పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : భూ ద్వీప వర్ష విస్తారములు

  •  
  •  
  •  

5.2-75-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు వివిధమంత్ర గోపనార్థం బా నగాగ్రంబున నున్న భగవంతుండు దక్క లోకాలోకపర్వతంబునకు నవ్వల నొరులకు సంచరింప నశక్యంబయి యుండు; బ్రహ్మాండంబునకు సూర్యుండు మధ్య గతుండై యుండు; నా సూర్యునకు నుభయ పక్షంబుల యందు నిరువదేను కోట్ల యోజన పరిమాణంబున నండకటాహం బుండు; నట్టి సూర్యునిచేత నాకాశదిక్స్వర్గాపవర్గంబులును నరకంబులును నిర్ణయింపంబడు; దేవ తిర్యఙ్మనుష్య నాగ పక్షి తృణ గుల్మలతాది సర్వజీవులకును సూర్యుం డాత్మ యగుచు నుండు.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; వివిధ = అనేక రకము లైన; మంత్ర = మంత్రముల; గోపన = రహస్యములను; అర్థంబున్ = కాపాడుటకు; ఆ = ఆ యొక్క; నగ = పర్వతము యొక్క; అగ్రంబునన్ = శిఖరమున; ఉన్న = ఉన్నట్టి; భగవంతుండు = నారాయణుడు; తక్క = తప్పించి; లోకాలోకపర్వతంబున్ = లోకాలోకపర్వతమున; కున్ = కు; అవ్వలన్ = ఆవతల; ఒరుల్ = ఇతరుల; కున్ = కు; సంచరింపన్ = వర్తించుటకు, తిరుగుటకు; అశక్యంబున్ = అసాధ్యము; అయి = అయ్యి; ఉండున్ = ఉండును; బ్రహ్మాండంబున్ = బ్రహ్మాండమున {బ్రహ్మాండము - భూగోళ ఖగోళాదికములు కల పెద్ద అండము (గోళము)}; కున్ = కు; సూర్యుండు = సూర్యుడు; మధ్య = నడుమ; గతుండు = తిరుగువాడు; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; ఆ = ఆ; సూర్యున్ = సూర్యుని; కున్ = కి; ఉభయ = రెండు; పక్షంబులన్ = వైపుల; అందున్ = లోను; ఇరువదేనుకోట్ల = ఇరవైదుకోట్ల (25,00,00,000); యోజన = యోజనముల; పరిమాణంబునన్ = దూరమున; అండకటాహంబున్ = అండకటాహము {అండకటాహము - అండ (బ్రహ్మాండ) కటాహము (పైడిప్ప)}; ఉండున్ = ఉండును; అట్టి = అటువంటి; సూర్యుని = సూర్యభగవానుని; చేతన్ = చేత; ఆకాశ = ఆకాశము; దిక్క్ = దిక్కులు; స్వర్గ = స్వర్గము; అపవర్గంబులును = మోక్షములును; నరకంబులును = నరకములును; నిర్ణయింపంబడున్ = నిర్ణయము చేయబడును; దేవ = దేవతలు; తిర్యక్ = తిర్యక్కులు {తిర్యక్కు - తిరిగెడివి, జంతువులు మొదలగునవి}; మనుష్యు = మానవులు; నాగ = నాగులు; పక్షి = పక్షులు; తృణ = గడ్డిమొక్కలు; గుల్మ = పొదలు; లత = లతలు; ఆది = మొదలైన; సర్వ = నిఖిలమైన; జీవులు = ప్రాణుల; కును = కు; సూర్యుండు = సూర్యభగవానుడు; ఆత్మ = లో ఉండువాడు; అగుచున్ = అగుచు; ఉండు = ఉండును;

భావము:

ఈ విధంగా వివిధ మంత్రాలను రహస్యంగా రక్షించడానికి ఆ పర్వతం మీద ఉన్న భగవంతుడు తప్ప ఆ లోకాలోక పర్వతం ఆవల ఎవ్వరికి సంచరించడానికి శక్యం కాదు. బ్రహ్మాండానికి మధ్య భాగంలో సూర్యుడు ఉన్నాడు. ఆ సూర్యునికి ఇరువైపులా ఇరవై అయిదు కోట్ల యోజనాల దూరంలో బ్రహ్మాండ కటాహం ఉంది. ఆ సూర్యభగవానుడే ఆకాశం, దిక్కులు, స్వర్గనరకాలు, మోక్షం అనే వాటిని నిర్దేశిస్తాడు. దేవతలకు, మానవులకు, జంతువులకు, సర్పాలకు, పక్షులకు, గడ్డిపోచలకు, తీగలకు, పొదలకు, సర్వజీవరాసులకు సూర్యుడే ఆత్మ.