పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : భగణ విషయము

  •  
  •  
  •  

5.2-94-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు నా ధ్రువుండు గాలంబుచేత నిమిషమాత్రం బెడలేక సంచరించు జ్యోతిర్గ్రహ నక్షత్రంబులకు నీశ్వరునిచేత ధాన్యాక్రమణంబునఁ బశువులకై యేర్పఱిచిన మేధిస్తంభంబు తెఱంగున మేటిగాఁ గల్పింపంబడి ప్రకాశించుచుండు; గగనంబు నందు మేఘంబులును శ్యేనాది పక్షులును వాయువశంబునం గర్మసారథులై చరించు తెఱంగున జ్యోతిర్గణంబులును బ్రకృతిపురుష యోగ గృహీతాశులై కర్మనిమిత్తగతి గలిగి వసుంధరం బడకుందురు.

టీకా:

మఱియున్ = ఇంకను; ఆ = ఆ; ధ్రువుండు = ధ్రువుడు; కాలంబున్ = కాలము; చేతన్ = వలన; నిమిష = నిమేష; మాత్రంబున్ = మాత్రమైనా; ఎడలేక = సందులేక, ఏమరుపాటులేక; సంచరించున్ = తిరుగును; జ్యోతిః = జ్యోతిర్మండలములు; గ్రహ = గ్రహములు; నక్షత్రంబుల్ = నక్షత్రముల; కున్ = కు; ఈశ్వరుని = భగవంతుని; చేతన్ = చేత; ధాన్యాక్రమణంబునన్ = కళ్ళమున ధాన్యము నూర్చుటకు; పశువుల్ = పశువుల; కై = కోసము; ఏర్పరచిన = ఏర్పాటుచేసిన; మేధిస్తంభంబు = కట్రాట; తెఱంగునన్ = విధముగ; మేటిగాన్ = శ్రేష్ఠముగా; కల్పింపంబడి = ఏర్పాటు చేయబడి; ప్రకాశించుచుండున్ = విరాజిల్లుతుండును; గగనంబున్ = ఆకాశము; అందున్ = లో; మేఘంబులును = మేఘములు; శేన్య = డేగ; ఆది = మొదలగు; పక్షులును = పక్షులు; వాయు = గాలికి; వశంబునన్ = లొంగి; కర్మ = కర్మలను; సారథులు = అనుసరించినవారు; ఐ = అయ్యి; చరించున్ = తిరిగెడు; తెఱంగునన్ = విధముగ; జ్యోతిః = జ్యోతిర్మండలముల; గణంబులును = సమూహములును; ప్రకృతి = ప్రకృతి; పురుష = పరమపురుషుల; యోగ = కూర్పులను; గృహీత = స్వీకరించిన; ఆశులు = దిక్కు (ఆధారము) కలవారు; ఐ = అయ్యి; కర్మనిమిత్త = కర్మానుసార; గతి = చలనము; కలిగి = కలిగి ఉండి; వసుంధరన్ = భూమిపైన; పడకన్ = పడకుండగ; ఉందురు = ఉంటారు;

భావము:

ధాన్యం నూర్చే కళ్ళంలో పశువులను కట్టడం కోసం మధ్యలో పాతిన స్తంభంలాగా ధ్రువుడు ఆ శింశుమారచక్రం నడుమ ప్రకాశిస్తూ ఉన్నాడు. అతని చుట్టూ గ్రహాలు, నక్షత్రాలు ఉన్నాయి. అవన్నీ కాలవిభాగంలో నిమేషమాత్రం కూడా ఏమరుపాటు లేక ధ్రువుని చుట్టూ ప్రదక్షిణంగా తిరుగుతూ ఉంటాయి. ఆకాశంలో మేఘాలు, డేగలు మొదలైన పక్షులు కర్మానుసారంగా గాలికి లోబడి ఆకాశంలో ఎలా పరిభ్రమిస్తున్నాయో అలా జ్యోతిర్గణాలు కర్మను అవలంబించి ప్రకృతి పురుషులకు లోబడి గగనాన తిరుగుతూ ఉంటాయి. ఈ కారణం వల్లనే ఆ గ్రహాలు నేలమీద పడడం లేదు.