పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : భగణ విషయము

  •  
  •  
  •  

5.2-81-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు; నివ్విధంబున దివసంబు లుత్తరాయణ దక్షణాయనంబుల వృద్ధిక్షయంబుల నొంద నొక్క యహోరాత్రంబున నేకపంచాశదుత్తరనవ కోటి యోజనంబుల పరిమాణంబు గల మానసోత్తర పర్వతంబున సూర్యరథంబు దిరుగుచుండు; నా మానసోత్తరపర్వతంబు నందుఁ దూర్పున దేవధాని యను నింద్రపురంబును, దక్షిణంబున సంయమని యను యమ నగరంబును, పశ్చిమంబున నిమ్లోచని యను వరుణ పట్టణంబును, నుత్తరంబున విభావరి యను సోముని పుటభేదనం బును దేజరిల్లుచుండు; నా పట్టణంబుల యందు నుదయ మధ్యాహ్నా స్తమయ నిశీథంబు లనియెడు కాలభేదంబులను, భూత ప్రవృత్తి నిమిత్తం బచ్చటి జనులకుఁ బుట్టించు చుండు; సూర్యుం డెపు డింద్ర నగరంబున నుండి గమనించు నది యాదిగాఁ బదియేను గడియలను రెండుకోట్ల ముప్పదియేడులక్షల డెబ్బదియైదువేల యోజనంబులు నడచు; నివ్వింధంబున నింద్ర యమ వరుణ సోమ పురంబుల మీఁదఁ జంద్రాది గ్రహ నక్షత్రంబులం గూడి సంచరించుచుం బండ్రెండంచులు, నాఱు గమ్ములును, మూఁడు దొలులుం గలిగి సంవత్సరాత్మకంబయి యేకచక్రం బయిన సూర్యుని రథంబు ముహూర్త మాత్రంబున ముప్పది నాలుగులక్షల నెనమన్నూఱు యోజనంబులు సంచరించు.

టీకా:

మఱియున్ = ఇంకను; ఈ = ఈ; విధంబునన్ = విధముగ; దివసంబులు = పగళ్ళు; ఉత్తరాయణ = ఉత్తరాయణము; దక్షిణాయనంబులన్ = దక్షిణాయనములందు; వృద్ధి = పెరుగుట; క్షయంబులన్ = తగ్గుటలను; ఒందన్ = పొందుతుండగ; ఒక్క = ఒక; అహోరాత్రంబునన్ = పగలు రాత్రిసమయములో; ఏకపంచాశదుత్తరనవకోటి = తొమ్మిదికోట్లయేభైయొక్క; యోజనంబులన్ = యోజనముల; పరిమాణంబున్ = పరిమాణము; కల = కలిగిన; మానసోత్తర = మానసోత్తరము అనెడి; పర్వతంబునన్ = పర్వతము నందు; సూర్య = సూర్యుని; రథంబున్ = రథము; తిరుగుచుండున్ = తిరుగుతుండును; ఆ = ఆ; మానసోత్తరపర్వతంబు = మానసోత్తరపర్వతము; అందున్ = అందు; తూర్పున = తూర్పువైపున; దేవధాని = దేవధాని; అను = అనెడి; ఇంద్ర = ఇంద్రుని యొక్క; పురంబునున్ = పట్టణము; దక్షిణంబునన్ = దక్షిణమువైపున; సంయమని = సంయమని; అను = అనెడి; యమ = యముని యొక్క; నగరంబునున్ = పట్టణము; పశ్చిమంబునన్ = పడమరవైపున; నిమ్లోచని = నిమ్లోచని; అను = అనెడి; వరుణ = వరుణుని యొక్క; పట్టణంబునున్ = పట్టణము; ఉత్తరంబునన్ = ఉత్తరమువైపున; విభావరి = విభావరి; అను = అనెడి; సోముని = సోముని యొక్క; పుటభేదనంబునున్ = పట్టణము; తేజరిల్లుచుండున్ = విలసిల్లుచుండును; ఆ = ఆ; పట్టణంబులన్ = పట్టణములు; అందునున్ = లోను; ఉదయ = ఉదయము; మధ్యాహ్న = మధ్యాహ్నము; అస్తమయ = అస్తమయము; నిశీథంబులు = రాత్రులు; అనియెడు = అనెడు; కాల = కాలము లందలి; భేదంబులను = రకములతో; భూత = ప్రాణుల; ప్రవృత్తి = ప్రవర్తించుట; నిమిత్తంబు = కోసము; అచ్చటన్ = అక్కడి; జనుల్ = ప్రజల; పుట్టించుచుండున్ = సృష్టించుచుండును; సూర్యుండు = సూర్యుడు; ఎపుడున్ = ఎప్పుడైతే; ఇంద్ర = ఇంద్రుని యొక్క; నగరంబున్ = పట్టణము (తూర్పున ఉన్నది); నుండి = నుండి; గమనించునది = నడచెడిది {గమనించునది - గమనము చేసెడిది, నడచెడిది}; ఆదిగా = మొదలు; పదియేను = పదిహేను; గడియలను = గడియలలో; రెండుకోట్లముప్పదియేడులక్షలడెబ్బదియైదువేల = రెండుకోట్లముప్పైయేడులక్షలడెబ్బైయైదువేల (2,37,55,000); యోజనంబులున్ = యోజనములు; నడచున్ = నడచును; ఈ = ఈ; విధంబునన్ = విధముగ; ఇంద్ర = ఇంద్రుని యొక్క; యమ = యముని యొక్క; వరుణ = వరుణుని యొక్క; సోమ = సోముని యొక్క; పురంబులు = పట్టణములు; మీదన్ = పైన; చంద్ర = చంద్రుడు; ఆది = మొదలగు; గ్రహ = గ్రహములు; నక్షత్రంబులన్ = నక్షత్రములను; కూడి = కలిసి; సంచరించుచున్ = తిరుగుతూ; పండ్రెండు = పన్నెండు (12); అంచులున్ = అంచులు; ఆఱు = ఆరు (6); కమ్ములు = కమ్మీలు; మూడు = మూడు (3); తొలులు = కుండలు, తొట్లు; కలిగి = కలిగుండి; సంవత్సర = సంవత్సరము; ఆత్మకంబున్ = స్వరూపము; అయి = అయ్యి; ఏక = ఒక; చక్రంబున్ = చక్రము కలది; అయిన = అయిన; సూర్యుని = సూర్యుని యొక్క; రథంబున్ = రథము; ముహూర్త = ముహూర్తపు; మాత్రంబునన్ = మాత్రపు సమయములో; ముప్పదినాలుగులక్షలనెనమన్నూఱు = ముప్పైనాలుగులక్షలఎనిమిదివందల (34,00,800); యోజనంబులున్ = యోజనములు; సంచరించున్ = తిరుగును;

