పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : భూ ద్వీప వర్ష విస్తారములు

  •  
  •  
  •  

5.2-55-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మలయపర్వతంబును, మంగళప్రస్థంబును, మైనాకంబును, ద్రికూటంబును, ఋషభపర్వతంబును, గూటరంబును, గోల్లంబును, సహ్యపర్వతంబును, వేదగిరియును, ఋష్యమూకపర్వతంబును, శ్రీశైలంబును, వేంకటాద్రియును, మహేంద్రంబును, వారిధరంబును, వింధ్య పర్వతంబును, శుక్తిమత్పర్వతంబును, ఋక్షగిరియును, బారియాత్రంబును, ద్రోణపర్వతంబును, చిత్రకూటంబును, గోవర్ధనాద్రియును, రైవతకంబును, గుకుంభంబును, నీలగిరియును, గాకముఖంబును, నింద్రకీలంబును, రామగిరియును నాదిగాఁ గల పుణ్య పర్వతంబు లనేకంబులు గలవా పర్వతపుత్రిక లైన చంద్రవటయు, దామ్రపర్ణియు, నవటోదయుఁ, గృతమాలయు, వైహాయసియుఁ, గావేరియు, వేణియుఁ, బయస్వినియుఁ, బయోదయు, శర్కరావర్తయుఁ, దుంగభద్రయుఁ, గృష్ణవేణియు, భీమరథియు, గోదావరియు, నిర్వింధ్యయుఁ, బయోష్ణయుఁ, దాపియు, రేవానదియు, శిలానదియు, సురసయుఁ, జర్మణ్వతియు, వేదస్మృతియు, ఋషికుల్యయుఁ, ద్రిసమయుఁ, గౌశికియు, మందాకినియు, యమునయు, సరస్వతియుఁ, దృషద్వతియు, గోమతియు, సరయువును, భోగవతియు, సుషుమయు, శతద్రువును, జంద్రభాగయు, మరుద్వృథయు, వితస్తయు, నసిక్నియు, విశ్వయు నను నీ మహానదులును, నర్మద, సింధువు, శోణ యను నదంబులును నైన మహా ప్రవాహంబు లీ భారతవర్షంబునఁ గల; వందు సుస్నాతులైన మానవులు ముక్తిం జెందుదురు; మఱియు నీ భారత వర్షంబున జన్మించిన పురుషులు శుక్ల లోహిత కృష్ణవర్ణ రూపంబు లగు త్రివిధ కర్మంబులంజేసి క్రమంబుగ దేవ మనుష్య నరక గతులను త్రివిధ గతులం బొందుదురు; వినుము; రాగద్వేషాది శూన్యుండు, నవాఙ్మానసగోచరుండు, ననాధారుండు నగు శ్రీవాసుదేవమూర్తి యందుఁ జిత్తంబు నిలిపి భక్తియోగంబున నారాధించెడు మహాత్ముల విద్యాగ్రంథి దహనంబు గావించుట జేసి పరమ భాగవతోత్తములు పొందెడు నుత్తమగతిం జెందుదురు; కావున భారత వర్షంబు మిగుల నుత్తమం బని మహాపురుషు లిట్లు స్తుతించు చుండుదురు;

టీకా:

