పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : భూ ద్వీప వర్ష విస్తారములు

  •  
  •  
  •  

5.2-60-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నరేంద్రా! యా యిధ్మజిహ్వుం డా ప్లక్షద్వీపంబు నేడు వర్షంబులుగ విభజించి యందు నా వర్షనామధారులుగా నుండు తన పుత్రు లగు శివ యశస్య సుభద్ర శాంత క్షేమాభయామృతు లనియెడు నేడుగుర నేడు వర్షంబుల కధిపతులం గావించి తపంబునకుం జనియె; నా వర్షంబుల యందు మణికూట వజ్రకూట యింద్రసేన జ్యోతిష్మద్ధూమ్రవర్ణ హిరణ్యగ్రీవ మేఘమాల లను నామంబులు గల సప్త కులపర్వతంబులును, నరుణయు సృమణయు నాంగీరసయు సావిత్రియు సుప్రభాతయు ఋతంభరయు సత్యంభరయు నన సప్తమహానదులును, నా నదులయందు సుస్నాతు లగుచు గత పాపు లైన హంస పతం గోర్ధ్వాయన సత్యాంగు లను నామంబులు గల చాతుర్వర్ణ్యంబును గలగి యుండు; నందుఁ బురుషులు సహస్ర వత్సర జీవులును దేవతాసములును దృష్టిమాత్రంబునం గ్లమస్వేదాది రహితంబగు నపత్యోత్పాదనంబు గలవార లగుచు వేద త్రయాత్మకుండును, స్వర్గద్వార భూతుండును, భగవత్స్వరూపియు నగు సూర్యుని వేదత్రయమ్మున సేవింపుదురు; ప్లక్షద్వీపం బాదిగా మీఁదటి ద్వీపపంచకంబు నందలి పురుషులకు నాయు రింద్రియ పటుత్వంబులును దేజో బలంబులును దోడనె జనియించుచుండు.

టీకా:

నరేంద్ర = రాజా; ఆ = ఆ; ఇధ్మజిహ్వుండు = ఇధ్మజిహ్వుడు; ఆ = ఆ; ప్లక్షద్వీపంబున్ = ప్లక్షద్వీపమును; ఏడు = ఏడు (7); వర్షంబులుగన్ = వర్షములుగ; విభజించి = భాగములుగ జేసి; అందున్ = వానికి; ఆ = ఆ; వర్ష = వర్షముల యొక్క; నామ = పేరు; ధారులుగా = ధరించినవారై; ఉండున్ = ఉండెడి; తన = తన యొక్క; పుత్రులు = కుమారులు; అగు = అయిన; శివ = శివ; యశస్య = యశస్య; సుభద్ర = సుభద్ర; శాంత = శాంత; క్షేమ = క్షేమ; అభయ = అభయ; అమృతల్ = అమృత; అనియెడు = అనెడు; ఏడుగురన్ = ఏడుగురను (7); ఏడు = ఏడు (7); వర్షంబుల్ = వర్షముల; కున్ = కు; అధిపతులన్ = రాజులు; కావించి = చేసి; తపంబున్ = తపస్సు చేసుకొనుట; కున్ = కు; చనియెన్ = వెళ్ళెను; ఆ = ఆ; వర్షంబుల = వర్షముల, దేశముల; అందున్ = లో; మణికూట = మణికూటము; వజ్రకూట = వజ్రకూటము; ఇంద్రసేన = ఇంద్రసేనము; జ్యోతిష్మత్ = జ్యోతిష్మత్తు; ధూమ్రవర్ణ = ధూమ్రవర్ణము; హిరణ్యగ్రీవ = హిరణ్యగ్రీవము; మేఘమాల = మేఘమాల; అను = అనెడి; నామంబులున్ = పేర్లుగల; సప్త = ఏడు (7); కులపర్వతంబులునున్ = కులపర్వతములును; అరుణయున్ = అరుణ; సృమణయున్ = సృమణ; ఆంగీరసయున్ = ఆంగీరస; సావిత్రియున్ = సావిత్రి; సుప్రభాతయున్ = సుప్రభాత; ఋతంభరయున్ = ఋతంభర; సత్యంభరయున్ = సత్యంభర; అన = అనెడి; సప్త = ఏడు (7); మహా = గొప్ప; నదులునున్ = నదులు; ఆ = ఆ; నదుల = నదుల; అందున్ = లో; సుస్నాతులు = చక్కగ స్నానము చేసినవారు; అగుచున్ = అగుచు; గత = పోయిన; పాపులున్ = పాపములు కలవారు; ఐన = అయిన; హంస = హంసలు; పతంగ = పతంగులు; ఊర్ధ్వాయన = ఊర్ధ్వాయనులు; సత్యాంగులు = సత్యాంగులు; అను = అనెడి; నామంబులున్ = పేర్లు కల; చాతుర్వర్ణంబునున్ = నాలుగు కులములును; కలిగి = కలిగి; ఉండున్ = ఉండును; అందున్ = దానిలోని; పురుషులు = జనులు; సహస్ర = వేయి (1000); వత్సర = సంవత్సరములు; జీవులును = జీవించెడివారును; దేవతా = దేవతలకు; సములున్ = సమానమైనవారు; దృష్ఠి = దర్శన; మాత్రంబున్ = మాత్రముచేత; క్లమ = అలసట; స్వేద = చమట; ఆది = మొదలగు; రహితంబున్ = లేకపోవుట; అగు = కలిగి; అపత్య = సంతతిని; ఉత్పాదనంబు = పుట్టించుట; కలవారలు = కలవారు; అగుచున్ = అగుచు; వేదత్రయ = ఋగ్వేద యజుర్వేద అధర్వణవేదములు; ఆత్మకుండును = ఆత్మగ కలవాడును; స్వర్గ = స్వర్గము యొక్క; ద్వార = ప్రవేశము; భూతుండును = అయినవాడు; భగవత్ = భగవంతున్; స్వరూపియున్ = స్వరూపము కలవాడు; అగు = అయిన; సూర్యుని = సూర్యుని; వేదత్రయమ్మునన్ = వేదత్రయముతో; సేవింపుదురు = కొలచెదరు; ప్లక్షద్వీపంబు = ప్లక్షద్వీపము; ఆదిగా = మొదలైన; మీదటి = పైనున్న; ద్వీపపంచకంబున్ = ఐదు ద్వీపములు; అందలి = వానిలోని; పురుషుల్ = మానవుల; కున్ = కు; ఆయుః = ఆయుష్షు; ఇంద్రియ = ఇంద్రియముల; పటుత్వంబులున్ = సామర్థ్యములు; తేజస్ = తేజస్సు; బలంబులున్ = శక్తి; తోడనె = పుట్టుకతోనే; జనియించుచుండు = కలిగి ఉండును;