భావము:

ఈ ప్రకారంగా అహోరాత్రాలను ఉత్తరాయణ, దక్షిణాయనాలలో పెంచుతూ తగ్గిస్తూ ఒక్కదినంలో తొమ్మిది కోట్ల యాభైఒక్క లక్షల యోజనాల పరిమాణం కలిగిన దూరం మానసోత్తర పర్వతం నలువైపులా సూర్యరథం తిరుగుతూ ఉంటుంది. ఈ పర్వతం తూర్పున దేవధాని అనే ఇంద్రుని పట్టణం, దక్షిణంలో సంయమని అనే యముని పట్టణం, పశ్చిమంలో నిమ్లోచన అనే వరుణుని పట్టణం, ఉత్తరంలో విభావరి అనే సోముని పట్టణం ఉన్నాయి. ఈ నాలుగు పట్టణాలలోను సూర్యుడు క్రమంగా ఉదయం, మధ్యాహ్నం, అస్తమయం, అర్ధరాత్రం అనే కాల భేదాలను కల్పిస్తూ ఉంటాడు. ఈ ఉదయం మొదలైనవి అక్కడి జీవుల ప్రవృత్తి నివృత్తులకు కారణా లవుతుంటాయి. సూర్యుడు ఇంద్రనగరం నుండి యమనగరానికి పయనించేటప్పుడు పదిహేను గడియలలో రెండు కోట్ల ముపై ఏడు లక్షల డెబ్బై ఐదు వేల యోజనాలు అతిక్రమించి యమనగరానికి, ఇదే విధంగా అక్కడి నుంచి వరుణ, సోమ నగరాలకు చంద్రాది గ్రహాలతో, నక్షత్రాలతో సంచరిస్తాడు. పన్నెండు ఆకులూ, ఆరు కమ్ములూ, మూడు కుండలూ (నాభి ప్రదేశాలు) కలిగి ఏకచక్రంతో కూడి సంవత్సరాత్మకమైన సూర్యుని రథం ఒక ముహూర్తకాలంలో ముప్పై నాలుగు లక్షల ఎనిమిది వందల యోజనాలు ప్రయాణం చేస్తుంది.