పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : భూ ద్వీప వర్ష విస్తారములు

  •  
  •  
  •  

5.2-62-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అందు శాల్మలీ వృక్షంబు ప్లక్షాయామంబై తేజరిల్లు; నా వృక్షరాజంబు నకు నధోభాగంబునం బతత్రిరాజుగా నుండు గరుత్మంతుండు నిలుకడగా వసించు; నా శాల్మలీ వృక్షంబు పేర నా ద్వీపంబు శాల్మలీ ద్వీపం బన విలసిల్లు; ఆ ద్వీపపతియైన ప్రియవ్ర తాత్మజుండగు యజ్ఞబాహువు దన పుత్రులగు సురోచన సౌమనస్య రమణక దేవబర్హ పారిబర్హాప్యాయ నాభిజ్ఞాతు లనియెడు వారి పేర నేడు వర్షంబుల నేర్పఱచి యా వర్షంబుల యం దేడ్వురఁ గుమారుల నభిషిక్తులం జేసె; నా వర్షంబుల యందు స్వరస, శతశృంగ, వామదేవ, కుముద, ముకుంద, పుష్పవర్ష, శతశ్రుతు లను పర్వత సప్తకంబును ననుమతియు, సినీవాలియు, సరస్వతియుఁ, గుహువును, రజనియు, నందయు, రాకయు నను సప్త మహానదులును గలవు; నందు శ్రుతధర, విద్యాధర, వసుంధ, రేధ్మధర సంజ్ఞులగు నా వర్షపురుషులు భగవత్స్వరూపుండు, వేదమయుండు, నాత్మస్వరూపుండు నగు సోముని వేదమంత్రంబులచే నారాధింపుదు; రా ద్వీపంబు లక్షచతుష్టయపరిమిత యోజన విస్తృతం బయిన సురాసముద్రంబుచే నావృతంబై తేజరిల్లు; నందు.

టీకా:

అందు = దానిలో; శాల్మలీవృక్షంబు = బూరుగుచెట్లు; ప్లక్ష = జువ్విచెట్లంత; ఆయామంబు = విస్తృతి కలగి; ఐ = అయ్యి; తేజరిల్లు = విరాజిల్లును; ఆ = ఆ; వృక్ష = వృక్షములలో; రాజంబున్ = గొప్పదాని; కున్ = కి; అధః = క్రింది; భాగంబునన్ = పక్క; పతత్రి = పక్షులకు {పతత్రి – రెక్కలు గలది, పక్షి}; రాజు = రాజు; కాన్ = అయ్యి; ఉండు = ఉండెడి; గరుత్మంతుండు = గరుత్మంతుడు; నిలుకడగా = స్థిరముగా; వసించున్ = నివసించును; ఆ = ఆ; శాల్మలీవృక్షంబు = బూరుగుచెట్లు; పేరన్ = పేరుతో; ఆ = ఆ; ద్వీపంబున్ = ద్వీపమును; శాల్మలీద్వీపంబున్ = శాల్మలీద్వీపము; అనన్ = అనగా; విలసిల్లున్ = ప్రసిద్ధమగును; ఆ = ఆ; ద్వీప = ద్వీపమునకు; పతి = ప్రభువు; ఐన = అయినట్టి; ప్రియవ్రత = ప్రియవ్రతుని; ఆత్మజుండు = పుత్రుడు; అగు = అయినట్టి; యజ్ఞబాహువు = యజ్ఞబాహువు; తన = తన యొక్క; పుత్రులు = కుమారులు; అగు = అయినట్టి; సురోచన = సురోచనుడు; సౌమనస్య = సౌమనస్యుడు; రమణక = రమణకుడు; దేవబర్హ = దేవబర్హుడు; పారిబర్హ = పారిబర్హుడు; ఆప్యాయన = ఆప్యాయనుడు; అభిజ్ఞాతులు = అభిజ్ఞాతుడు; అనియెడి = అనెడి; వారి = వారి యొక్క; పేరన్ = పేరుతో; వర్షంబులన్ = వర్షములను; ఏర్పరచి = ఏర్పాటుచేసి; ఆ = ఆ; వర్షంబులన్ = వర్షముల; అందున్ = అందును; ఏడ్వురన్ = ఏడుగురు (7); కుమారులన్ = పుత్రులను; అభిషిక్తులన్ = పట్టాభిషిక్తులునుగా; చేసెన్ = చేసెను; ఆ = ఆ; వర్షంబులన్ = వర్షముల, దేశముల; అందున్ = లో; స్వరస = స్వరసము; శతశృంగ = శతశృంగము; వామదేవ = వామదేవము; కుముద = కుముదము; ముకుంద = ముకుందము; పుష్పవర్ష = పుష్పవర్షము; శతశ్రుతులు = శతశ్రుతము; అను = అనెడి; పర్వత = పర్వతముల; సప్తకంబునున్ = ఏడును (7); అనుమతియున్ = అనుమతి {అనుమతి - ఒక కళ తక్కువైన చంద్రుడుగల పౌర్ణమి}; సినీవాలియున్ = సినీవాలి {సినీవాలి - చంద్రకళ కనబడెడి అమావాస్య}; సరస్వతియున్ = సరస్వతి; కుహువునున్ = కుహువు {కుహువు - చంద్రకళ కానరాని అమావాస్య}; రజనియున్ = రజని {రజని - రాత్రి}; నందయున్ = నంద {నంద - శుక్లపక్షమునుండి మొదటి ఐదు తిథులు (పాడ్యమి విదియ తదియ చవితి పంచమి)}; రాకయున్ = రాక {రాక - నిండు పౌర్ణమి, సంపూర్ణ కళలతో కూడిన చంద్రుడుగల పున్నమి}; అను = అనెడి; సప్త = ఏడు; మహా = పెద్ద; నదులునున్ = నదులు; కలవు = ఉన్నవి; అందు = వానిలో; శ్రుతధర = శ్రుతధరులు; విద్యాధర = విధ్యాధరులు; వసుంధర = వసుంధరులు; ఇధ్మధర = ఇధ్మధరులు; సంజ్ఞులు = అనెడి పేర్లు కలవారు; అగు = అయిన; ఆ = ఆ; వర్ష = వర్షము నందలి, దేశపు; పురుషులున్ = వారు; భగవత్ = భగవంతుని యొక్క; స్వరూపుండు = స్వరూప మైనవాడును; వేద = వేదములతో; మయుండునున్ = నిండినవాడును; ఆత్మ = పరమాత్మ; స్వరూపుండున్ = స్వరూప మైనవాడును; అగు = అయినట్టి; సోమునిన్ = సోముడిని; వేద = వేదము లందలి; మంత్రంబుల్ = మంత్రముల; చేన్ = చేత; ఆరాధింపుదురు = పూజింతురు; ఆ = ఆ; ద్వీపంబున్ = ద్వీపము, ఖండము; లక్షచతుష్టయ = లక్షలు నాలుగు (400000); పరిమిత = మేర; యోజన = యోజనముల; విస్తృతంబున్ = విస్తృతి కలగినది; అయిన = అయినట్టి; సురా = మధ్యపు, సురారసపు; సముద్రంబున్ = సముద్రము; చేతన్ = వలన; ఆవృతంబున్ = చుట్టబడినది; ఐ = అయ్యి; తేజరిల్లున్ = అతిశయించును; అందు = దానికి;