భావము:

రాజా! ఇధ్మజిహ్వుడు ప్లక్షద్వీపాన్ని ఏడు వర్షాలుగా విభజించాడు. ఆ వర్షాల పేర్లు కలిగిన తన ఏడుగురు కుమారులు శివుడు, యశస్యుడు, సుభద్రుడు, శాంతుడు, క్షేముడు, అభయుడు, అమృతుడు అనే వారిని వాటికి అధిపతులను చేసాడు. ఆ తరువాత ఇధ్మజిహ్వుడు నిస్సంగుడై తపస్సుకై అడవికి వెళ్ళిపోయాడు. విభజింపబడిన ఒక్కొక్క వర్షంలో ఒక్కొక్క కులపర్వతం, ఒక్కొక్క మహానది ఉన్నాయి. ఆ విధంగా ఆ సప్తవర్షాలలో వరుసగా మణికూటం, వజ్రకూటం, ఇంద్రసేనం, జ్యోతిష్మంతం, ధూమ్రవర్ణం, హిరణ్యగ్రీవం, మేఘమాలం అనేవి ఆ కులపర్వతాలు. అరుణ, సృమణ, అంగిరసి, సౌమిత్రి, సుప్రభాత, ఋతంభర, సత్యంభర అనేవి ఆ మహానదులు. ఆ నదులలో స్నానం చేసి నాలుగు వర్ణాలవారు పాపం పోగొట్టుకుంటారు. ఆ నాలుగు వర్ణాలవారిని హంసులు, పతంగులు, ఊర్ధ్వాయనులు, సత్యాంగులు అని వ్యవహరిస్తారు. ప్లక్షద్వీపంలో నివసించే పురుషుల ఆయుర్దాయం వేయి సంవత్సరాలు. వారు దేవతలతో సమానమైనవారు. కేవలం చూపుతోనే శ్రమ స్వేదాదులు లేని సంతానాన్ని అనుగ్రహింపగలవారు. వేదస్వరూపుడు, స్వర్గానికి ద్వారమైనవాడు, భగవంతుడు అయిన సూర్యుణ్ణి వారు ఋగ్యజుస్సామ వేద మంత్రాలతో సేవిస్తుంటారు. ప్లక్షద్వీపం మొదలైన ముందు చెప్పబోయే ఐదు ద్వీపాలలోని పురుషులకు ఆయుర్బలం, ఇంద్రియపటుత్వం, తేజోబలం పుట్టుకతోనే సంక్రమిస్తాయి.