పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : భూ ద్వీప వర్ష విస్తారములు

  •  
  •  
  •  

5.2-73-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు; పుష్కరద్వీపంబు చతుష్షష్టిలక్ష యోజన విస్తారం బైన శుద్ధోదక సముద్ర ముద్రితం బగుచుండు; నవ్వల లోకాలోకపర్వతం బుండు; శుద్ధోదక సముద్ర లోకాలోకపర్వతంబుల నడుమ రెండుకోట్ల యోజన విస్తారంబయిన నిర్జన భూమి దర్పణోదర సమానంబై దేవతావాస యోగ్యంబుగా నుండు; నా భూమిం జేరిన పదార్థంబు మరలఁ బొంద నశక్యంబుగా నుండు; అటమీఁద లోకాలోకపర్వతం బెనిమిది కోట్ల యోజనంబులు సువర్ణభూమియు సూర్యాది ధ్రువాంతంబు లగు జ్యోతిర్గణంబుల మధ్యంబున నుండుటంజేసి లోకాలోకపర్వతం బనందగి యుండు; పంచాశత్కోటి యోజనవిస్తృతం బగు భూమండల మానంబునకు దురీయాంశ ప్రమాణంబుగల యా లోకాలోక పర్వతంబు మీఁద నఖిల జగద్గురువగు బ్రహ్మచేతఁ జతుర్దిశల యందు ఋషభ పుష్కరచూడ వామ నాపరాజిత సంజ్ఞలుగల దిగ్గజంబులు నాలుగును లోకరక్షణార్థంబు నిర్మితంబై యుండు; మఱియును.

టీకా:

మఱియున్ = ఇంకను; పుష్కరద్వీపంబున్ = పుష్కరద్వీపము; చతుష్షష్టిలక్ష = అరవైనాలుగు లక్షల (6400000); యోజన = యోజనముల; విస్తారంబున్ = విశాలము; ఐన = అయిన; శుద్ద = స్వచ్ఛమైన, మంచి; ఉదక = నీటి; సముద్ర = సముద్రముచేత; ముద్రితంబున్ = సరిహద్దులు కలది; అగుచుండున్ = అయ్యి ఉండును; అవ్వలన్ = దానికి ఆవతల; లోకాలోకపర్వతంబున్ = లోకాలోకపర్వతము; ఉండున్ = ఉండును; శుద్ధోదకసముద్ర = మంచినీటి సముద్రము; లోకాలోకపర్వతంబుల = లోకాలోకపర్వతముల; నడుమ = మధ్యన; రెండుకోట్ల = రెండుకోట్ల (20000000); యోజన = యోజనముల; విస్తారంబున్ = విస్తారము కలది; అయిన = అయినట్టి; నిర్జన = జనసంచారములేని; భూమి = ప్రదేశము; దర్పణ = అద్దము; ఉదర = పైతలమునకు; సమానంబున్ = సమానమైనది; ఐ = అయ్యి; దేవతా = దేవతలు; వాస = నివసించుటకు; యోగ్యంబుగాన్ = తగినదిగా; ఉండున్ = ఉండును; ఆ = ఆ; భూమిన్ = ప్రదేశమును; చేరిన = చేరినట్టి; పదార్థంబున్ = పదార్థములను; మరల = వెనుకకు; పొందుట = పొందుట; కున్ = కు; అశక్యంబుగాన్ = అసాధ్యముగా; ఉండున్ = ఉండును; అటమీద = తరువాత; లోకాలోకపర్వతంబు = లోకలోకపర్వతము; ఎనిమిదికోట్ల = ఎనిమిదికోట్ల (80000000); యోజనంబులున్ = యోజనములు; సువర్ణభూమియున్ = బంగారు భూమియును; సూర్య = సూర్యుడు; ఆది = మొదలు; ధ్రువ = ధ్రువమండలము; అంతంబులు = అంత మగువరకు; అగు = అయిన; జ్యోతిర్గణంబుల = జ్యోతిర్మండలముల గుంపుల; మధ్యంబునన్ = నడుమ; ఉండుటన్ = ఉండుట; చేసి = వలన; లోకాలోకపర్వతంబు = లోకాలోకపర్వతము {లోకాలోకపర్వతము - లోక (ఉన్నది, లోకములకు) అలోక (లేనిది ఐన, పరలోకములకు మధ్యన ఉన్నట్టి) పర్వతము}; అనన్ = అనుటకు; తగి = తగినది ఐ; ఉండున్ = ఉండును; పంచాశత్కోటి = యాభైకోట్ల (50,00,00,000); యోజన = యోజనముల; విస్తృతంబున్ = విస్తారము కలది; అగున్ = అయ్యి ఉండును; భూమండల = భూమండలముపై ఉండెడి; మానంబున్ = మానము, కొలతలకు; కున్ = కు; తురీయాంశ = నాలుగవవంతు; ప్రమాణంబున్ = ప్రమాణములు, కొలతలు; కల = కలిగిన; ఆ = ఆ; లోకాలోకపర్వతంబు = లోకాలోకపర్వతము; మీదన్ = పైన; అఖిల = సర్వ; జగత్ = లోకములకు; గురువు = గురువు, పెద్దవాడు; అగు = అయిన; బ్రహ్మ = బ్రహ్మదేవుని; చేతన్ = చేత; చతుః = నాలుగు; దిశలన్ = దిక్కులు; అందున్ = లోను; ఋషభ = ఋషభము; పుష్కరచూడ = పుష్కరచూడము; వామన = వామనము; అపరాజిత = అపరాజితము; సంజ్ఞలు = అనెడి పేర్లు; కల = కలిగిన; దిగ్గజంబులు = దిగ్గజములు {దిగ్గజములు – దిక్కు లందు ఉండెడి ఏనుగులు}; నాలుగును = నాలుగు; లోక = లోకములను; రక్షణ = రక్షణ కలిగించుట; అర్థంబున్ = కొరకు; నిర్మితంబు = తయారు చేయబడి; ఉండు = ఉండును; మఱియును = ఇంకను;