భావము:

ఈ ద్వీపంలో ఉన్న శాల్మలీవృక్షం (బూరుగు చెట్టు) ప్లక్షద్వీపంలోని జువ్విచెట్టంత ఉంది. ఈ బూరుగు చెట్టు దిగువభాగంలో పక్షులకు రాజైన గరుత్మంతుడు స్థిరనివాసం చేస్తుంటాడు. ప్రియవ్రతుని కుమారుడైన యజ్ఞబాహువు ఈ ద్వీపాన్ని పరిపాలిస్తుంటాడు. అతడు తాను పాలించే భూభాగాన్ని ఏడు వర్షాలుగా విభజించాడు. ఒక్కొక్క వర్షంలో ఒక్కొక్క పర్వతం, ఒక్కొక్క నది ఉన్నాయి. అతడు సురోచనుడు, సౌమనస్యుడు, రమణకుడు, దేవబర్హుడు, వారిబర్హుడు, ఆప్యాయనుడు, అభిజ్ఞాతుడు అనే తన ఏడుగురు కుమారులను వారి పేర్లతోనే వ్యవహరింపబడే ఆ ఏడు వర్షాలకు అభిషిక్తులను చేసాడు. ఈ ఏడు వర్షాలలో స్వరసం, శతశృంగం, వామదేవం, కుముదం, ముకుందం, పుష్పవర్షం, శతశ్రుతి అనే పర్వతాలు; అనుమతి, సినీవాలి, సరస్వతి, కుహువు, రజని, నంద, రాక అనే ఏడు మహానదులు ఉన్నాయి. ఆ వర్షంలోని పురుషులు శ్రుతధరులు, విద్యధరులు, వసుంధరులు, ఇధ్మధర్ములు అని పిలువబడతారు. వారు భగవత్ స్వరూపుడు, వేదమయుడు, ఆత్మస్వరూపుడు అయిన సోముణ్ణి వేదమంత్రాలతో ఆరాధిస్తారు. ఆ ద్వీపం చుట్టూ నాలుగు లక్షల యోజనాల విస్తృతి కలిగిన సురా (కల్లు) సముద్రం ఉంది.