇతరములు; అగు = అయిన; మృత్యు = మరణకారకముల; భయంబున్ = భయములు; ఒందక = పొందక; ఉందురు = ఉండెదరు; అదియునున్ = అంతే; కాక = కాకుండగ;

భావము:

ఇంకా మనస్సుకు, ఇంద్రియాలకు ఆహ్లాదం కలిగించే సరస్సులు కూడా అక్కడ ఉన్నాయి. ఆ సరోవరాలలో రకరకాలైన నీటిపక్షుల జంటలు విహరిస్తుంటాయి. అక్కడ నీరు నిర్మలంగా ఉంటుంది. చేపలు ఈదుతూ కోనేటిలో కదలికలను కలిగిస్తాయి. ఆ సరోవరాలలో తెల్ల కలువలు, నల్ల కలువలు, ఎఱ్ఱ కలువలు, రంగు రంగుల తామరపూలు ఉన్నాయి. అటువంటి సరస్సులు కలిగిన ఉద్యానవనాలలో వాళ్ళు ఇళ్ళు ఏర్పరచుకొంటారు. స్వర్గ భోగాలను మించిన భోగాలు వారికి అందుబాటులో ఉంటాయి. వారికి పగలు, రాత్రి అనే కాలభేదాలు ఉండవు. శేషుడు మొదలైన సర్పరాజుల పడగల మీద ఉన్న దివ్యమైన మణులవల్ల వారికి చీకట్లు ఉండవు. అక్కడ ఎప్పుడూ పట్టపగలు లాగా ఉంటుంది. అక్కడివారు దివ్యమైన మూలికలను, రస రసాయనాలను ఆహారంగా స్వీకరించడం వల్ల దేహవ్యాధులు కాని, మనోవ్యాధులు కాని వారికి ఉండవు. దేహం పాలిపోదు. ముడతలు పడదు. జుట్టు నెరసిపోదు. ముసలితనం రాదు. రోగాలు లేవు. చెమట, దుర్వాసనలు ఉండవు. ఆకర్షణీయమైన ఆకారాలు కలిగి ఉంటారు. వారికి సుదర్శన చక్ర భయం తప్ప మరే మృత్యుభయం లేదు. అంతేకాక...