పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : భగణ విషయము

  •  
  •  
  •  

5.2-86-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నరేంద్రా! యతి వేగంబునఁ దిరుగుచుండు కులాల చక్రంబు నందు జక్ర భ్రమణంబునకు వేఱైన గతి నొంది బంతిసాగి తిరిగెడు పిపీలకాదుల చందంబున నక్షత్రరాసులతోడం గూడిన కాలచక్రంబు ధ్రువమేరువులం బ్రదక్షిణంబు దిరుగునపు డా కాలచక్రంబు నెదుర సంచరించు సూర్యాదిగ్రహంబులకు నక్షత్రాంతరంబుల యందును రాశ్యంతరంబుల యందును నునికి గలుగుటం జేసి సూర్యాది గ్రహంబులకుఁ జక్రగతి స్వగతులవలన గతిద్వయంబు గలుగుచుండు; మఱియు నా సూర్యుం డాదినారాయణమూర్తి యగుచు లోకంబుల యోగక్షేమంబులకు వేదత్రయాత్మకంబై కర్మసిద్ధి నిమిత్తంబై దేవర్షి గణంబులచేత వేదాం తార్థంబుల ననవరతంబు వితర్క్యమాణం బగుచున్న తన స్వరూపంబును ద్వాదశ విధంబులుగ విభజించి వసంతాది ఋతువుల నాయా కాలవిశేషంబుల యందుఁ గలుగఁ జేయుచుండు; నట్టి పరమ పురుషుని మహిమ నీ లోకంబున మహాత్ములగు పురుషులు దమతమ వర్ణాశ్రమాచారముల చొప్పున వేదోక్త ప్రకారంబుగా భక్త్యతిశయంబున నారాధించుచు క్షేమంబు నొందుచుందు; రట్టి యాదినారాయణమూర్తి జ్యోతిశ్చక్రాంతర్వర్తియై స్వకీయ తేజఃపుంజదీపితాఖిల జ్యోతిర్గణంబులు గలవాడై ద్వాదశరాసుల యందు నొక సంవత్సరంబున సంచరించుచుండు; నట్టి యాదిపురుషుని గమన విశేషకాలంబును లోకు లయన ఋతు మాస పక్ష తిథ్యాదులచే వ్యవహరించుచుందురు; మఱియు నప్పరమపురుషుం డా రాసుల యందు షష్టాంశ సంచారంబు నొందిన సమయంబును ఋతు వని వ్యవహరింపుదు; రా రాసుల యందు నర్థాంశ సంచారమ్మున రాశిషట్కభోగం బొందిన తఱి యయనం బని చెప్పుదురు; సమగ్రంబుగా రాశుల యందు సంచార మొందిన యెడల నట్టి కాలంబును సంవత్సరం బని నిర్ణ యింపుదు; రట్టి సమగ్రరాశి సంచారంబునందు శీఘ్రగతి మందగతి సమగతు లనియెడు త్రివిధగతి విశేషంబులవలన వేఱుపడెడు నా వత్సరంబును సంవత్సరంబు పరివత్సరం బిడావత్సరం బనువత్సరం బిద్వత్సరం బని పంచవిధంబులఁ జెప్పుదురు; చంద్రుండు నీ తెఱంగున నా సూర్యమండలంబు మీఁద లక్షయోజనంబుల నుండి సంవత్సర పక్ష రాశి నక్షత్ర భుక్తులు గ్రహించుచు నగ్రచారియై శీఘ్ర గతిం జరించునంత వృద్ధిక్షయరూపంబునం బితృగణంబులకుఁ బూర్వ పక్షాపరపక్షంబులచేత నహోరత్రంబులఁ గలుఁగఁ జేయుచు సకలజీవ ప్రాణంబై యొక్క నక్షత్రంబు త్రింశన్మూహూర్తంబు లనుభవించుచు షోడశ కళలు గలిగి మనోమయాన్నమ యామృతమయ దేహుండై దేవ పితృ మనుష్య భూత పశు పక్షి సరీసృప వీరుత్ప్ర భృతులకుఁ బ్రాణాప్యాయనశీలుం డగుటంజేసి సర్వసముం డనంబడు.