మలయపర్వతంబునున్ = మలయపర్వతము; మంగళప్రస్థంబునున్ = మంగళప్రస్థపర్వతము; మైనాకంబును = మైనాకపర్వతము; త్రికూటంబునున్ = త్రికూట పర్వతము; ఋషభపర్వతంబునున్ = ఋషభపర్వతమును; కూటరంబునున్ = కూటర పర్వతము; గోల్లంబునున్ = గోల్హపర్వతము; సహ్యపర్వతంబును = సహ్యాద్రి; వేదగిరియును = వేదగిరి; ఋష్యమూకపర్వతంబునున్ = ఋష్యమూకపర్వతము; శ్రీశైలంబునున్ = శ్రీశైలము; వెంకటాద్రియునున్ = వెంకటాద్రి; మహేంద్రంబునున్ = మహేంద్రగిరి; వారిధరంబునున్ = వారిధరపర్వతము; వింద్యపర్వతంబునున్ = వింధ్యపర్వతములును; శుక్తిమత్పర్వతంబునున్ = శుక్తిమత్ పర్వతములును; ఋక్షగిరియును = ఋక్షగిరి; పారియాత్రంబునున్ = పారియాత్ర పర్వతములు; ద్రోణపర్వతంబునున్ = ద్రోణాచలము; చిత్రకూటంబును = చిత్రకూటము; గోవర్ధనాద్రియును = గోవర్ధనగిరి; రైవతకంబునున్ = రైవతక పర్వతములు; కుకుంభంబును = కుకుంభగిరులు; నీలగిరియును = నీలగిరి; కాకముఖంబును = కాకముఖ కొండలు; ఇంద్రకీలంబును = ఇంద్రకీలాద్రి; రామగిరియును = రామగిరి; ఆదిగా = మొదలగునవియై; కల = ఉన్నట్టి; పుణ్య = పుణ్యవంతములైన; పర్వతంబులు = పర్వతములు; అనేకంబులు = లెక్కకు మిక్కిలి; కలవు = ఉన్నవి; ఆ = ఆ; పర్వత = పర్వతముల యొక్క; పుత్రికలు = పుట్టినవి; ఐన = అయిన; చంద్రపటయున్ = చంద్రవటము; తామ్రపర్ణియున్ = తామ్రపర్ణి; అవటోదయయున్ = అవటోదయ; కృతమాలయున్ = కృతమాల; వైహాయసియున్ = వైహాయసి; కావేరియున్ = కావేరి; వేణియున్ = వేణీ; పయస్వియున్ = పయస్వి; పయోదయున్ = పయోద; శర్కరావర్తయున్ = శర్కరావర్తి; తుంగభద్రయున్ = తుంగభద్ర; కృష్ణవేణియున్ = కృష్ణవేణి; భీమరథియున్ = భీమరథి; గోదావరియున్ = గోదావరి; నిర్వింధ్య = నిర్వింధ్య; పయోష్ణియున్ = పయోష్ణి; తాపియున్ = తాపి; రేవానదియున్ = రేవానది; శిలానదియున్ = శిలానది; సురసయున్ = సురస; చర్మణ్వతియున్ = చర్మణ్వతి; వేదవతియున్ = వేదవతి; ఋషికుల్యయున్ = ఋషికుల్య; త్రిసమయున్ = త్రిసమ; కౌశికియున్ = కౌశికి; మందాకినియున్ = మందాకిని; యమునయున్ = యమున; సరస్వతియున్ = సరస్వతి; తృషద్వతియున్ = తృషద్వతి; గోమతియున్ = గోమతి; సరయువునున్ = సరయువు; భోగవతియున్ = భోగవతి; సుషుమయున్ = సుషుమ; శతధ్రువును = శతధ్రువ; చంద్రభాగయున్ = చంద్రభాగ; మరుద్వృథయున్ = మరుద్వృథ; వితస్తయును = వితస్త; అసిక్నియున్ = అసిక్ని; విశ్వ = విశ్వ; అను = అనెడి; ఈ = ఈ; మహా = గొప్ప; నదులునున్ = నదులు {నదులు - తూర్పునకు ప్రవహించు ప్రవాహములు}; నర్మద = నర్మద; సింధువు = సింధు; శోణ = శోణ; అను = అనెడి; నదంబులునున్ = నదములు {నదములు - పడమరకు ప్రవహించు ప్రవాహములు}; ఐన = అయిన; మహా = గొప్ప; ప్రవాహంబులు = నదీనదములు; ఈ = ఈ; భారతవర్షంబునన్ = భరతవర్షము నందు; కలవు = ఉన్నవి; అందున్ = వాటిలో; స్నాతులు = స్నానము చేసినవారు; ఐన = అయిన; మానవులు = మనుషులు; ముక్తిన్ = ముక్తిని; చెందుదురు = పొందుదురు; మఱియున్ = ఇంకను; ఈ = ఈ; భారతవర్షంబునన్ = భారతవర్షమున; జన్మించిన = పుట్టిన; పురుషులు = జనులు; శుక్ల = తెల్లని; లోహిత = ఎఱ్ఱని; కృష్ణ = నల్లని; వర్ణ = రంగులు కలిగిన; రూపంబులు = రూపములు; అగు = కలిగి; త్రి = మూడు (3) {త్రివిధకర్మములు – సత్త్వ రజోతమో గుణములు కలిగిన కర్మములు}; విధ = విధములైన; కర్మములన్ = కర్మల; చేసి = వలన; క్రమంబుగన్ = వరుసగా; దేవ = దేవలోక; మనుష్య = మానవలోక; నరక = నరకలోక; గతులు = జన్మాంతర ప్రాప్తములు; అను = అనెడి; త్రి = మూడు (3); విధ = రకముల; గతులన్ = జన్మాంతర ప్రాప్తములు; పొందుదురు = పొందెదరు; వినుము = వినుము; రాగద్వేషాదిశూన్యుండు = నారాయణుడు {రాగ ద్వేషాది శూన్యుడు - రాగము ద్వేషము లాంటివి లేనివాడు, విష్ణువు}; అవాఙ్మానసగోచరుండు = నారాయణుడు {అవాఙ్మానస గోచరుడు - వాక్కు (వర్ణించుటకు) మానస (ఊహించుటకు) అగోచరుండు (అందనివాడు), విష్షువు}; అనాధారుండును = నారాయణుడు {అనాధారుడు - వేరు ఆధారము అవసరములేని వాడు, విష్ణువు}; అగు = అయిన; శ్రీ = శుభకరుడైన; వాసుదేవమూర్తి = శ్రీకృష్ణుని {వాసుదేవమూర్తి - వాసుదేవ (వసుదేవుని పుత్రుడు) యొక్క మూర్తి (విగ్రహము), శ్రీకృష్ణుడు}; అందున్ = ఎడల; చిత్తంబున్ = మనసును; నిలిపి = లగ్నముచేసి; భక్తియోగంబునన్ = భక్తియోగముతో; ఆరాధించెడు = కొలిచెడు; మహాత్ములు = గొప్పవారు; అవిద్యాగ్రంథి = అవిద్య అనెడి ముడి; దహనంబున్ = నాశనము; కావించుటన్ = చేయుట; చేసి = వలన; పరమ = అత్యుత్తమ; భాగవత = భాగవతులలో; ఉత్తములు = శ్రేష్ఠులు; పొందెడున్ = పొందెడి; ఉత్తమ = ఉత్తమమైన; గతిన్ = గతిని; చెందుదరు = పొందెదరు; కావునన్ = అందుచేత; భారతవర్షంబున్ = భారతవర్షమున; మిగులన్ = అధికముగ; ఉత్తమంబు = ఉత్తమమైనది; అని = అని; మహా = గొప్ప; పురుషులు = మానవులు; ఇట్లు = ఈ విధముగ; స్తుతించుచుందురు = కీర్తించుతుందురు;