భావము:

ఇంకా ఆ పుష్కరద్వీపం అరవై నాలుగు లక్షల యోజనాల విస్తృతి కలిగి ఉంటుంది. దాని చుట్టూ అంతే విస్తీర్ణం కలిగి పరిశుద్ధమైన జలంతో నిండిన సముద్రం ఉంది. ఆ సముద్రానికి ఆవల లోకాలోకం అనే పర్వతం ఉంది. సముద్రానికి ఆ పర్వతానికి మధ్యగల ప్రదేశం రెండు కోట్ల యోజనాల విస్తీర్ణం కలిగి ఉంటుంది. అక్కడ మానవ సంచారం లేదు. ఆ భూమి అద్దంలాగా స్వచ్ఛంగా ఉంటుంది. అది దేవతల నివసించడానికి ప్రయత్నించినా చేతికందదు. ఆ పైన ఎనిమిది కోట్ల యోజనాల ప్రదేశం బంగారు భూమిలాగా ప్రకాశిస్తూ ఉంటుంది. సూర్యుని నుండి ధ్రువతార వరకు వ్యాపించిన జ్యోతిర్గణం మధ్య ఉండడం వల్ల ఆ పర్వతానికి లోకాలోక పర్వతమనే పేరు సార్థకం అవుతున్నది. ఈ భూమండలమంతా యాభైకోట్ల యోజనాల విస్తృతి కలిగి ఉందు. అందులో నాల్గవవంతు లోకాలోక పర్వతం. ఆ పర్వతం మీద సకలలోక గురుడైన బ్రహ్మదేవుడు ఋషభం, పుష్కరచూడం, వామనం, అపరాజితం అనే దిగ్గజాలను లోకరక్షణార్థం నిలిపి ఉంచాడు.