టీకా:

నరేంద్రా = రాజా; అతి = మిక్కిలి; వేగంబునన్ = వేగముగా; తిరుగుచుండు = తిరుగుచుండెడి; కులాల = కుమ్మరి; చక్రంబున్ = చక్రము; అందున్ = లో; చక్రభ్రమణంబున్ = గుండ్రముగా తిరుగుట; కున్ = కు; వేఱు = ఇతరము; ఐన = అయిన; గతిన్ = గమనమును; ఒంది = పొంది; బంతిసాగి = వరుసకట్టి; తిరుగెడు = తిరుగుచుండెడి; పిపీలక = చీమలు; ఆదులన్ = మొదలగువాని; చందంబునన్ = విధముగా; నక్షత్రరాసులు = నక్షత్రరాశుల; తోడన్ = తోటి; కూడిన = కూడి ఉన్న; కాలచక్రంబున్ = కాలచక్రము; ధ్రువ = ధ్రువమండలము; మేరువులన్ = మేరుపర్వతముల; ప్రదక్షిణంబున్ = చుట్టును; తిరుగున్ = తిరుగును; అపుడు = అప్పుడు; ఆ = ఆ; కాలచక్రంబున్ = కాలచక్రము; ఎదురన్ = ఎదురుగా; సంచరించు = ప్రయాణించెడి; సూర్య = సూర్యుడు; ఆది = మొదలగు; గ్రహంబులు = గ్రహముల; కున్ = కు; నక్షత్ర = నక్షత్రముల; అంతరంబులన్ = మధ్యప్రదేశముల; అందునున్ = లోను; రాశి = రాశుల; అంతరంబులన్ = మధ్యప్రదేశముల; అందునున్ = లోను; ఉనికి = స్థానము; కలుగుటన్ = కలిగి ఉండుట; చేతన్ = వలన; సూర్య = సూర్యుడు; ఆది = మొదలగు; గ్రహంబులు = గ్రహముల; కున్ = కు; చక్రగతి = చక్రభ్రమణము; స్వ = తన; గతుల = గమనములు; వలన = వలన; గతి = గమనముల; ద్వయంబున్ = రెండేసి; కలుగుచుండున్ = ఉండును; మఱియున్ = ఇంకను; ఆ = ఆ; సూర్యుండు = సూర్యుడు; ఆదినారాయణమూర్తి = ఆదినారాయణుని విగ్రహము {ఆదినారాయణుడు - ఆది (సృష్టికి ముందు) నారములు (నీటి) యందు వసించెడివాడు, సూర్యుడు}; అగుచున్ = అగుచు; లోకంబులన్ = లోకములకు; యోగక్షేమంబుల = శుభములు; కున్ = కు; వేద = వేదములు; త్రయ = మూటి (3); ఆత్మకంబున్ = స్వరూపము; ఐ = అయ్యి; కర్మ = పనులు; సిద్ధి = నెరవేరుట; నిమిత్తంబున్ = కోసము; ఐ = అయ్యి; దేవర్షి = దేవతలలో ఋషియైనవారి; గణంబుల = సమూహముల; చేతన్ = చేత; వేదాంత = వేదాంతముల; అర్థంబులన్ = అర్థములను; అనవరతంబున్ = ఎల్లప్పుడును; వితర్క్యమాణంబు = తర్కింపబడుతున్నవి; అగుచున్న = అగుతున్న; తన = తన యొక్క; స్వరూపంబును = స్వరూపమును; ద్వాదశ = పన్నెండు (12); విధంబులుగన్ = విధములుగా; విభజించి = విభజించుతూ; వసంత = వసంతము; ఆది = మొదలగు; ఋతువులన్ = ఋతువులను {ఋతువులు - వసంతాది - 1వసంతఋతువు 2గ్రీష్మఋతువు 3వర్షఋతువు 4శరదృతువు 5హేమంతఋతువు 6శిశిరఋతువు}; ఆయా = ఆయా; కాల = కాలముల యొక్క; విశేషంబులు = విశేషముల; అందున్ = లో; కలుగన్ = కలిగునట్లు; చేయుచుండున్ = చేయుచుండును; అట్టి = అటువంటి; పరమ = అఖిలమునకు పరమమైనట్టి; పురుషునిన్ = పురుషుని; మహిమన్ = గొప్పదనమును; ఈ = ఈ; లోకంబునన్ = లోకములో; మహాత్ములు = గొప్పవారు; అగు = అయిన; పురుషులు = వారు; తమతమ = వారివారి; వర్ణ = వర్ణధర్మములు {వర్ణములు - 1బ్రాహ్మణ 2క్షత్రియ 3వైశ్య 4శూద్ర అనెడి చాతుర్వర్ణములు}; ఆశ్రమ = ఆశ్రమముల ధర్మములు {ఆశ్రమములు - 1బ్రహ్మచర్యము 2గార్హస్త్యము 3వానప్రస్థము 4సన్యాసము అనెడి చతురాశ్రమములు}; ఆచారముల = ఆచారములు; చొప్పున = ప్రకారము; వేద = వేదములందు; ఉక్త = చెప్పబడిన; ప్రకారంబుగా = విధముగా; భక్తి = భక్తి యొక్క; అతిశయంబునన్ = పెరుగుటచేత; ఆరాధించుచు = సేవించుతూ; క్షేమంబున్ = శుభములను; ఒందుచుందురు = పొందుతుందురు; అట్టి = అటువంటి; ఆదినారాయణమూర్తి = ఆదినారాయణుని విగ్రహము; జ్యోతిశ్చక్ర = జ్యోతిశ్చక్రము {జ్యోతిశ్చక్రము - గ్రహనక్షత్రాదులైన జ్యోతిర్మండలభ్రమణముగల చక్రము, అంతరిక్షము}; అంతర్వర్తి = లోన తిరిగెడువాడు; ఐ = అయ్యి; స్వకీయ = తన యొక్క; తేజః = వెలుగుల; పుంజ = పుంజములచేత; దీపిత = ప్రకాశమానమైన; అఖిల = నిఖిలమైన; జ్యోతిః = జ్యోతిర్మండలముల; గణంబులు = సమూహములు; కలవాడు = కలిగినవాడు; ఐ = అయ్యి; ద్వాదశ = పన్నెండు (12) {ద్వాదశరాశులు - 1మేషము (మేక) 2వృషభము (ఎద్దు) 3మిథునము (దంపతులు 4కర్కాటకము (పీత) 5సింహము 6కన్య (పడచు) 7తుల (త్రాసు) 8వృశ్చికము (తేలు) 9ధనుస్సు (విల్లు) 10మకరము (మొసలి) 11కుంభము (కుండ) 12మీనము (చేప)}; రాసుల = రాశుల; అందున్ = లోను; ఒక = ఒక; సంవత్సరంబునన్ = సంవత్సరములో; సంచరించుచుండు = తిరుగుతుండెడి; అట్టి = అటువంటి; ఆదిపురుషుని = మూలపురుషుని; గమన = గతుల; విశేష = విశిష్ఠమైన; కాలంబునున్ = కాలమును; లోకులు = ప్రజలు; అయన = అయనములు {అయనములు - 1ఉత్తరాయణము 2దక్షిణాయనము}; ఋతు = ఋతువులు; మాస = నెలలు {నెలలు - పన్నెండు, 1చైత్రము 2వైశాఖము 3జేష్ఠము 4ఆషాడము 5శ్రావణము 6బాధ్రపదము 7ఆశ్వయుజము 8కార్తీకము 9మార్గశిరము 10పుష్యమి 11మాఘము 12ఫాల్గుణము}; పక్ష = పక్షములు {పక్షములు - 1శుక్లపక్షము 2కృష్ణపక్షము}; తిథులు = తిథులు {తిథులు - 1పాడ్యమి 2విదియ 3తదియ 4చవితి 5పంచమి 6షష్ఠి 7సప్తమి 8అష్టమి 9నవమి 10దశమి 11ఏకాదశి 12ద్వాదశి 13త్రయోదశి 14చతుర్దశి 15పున్నమి లేక అమావాస్య}; ఆదులు = మొదలగువాని; చేన్ = చేత; వ్యవహరించుచుందురు = చెప్పుకొనెదరు; మఱియున్ = ఇంకను; ఆ = ఆ; పరమ = సమస్తమునకు పరముయైనట్టి; పురుషుండు = వాడు; ఆ = ఆ; రాసుల = రాశుల; అందున్ = అందు; షష్ఠాంశ = ఆరవవంతు; సంచారంబున్ = తిరుగుట; అందిన = జరిగిన; సమయంబునున్ = కాలమును; ఋతువు = ఋతువు; అని = అని; వ్యవహరింపుదురు = అనెదరు; ఆ = ఆ; రాసుల = రాశుల; అందున్ = లో; అర్థాంశ = సగముభాగమును; సంచారమ్మునన్ = తిరుగుటయందు; రాశి = రాశుల; షట్క = ఆరింటిని; భోగం = అనుభవించుటను; పొందిన = పొందినట్టి; తఱి = కాలమును; అయనంబు = అయనము; అని = అని; చెప్పుదురు = చెప్పుతారు; సమగ్రంబుగా = పూర్తిగా; రాశులన్ = అన్ని రాశుల; అందున్ = లోను; సంచారమున్ = తిరుగుట; ఒందిన = పొందిన; ఎడలన్ = అట్లయితే; కాలంబునున్ = కాలమును; సంవత్సరంబున్ = సంవత్సరము; అని = అని; నిర్ణయింపుదురు = నిర్ణయించిరి; సమగ్ర = సంపూర్ణమైన; రాశి = రాశుల; సంచారంబున్ = సంచరించుట; అందున్ = లో; శీఘ్రగతి = వేగముగానడచుట; మందగతి = మెల్లగానడచుట; సమగతులన్ = సమానముగానడచుట; అనియెడు = అనెడు; త్రివిధగతి = మూడురకములనడకల; విశేషంబుల = విశిష్టతల; వలన = వలన; వేఱుపడెడు = ఏర్పడెడు; ఆ = ఆ; వత్సరంబునున్ = వత్సరమును; సంవత్సరంబు = సంవత్సరము; పరివత్సరంబు = పరివత్సరము; ఇడావత్సరంబు = ఇడావత్సరము; అనువత్సరంబు = అనువత్సరము; బిద్వత్సరంబు = బిద్వత్సరము; అని = అని; పంచ = ఐదు (5); విధంబులన్ = రకములుగ; చెప్పుదురు = చెప్పెదరు; చంద్రుండు = చంద్రుడు; ఈ = ఈ; తెఱంగునన్ = విధముగా; ఆ = ఆ; సూర్యమండలంబు = సూర్యమండలము; మీదన్ = పైన; లక్ష = ఒకలక్ష; యోజనంబులన్ = యోజనముల దూరములో; ఉండి = ఉండి; సంవత్సర = సంవత్సరము; పక్ష = పక్షములు; రాశి = రాశుల; నక్షత్ర = నక్షత్రముల; భుక్తులు = అనుభవించుటలు; గ్రహించుచు = తెలిసికొనుచు; అగ్ర = పైన; సంచారి = తిరిగెడువాడు; శీఘ్రగతిన్ = వేగముగా వెళ్ళుట; చరించు = సంచరిస్తున్న; అంతన్ = అంతట; వృద్ధి = అభివృద్ధి; క్షయ = క్షీణించుట; రూపంబున్ = రూపముతో; పితృ = పితృదేవతా; గణంబులన్ = సమూహముల; గణంబులు = గణముల; పూర్వ = శుక్ల; పక్షంబున్ = పక్షములు; అపర = కృష్ణ; పక్షంబుల = పక్షములు; చేతన్ = చేత; అహోరాత్రంబులన్ = రాత్రింబవళ్ళు; కలుగన్ = కలుగునట్లు; సకల = అఖిల; జీవ = ప్రాణులకు; ప్రాణంబు = ప్రాణాధారము; ఐ = అయ్యి; ఒక్క = ఒక్కక్క; నక్షత్రంబున్ = నక్షత్రమును; త్రింశ = ముప్పై (30); ముహూర్తంబులను = ముహూర్తములను; అనుభవించుచున్ = అనుభవించుచు; షోడశ = పదహారు; కళలు = చంద్రకళలు; కలిగి = ఉండి; మనోమయ = మనస్సుతోను; అన్నమయ = అన్నముతోను; అమృతమయ = అమృతముతోను; దేహుండు = శరీరము గలవాడు; ఐ = అయ్యి; దేవ = దేవతలకు; పితృ = పితృగణములకు; మనుష్య = మానవులకు; భూత = జంతువులకు; పశు = పశువులకు; పక్షి = పక్షులకు; సరీసృప = పొట్టతోపాకెడు ప్రాణులకు; వీరుత్ = పొదలు దుబ్బులు తీగలు; ప్రభృతుల = ఆదుల; కున్ = కు; ప్రాణ = ప్రాణములకు; ఆప్యాయ = తృప్తిని; శీలుండు = కలిగించెడి తత్వముగలవాడు; అగుటన్ = అగుట; చేసి = వలన; సర్వసముండు = సర్వసముడు; అనంబడు = అందురు;

భావము:

