పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : భూ ద్వీప వర్ష విస్తారములు

  •  
  •  
  •  

5.2-58-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు భారత వర్షంబునందుల జనంబులకు నెద్దియు నసాధ్యంబు లేదు; నారాయణ స్మరణంబు సకల దురితంబుల నడంచు; తన్నామస్మరణ రహితంబులైన యజ్ఞ తపో దానాదులు దురితంబుల నడంప లేవు; బ్రహ్మకల్పాంతంబు బ్రదికెడి యితర స్థానంబునం బునర్జన్మ భయంబున భీతిల్లుచు నుండుటకన్న భారతవర్షంబు నందు క్షణమాత్రంబు మనంబున సర్వసంగపరిత్యాగంబు చేసిన పురుషశ్రేష్ఠునకు శ్రీమన్నారాయణ పదప్రాప్తి యతి సులభంబుగ సంభవించుం; గావున నట్టి యుత్తమంబగు నీ భారతవర్షంబె కోరుచుండుదురు; మఱియు నెక్కడ వైకుంఠుని కథావాసన లేకుండు, నే దేశంబున సత్పురుషులైన పరమభాగవతులు లేకుండుదు, రే భూమిని యజ్ఞేశ్వరుని మహోత్సవంబులు లేక యుండు, నది సురేంద్రలోకంబైన నుండ దగదు; జ్ఞానానుష్ఠాన ద్రవ్యకలాపంబుల చేత మనుష్యజాతిం బొంది తపంబున ముక్తిం బొందకుండెనేని మృగంబుల మాడ్కి నతండు దనకుం దానె బంధనంబు నొందు భారతవర్షంబునందుఁ బ్రజలచేత శ్రద్ధాయుక్తంబుగా ననుష్ఠింపంబడిన యజ్ఞంబులయందు వేల్వంబడు హవిస్సులను బెక్కు నామంబులం బుండరీకాక్షుం డంది తనమీఁది భక్తి యధికంబుగాఁ జేయు; నట్టి భారతవర్షంబు నందలి ప్రజమీఁదం గరుణించి సర్వేశ్వరుం డిహపర సౌఖ్యంబుల నొసంగుచుండు; జంబూద్వీపంబున సగరాత్మజు లశ్వమేధాశ్వంబు నన్వేషింపం బూని భూఖననంబు చేయుటంజేసి స్వర్ణప్రస్థ చంద్రశుక్లావర్తన రమణక మందేహారుణ పాంచజన్య సింహళ లంకాద్వీపంబు లన నెనిమిది యుపద్వీపంబులు గలిగె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; భారతవర్షంబున్ = భారతవర్షము; అందులన్ = లో; జనంబుల్ = ప్రజల; కున్ = కు; ఎద్దియున్ = ఏదీకూడ; అసాధ్యంబు = సాధ్యము కానిది అన్నది; లేదు = లేదు; నారాయణ = విష్ణుని; స్మరణంబున్ = ధ్యానించుటవలన; సకల = అఖిల; దురితంబులు = పాపములును; అడంచున్ = అణగజేయును; తత్ = ఆతని; నామ = నామములను; స్మరణ = తలచుటలు; రహితంబులు = లేనివి; ఐన = అయిన; యజ్ఞ = యజ్ఞములు; తపస్ = తపస్సులు; దాన = దానములు; ఆదులు = మొదలగునవి; దురితంబులన్ = పాపములను; అడపన్ = అణచుటలు; లేవు = చేయలేవు; బ్రహ్మకల్ప = బ్రహ్మకల్పము; అంతంబున్ = చివరివరకు; బ్రతికెడు = జీవించెడు; ఇతర = మిగిలిన; స్థానంబున్ = ప్రదేశములలో; పునర్జన్మ = పునర్జన్మల వలన; భయంబునన్ = భయముతో; భీతిల్లుచున్ = భీతిచెందుతూ; ఉండుట = ఉండుట; కన్నన్ = కంటెను; భారతవర్షంబున్ = భారతవర్షము; అందున్ = లో; క్షణమాత్రంబు = క్షణము కాలము యైనను; మనంబునన్ = మనసులో; సర్వసంగపరిత్యాగంబున్ = అఖిల సాంగత్యములను పూర్తిగ వదలుట; చేసిన = చేసినట్టి; పురుష = పురుషులలో; శ్రేష్ఠున్ = శ్రేష్ఠున; కున్ = కు; శ్రీమత్ = శ్రీమంతమైన; నారాయణ = హరి; పద = పదమును; ప్రాప్తిన్ = పొందుటను; అతి = మిక్కిలి; సులభంబుగన్ = సుళువుగ; సంభవించున్ = కలుగును; కావునన్ = అందుచేత; అట్టి = అటువంటి; ఉత్తమంబు = ఉత్తమమైనది; అగు = అయిన; ఈ = ఈ; భారతవర్షంబె = భారతవర్షమే; కోరుచుండుదురు = కోరుతుందురు; మఱియున్ = ఇంకను; ఎక్కడ = ఎక్కడైతే; వైకుంఠుని = హరి {వైకుంఠుడు - వైకుఠమున ఉండెడివాడు, విష్ణువు}; కథా = కథల; వాసనలు = అనుభూతార్థస్మృతి; లేకుండున్ = లేకుండగ ఉండునో; ఏ = ఏ; దేశంబునన్ = దేశములో నైతే; సత్పురుషులు = మంచివారు; ఐన = అయిన; పరమ = అత్యుత్తమ; భాగవతులు = భాగవతులు {భాగవతులు – భాగవత అనుయాయులు}; లేకుండుదురు = ఉండరో; ఏ = ఏ; భూమినిన్ = దేశములో నైతే; యజ్ఞేశ్వరునిన్ = హరిని {యజ్ఞేశ్వరుడు - యజ్ఞములకు ఈశ్వరుడు, విష్ణువు}; మహా = గొప్ప; ఉత్సవంబులు = ఉత్సవములు; లేక = లేకుండగ; ఉండున్ = ఉండునో; అది = అది; సురేంద్ర = దేవేంద్ర; లోకంబున్ = లోకము; ఐననున్ = అయినప్పటికిని; ఉండన్ = ఉండుటకు; తగదు = తగినది కాదు; జ్ఞాన = సుజ్ఞానము; అనుష్ఠాన = మంచి నడవడిక, ఆచారములు; ద్రవ్య = పదార్థములను; కలాపంబుల = వినియోగములు; చేతన్ = వలన; మనుష్య = మానవ; జాతిన్ = జాతి యందు జనించుటను; పొంది = పొంది; తపంబునన్ = తపస్సువలన; ముక్తిన్ = ముక్తిని; పొందకుండెను = పొందకండగ; ఏని = ఉండె నేని; మృగంబుల్ = జంతువుల; మాడ్కిన్ = వలె; అతండు = అతడు; తనకుందానే = తనకు తనే; బంధనంబున్ = బంధనములను; ఒందున్ = పొందును; భారతవర్షంబున్ = భారతవర్షము; అందున్ = లో; ప్రజల్ = జనుల; చేతన్ = చేత; శ్రద్ధా = శ్రద్ధతో; యుక్తంబుగాన్ = కూడినట్టి; అనుష్ఠింపంబడిన = ఆచరింపబడిన; యజ్ఞంబుల్ = యాగముల; అందున్ = అందు; వేల్వంబడు = వేల్చబడెడి {వేల్చుట - అగ్నిహోత్రమున నేయి మొదలగునవి సమర్పించుట}; హవిస్సులన్ = హవిస్సులను {హవిస్సు - అగ్నిహోత్రమున వేల్చుటకైన ఇగర్చబడిన అన్నము నెయ్యి}; పెక్కు = అనేకమైన; నామంబులన్ = పేర్లతో; పుండరీకాక్షుండు = నారాయణుడు; అంది = స్వీకరించి; తన = తన; మీది = పైని; భక్తిన్ = భక్తిని; అధికంబుగాన్ = ఎక్కువగా; చేయున్ = చేసెడి; అట్టి = అటువంటి; భారతవర్షంబున్ = భారతవర్షము; అందలి = లోని; ప్రజ = జనుల; మీదన్ = పైన; కరుణించి = దయచూపి; సర్వేశ్వరుండు = హరి; ఇహ = ఈ లోకపు; పర = పరలోకపు; సౌఖ్యంబులన్ = సుఖములను; ఒసగుచుండున్ = ఇచ్చుచుండును; జంబూద్వీపంబునన్ = జంబూద్వీపము నందు; సగర = సగరుని {సగర - సగరుడు యనెడి చక్రవర్తి, ఇతని మాయమైన యజ్ఞాశ్వము కొరకు భూమిని తవ్విరి అక్కడనే సాగరము ఏర్పడెను}; ఆత్మజులు = పుత్రులు; అశ్వమేధా = అశ్వమేధయాగము యొక్క; అశ్వంబున్ = గుఱ్ఱమును; అన్వేషింపన్ = వెదకుటను; పూని = పూనుకొని; భూ = భూమిని; ఖననంబు = తవ్వుట; చేయుటన్ = చేయుట; చేసి = వలన; స్వర్ణప్రస్థ = స్వర్ణప్రస్థము; చంద్రశుక్ల = చంద్రశుక్లము; ఆవర్తన = ఆవర్తనము; రమణక = రమణకము; మందేహారణ = మందేహారణము; పాంచజన్య = పాంచజన్యము; సింహళ = సింహళము; లంకా = లంక యనెడు; ద్వీపంబులు = దీవులను; అనన్ = అనెడి; ఎనిమిది = ఎనిమిది (8); ఉపద్వీపంబులు = ఉపద్వీపములు; కలిగెన్ = ఏర్పడెను;

భావము:

ఈ విధంగా భారతవర్షంలో పుట్టిన జనులకు సాధ్యం కానిదంటూ లేనే లేదు. శ్రీమన్నారాయణుని సంస్మరణం సమస్త పాపాలను పటాపంచలు చేస్తుంది. అతని స్మరణం లేని యజ్ఞాలు, తపస్సులు, దానాలు నిరర్థకాలు. వాటివల్ల పాపాలు పోవు. పునర్జన్మ మళ్ళీ వస్తుందేమో అన్న భయంతో ఇతర ప్రదేశాలలో బ్రహ్మకల్పం చివరిదాకా జీవించటం కంటే భారతవర్షంలో క్షణకాలం జీవించి సర్వసంగ పరిత్యాగం చేసినట్లయితే అటువంటి పురుషశ్రేష్ఠునికి శ్రీమన్నారాయణ పదప్రాప్తి చాల సులభంగా దక్కుతుంది. అందుచేత అందరూ భారతవర్షంలో జన్మించాలని కోరుకుంటారు. అదీగాక ఏ స్థలంలో వైకుంఠనిలయుని పుణ్యకథల వాసన ఆవంత అయినా ఉండదో, ఏ ప్రదేశంలో పుణ్యపురుషులైన భాగవతోత్తములు ఉండరో, ఏ స్థలంలో యజ్ఞేశ్వరుని ఉత్సవాలు జరుగవో అటువంటి ప్రదేశం దేవేంద్ర లోకమైనా ఆ ప్రదేశంలో నివసించరాదు. మానవజన్మ ఎత్తి జ్ఞానం, సదనుష్ఠానం, ద్రవ్యసంపత్తి అన్నీ ఉండికూడా తపస్సు ద్వారా ముక్తి అందుకోలేని మానవులు పశువులలాగా తమకు తామే బంధనాల పాలవుతారు. భారతవర్షంలోని ప్రజలు శ్రద్ధతో యజ్ఞాలు నిర్వహించినట్లయితే, ఆ హోమాలలోని హవిస్సును అనేక నామాలతో ఆ పుండరీకాక్షుడు అందుకొని ప్రసన్నుడై వారికి తనమీది భక్తిని అతిశయింప జేస్తాడు. భారతవర్షంలోని ప్రజలమీద అపరిమితమైన అనుగ్రహం ప్రకటిస్తూ, ఆ భగవంతుడు ఇహపర సౌఖ్యాలను వారికి ప్రసాదిస్తాడు. జంబూద్వీపంలోని సగరుని కుమారులు అపహరింపబడిన అశ్వమేధాశ్వాన్ని వెదకుతూ నలువైపులా భూమిని త్రవ్వినపుడు ఎనిమిది ఉపద్వీపాలు ఏర్పడ్డాయి. అవే స్వర్ణప్రస్థం, చంద్రశుక్లం, ఆవర్తనం, రమణకం, మందేహారుణం, పాంచజన్యం, సింహళం, లంక అనేవి.