పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : భూ ద్వీప వర్ష విస్తారములు

  •  
  •  
  •  

5.2-64-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు హిరణ్యరేతసుండు వసుదాన, దృఢరుచి, నాభి, గుప్త, సత్యవ్రత, విప్ర, వామదేవులను నామంబులుగల పుత్రుల,నామంబుల సప్త వర్షంబులం గావించి యా కుమారులనందు నిలిపి తాను దపంబు నకుం జనియె; నా వర్షంబునందు బభ్రు చతుశ్శృంగ కపిల చిత్రకూట దేవానీకోర్ధ్వరోమ ద్రవిణంబులను నామంబులు గల సప్తగిరులును, రసకుల్యయు, మధుకుల్యయు, శ్రుతవిందయు, మిత్రవిందయు, దేవగర్భయు, ఘృతచ్యుతయు, మంత్రమాలయు నను సప్త మహానదులును గల వా నదీజలంబులఁ గృతమజ్జను లగుచు భగవంతుండగు యజ్ఞపురుషునిఁ గుశల కోవిదాభియుక్త కులక సంజ్ఞలు గల వర్షపురుషు లారాధించుచుందురు.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; హిరణ్యరేతసుండు = హిరణ్యరేతసుడు; వసుదాన = వసుదానుడు; దృఢరుచి = దృఢరుచి; నాభి = నాభుడు; గుప్త = గుప్తుడు; సత్యవ్రత = సత్యవ్రతుడు; విప్ర = విప్రుడు; వామదేవులు = వామదేవుడు; అను = అనెడి; నామంబులున్ = పేర్లు; కల = కలిగిన; పుత్రుల = కుమారుల యొక్క; నామంబులన్ = పేర్లతో; సప్త = ఏడు (7); వర్షంబులన్ = వర్షములను, దేశములను; కావించి = ఏర్పరచి; ఆ = ఆ; కుమారులన్ = పుత్రులను; అందున్ = వాని యందు; నిలిపి = నిలబెట్టి; తాను = తను; తపంబున్ = తపస్సు చేసుకొనుట; కున్ = కు; చనియెన్ = వెళ్ళెను; వర్షంబున్ = వర్షము, దేశము; అందున్ = లో; బభ్రు = బభ్రువు; చతుశ్శృంగ = చతుశ్శృంగము; కపిల = కపిలము; చిత్రకూట = చిత్రకూటము; దేవానీక = దేవానీకము; ఊర్ధ్వరోమ = ఊర్ధ్వరోమము; ద్రవిణంబులు = ద్రవిణములు; అను = అనెడి; నామంబులున్ = పేర్లు; కల = కలిగిన; సప్త = ఏడు (7); గిరులును = పర్వతములును; రసకుల్యయున్ = రసకుల్యము; మధుకుల్యయున్ = మధుకుల్యము; శ్రుత విందయు = శ్రుతవింద; మిత్రవిందయు = మిత్రవింద; దేవగర్భయున్ = దేవగర్భము; ఘృతచ్యుత = ఘృతచ్యతము; మంత్రమాలయున్ = మంత్రమాల; అను = అనెడి; సప్త = ఏడు (7); మహా = పెద్ద; నదులునున్ = నదులు; కలవు = ఉన్నవి; ఆ = ఆ; నదీ = నదియొక్క; జలములన్ = నీటిలో; కృత = చేసిన; మజ్జనులు = స్నానముచేసినవారు; అగుచున్ = అగుచు; భగవంతుండు = నారాయణుని {భగవంతుడు – మహత్యము గలవాడు, సృష్టి పుట్టుక స్థానమైనవాడు, మోక్ష స్థానమైనవాడు, విష్ణువు}; యజ్ఞపురుషుని = నారాయణుని {యజ్ఞ పురుషుడు - యజ్ఞములకు పతియైనవాడు, విష్ణువు}; కుశల = కుశలులు; కోవిద = కోవిదులు; అభియుక్త = అభియుక్తులు; కులక = కులకులు; సంజ్ఞలున్ = అనెడి పేర్లు; కల = కలిగిన; వర్ష = వర్షము నందలి, దేశపు; పురుషులున్ = మానవులు; ఆరాధించుచుందురు = పూజింతురు;

భావము:

ఈ విధంగా హిరణ్యరేతసుడు వసుదానుడు, దృఢరుచి, నాభి, గుప్తుడు, సత్యవ్రతుడు, విప్రుడు, వామదేవుడు అనే కుమారుల పేర్లతో ఏడు వర్షాలను ఏర్పాటు చేసి వారిని అందులో నియమించి తపస్సు చేయడానికి వెళ్ళిపోయాడు. ఆ కుశద్వీపంలోనివర్షములలో బభ్రువు, చతుశ్శృంగం, కపిలం, చిత్రకూటం, దేవానీకం, ఊర్ధ్వరోమం, ద్రవిణం అనే ఏడు పర్వతాలు, రసకుల్య, మధుకుల్య, శ్రుతనింద, మిత్రవింద, దేవగర్భ, ఘృతచ్యుత, మంత్రమాల అనే ఏడు మహానదులు ఉన్నాయి. కుశలులు, కోవిదులు, అభియుక్తులు, కులకులు అనే నాలుగు వర్ణాలవారు ఆ పవిత్ర నదీజలాలలో స్నానం చేసి శుచులై భగవంతుడైన యజ్ఞపురుషుని ఆరాధిస్తుంటారు.