“రాజా! కుమ్మరిసారె వేగంగా గిరగిరా తిరుగుతుంటుంది. ఆ సారెమీద చీమల బారులు తిరుగుతుంటాయి. అయితే వాటి గమనం ఆ చక్ర భ్రమణానికి భిన్నంగా ఉంటుంది. అదే విధంగా నక్షత్రాలతో, రాసులతో కూడిన కాలచక్రం తిరుగుతున్నది. ఆ కాలచక్రం ధ్రువ మేరువులను ప్రదక్షిణం చేస్తూ తిరిగేటప్పుడు ఆ కాలచక్రం వెంట తిరిగే సూర్యాది గ్రహాలు నక్షత్రాలలోను, రాసులలోను సంచరిస్తూ ఉంటాయి. అందువల్ల సూర్యాది గ్రహాలకు కాలచక్ర గమనం, స్వగమనం అనే రెండు రకాల గమనాలు కలుగుతున్నాయి. అంటే తమంత తాము తిరగడం, కాలచక్ర గమనంతో తిరగడం. ఆదినారాయణుడే సూర్యుడుగా ప్రకాశిస్తున్నాడు. ఆ సూర్యభగవానుడు సమస్త లోకవాసుల యోగక్షేమాలు ప్రసాదించేవాడు. అతడు ఋగ్యజుస్సామ వేదస్వరూపుడు. మానవులు నిర్వహించే కర్మలకు సిద్ధి ప్రదాత. ఆ దేవుని స్వరూపాన్ని దేవర్షి గణాలు వేదాంతపరంగా భావించి సంభావిస్తారు. అటువంటి సూర్యుడు తన స్వరూపాన్ని పన్నెండు విధాలుగా విభజించి వసంతం గ్రీష్మం మొదలైన ఋతువులను ఆయా కాలాలలో కలుగజేస్తూ ఉంటాడు. అటువంటి పరమ పురుషుని మహిమను అర్థం చేసుకొన్న మహాత్ములు వర్ణాశ్రమాలను పాటిస్తూ వేదాలలో చెప్పబడ్డట్టు అతిశయమైన భక్తితో ఆయనను ఆరాధిస్తూ క్షేమంగా ఉంటారు. సూర్య రూపుడైన ఆదినారాయణమూర్తి జ్యోతిశ్చక్రంలో తిరుగుతూ తన తేజస్సుతో గ్రహగోళాలను వెలిగిస్తూ ద్వాదశ రాసులలో ఒక సంవత్సరకాలం సంచరిస్తాడు. ఆ ఆదిపురుషుని గమన విశేషాన్ని లోకులు అయనాలు, ఋతువులు, మాసాలు, పక్షాలు, తిథులు అనే పేర్లతో వ్యవహరిస్తూ ఉంటారు. రాసులలో ఆరవ భాగం సంచారం చేసే కాలాన్ని ఋతువని వ్యవహరిస్తారు. ఆ రాసులలో సగభాగం సంచరిస్తూ ఆరు రాసులలో తిరిగే కాలాన్ని అయన మంటారు. రాసులన్నిటిలోను పూర్తిగా తిరిగిన కాలాన్ని సంవత్సర మని నిర్ణయిస్తారు. ఆ సమగ్ర రాశి సంచారంలో మూడు రకాలైన గమనాలు ఉంటాయి. మొదటిది శ్రీఘ్రగతి. రెండవది మందగతి. మూడవది సమగతి. ఈ గతుల కారణంగా సంవత్సరంలో కలిగిన మార్పులను వరుసగా వత్సరం, పరివత్సరం, ఇడావత్సరం, అనువత్సరం, ఇద్వత్సరం అని ఐదు విధాలుగా చెబుతారు. ఇదే పద్ధతిలో చంద్రుడు సూర్యమండలం మీద లక్ష యోజనాల దూరం నుండి సంవత్సరం, పక్షాలు, రాసులు, నక్షత్రాలు భుక్తులను గ్రహిస్తూ ముందుండి వేగంగా సంచరిస్తాడు. చంద్రుని వృద్ధి క్షయాల వల్ల పితృగణాలకు పూర్వపక్షం, అపరపక్షం అనేవి ఏర్పడతాయి. వీటివల్లనే పగలు రాత్రులు కలుగుతాయి. చంద్రుడు ఒక్కొక్క నక్షత్రంలో ముప్పై ముహూర్తాల కాలం సంచరిస్తాడు. పదహారు కళలతో మనోమయ, అన్నమయ, అమృతమయ దేహంతో ఒప్పుతూ ఉంటాడు. దేవతలకు, పితృగణానికి, మానవులకు, భూతాలకు, జంతువులకు, పక్షులకు, పాములు మొదలైనవాటికి, తీగలకు, పొదలకు ప్రాణప్రదమైన తన స్పర్శవల్ల సంతృప్తిని కలిగిస్తూ చంద్రుడు సర్వసముడుగా ప్రకాశిస్తాడు.