పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : భగణ విషయము

  •  
  •  
  •  

5.2-83-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఆ రథంబునకు గాయత్రీచ్ఛందం బాదిగా సప్తచ్ఛందంబులు నశ్వంబులై సంచరించు; భాస్కరునకు నగ్రభాగంబున నరుణుండు నియుక్తుండై రథంబు గడపుచుండు; వెండియు నంగుష్ఠపర్వమాత్ర శరీరంబులుగల యఱువదివేల వాలఖిల్యాఖ్యు లగు ఋషివరులు సూర్యుని ముందట సౌరసూక్తంబుల స్తుతియింప, మఱియు ననేక మునులును గంధర్వ కిన్నర కింపురుష నాగాప్సరః పతంగాదులును నెలనెల వరుస క్రమంబున సేవింపం, దొమ్మిదికోట్ల నేబఁది యొక లక్ష యోజనంబుల పరిమాణంబు గల భూమండలంబు నం దొక క్షణంబున సూర్యుండు రెండువేలయేబది యోజనంబులు సంచరించుచు, నొక యహోరాత్రంబు నందె యీ భూమండలం బంతయు సంచరించు" ననిన శుకయోగీంద్రునకుఁ బరీక్షిన్నరేంద్రుం డిట్లనియె.

టీకా:

ఆ = ఆ; రథంబున్ = రథమున; కున్ = కు; గాయత్రీచ్ఛందంబున్ = గాయత్రీ ఛందస్సు; ఆదిగా = మొదలుగా; సప్తచ్ఛందంబులున్ = ఏడు ఛందస్సులును {సప్తచ్ఛందస్సులు - 1గాయత్రి 2ఉష్టిక్ 3త్రిష్టుప్ 4అనుష్టుప్ 5జగతీ 6పంక్తి 7బృహతి అనెడి ఏడు ఛందస్సులు}; అశ్వంబులును = గుఱ్ఱములు; ఐ = అయ్యి; సంచరించు = తిరుగుచుండెడి; భాస్కరున్ = భాస్కరున; కున్ = కు; అగ్ర = పై; భాగంబునన్ = భాగములో; అరుణుండు = అరుణుడు; నియుక్తుండు = నియమింపబడినవాడు; ఐ = అయ్యి; రథంబున్ = రథమును; గడుపుచుండున్ = నడుపుచుండును {గడుపుచుండును - సమయమును నడుపుచుండును, నడుపుచుండును}; వెండియున్ = ఇంకను; అంగుష్ఠ = బొటకనవేలి; పర్వ = కణుపు; మాత్ర = అంతమాత్రపు; శరీరంబున్ = దేహము; కల = కలిగిన; అఱువదివేల = అరవైవేలమంది; వాలఖిల్య = వాలఖిల్యులు; ఆఖ్యులు = అనెడి పేరు కలవారు; అగు = అయిన; ఋషి = ఋషులలో; వరులు = ఉత్తములు; సూర్యునిన్ = సూర్యుని; ముందటన్ = ముందు; సౌరసూక్తంబులన్ = సూర్యస్తోత్రములను; స్తుతియింపన్ = స్తుతించుతుండగా; మఱియున్ = ఇంకను; అనేక = అనేకమైన; మునులునున్ = మునులు; గంధర్వ = గంధర్వులు; కిన్నర = కిన్నరలు; కింపురుష = కింపురుషులు; నాగ = నాగులు; అప్సరః = అప్సరసలు; పతంగ = పక్షులు; ఆదులు = మొదలగువారు; నెలనెల = మాసము తరువాత మాసము; వరుసన్ = వరసగా; క్రమంబునన్ = క్రమముగ; సేవింపన్ = కొలచుతుండగా; పందొమ్మిది కోట్ల నేబది యొక లక్ష = పంతొమ్మిదికోట్లయేభైయొక్కలక్షల (19,51, 00,000); యోజనంబులన్ = యోజనముల; పరిమాణము = పరిమాణము; కల = కలిగిన; భూమండలంబున = భూమండలము; అందున్ = లో; ఒక్క = ఒక; క్షణంబునన్ = క్షణములో; సూర్యుండు = సూర్యుడు; రెండువేలఏబది = రెండువేలయోభై (2,050); యోజనంబులున్ = యోజనములను; సంచరించున్ = ప్రయాణించును; ఒక = ఒక; అహోరాత్రంబున్ = రాత్రింబవలు; అందె = అందలోనే; ఈ = ఈ; భూమండలంబున్ = భూమండలము; అంతయున్ = మొత్తమంతా; సంచరించున్ = ప్రయాణించును; అనిన = అనగా; శుక = శుకుడు యనెడి; యోగి = యోగులలో; ఇంద్రున్ = ఇంద్రుని వంటివాని; కున్ = కి; పరీక్షిత్ = పరీక్షితుడు యనెడు; నరేంద్రుడు = రాజు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను;

భావము:

ఆ సూర్యరథానికి గాయత్రి ఉష్టిక్ త్రిష్టుప్ అనుష్టుప్ జగతీ పంక్తి బృహతి అనెడి ఏడు ఛందస్సులు గుఱ్ఱాలుగా ఉన్నాయి. సూర్యునికి అరుణుడు రథసారథి. అతడు సూర్యుని ముందు భాగంలో కూర్చుండి రథాన్ని నడుపుతుంటాడు. బొటనవ్రేలి కణుపు పరిమాణం దేహం కలిగిన వాలఖిల్యులు అనే ఋషిపుంగవులు అరవై వేల మంది జ్యోతిర్మయ స్వరూపాలను ధరించినవారు సూర్యుని ముందుండి వేద సూక్తాలతో స్తోత్రం చేస్తుంటారు. ఎందరో మునులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, నాగులు, అప్సరసలు, గరుడులు మొదలైనవారు క్రమం తప్పకుండా సూర్యుణ్ణి సేవిస్తూ ఉంటారు. తొమ్మిది కోట్ల యాభైఒక్క లక్షల యోజనాల పరిమాణం కలిగిన భూమండలం చుట్టూ సూర్యుడు క్షణానికి రెండువేల యాభై యోజనాల చొప్పున అహోరాత్రంలో సంచరిస్తాడు” అని చెప్పిన శుకయోగీంద్రునితో పరీక్షిత్తు ఇలా అన్నాడు.