భావము:

భారతవర్షంలో మలయం, మంగళప్రస్థం, మైనాకం, త్రికూటం, ఋషభం, కూటరం, గోల్లం, సహ్యాద్రి, వేదాద్రి, ఋశ్యమూకం, శ్రీశైలం, వేంకటాద్రి, మహేంద్రగిరి, మేఘపర్వతం, వింధ్యపర్వతం, శుక్తిమంతం, ఋక్షగిరి, పారియాత్రం, ద్రోణగిరి, చిత్రకూటం, గోవర్ధనం, రైవతకం, కుకుంభం, నీలగిరి, కాకముఖం, ఇంద్రకీలం, రామగిరి మొదలైనవి ప్రసిద్ధ పర్వతాలు. ఆ పర్వతాలకు పుత్రికల వంటివైన చంద్రవట, తామ్రపర్ణి, అవటోద, కృతమాల, వైహాయసి, కావేరి, వేణి, పయస్విని, పయోద, శర్కరావర్త, తుంగభద్ర, కృష్ణవేణి, భీమరథి, గోదావరి, నిర్వింధ్య, పయోష్ణ, తాపి, రేవా, శిలా, సురస, చర్మణ్వతి, వేదస్మృతి, ఋషికుల్య, త్రిసమ, కౌశికి, మందాకిని, యమున, సరస్వతి, దృషద్వతి, గోమతి, సరయువు, భోగవతి, సుషమ, శతద్రువు, చంద్రభాగ, మరుద్వృథ, వితస్త, అసిక్ని, విశ్వ మొదలైనవి ప్రధానమైన నదులు. నర్మద, సింధు, శోణ అనేవి నదాలు. ఇటువంటి మహానదులు భారతవర్షంలో ఎన్నో ఉన్నాయి. వీటిలో స్నానం చేసిన మానవులకు ముక్తి కరతలామలకం. ఈ భారతవర్షంలో పుట్టిన మానవులు మూడు విధాలైన కర్మలను చేస్తుంటారు. కొన్ని తెల్లనివి, కొన్ని ఎఱ్ఱనివి, కొన్ని నల్లనివి. తెల్లనివి సత్త్వగుణ ప్రధానమైన కర్మలు. ఎఱ్ఱనివి రజోగుణ ప్రధానమైన కర్మలు. నల్లనివి తమోగుణ ప్రధానమైన కర్మలు. ఇటువంటి కర్మల కారణంగా భారతవర్షంలో పుట్టిన ప్రజలు క్రమంగా దేవలోకం, మానవలోకం, నరకలోకం చేరుకొంటారు. ఇంకా విను. రాగద్వేషాలు లేనివాడు, వాక్కులకు కాని మనస్సుకు కాని అందనివాడు, సర్వానికి తానే ఆధారమైనవాడు అయిన శ్రీవాసుదేవమూర్తియందు హృదయం పదిలంగా నిలుపుకొని భక్తితో ఆరాధించేవారు ఉత్తమగతిని తప్పక పొందుతారు. అటువంటి మహాత్ములు అజ్ఞానం రూపుమాసి పోగా పరమ భాగవతులు పొందే పుణ్యలోకాలకు యోగ్యు లవుతారు. అందువల్ల మహాపురుషులు భారతవర్షం ఉత్తమోత్తమ మైనదని ఈ విధంగా కొనియాడుతూ ఉంటారు.